విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా

  • 20 ఆగస్టు 2019
విక్రమ్ సారాభాయ్ Image copyright AMRITA SHAH/BOOK COVER

అహ్మదాబాద్‌లోని బట్టల మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ ఇంట్లో 1919 ఆగస్టు 12న ఒక మగపిల్లాడు పుట్టాడు. అతడిని చూడ్డానికి వచ్చిన అందరి కళ్లూ బిడ్డ చెవులపైకి వెళ్లాయి.

ఆ చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లంతా "అరే ఇవి గాంధీజీ చెవుల్లా ఉన్నాయే" అన్నారు.

అంబాలాల్ సన్నిహతులు కొందరైతే సరదాగా "తమలపాకుల్లా ఉన్న ఆ చెవులను కిళ్లీలా మడవచ్చు" అన్నారు. ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే పేరు పెట్టారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

అప్పట్లో అహ్మదాబాద్‌లోని సారాభాయ్ ఇంట్లో భారతదేశంలోని ప్రముఖ మేధావులు, శాస్త్రవేత్తలు బస చేస్తుండేవారు. జగదీశ్ చంద్రబోస్, సీవీ రామన్, తత్వవేత్త గురు జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఎందరో వస్తుండేవారు.

1920లో రవీంద్రనాథ్ టాగూర్ అహ్మదాబాద్ వచ్చారు. అప్పుడు ఆయన సారాభాయి ఇంట్లోనే ఉన్నారు. విక్రమ్ సారాభాయ్ జీవితచరిత్ర రాసిన అమృత్ షా ఠాగూర్ అప్పుడు జరిగింది చెప్పారు.

టాగూర్ ఎవరి ముఖమైనా చూడగానే వారి భవిష్యత్తు గురించి చెప్పేవారు. పిల్లాడుగా ఉన్న విక్రమ్‌ను ఆయన దగ్గరికి తీసుకురాగానే, టాగూర్ విశాలంగా విక్రమ్ నుదుటిని అలా చూస్తుండిపోయారు. "ఈ పిల్లాడు ఒకరోజు చాలా పెద్ద పని చేస్తాడు" అన్నారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

ఎప్పుడూ ఆలోచనల్లో ఉండేవారు

తర్వాత విక్రమ్ సారాభాయ్ కేంబ్రిడ్జిలో చదవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు టాగూర్ ఆయనకు ఒక రెకమండేషన్ లెటర్ కూడా రాసిచ్చారు.

విక్రమ్ సారాభాయ్ కూతురు మల్లికా సారాభాయ్ ప్రస్తుతం భారతదేశలోని ప్రముఖ నృత్య కళాకారిణి.

తండ్రి ఎప్పుడూ ఆలోచనల్లో మునిగి ఉండడం చూసేదాన్నని ఆమె చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు రోడా కళాఖండం 'థింకర్'లా ఆయన చేయి ఎప్పుడూ ఆలోచనాముద్రలో ఉండేదన్నారు.

"మా నాన్న ప్రతి మాటనూ చాలా శ్రద్ధగా వినేవారు. ఎప్పుడూ తెల్ల కుర్తా, పైజామా వేసుకునేవారు.

అవసరమైనప్పుడు మాత్రమే సూట్ వేసుకునేవారు. కానీ వాటిపైకి బూట్లు వేసుకోకుండా, కొల్హాపురి చెప్పులు వేసుకునేవారు. పిల్లలిద్దర్నీ చూసి ఆయన చాలా గర్వపడేవారు" అని మల్లికా సారాభాయ్ ఆరోజులను గుర్తు చేసుకున్నారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

జీవిత భాగస్వామితో పరిచయం

కేంబ్రిడ్జి నుంచి తిరిగొచ్చిన విక్రమ్ సారాభాయ్ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన నోబెల్ పురస్కార గ్రహీత సీవీ రామన్ పర్యవేక్షణలో తన పరిశోధనలు కొనసాగించారు.

అక్కడే ఆయన పరమాణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాను కలిశారు. ఆయనే విక్రమ్ సారాభాయ్‌ని ప్రముఖ నర్తకి మృణాళినీ స్వామినాథన్‌కు పరిచయం చేశారు. తర్వాత విక్రమ్ ఆమెను పెళ్లాడారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT
చిత్రం శీర్షిక కూతురు మల్లికతో సారాభాయ్

ఆ రోజుల గురించి చెప్పిన మల్లిక "హోమీ కూడా మంచి కళాకారుడు. ఆయన బొమ్మలు కూడా వేసేవారు. మా నాన్న, ఆయన మంచి స్నేహితులు. ఆయన తరచూ మా నాన్నతో "నువ్వింత అందమైన భారతీయ బట్టలు ఎందుకు వేసుకుంటావ్, ఒక శాస్త్రవేత్తలా బట్టలు వేసుకోవచ్చుగా" అని ఉడికించేవారు. మా అమ్మ, భాభా బ్యాడ్మింటన్ ఆడేవారు. మొదటిసారి మా నాన్నను మా అమ్మకు పరిచయం చేసింది భాభానే" అన్నారు.

మృణాళిని భరతనాట్యం నేర్చుకునేవారు. ఆమె దాన్ని ఎంత సీరియస్‌గా నేర్చుకునేవారంటే అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారు. కానీ విక్రమ్ ఆమెను కలిసిన తర్వాత ఆమె కూడా మారారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

వద్దంటూనే పెళ్లి, రైల్లో హనీమూన్

విక్రమ్, మృణాళిని ఇద్దరూ అందరితో మాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదనేవారు. తర్వాత మెల్లమెల్లగా ప్రేమలో పడ్డారు. వాళ్ల పెళ్లి మొదట సంప్రదాయం ప్రకారం జరిగింది, తర్వాత వారు సివిల్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు.

పెళ్లి అయిన రోజు ఇద్దరూ బెంగళూరు నుంచి అహ్మదాబాద్ బయల్దేరారు. అదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతోంది. ఆందోళనకారులు చాలా ప్రాంతాల్లో రైలు పట్టాలు పీకేశారు. దాంతో 18 గంటల్లో గమ్యం చేరుకోవాల్సిన వారు 48 గంటల తర్వాత ఇల్లు చేరారు. అలా విక్రమ్, మృణాళిని రైల్లో ఫస్ట్ క్లాస్ కూపేలోనే హనీమూన్ చేసుకున్నారు.

Image copyright Getty Images

కొత్త దంపతులు అహ్మదాబాద్ చేరుకునేసరికి ఇంట్లో అంతా దిగులుగా ఉన్నారు. ఎందుకంటే, విక్రమ్ సోదరి మృదుల స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు 18 నెలల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అన్నా, వదినలను చూసేందుకు ఆమెను విడుదల చేయాలని అంబాలాల్ సారాభాయ్ అధికారులను కోరారు. గవర్నర్ రాజర్ లమ్లే సరే అన్నారు. కానీ మృదుల జైలు నుంచి బయటకు రావడానికి నిరాకరించారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

భార్యకు సారాభాయ్ వింత బహుమతులు

భార్యకు బహుమతులు ఇవ్వడంలో విక్రమ్ తనదైన ప్రత్యేకత చూపేవారు. రచయిత అమృత షా వాటి గురించి చెప్పారు.

"మృణాళిని ఒకసారి నవ్వుతూ ఆయన నాకెప్పుడూ మామూలు బహుమతి ఇవ్వలేదని నాకు చెప్పారు. నా ఎంగేజ్‌మెంట్ రోజు ఆయన అంత కోటీశ్వరుడు అయినా చాలా చౌకగా దొరికే ఒక టిబెట్ ఉగరం తీసుకొచ్చి ఇచ్చారు. కానీ, అది చాలా అందంగా ఉండేది అన్నారు".

"విక్రమ్ ఒకసారి నాకు బహుమతిగా శ్రీలంకలో కనిపించే కోతి జాతికి చెందిన 'స్లెండర్ లోరిస్' పంపించారు. దాన్ని నేను తీసుకోనని చెప్పేశాను. పెళ్లి రోజు విక్రమ్ ఒక రాగి ట్రేలో చాలా అరుదుగా దొరికే ఒక నీలి కమలం ఇచ్చారు. ఒకరిపై ఉన్న ప్రేమను అంతకంటే అందంగా ఎవరు బయటపెట్టగలరు" అని మృణాళిని చెప్పారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

విజిల్ వేస్తూ ల్యాబ్‌లోకి వెళ్లేవారు

విక్రమ్ సారాభాయ్ చాలా కష్టపడేవారు. ఆయన శాస్త్రవేత్తే కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా. టెన్షన్ తగ్గించుకోడానికి ఆయన ఎక్కువగా సంగీతం వినేవారు.

ఆయన దగ్గర గ్రామ్‌ఫోన్ రికార్డుల భారీ కలెక్షన్ ఉండేదని చెబుతారు. ఆయనకు నచ్చిన గాయకుడు 'కుందన్ లాల్ సెహగల్'

ఆయనకు విజిల్ వేయడం అంటే చాలా ఇష్టం. విజిల్‌తోపాటూ మెట్లపై చెప్పుల శబ్దం వినిపించగానే ల్యాబ్‌లో పనిచేస్తున్నవారు విక్రమ్ సారాభాయ్ వచ్చేశారని తెలుసుకునేవారు.

విక్రమ్ సారాభాయ్‌కు శాస్త్రీయ, వెస్ట్రన్, భారతీయ సంగీతం చాలా ఇష్టం. టాగూర్, సెహగల్ పాటలంటే ఆయనకు చాలా ఇష్టం అంటారు మల్లికా సారాభాయ్.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

ఫిట్‌నెస్ పాటించిన భోజన ప్రియుడు

విక్రమ్ సారాభాయ్ తన బరువు పెరక్కుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఉదయం లేవగానే సూర్యనమస్కారాలు చేసేవారు, అవకాశం దొరికినప్పుడల్లా ఈతకొట్టేవారు. పెరుగు, ఊరగాయ, అప్పడం, సలాడ్‌తోపాటు ఆయన ఒక్క చపాతీనే తినేవారు.

అప్పుడప్పుడు ఆయన వేరే వాళ్ల ప్లేటులోంచి ఒక ముద్ద తీసుకుని తింటూ "ఇది నా ప్లేటులోది కాదు, అందుకే దీని కేలరీలు నాకు రావు" అనేవారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT
చిత్రం శీర్షిక విక్రమ్ సారాభాయ్ కుమార్తె మల్లికా సారాభాయ్

"ఆయన మంచి ఫుడీ(భోజనప్రియుడు) కానీ ఎప్పుడూ తన బరువు పెరక్కుండా చూసుకునేవారు. ఎప్పుడూ సన్నగా ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నించేవారు. ఆయనకు కొత్త రుచులు అంటే ఇష్టం. మా అమ్మ పెళ్లికి ముందు పూర్తి మాంసాహారి. కానీ ఆమె శాఖాహారిని పెళ్లి చేసుకోవడమే కాదు, శాఖాహార రాష్ట్రానికే వచ్చేశారు" అని మల్లికా సారాభాయ్ చెప్పారు.

"నాన్న భోజన ప్రియులు కావడంతో, అమ్మ ఇతర దేశాల శాఖాహార రెసిపీలు తెప్పించి ఆయన కోసం ఇంట్లో చేసేవారు. మాకు చిన్నప్పుడు మెక్సికన్, స్పానిష్ వంటల రుచి బాగా నచ్చింది. ఇప్పుడు ఇటాలియన్ భోజనం అన్నిచోట్లా దొరుకుతుంది. కానీ అప్పట్లోనే మా ఇంట్లో ప్రపంచంలోని వంటకాలన్నీ రుచిచూసేవాళ్లం" అన్నారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

పెళ్లైన 25 ఏళ్లకు మరో మహిళతో బంధం

పెళ్లైన 25 ఏళ్ల తర్వాత విక్రమ్ సారాభాయ్‌కు కమలా చౌధరి అనే మహిళతో సంబంధం ఏర్పడింది. కానీ ఆయన దాన్ని ఎప్పుడూ దాచాలని ప్రయత్నించలేదు.

దాని గురించి చెప్పిన ఆయన కూతురు మల్లికా సారాభాయ్ "నాన్న కమలా చౌధరితో 'ఇన్వాల్వ్‌' అయ్యారు. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. ఆయనతో చాలా వాదించేదాన్ని. తర్వాత నేను పెద్దయ్యాక ఇద్దరి మధ్య ప్రేమ కలగడం సాధారణం అని తెలిసింది" అన్నారు.

చిత్రం శీర్షిక 'విక్రమ్ సారాభాయ్: ఎ లైఫ్' రచయిత్రి అమృతా షాతో బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్

విక్రమ్ సారాభాయ్ ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆయన చాలా ఓపెన్ థింకింగ్‌తో ఉండేవారు. ఆ ఆలోచనల పరిధి చాలా విశాలంగా ఉండేది. ఆయన తన సంబంధాన్ని కూడా ఎప్పుడూ దాయాలని ప్రయత్నించలేదు. కానీ అప్పుడు కూడా తన భార్యకు కూడా అదే స్థాయి ప్రేమను పంచారు" అని ఆయనపై పుస్తకం రాసిన అమృతా షా చెప్పారు

కమలా చౌధరితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మృణాళిని కూడా వ్యతిరేకించలేదు. ఆమె వారి మధ్యకు ఎప్పుడూ వచ్చేవారు కాదు.

Image copyright MALLIKA SARABHAI
చిత్రం శీర్షిక హోమీ జహంగీర్ భాభా

హోమీ భాభా వారసుడు

1966లో హోమీ భాభా హఠాత్తుగా విమాన ప్రమాదంలో మరణించినపుడు విక్రమ్ సారాభాయ్ ఆయన స్థానంలో అణుశక్తి కమిషన్ అధ్యక్షుడయ్యారు. అయితే ఆయనకు అణు పరిశోధనలు చేసిన ఎలాంటి నేపథ్యం లేదు.

దీనిపై మాట్లాడిన అమృతా షా "భాభా వ్యక్తిత్వం, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో ఆయనకు ఉన్న సంబంధాల గురించి తెలిసినవారు, వారసుడిగా ఆయనతో సమానమైనవారిని నియమించాలని భావించారు. కొంతమందిని ఈ పదవికి ప్రతిపాదించారు. ఆ తర్వాత సారాభాయిని ఈ పదవి స్వీకరించాలని చెప్పారు. ఆయన అప్పటికే భారత అంతరిక్ష కార్యక్రమం చూసుకుంటున్నారు. దానితోపాటు అణు విభాగం బాధ్యతలు కూడా తీసుకోవడం అంటే, అది చాలా కష్టమైన పని" అన్నారు.

"మరో విషయం ఏంటంటే, భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసింది విక్రమ్ సారాభాయే. ఆయన టీమ్ ఆయనతోపాటూ పనిచేసేది. కానీ అణు కార్యక్రమం టీమ్ మొదటి నుంచే ఉంది. అందుకే బయటి వ్యక్తి ఆ విభాగానికి చీఫ్‌గా రాగానే, కొంతమందికి ఆయన నచ్చలేదు. అందులో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ హోమీ సేఠ్నా ముఖ్యులు. కానీ రాజా రామన్న ఆ సమయంలో ఈ పదవికి సారాభాయ్ లాంటి వ్యక్తి అవసరం ఉందని చెప్పారు".

Image copyright EPA
చిత్రం శీర్షిక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు గురువు

భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ పేరుతో పాపులరైన ఏపీజే అబ్దుల్ కలాంకు విక్రమ్ సారాభాయ్ గురువు. ఒక సారి "మిమ్మల్ని దిల్లీలో కలవాలని అనుకుంటున్నట్లు" సారాభాయ్ నుంచి కలాంకు ఒక మెసేజ్ అందింది. కలాం చాలా విమానాలు మారి దిల్లీ చేరుకున్నారు. సారాభాయ్ ఆయనకు ఉదయం మూడున్నరకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

కలాం తన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో ఆరోజు గురించి రాశారు. "నేను అంత ఉదయం అశోకా హోటల్‌కు ఎలా వెళ్లాలా అని నాకు కంగారుగా ఉంది. దాంతో, నేను రాత్రంతా ఆ హోటల్ లాబీలోనే ఉండాలని అనుకున్నా. ఆ హోటల్లో భోజనం చేస్తే, నా జేబు ఖాళీ అయిపోతుంది. అందుకే నేను ఒక దాభాకు వెళ్లి భోజనం చేశాను. రాత్రి 11 గంటలకు హోటల్ లాబీలోకి చేరుకున్నాను" అని చెప్పారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT
చిత్రం శీర్షిక అబ్దుల్ కలాంతో విక్రమ్ సారాభాయ్

"దాదాపు 3 గంటలప్పుడు అక్కడకు ఒక వ్యక్తి వచ్చి కూచున్నారు. ఆయన సూట్‌ వేసుకుని, ఒక మెరిసే టై కట్టుకుని ఉన్నారు. బూట్లు మెరుస్తున్నాయి. సరిగ్గా మూడు గంటలకు మమ్మల్నిద్దరినీ సారాభాయ్ గదికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి పిలిచి మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశారు. 'కలామ్ అంతరిక్ష విభాగంలో నా సహచరుడు అని ఆయనకు, గ్రూప్ కెప్టెన్ నారాయణన్, ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తారు అని నాకు చెప్పారు"

"కాఫీ తాగాక డాక్టర్ సారాభాయ్ మా ఇద్దరికీ 'రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్' అంటే RATO గురించి తన ప్లాన్ చెప్పారు. దీని సాయంతో భారత యుద్ధ విమానాలు హిమాలయాల్లో చిన్న రన్‌వేపై కూడా సమర్థంగా టేకాఫ్ అవుతాయన్నారు".

"కాసేపటి తర్వాత ఆయన మమ్మల్నిద్దరినీ కార్లో కూచోమని చెప్పారు. ఇద్దరినీ తనతోపాటూ ఫరీదాబాద్‌లో ఉన్న తిల్పత్ రేంజి తీసుకెళ్లారు. 'నేను పరిశోధన కోసం మీకు ఒక రాకెట్ అందుబాటులో ఉంచితే, మీరు 18 నెలల్లో దాని స్వదేశీ వెర్షన్ తయారు చేసి మన హెచ్ఎఫ్-24 విమానానికి ఫిట్ చేయగలరా' అని ఒక టీచర్‌లా అడిగారు. మేమిద్దరం 'అది సాధ్యమే' అన్నాం. అది వినగానే ఆయన నరాలు ఉప్పొంగాయి. ఆయన తన కారులోనే మాఇద్దరినీ తిరిగి అశోకా హోటల్ తీసుకొచ్చారు. తర్వాత టిఫిన్ సమయంలో ప్రధానమంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు" అని కలాం తన ఆత్మకథలో చెప్పారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

అణుబాంబుకు ఎప్పుడూ వ్యతిరేకం

అణుశక్తిని శాంతికోసమే ఉపయోగించాలని విక్రమ్ సారాభాయ్ మొదటి నుంచీ భావించేవారు.

ఇండియా టుడే ఎడిటర్ రాజ్ చెంగప్ప తన 'వెపన్ ఆఫ్ పీస్‌' పుస్తకంలో అణు బాంబు తయారీ విషయంలో విక్రమ్ సారాభాయ్, హోమీ భాభా అభిప్రాయాలు అసలు కలిసేవి కావు. భాభా చనిపోయిన ఐదు నెలలకు సారాభాయ్ అణుశక్తి కమిషన్‌ చీఫ్ పదవిని స్వీకరించినప్పుడు ఆయన మొదట భారత్ కొత్తగా ప్రారంభించిన అణు బాంబు కార్యక్రమాన్ని ముగించే సన్నాహాలు ప్రారంభించారు" అని చెప్పారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

అణు శాస్త్రవేత్త రాజా రామన్న ఆ రోజును గుర్తుచేసుకున్నారు. "ఒక ఆయుధంగా అణు బాంబు ఎందుకూ పనికిరానిదని సారాభాయ్ భావించేవారు. అణు బాంబు పట్ల సారాభాయ్ ఉద్దేశాన్ని గ్రహించిన మొరార్జీ దేశాయ్ చాలా సంతోషించారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు రాజా రామన్నతో "సారాభాయ్ తెలివైన కుర్రాడు. ఆ పిచ్చి భాభా మొత్తం ప్రపంచాన్నే పేల్చేయాలనుకునేవాడు" అన్నారు.

అణు బాంబు తయారు చేయడానికి చాలా తక్కువ వ్యయం అవుతుందని భాభా విక్రమ్‌తో వాదించినపుడు, ఆయన "మీరు రెండు గజాల గుడ్డ ధర ఎంతుంటుందిలే అని నన్నడగచ్చు. కానీ మగ్గాలు, మిల్లులు లేకుండా ఆ రెండు గజాల గుడ్డను తయారుచేయలేం" అన్నారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

విక్రమ్ సారాభాయ్‌కు ఇందిర షాక్

ఇందిరాగాంధీ విక్రమ్ సారాభాయ్‌కి చాలా విలువ ఇచ్చేవారు. ఆమె మొదటి పేరు పెట్టి పిలిచే కొద్దిమందిలో ఆయన ఒకరు. విక్రమ్ పర్సనల్ సెక్రటరీ ఆర్ రామనాథ్ దాని గురించి చెబుతూ.. "ఇందిరాగాంధీ ఎప్పుడు అహ్మదాబాద్ వచ్చినా, నగరంలో దొరికే ఎర్రగులాబీలతో ఒక బొకే తయారు చేయించడం నా పని. దానిని విక్రమ్ సారాభాయ్ స్వయంగా తన చేతులతో ఇందిరాగాంధీకి ఇచ్చేవారు. కానీ 1971 చివర్లో వారి ఆ బంధం బీటలువారింది" అన్నారు.

రాజ్ చెంగప్ప 'వెపన్ ఆఫ్ పీస్' పుస్తకంలో దాని గురించి రాశారు. "భారత్-పాకిస్తాన్ యుద్ధానికి ముందు నవంబర్ చివరి వారంలో ఇందిరాగాంధీ సారాభాయ్‌ను పిలిపించారు. ఆయనతో మీ నేతృత్వంలో ఒక అంతరిక్ష కమిటీని ఏర్పాటు చేయబోతున్నాను, అందుకే మీరు అణు శక్తి కమిషన్ చీఫ్ పదవిని వదిలేయండి అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు సారాభాయ్ తనకు బలవంతంగా తొలగించినట్లు భావించారు" అని చెప్పారు.

"ఇందిరాగాంధీకి ఇక తనపై నమ్మకం పోయిందని సారాభాయ్ భావించారు. ఆమె మాత్రం అది నిజం కాదు. మీరు ఇలాగే పనిచేస్తూ ఉంటే మేం మిమ్మల్ని చాలా త్వరగా కోల్పోతాం అన్నారు. సారాభాయ్ చాలా నైరాశ్యంతో ఇందిర ఆఫీసు నుంచి బయటికొచ్చారు. ఆయన స్నేహితులు కొందరు సారాభాయ్ కూడా రాజీనామా ఇవ్వాలనే అనుకున్నారు. కానీ భారత్-పాకిస్తాన్ యుద్ధంతో అది కుదరలేదు అని చెప్పారు. కానీ, అంతరిక్ష, అణు విభాగాల విభజన గురించి బహిరంగ ప్రకటన చేయకముందే విక్రమ్ సారాభాయ్ కన్నుమూశారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

గుండెపై పుస్తకం పెట్టుకునే వీడ్కోలు

1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ త్రివేండ్రమ్ ‌దగ్గరున్న కోవలం బీచ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. ఉదయం నిద్రలేవకపోయేసరికి ఆయన పడుకున్న గది తలుపులు విరగ్గొట్టారు. లోపల దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకుని కనిపించారు. ఆయన గుండెలపై ఒక పుస్తకం ఉంది. డాక్టర్ ఆయన్ను పరీక్షించి, రెండు గంటల ముందే చనిపోయారని చెప్పారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ వయసు కేవలం 52 ఏళ్లు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

మల్లికా సారాభాయ్ ఆ రోజును గుర్తుచేసుకున్నారు. "నేను నా మొదటి సినిమా షూటింగులో ఉన్నాను. అప్పుడే అమ్మ ఫోన్ చేశారు. డైరెక్టర్‌తో మల్లికను ఇంటికి తీసుకురండి అన్నారు. కార్లో తిరిగి వస్తుంటే, అమ్మకు ఏదైనా అయ్యిందేమో అనుకున్నా. నాన్నకు అలా జరుగుతుందని నేనసలు ఊహించలేదు" అన్నారు.

"నేను ఇంటికి చేరుకునేసరికి వరుసగా కార్లు ఉన్నాయి. జనం తెల్ల దుస్తులు వేసుకుని ఏడుస్తున్నారు. పైకెళ్లేసరికి నాన్న సెక్రటరీ నన్ను లోపలికి తీసుకెళ్లారు. అక్కడ అమ్మ బెడ్రూంలో ఏడుస్తున్నారు. ఆమె నాతో 'మల్లికా పాపా ఈజ్ గాన్' అన్నారు. నాకు ఏం అర్థం కాలేదు. ఆయనకు ఏదైనా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు" అని చెప్పారు.

Image copyright MALLIKA SARABHAI/FAMILY HANDOUT

తండ్రి చితికి నిప్పుపెట్టింది కూడా మల్లిక సారాభాయే. అప్పుడు అక్కడ విక్రమ్ సారాభాయ్ తల్లి కూడా ఉన్నారు. దహన సంస్కారాలు చేస్తున్న పురోహితుడు గడ్డకట్టిన నెయ్యిని ముక్కలు చేసి చితిపై వేస్తున్నప్పుడు, ఆయన తల్లి "మెల్లగా వేయండి, విక్రమ్‌కు దెబ్బ తగులుతుంది" అన్నారు.

1974లో చంద్రుడిపైన ఒక బిలానికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. భారత్ చంద్రయాన్-2 ఇప్పుడు చంద్రుడి కక్ష్యలోకి కూడా ప్రవేశించింది. కానీ విక్రమ్ సారాభాయ్ ఎన్నో దశాబ్దాల క్రితమే ఈ అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం