కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

  • 19 ఆగస్టు 2019
లేహ్ గ్రౌండ్ రిపోర్ట్

"యూటీ అంటే ఏంటో తెలుసా"?

యూనియన్ టెరిటరీ అని చెప్పగానే ఆ ఆరేళ్ల బాలిక పరిగెత్తుకు వెళ్లిపోయింది.

లద్దాఖ్ ప్రజలకు కేంద్ర పాలిత ప్రాంతం అనే డిమాండ్ ఒక పాత నినాదంలా మారిపోయింది. అందుకే, దాని అర్థమేంటో తెలుసుకోడానికి ఇక్కడ ఉంటున్న పౌరులు పుస్తకాల్లో వెతకడం లేదు.

ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఆర్టికల్ 370లోని ముఖ్యమైన నిబంధనలను తొలగించాలని, లద్దాఖ్‌ను జమ్మూకశ్మీర్ నుంచి వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని నిర్ణయించింది.

'ఇప్పుడు కశ్మీర్ కింద లేము'

బౌద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న లేహ్‌లో ప్రజలు మొదట తమ స్పందనను షేర్ చేసుకున్నప్పుడు ఈ నిర్ణయాన్ని స్వాగతించినట్లే కనిపించింది. మార్కెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ బ్యానర్లు కూడా ఉన్నాయి.

దేహ్‌చిన్ అనే మహిళ ప్రధాన మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటారు. ఆమె పొలం అక్కడికి 10-15 నిమిషాల దూరంలో ఉంటుంది. యూటీ కావడం వల్ల తమ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఆమెకు తెలీదు. కానీ, ఆ ప్రకటన తర్వాత తమ కుటుంబం, చుట్టుపక్కల వారు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు.

వచ్చీరాని హిందీలో మాట్లాడిన ఆమె "మొదట మేం జమ్మూకశ్మీర్ కింద ఉండేవాళ్లం. ఇప్పుడు ఇది మాది. మా సొంతమైంది" అన్నారు.

చిత్రం శీర్షిక దేహ్‌చిన్

'కశ్మీరీల వివక్ష' నుంచి విముక్తి పొందామనే భావన

లద్దాఖ్ కశ్మీర్ కింద ఉందనే బాధ ఇక్కడ చాలా మందికి ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడాన్ని జనం తమ సంస్కృతికి లభించిన స్వతంత్ర ఉనికి అంటూ భావోద్వేగంతో చెబుతున్నారు.

కశ్మీరీ సంస్కృతికి, అక్కడి నేతలకు, వారి రాజకీయ ప్రాధాన్యాలకు లద్దాఖ్‌తో, ముఖ్యంగా లేహ్‌తో ఎలాంటి సంబంధం లేదని వారు భావిస్తున్నారు. అందుకే కశ్మీరీ నేతల నాయకత్వం నుంచి తమకు విముక్తి లభించిందని వారు చాలా సంతోషంగా ఉన్నారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో తమకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో అభివృద్ధి పథకాలు, నిధులకు సంబంధించి తమపట్ల వివక్ష ఉండేదని ఇక్కడ చాలామంది భావిస్తున్నారు.

కిర్గిస్తాన్ మాజీ భారత దౌత్యవేత్త, రచయిత, రాజకీయ విశ్లేషకులు పి. స్తోబదాన్ లేహ్‌కు చెందినవారు.

ఆయన కేంద్ర పాలిత ప్రాంతాల అంశం గురించి పుస్తకాలు కూడా రాశారు. లద్దాఖ్ జమ్మూకశ్మీర్ కింద ఉండడాన్ని అక్కడివారు ఒక బానిసత్వంలా భావించేవారని ఆయన చెప్పారు.

"జమ్మూకశ్మీర్‌లోని 60 శాతం భూమి లద్దాఖ్‌లోనే ఉంది. కానీ, కశ్మీర్ లోయలోని 15 శాతం ప్రజలు లద్దాఖ్ భవిష్యత్, వర్తమానాలను నిర్ణయించేవారు. లద్దాఖ్ ప్రజలు షేక్ అబ్దుల్లానుగానీ, వేరే ఇంకెవరినైనా కానీ తమ నేతగా ఎప్పుడూ అనుకోలేదు. వారికి మాతో రక్త సంబంధంగానీ, బంధుత్వంగానీ లేదు. కానీ, ప్రతి వేదిక మీదా వారే మాకు ప్రాతినిధ్యం వహించేవారు. అది ఒక అన్యాయం. దానిని ఇక్కడ ప్రజలు ఒక అవమానంలా భావించేవారు" అన్నారు స్తోబదాన్.

చిత్రం శీర్షిక పి.స్తోబదాన్

అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమల ఆశలు

సాంస్కృతిక ఉనికికి స్వతంత్రం లభించిందనే సంతోషం ఒకటైతే, అభివృద్ధి, ఉపాధి, కొత్త ఆశలకు సంబంధించిన సంతోషం మరొకటి. యూటీ హోదా లభించిన తర్వాత ఇక్కడకు కొత్త పరిశ్రమలు వస్తే సంపాదన అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు.

డ్రైవర్‌గా పని చేస్తున్న సోనమ్ తరగేష్ తన పిల్లలు పెద్దవాళ్లయ్యేసరికి ఇక్కడ బహుశా చండీగఢ్ స్థాయిలో ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కావచ్చని, అందులో చదివే పిల్లలు పెద్ద నగరాల్లోని విద్యార్థులకు కూడా పోటీ ఇచ్చేలా చదువుతారనే ఆశతో ఉన్నారు. ఇప్పుడు లేహ్‌లో ఉన్న డిగ్రీ కాలేజీల్లో సరిగా చదువు చెప్పడం లేదని స్థానికులు భావిస్తున్నారు.

లద్దాఖ్‌లో చాలా సహజ వనరులు ఉన్నాయని, సౌర విద్యుత్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

"ఇక్కడ లభించే నీటి వనరుల సామర్థ్యానికి తగినట్టు ఇక్కడ విద్యుదుత్పత్తి జరగడం లేదు. ఇక్కడ 23 గిగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని కొంతమంది ప్రైవేటు పరిశోధకులు చెబుతున్నారు" అంటారు పి.స్తోబదాన్.

అందుకే, ప్రైవేటు కంపెనీల కంటే ముందు ఇక్కడకు పబ్లిక్ రంగ కంపెనీలు రావాలని ఆయన సలహా కూడా ఇస్తున్నారు.

చరిత్ర చిన్నదే

పది నుంచి 19వ శతాబ్దం వరకూ లద్దాఖ్ ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉండేది. ఇక్కడ 30-32 రాజుల చరిత్ర ఉంది. కానీ 1834లో డోగ్రా సేనాపతి జోరావర్ సింగ్ లద్దాఖ్‌పై విజయం సాధించాక, అది జమ్ము-కశ్మీర్ అధీనంలోకి వెళ్లిపోయింది.

అందుకే లద్దాఖ్ తన స్వతంత్ర గుర్తింపు కోసం పోరాడింది. యూటీ చేయాలనే డిమాండ్ ఇక్కడ దశాబ్దాల నుంచీ ఉంది. కానీ 1989లో బౌద్ధుల ప్రముఖ ధార్మిక సంస్థ లద్దాఖ్ బుద్ధిష్ట్ అసోసియేషన్(ఎల్‌బిఎ) నేతృత్వంలో ఇక్కడ భారీ స్థాయిలో ఉద్యమం జరిగినప్పుడు ఆ డిమాండుకు కాస్త విజయం దక్కింది.

Image copyright Getty Images

రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీనిపై మాట్లాడేందుకు సిద్ధమైంది. యూటీ హోదా ఇవ్వకపోయినా, తర్వాత 1993లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లద్దాఖ్‌కు 'స్వయంప్రతిపత్తి ఉన్న హిల్ కౌన్సిల్‌' హోదా ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

ఈ కౌన్సిల్‌ దగ్గర గ్రామ పంచాయతీలతోపాటు, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భూమి ఉపయోగం, పన్నులు, స్థానిక పాలనకు సంబంధించిన హక్కులు ఉంటాయి. లా అండ్ ఆర్డర్, న్యాయ వ్యవస్థ, కమ్యూనికేషన్స్, ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలను మాత్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం దగ్గరే ఉంచారు.

అంటే ఒక విధంగా కొన్ని రంగాల్లో లద్దాఖ్‌కు కాస్త స్వేచ్ఛ కచ్చితంగా లభించింది. ఆ తర్వాత ఎన్నో స్థాయిల్లో ఇక్కడ అభివృద్ధి కూడా వేగం అందుకుంది.

కొన్ని కన్‌ఫ్యూజన్లు, ఆందోళనలు ఉన్నాయి

"స్థానిక మూలాలున్న ఒక లెఫ్టినెంట్ గవర్నర్, చీఫ్ సెక్రటరీతో కలిసి లేహ్ లేదా కార్గిల్‌లో ఉంటే ఈ అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని స్థానికులు ఆశిస్తున్నారు. వారికి ఇక్కడి వారి గురించి బాగా తెలిసుంటుంది. వారు కేంద్రంలో మాకు అసలైన ప్రతినిధులుగా ఉంటారు" అంటారు స్థానికులు.

కానీ, సంబరాలు, సంతోషాల ఈ వాతావరణంలో ప్రజల్లో కొన్ని అస్పష్టతలు, ఆందోళనలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని చెప్పకుంటే దీని గురించి అసంపూర్తిగా చెప్పినట్లే ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఆ ఆందోళన ఇక్కడి వారికి ఆర్టికల్ 370 ద్వారా లభించిన హక్కుల సంరక్షణకు సంబంధించింది కావడం విశేషం.

370 ప్రకారం బయట రాష్ట్రాలవారికి ఇక్కడి భూములను కొనుగోలు చేసే అనుమతి లేదు. ఇక్కడ పారిశ్రామిక ప్రయోజనాల కోసం అది ఒక పెద్ద 'సేఫ్‌గార్డ్‌'గా ఉంది.

హోటళ్లు, పరిశ్రమలు, షాపులు, టాక్సీల యజమానులు ఇప్పుడు ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే సమయంలో తమ పారిశ్రామిక ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ఈశాన్యభారతం, హిమాచల్ ప్రదేశ్, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని నిబంధనలను విధించింది అంటున్నారు. అంటే 370 లాంటివే.

లేహ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు త్సెవాంగ్ యాంగ్‌జోర్ ఆర్టికల్ 370 తొలగించకుండా లద్దాఖ్‌ను విడిగా యూటీ చేసుంటే మాకు మరింత మెరుగ్గా ఉండేదని అన్నారు.

"అలా చేసుంటే మా పారిశ్రామిక ప్రయోజనాలకు చాలా మెరుగ్గా ఉండేది. బహుశా ప్రభుత్వానికి అందుకు కొన్ని రాజకీయ సమస్యలు ఎదురయ్యాయేమో నేనేం చెప్పలేను" అన్నారు.

ఉప్పులో పిండి, పిండిలో ఉప్పు

దోర్జే నాంగ్యాల్ ఒక సీనియర్ సిటిజన్. ఆయనకు లేహ్ ప్రధాన మార్కెట్లో ఒక బట్టల దుకాణం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల లాభం, నష్టం రెండూ ఉంటాయని ఆయన భావిస్తున్నారు.

"ఈ నిర్ణయం వల్ల ముందు ముందు ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలీడం లేదు. ఎందుకంటే యూటీ ఒక పాత డిమాండ్. అది నెరవేరడంతో ఇప్పుడు జనం సంతోషంగా ఉన్నారు. కానీ దీని గురించి చాలామందికి ఎక్కువ తెలీదు. చివరికి ఇప్పుడు మన భూమి కాపాడుకోవాలనే విషయానికి వచ్చారు" అన్నారు.

"కశ్మీర్‌లో అగ్ని పర్వతం బద్దలు కానుంది, కొంత కాలం గడిచాక..."

చిత్రం శీర్షిక దోర్జే నాంగ్యాల్

స్థానిక జర్నలిస్ట్ సెవాంగ్ రింగ్జిన్ యూటీ కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు దశాబ్దాల నుంచీ యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అసెంబ్లీ లేని యూటీ అనేది వారి డిమాండులో లేదు.

"మాకు హిల్ కౌన్సిల్ లభించిన తర్వాత జమ్ము-కశ్మీర్ పెత్తనం ఎక్కువగా సాగలేదు. గత 10-15 ఏళ్ల నుంచి మేం 'యూటీ విత్ అసెంబ్లీ' డిమాండ్ మాత్రమే ఉంది" అని ఆయన అన్నారు.

"ఇక్కడ పర్యావరణం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లద్దాఖ్ ఒక పాపులర్ పర్యాటక ప్రదేశం. ఇక్కడ పర్యావరణం చాలా సున్నితంగా ఉంటుంది. దీని గురించి ప్రజలు చాలా భావోద్వేగంతో ఉంటారు. ఇప్పుడు బయటనుంచి జనం భారీగా రావడం వల్ల లద్దాఖ్ గుర్తింపే ప్రమాదంలో పడకూడదు" అంటారు రింగ్జిన్.

పి. స్తోబదాన్ దీనికి ఉపమానాలు కూడా చెబుతున్నారు. "పిండిలో ఉప్పు కలిపితే బాగుంటుంది. కానీ ఉప్పులో పిండి కలిపితే ఆ ఉప్పు తన రుచినే కోల్పోతుంది. ప్రభుత్వం మమ్మల్ని వేడిగా ఉన్న పెనం మీద నుంచి తీసి, వేడిగా ఉన్న ఇంకో పెనంమీద వేయదనే మేం నమ్ముతున్నాం" అన్నారు.

Image copyright Getty Images

అసెంబ్లీ లేని లద్దాఖ్... చండీగఢ్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతంలా ఉంటుంది. హిల్ కౌన్సిల్ పాత్రపై ఉన్న అనిశ్చితి దృష్ట్యా స్థానిక రాజకీయ ప్రతినిధుల్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి.

లేహ్‌లోనే నివసించే రియాజ్ అహ్మద్ యూటీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూనే హిల్ కౌన్సిల్‌ పవర్ అలాగే ఉంచాలని, వీలైతే అసెంబ్లీ కూడా ఇవ్వాలని కోరారు.

"మాకు ఐదారు నెలలపాటు మిగతా ప్రపంచంతో సంబంధాల తెగిపోతాయి. మా సరిహద్దు చైనా, పాకిస్తాన్ రెండింటితో ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు కఠినంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మైనస్ 32 డిగ్రీల సెల్సియస్‌లో కూడా ఉంటున్నారు. దీన్నంతా శ్రీనగర్, దిల్లీలో కూర్చుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మా స్థానిక ప్రతినిధుల పాలనే ఉండాలి" అంటారు రియాజ్.

చిత్రం శీర్షిక రియాజ్ అహ్మద్

నిర్ణయం సంతోషమే, తర్వాత...

కేంద్ర ప్రభుత్వం యూటీ నిర్ణయం తీసుకుని దాదాపు 15 రోజులవుతోంది. దీనిని మొదట స్వాగతించిన వారిలో ఇప్పుడు తర్వాతేంటి అనే చర్చ కూడా మొదలైంది.

ఎన్నో అకడమిక్, పారిశ్రామిక, ఇతర వేదికలపై కలుస్తున్న వారందరూ తాము ఎలాంటి యూటీని కోరుకుంటున్నామో చర్చించుకుంటున్నారు.

పరిశ్రమలు, కంపెనీల 'ఫ్రీ ఫ్లో' గురించి ఇక్కడి సాంస్కృతిక సంస్థల్లో, పారిశ్రామిక వర్గాల్లో ఒక విధమైన విముఖత స్పష్టంగా కనిపిస్తోంది.

Image copyright Getty Images

మొబైల్ అప్లికేషన్‌తో టాక్సీ ఇచ్చే అంతర్జాతీయ కంపెనీ ఇక్కడకు వస్తే తను దానితో పోటీపడలేనని ఒక టాక్సీ యజమానికి అనిపిస్తోంది.

"ఎయిర్ పోర్టు, ప్రధాన మార్కెట్ వరకూ మూడు కిలోమీటర్ల దూరానికి ఇక్కడ టాక్సీ వాళ్లు 400 రూపాయలు తీసుకుంటారు. దిల్లీలో మీరు గరిష్టంగా వంద రూపాయలకు అంత దూరం వెళ్లచ్చు" అని అతడు చెప్పాడు.

కానీ, ఇప్పుడు వీరి స్వరంలో ఆందోళన కూడా వినిపిస్తోందన్నది నిజం. ఈ స్వరంలో కోపం లేదు.

కొన్ని అస్పష్టతలు ఉన్నప్పటికీ లేహ్ ప్రజలకు తమ కల హఠాత్తుగా నిజమైనట్టే అనిపిస్తోంది. దానితోపాటూ ఏర్పడ్డ ఆందోళనను కూడా ప్రభుత్వం సరి చేస్తుందని వీరంతా ఆశగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

‘కైలాస్ లేనే లేదు.. మేం అమ్మలేదు’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు