ఆంధ్రప్రదేశ్: సర్కారు బడుల్లో 'స్మార్ట్' క్లాస్ రూంలు... ఈ-మెయిల్‌లో హోంవర్క్, ఆన్‌లైన్లో ఎగ్జామ్స్

  • 22 ఆగస్టు 2019
డిజిటల్ క్లాసులు

హరితకు సైన్స్ అంటే చాలా ఆసక్తి. స్కూలు నుంచి ఇంటికి రాగానే సైన్స్‌కు సంబంధించిన వివిధ విషయాలను తెలుసుకునేందుకు ఆమె ఎప్పుడూ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్తుండేది. సాయంత్రం పూట అమ్మాయి బయటకు వెళ్తోందని తల్లిదండ్రులు భయపడేవారు. కానీ, ఇప్పుడు వారికి ఆ ఇబ్బందులేవీ లేవు. ఎందుకంటే, ఆమె చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలోనే డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేశారు.

విశాఖ నగరంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన అధునాతన డిజిటల్ తరగతి గదులు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పెదవాల్తేరులో ఉన్న కేడీపీఎం పాఠశాలలో హరిత 9వ తరగతి చదువుతోంది. ఆమె 7వ తరగతిలో ఉన్నప్పుడు ఇక్కడ డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తాము చదువుకునే విధానం పూర్తిగా మారిపోయిందని హరిత అంటోంది.

డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులందరికీ క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లు ఇస్తారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు ఆ ల్యాప్‌టాప్‌లోనూ చూసుకోవచ్చు. ఏదైనా కారణంతో ఒకరోజు బడికి వెళ్లలేకపోయినా, ఆ రోజు జరిగిన తరగతులను మరుసటి రోజు చూసుకోవచ్చు.

ఇప్పుడు నోటు పుస్తకాలతో పనిలేదు. హోంవర్కులను టీచర్లకు ఈమెయిల్ ద్వారా పంపుతారు. పరీక్షలు ఆన్‌లైన్‌లోనే రాస్తారు. తోటి విద్యార్థులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఆన్‌లైన్‌లోనే.

పెదవాల్తేరులో ఉన్న కేడీపీఎం పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న సాయిశ్రీ, గతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకునేది. అక్కడ విద్యా బోధన నచ్చక ఈ స్కూలులో చేరానని ఆమె చెప్పారు. ప్రైవేటు స్కూల్‌లో చదివినప్పుడు తనకు ఇంగ్లీషు బాష మీద అంత పట్టు ఉండేదీ కాదని, ఈ పాఠశాలలో చేరాక ఇంగ్లీషు బాగా నేర్చుకున్నానని సాయిశ్రీ అంటున్నారు.

సైన్స్ ఫేయిర్‌ కోసం కొత్త కొత్త ప్రయోగాలు, నమూనాలు రూపొందించేందుకు తనకు ఇంటర్నెట్ ఎంతో ఉపయోగపడుతోందని ఆమె చెప్పారు.

"రెండేళ్ల క్రితం వరకు నోటు పుస్తకాలు కొనేందుకే మాకు చాలా ఖర్చయ్యేది. అప్పుడు మాకు కంప్యూటర్ల గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభించాక కొత్త విషయాలను చాలా సులువుగా తెలుసుకోగలుగుతున్నాం. పేపర్ల వాడకం తగ్గిపోయింది. నోటు పుస్తకాల ఖర్చు తగ్గిపోయింది" అని ఎనిమిదో తరగతి చదువుతున్న ఝాన్సీ చెప్పింది.

ప్రతి చిన్న విషయాన్నీ దృశ్యాల రూపంలో టీచర్లు చూపిస్తూ వివరించడం వల్ల తాము బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరు పాఠశాలలతో తొలుత ప్రయోగాత్మకంగా 2017లో స్మార్ట్ తరగతి గదులను ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలు కనిపించడంతో అదే ఏడాదిలోనే మరో 25 స్కూళ్లలోనూ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం 31 పాఠశాలల్లో 150 డిజిటల్ తరగతి గదులు (స్మార్ట్‌ బోర్డులతో కూడినవి), 57 గూగుల్ ఫ్యూచర్ క్లాస్‌రూమ్‌లు (స్మార్ట్‌ బోర్డులు, క్రోమ్‌బుక్‌లు ఉన్నాయి).

విశాఖ నగరపాలక సంస్థ, గూగుల్ సహకారంలో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ ఈ పాఠశాలల్లోని క్రోమ్‌బుక్ కంప్యూటర్ల నిర్వహణ చూస్తోంది.

విశాఖ జిల్లా వ్యాప్తంగా మరో 119 పాఠశాలల్లో తరగతి గదులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

వీటిల్లో విద్యార్ధులకు ప్రత్యేకమైన ఈమెయిల్ ఐడీ ఇస్తారు. గూగుల్ డాక్స్‌లో ప్రాజెక్ట్‌లను రూపొందించేలా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు మొదట విద్యార్ధులకు సమయం పట్టినా, ఇప్పుడు వాటితో ప్రయోగాలు చెస్తున్నారు.

డిజిటల్ క్లాస్ రూంలలో పాఠాలు చెప్పడం చాలా సులువైందని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ప్రతి విషయాన్నీ తెరపై దృశ్యాల రూపంలో చూపిస్తూ, వివరిస్తున్నామని కేడీపీఎం ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీదేవి చెప్పారు.

"విద్యార్ధులకు వీడియోలు చూపించడం వల్ల ప్రతి చిన్న విషయాన్నీ విద్యార్ధులకు చక్కగా వివరించగలుగుతున్నాం. పిల్లలందరినీ సమానంగా చూసే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా నేర్చుకునే విద్యార్ధులు తగ్గిపోయారు. గతంలో టీచర్ పాఠాలు చెప్పేవారు, విద్యార్ధులు నేర్చుకునేవారు. కానీ, ఇప్పుడు టీచర్ చెప్పడంతో పాటుగా, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో, మేము చెప్పిందే కాకుండా పిల్లలు ఆ వీడియోలను చూసి ఎక్కువగా నేర్చుకుంటున్నారు" అని శ్రీదేవి వివరించారు.

"ప్రపంచం ఎలా ఉంటుందో విద్యార్ధులకు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. విద్యార్ధులలో ఊహా శక్తి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం బాగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పిల్లలు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లలో మేం ఒక ప్రాజెక్టును చూపిస్తే, విద్యార్ధులు ఆ ప్రాజెక్టుతో పాటు మరొక ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. ఒకరికి ఒకరు సహాయం చెసుకోవడం, ఒకరికి తెలిసిన విషయాలను మరొకరితో పంచుకోవడం పెరిగింది" అని ఆమె చెప్పారు.

స్మార్ట్ తరగతి గదులు ప్రారంభించిన తరువాత విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగిందని కేడీపీఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డీఏ నాయుడు తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్ధుల అడ్మిషన్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగిందని ఆయన చెప్పారు.

ఈ పాఠశాలలో ఇంతకుముందు ప్రతి తరగతిలో మూడు తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం సెక్షన్లు ఉండేవి. కానీ, ఈ ఏడాది రెండు తెలుగు మీడియం, రెండు ఇంగ్లీషు మీడియం సెక్షన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో అడ్మిషన్లు పూర్తిగా అపేశారు.

గతంలో కొందరు పిల్లల మధ్యాహ్నం పూట బడికి రాకుండా ఎగ్గొట్టేవారు. కానీ, స్మార్ట్ క్లాసులు అన్నీ మధ్యాహ్నం ఉండటం వల్ల ఇప్పుడు విద్యార్ధులు ఉదయం ఎంత మంది వస్తున్నారో, మధ్యాహ్నం కూడా అంతేమంది వస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

మధ్యలో చదువు ఆపేసే విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయిందని ఉపాధ్యాయులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?