హైదరాబాద్ సెక్స్ స్కాండల్: నాటి బ్రిటిష్ ఇండియాలో సంచలనం రేపిన ఆ చరిత్ర ఏమిటి?

  • 22 ఆగస్టు 2019
మెహిదీ హసన్ Image copyright TELANGANA/ANDHRA PRADESH STATE ARCHIVES
చిత్రం శీర్షిక మెహిదీ హసన్ నాటి నిజాం సంస్థానంలో ఓ ముస్లిం కులీనుడు

అది 1892 ఏప్రిల్. నాటి బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంలోని అతి పెద్ద, అత్యంత సంపన్నమైన నిజాం సంస్థానం. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఒక ఎనిమిది పేజీల కరపత్రం తీవ్ర కలకలం రేపింది.

అందులో ముస్లిం రాజవంశస్థుడు మెహిదీ హసన్, అతడి భార్య, భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ మహిళ ఎలెన్ జెర్ట్రూడ్ డానెలీ పేర్లు ఉన్నాయి. వారి జీవితాలను ఆ కరపత్రం ధ్వంసం చేసింది.

19వ శతాబ్దపు భారతదేశం.. భిన్న జాతుల మధ్య ప్రేమను ఆమోదించే కాలం కాదు. పాలకులు.. పాలితులను పెళ్లి చేసుకోవటం కాదు కదా.. వారితో సెక్స్ చేయటం కూడా ఉండదు. ఇక ఒక శ్వేత జాతి మహిళతో ఒక భారతీయుడికి సంబంధం ఉండటం చాలా చాలా అరుదు.

కానీ, ఈ జంట నిజాముల పాలనలోని హైదరాబాద్ కులీన వర్గానికి చెందిన వారు. బ్రిటిష్ వారితో ఎలెన్‌కు గల సంబంధాలు.. నిజాం ప్రభుత్వంలో మెహిదీ పోషించే పాత్ర.. 19వ శతాబ్దంలో ఈ జంటను ఒక అధికార కేంద్రంగా మలచింది.

బ్రిటిష్ సామ్రాజ్ఞి విక్టోరియాను కలవటానికి లండన్‌కు సైతం ఈ జంటను ఆహ్వానించారంటే వారు ఎంత శక్తిమంతులో అర్థం చేసుకోవచ్చు.

అయితే, హైదరాబాద్ పాలకవర్గాల్లో మెహిదీ ఉన్నతస్థాయికి ఎదగటం.. స్థానికులకు, హైదరాబాద్‌లో నివసించే ఇతర ఉత్తర భారతీయులకూ కంటగింపుగా మారింది.

మెహిదీ హసన్ హైదరాబాద్ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యానికి హోంమంత్రి అయ్యాడు. ఈ పదవులు, అధికారంతో ఆయనకు చాలా ఖరీదైన జీతభత్యాలు లభించేవి. ఇది ఆయన సహచరుల్లో ఈర్ష్యను పెంచింది.

Image copyright G P VARMA PRESS
చిత్రం శీర్షిక భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ మహిళ ఎలెన్ జెర్ట్రూడ్ డానెలీ.. మెహిదీ భార్య

అదే సమయంలో, ఎలెన్ పరదా నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని సంపన్న సామాజిక బృందాల్లో కనిపించడం మొదలుపెట్టింది. ఇది కొందరిని కలతపెట్టింది. కానీ మెహిదీ, ఎలెన్‌లు అంతకంతకూ పెరుగుతున్న తమ హోదాను ఆస్వాదించేవారు.

అయితే, ఆ చిన్న కరపత్రం. ఈ జంటకు సంబంధించి విభిన్నమైన కథనం చెప్పింది. వారి గౌరవమర్యాదలు నాటకీయంగా క్షీణించిపోయేలా చేసింది.

మెహిదీ విజయంతో అసూయ చెందిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆయన పనితీరును తప్పుపట్టలేక ఈ కరపత్రంలో ప్రధానంగా ఎలెన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఆ కరపత్రంలో నిర్దిష్టంగా మూడు ఆరోపణలు చేశారు.

మెహిదీని పెళ్లి చేసుకోవటానికి ముందు ఎలెన్ ఒక సాధారణ వేశ్య అన్నది మొదటి ఆరోపణ. ఈ కరపత్రం రచయితతో పాటు మరికొందరు పురుషులు ఆమెను తమ లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి ప్రత్యేకంగా ఉంచుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇక రెండో ఆరోపణ... మెహిదీ, ఎలెన్‌లకు అసలు పెళ్లే కాలేదు అన్నది.

మూడో ఆరోపణ... మెహిదీ హసన్ తనకు కావలసిన పదవులు పొందటం కోసం హైదరాబాద్‌ పాలకవర్గంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఎలెన్‌ను లైంగికంగా ''విక్రయించాడు'' అనేది.

ఈ కరపత్రం చూసి ఆగ్రహించిన మెహిదీ తన స్నేహితుల సలహాను కాదంటూ దీని ప్రచురణకర్త అయిన ఎస్.ఎం.మిత్రా మీద రెసిడెన్సీ కోర్టులో కేసు వేశాడు. ఆ కోర్టుకు ఒక బ్రిటిష్ జడ్జి న్యాయమూర్తిగా ఉన్నాడు.

Image copyright THE ALKAZI COLLECTION OF PHOTOGRAPHY
చిత్రం శీర్షిక కరపత్రాన్ని ముద్రించిన వ్యక్తి మీద మెహిదీ హసన్ రెసిడెన్సీ కోర్టులో కేసు వేశాడు

ఈ కేసులో తమ తరఫున వాదించటానికి ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వర్గాల వారిద్దరూ పేరున్న బ్రిటిష్ లాయర్లను నియమించుకున్నారు. ఇరు పక్షాల వారూ సాక్షులను లంచాలతో ప్రలోభపెట్టారు. ఎదుటి పక్షం సాక్షులు విచారణకు ముందు వాంగ్మూలంలో కానీ, కోర్టు విచారణలో కానీ.. రెండు చోట్లా కానీ అబద్ధపు సాక్ష్యాలు చెప్పారని పరస్పరం ఆరోపించుకున్నారు.

దిగ్భ్రాంతికరంగా రెసిడెన్సీ కోర్టు న్యాయమూర్తి, ఆ కరపత్రాన్ని మిత్రా ముద్రించాడన్న ఆరోపణలను కొట్టివేస్తూ అతడిని నిర్దోషిగా ప్రకటించాడు. ఇక సహజీవనం, వ్యభిచారం, వావివరుసలేని లైంగిక కార్యకలాపాలు, మోసం, అబద్ధపు సాక్ష్యం చెప్పటం, లంచాలు ఇవ్వటం వంటి... విచారణలో వచ్చిన అనేక ఆరోపణల జోలికి ఆయన వెళ్లలేదు.

ఆ కరపత్రం కుంభకోణం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ కేసు విచారణ తొమ్మిది నెలలు కొనసాగింది. నిజాం ప్రభుత్వం మొదలుకుని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం, లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా వార్తాపత్రికలు కేసు విచారణను చాలా నిశితంగా గమనించాయి.

కోర్టు తీర్పు వెలువడిన కొన్ని రోజులకే, మెహిదీ, ఎలెన్‌లు రైలు ఎక్కి ఉత్తర భారతదేశంలోని లక్నో ప్రయాణమయ్యారు. వాళ్లిద్దరూ చిన్నప్పుడు ఆ నగరంలోనే పెరిగారు.

లక్నోలోని స్థానిక ప్రభుత్వంలో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన మెహిదీ... పెన్షన్ కోసం లేదంటే కనీసంఎంతో కొంత డబ్బులు పొందటం కోసం.. మళ్లీ ఆ పదవిలో చేరటానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది.

Image copyright KEYSTONE-FRANCE
చిత్రం శీర్షిక హైదరాబాద్‌లో ఒక శక్తిమంతమైన జంటగా ఉన్న మెహిదీ, ఎలెన్‌లు ఈ కరపత్రం ఉదంతం అనంతరం లక్నో వెళ్లిపోయారు

ఒకప్పుడు బ్రిటిష్ రాణి విక్టోరియా మీద తనకు ఉన్న ప్రేమను సాశ్రునయనాలతో ప్రకటించటమే కాదు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను ''ప్రమాదకరం'' అంటూ వ్యతిరేకించిన మెహిదీని... నిజాం ప్రభుత్వం వదిలేసినట్లే నాటి బ్రిటిష్ వలస ప్రభుత్వం కూడా విస్మరించింది.

చివరికి, నిజాం ప్రభుత్వంలో హోం కార్యదర్శి పదవి నుంచి అతడిని డిస్మిస్ చేశారు. ఉభయ ప్రభుత్వాలూ ఇంకా అవమానకరంగా అతడికి ఎటువంటి పెన్షన్ కానీ, పరిహారం కానీ ఇవ్వటానికి తిరస్కరించాయి.

మెహిదీ హసన్ 52 ఏళ్ల వయసుకే చనిపోయాడు. అతడు మరణించే సమయానికి ఎలెన్‌కు ఎలాంటి ఆర్థిక రక్షణా ఏర్పాటు చేయలేకపోయాడు.

ఎలెన్ వయసు పెరిగే కొద్దీ ఆమె పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తన జీవితం చివరి నాళ్లలో.. ఏదో విధంగా కొంత పరిహారం అందించాలని కోరుతూ హైదరాబాద్ ప్రధానమంత్రికి, నిజాంకు ఒక అర్జీ పంపించింది.

కుంభకోణాలు, అవినీతిల నుంచి గట్టెక్కిన హైదరాబాద్ అధికారవర్గం.. ఆమె వినతిని సానుభూతితో చూసింది. ఆమెకు చిన్నపాటి భత్యాన్ని మంజూరు చేసింది.

అయినా, ఆ స్వల్ప భత్యం అందిన కొన్ని రోజులకే ఎలెన్ ప్లేగ్ వ్యాధితో చనిపోయింది.

బ్రిటిష్ భారత సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో సాంస్కృతిక సమ్మిశ్రమం ఎలా ఉండేదో కొంత అర్థం చేసుకోవటానికి మెహిదీ - ఎలెన్‌ జంట ఉదంతం కొంత ఉపయోగపడుతుంది.

అనతికాలంలోనే సామాజిక - రాజకీయ నిర్మాణాలను భారత జాతీయవాద శక్తులు సవాల్ చేయటం మొదలైంది.

ఆ కాలపు భారతదేశానికి సంబంధించిన సంప్రదాయ జ్ఞానాన్ని వీరి కథ సవాల్ చేస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెహిదీ, ఎలెన్‌ల మీద కరపత్రం ఉదంత కాలంలో నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్

సంసార సాగరంలో తుపాను రేగినా ఈ జంట ఒకరినొకరు అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ, ఆ కాలపు విలువలను ఉల్లంఘించటం వల్ల వీరి జీవితం ధ్వంసమైంది.

హైదరాబాద్, ఇతర సంస్థానాలు ఇంకా ''తూర్పు ఆసియా నిరంకుశ ప్రభువులు''గా ఉన్న వలస భారత చరిత్రలో ఈ కరపత్రం కుంభకోణం చివరి అంకం. వారిలో చాలా మంది అప్పుడప్పుడే జాతీవాద మద్దతుదారులుగా మారుతున్నారు.

1885లో ప్రారంభమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్... 1892లో మెహిదీ, ఎలెన్‌ల కేసు విచారణ జరిగే సమయానికి బలపడుతోంది.

ఎలెన్ మరణించిన తర్వాత కొంత కాలానికి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగివచ్చి... భారత స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను బలోపేతం చేశారు.

భారతదేశపు రాచప్రభువులు, వారి రాజ్యాలు, వారి కుంభకోణాలు పతాక శీర్షికల నుంచి తొలగిపోయి... జాతీయవాదం కీలక భూమికగా అవతరిస్తున్న భారీ మార్పు అప్పుడే జరుగుతూ ఉంది.

ఆ క్రమంలో ఈ కరపత్రం కేసు మరుగునపడిపోయింది.

(బెంజమిన్ కొహెన్ యూనివర్సిటీ ఆఫ్ ఉటాలో చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 'యాన్ అప్పీల్ టు ద లేడీస్ ఆఫ్ హైదరాబాద్: స్కాండల్ ఇన్ ద రాజ్' అనే పుస్తకం రచించారు. దీనిని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో పడవ ప్రమాదం: కొనసాగుతున్న గాలింపు చర్యలు.. బోటును బయటకు తీయడంలో ఆలస్యం

ట్రంప్ హయాంలో నాలుగేళ్లలో నాలుగో అధికారి.. జాతీయ భద్రతా సలహాదారుగా రాబర్ట్ ఓబ్రియన్

'సౌదీ చమురు క్షేత్రాలపై ఇరానే దాడులు చేసిందనడానికి ఈ శకలాలే నిదర్శనం'

అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?

గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే

ఏపీలో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం..

మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డుపై అభ్యంతరాలు ఎందుకు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం