జమ్మూలో మళ్లీ ఫోన్లు బంద్.. సాంకేతిక లోపాలే కారణమన్న అధికారులు

  • 18 ఆగస్టు 2019
కశ్మీర్ Image copyright EPA

జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లా కేంద్రాల్లో శనివారం 2జీ మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఆదివారం ఇవి మళ్లీ నిలిచిపోయాయి.

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2జీ సేవలు ఆగిపోయినట్లు జమ్మూకు చెందిన పాత్రికేయుడు మోహిత్ కంధారీ చెప్పారు.

మిగతా జిల్లాల్లో ముందు నుంచీ 2జీ సేవలు, ఇంటర్నెట్ నిలిచిపోయే ఉన్నాయని, అయితే ల్యాండ్ లైన్ సేవలు మాత్రం నడుస్తున్నాయని పేర్కొన్నారు.

సాంకేతిక లోపాలతో టెలికామ్ సంస్థలు సేవలను ఆపివేశాయని జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపినట్లు మోహిత్ కంధారీ తెలిపారు.

జమ్మూలోని చాలా జిల్లాల్లో వదంతులు వ్యాపిస్తున్నాయి. చాలా చోట్ల పెట్రోల్ పంపుల ముందు జనాల బారులు తీరు కనిపిస్తున్నారు.

ప్రజలు ఎలాంటి వదంతులూ నమ్మవద్దని, సాంకేతిక లోపాల వల్లే 2జీ మొబైల్ సేవలు ఆగిపోయాయని జమ్మూ ఐజీ ముకేశ్ సింగ్ ప్రకటించారు.

Image copyright MOHIT KANDHARI/BBC

జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం జమ్మూలో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజౌరీ, ఉద్ధమ్‌పుర్‌ల్లో పర్యటించిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. వివిధ పోలీసు దళాల అధికారులు ఇందులో పాల్గొన్నారు.

కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించిన తర్వాత ఆంక్షలు అమలు చేస్తున్నారు.

సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రికుల తొలి బ్యాచ్ వచ్చిన తర్వాత ఆదివారం కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయని, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించామని అధికారులు పేర్కొన్నట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

శ్రీనగర్‌లో శనివారం కర్ఫ్యూ సడలించిన తర్వాత పదులు సంఖ్యలో ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయని, వీటిలో కొందరు నిరసనకారులు గాయపడ్డారని అధికారులు చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.

Image copyright Reuters

‘అల్లరిమూకలపై చర్యలు’

కర్ఫ్యూ సడలించిన ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనకరమైన ఘటనలూ జరగలేదని, ఆంక్షలు అమల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఒకట్రెండు సాధారణ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని జమ్మూకశ్మీర్ ప్రణాళికా సంఘం ముఖ్య కార్యదర్శి రోహిత్ కంసల్ ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.

కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో కొన్ని అల్లరిమూకలు దుకాణాలను మూసివేయించాయని, వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.

శ్రీనగర్‌లోని రాజ్‌బాగ్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి ఆమిర్ పీర్జాదా.. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రశాంతంగానే ఉన్నట్లు చెప్పారు. పాత శ్రీనగర్‌లో మాత్రం ఆంక్షలను పెంచారని ఆయన పేర్కొన్నారు.

''శ్రీనగర్ ప్రధాన పట్టణంలో కర్ఫ్యూ ఇంకా ఆగస్టు 5న ఉన్నట్లే కొనసాగుతోంది. సీఆర్‌పీఎఫ్, ఇతర బలగాలు, బారికేడ్లు, కంచెలు అలాగే ఉన్నాయి. అనుమతి లేకుండా రాకపోకలను సాగనివ్వట్లేదు. భద్రతదళాలు మమ్మల్ని ఆపి, అనుమతి పత్రాలు చూపించమని అడిగారు. ప్రభుత్వం మాత్రం అక్కడ కర్ఫ్యూ లేదని చెబుతోంది'' అని ఆమిర్ అన్నారు.

Image copyright EPA

''మీడియాను ముందుకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. సౌరా వైపు వెళ్తుంటే, దారిలో మాకు ఆందోళనకారులు కనిపించారు. వారు రహదారిపై బైఠాయించారు. మమ్మల్ని వాళ్లు వాహనం నుంచి బలవంతంగా దింపి, వీడియో తీయమని అడిగారు'' అని ఆమిర్ చెప్పారు.

మధ్య కశ్మీర్‌లోని సివిల్ లైన్స్, రాజ్‌బాగ్‌ల్లో ఆంక్షలు సడలించారని, ఆ ప్రాంతాల్లో వాహనాలు తిరుగుతున్నాయని ఆమిర్ చెప్పారు.

పాదాచారులు మాత్రం పెద్దగా కనిపించడం లేదని, దుకాణాలు కూడా మూసివేసి ఉన్నాయని పేర్కొన్నారు.

పాత కశ్మీర్‌లో కర్ఫ్యూ కఠినంగా అమలవుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమిర్ చెప్పారు. ఉత్తర, దక్షిణ కశ్మీర్ ప్రాంతాల్లో కమ్యునికేషన్స్ సేవలు అందుబాటులో లేవని, అక్కడి పరిస్థితుల గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారమూ రాలేదని వివరించారు.

Image copyright EPA

బడులు తెరుచుకుంటాయా..

కశ్మీర్ లోయ ప్రాంతంలో వందకు పైగా బడులు సోమవారం తెరుచుకుంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు ఇప్పుడే పంపించే పరిస్థితి కనిపించడం లేదని ఆమిర్ పీర్జాదా అన్నారు.

కశ్మీర్‌లో శనివారం కేవలం ల్యాండ్ లైన్ సేవలు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు.

అయితే, కేవలం 17 టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ల సేవలు మాత్రమే మొదలయ్యాయి. అంతరాయం లేకుండా ఫోన్ సేవలు నడుస్తున్నట్లు బీబీసీ స్వతంత్రంగా నిర్ధారించుకోలేకపోయింది.

Image copyright AFP/GETTYIMAGES

బీబీసీ ప్రతినిధి శుభ్‌జ్యోతి ఘోష్ దిల్లీలో ఉంటున్న సదాఫ్ అనే కశ్మీరీ మహిళతో మాట్లాడారు.

కశ్మీర్‌లో టెలిఫోన్ సేవలు ప్రారంభమయ్యాయని తాను భావించట్లేదని సదాఫ్ చెప్పారు.

''మా ఇంట్లో వాళ్లు పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేశారు. వాళ్లకు మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ కాల్స్ చేసేందుకు స్టేషన్‌లో లైన్‌లో నిలబడుతున్నట్లు వాళ్లు నాకు చెప్పారు'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)