కశ్మీర్: "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం" - శ్రీనగర్‌లో రోగుల బంధువుల ఆవేదన

  • 17 ఆగస్టు 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption"ఆస్పత్రిలో బిడ్డ పుట్టింది, ఇంట్లో వాళ్లకు తెలియజేయలేకపోతున్నాం"

కశ్మీర్‌లోని శ్రీనగర్‌ లల్ దేడ్ ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్పించినవారి వెంట వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శిశువు పుట్టినా ఇంట్లోవాళ్లకు తెలియజేయలేకపోతున్నారు. సమాచార వ్యవస్థల నిలిపివేత, భద్రతా ఆంక్షల నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారనే అంశాలపై ఆస్పత్రి వద్ద వీరితో బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ మాట్లాడారు. ఆస్పత్రిలో సేవలపై ఎవరికీ ఎలాంటి ఫిర్యాదులూ లేవుగానీ, సమాచార సేవల నిలిపివేత, ఇతర చర్యలతో తమ జీవితాలే స్తంభించిపోయాయని వీరు ఆవేదన వ్యక్తంచేశారు.

"మీడియా వాళ్లు చాలా మంది ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయంటున్నారు. కానీ మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కార్లను అనుమతించడం లేదు. సమాచార సేవలేవీ లేవు. సాధారణ మెసేజ్ కూడా పంపలేకున్నాం" అని మొహమ్మద్ అబ్బాస్ మాలిక్ అనే యువకుడు చెప్పారు.

షోపియాన్ నుంచి వచ్చిన బిలాల్ అహ్మద్ మాట్లాడుతూ- అతికష్టమ్మీద తమ సోదరిని ఆస్పత్రిలో చేర్పించగలిగానని, తమ కారును మధ్యలో చాలాసార్లు ఆపారని, భద్రతా సిబ్బందికి పత్రాలు చూపించానని, ముందుకెళ్తే తిరిగి రాలేవేమోనని కూడా చెప్పారని తెలిపారు.

"మా సోదరికి బిడ్డ పుట్టింది. ఈ శుభవార్త మా ఇంట్లో వాళ్లకు చేరవేయలేకపోతున్నాను" అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

ఏటీఎం నుంచి డబ్బు కూడా తీసుకోలేకపోతున్నామని, దుకాణాలన్నీ మూసేశారని బిలాల్ నిస్సహాయత వ్యక్తంచేశారు.

షోపియాన్ జిల్లా నుంచి వచ్చిన రషీద్ హుస్సేన్ మాట్లాడుతూ- "ఈ ఆస్పత్రిలో మా కజిన్‌ను చేర్పించాం. ఆమెను డిశ్చార్జి చేశారు. కానీ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకడం లేదు. ఇక్కడంతా బాగానే ఉందని మీడియా వాళ్లు చెబుతున్నారు. ఎక్కడ బాగుంది" అని ప్రశ్నించారు.

మొత్తం కశ్మీర్, తమ జీవితం స్తంభించిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడంతా బాగానే ఉందనేవాళ్ల మాటలు అబద్ధమని, వాళ్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని, ఇలా చేయొద్దని చెప్పారు.

షహేల్ అహ్మద్ అనే ఇంకో యువకుడు స్పందిస్తూ- "మా అమ్మ సోదరి ఎనిమిది రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కర్ఫ్యూ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. భద్రతా దళాలు ఇద్దరిని కూడా కలిసి నడవనివ్వడం లేదు. అడుగడుగునా వాళ్లకు పత్రాలు చూపించాల్సి వస్తోంది" అని విచారం వ్యక్తంచేశారు.

తమ పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయలేకపోతున్నానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

"ఇంటి నుంచి ఆస్పత్రికి రావడంగాని, ఇక్కణ్నుంచి ఇంటికి వెళ్లడంగాని సాధ్యం కావడం లేదు. ఇక్కడ మా జీవితమే స్తంభించిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు