అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది

  • 22 ఆగస్టు 2019
Image copyright Getty Images

అణ్వస్త్ర పొరుగుదేశమైన పాకిస్తాన్‌ - భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో.. 'అణ్వస్త్రాలను మొదట ప్రయోగించరాదు' అన్న విధానాన్ని భారతదేశం సమీక్షించవచ్చునని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల సూచించటం.. పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది.

ఈ ప్రకటన.. దక్షిణాసియాలో శాంతి, భద్రతల మీద చూపే ప్రభావం గురించి ఈ రంగ రాజకీయ నిపుణులు క్రిస్టొఫర్ ఓ-క్లారీ, విపిన్ నారంగ్‌ల విశ్లేషణ.

ఏదైనా యుద్ధంలో అణ్వాయుధాలను తాము ముందుగా ఉపయోగించబోమన్నది భారతదేశం సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానమని రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల పునరుద్ఘాటించారు. అయితే.. ఆ వెంటనే ఆ విధానానికి కట్టుబడి ఉండటం ఎంత కాలం కొనసాగగలదని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటివరకూ ఈ విధానానికి భారత్ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నప్పటికీ.. ''భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది'' అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

అణ్వస్త్రాలను ''ముందుగా ఉపయోగించం'' అనే విధానానికి భారత్ కట్టుబడి ఉండటం.. సంపూర్ణం కాదనీ, శాశ్వతం కాదనీ.. భారతదేశం దానికి కట్టుబడి ఉండటం తప్పనిసరి కాదని ఆయన సూచించారు.

భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్ భూభాగానికి రాజ్యాంగంలో గల ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించిన అనంతరం.. అణ్వస్త్ర విధానంపై రాజ్‌నాథ్ తాజా ప్రకటన వెలువడింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించటం పట్ల.. కశ్మీర్ మొత్తం తమకే చెందుతుని భారత్ తరహాలోనే వాదించే పాకిస్తాన్ ఆగ్రహంగా స్పందించింది.

Image copyright HINDUSTAN TIMES
చిత్రం శీర్షిక 1998లో భారతదేశం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినపుడు దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు

ఈ వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి కావు. 1990ల్లో భారతదేశం అణ్వస్త్రాలను పరీక్షించిన స్థలం పోఖ్రాన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా రచించినట్లు కనిపిస్తున్న ఈ వ్యాఖ్యను తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ కూడా చేశారు. ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది.

అణ్వస్త్రాలను 'మొదట ఉపయోగించం' అనే భారత విధానం స్థానంలో మరింత అస్పష్టమైన విధానం రావచ్చునని ఈ స్థాయిలో అధికారికంగా సంకేతం ఇవ్వటం ఇదే ప్రథమం. దేశ భద్రతను పరిరక్షించటానికి అణ్వస్త్రాలను తామే ముందుగా ఉపయోగించాల్సి ఉంటుందని భారతదేశం ఏదో ఒక నాడు నిర్ణయం తీసుకోవచ్చునన్నది దీని భావం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1974లో భారతదేశం మొదటిసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది

అసలు ఈ 'ముందుగా ఉపయోగించం' విధానం ఏమిటి?

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బ్రిటన్‌ నాలుగు దేశాలూ.. తీవ్ర యుద్ధంలో అణ్వస్త్రాలను తాము ముందుగా ఉపయోగించే హక్కును ఉంచుకున్నాయి.

అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించటం ప్రధానంగా రెండు రకాలుగా ఉండేవి:

  1. ఒక దేశం సంప్రదాయ సైనిక యుద్ధంలో యుద్ధ రంగంలో ఓటమి ప్రమాదంలో ఉన్నపుడు.. ఆ ఓటమిని నిలువరించటానికి శత్రు సైనిక బలగాలపై వ్యూహాత్మకమని చెప్పే అణ్వస్త్రాలను ప్రయోగిస్తుంది - లేదా -
  2. ఒక శత్రుదేశం తన మీద అణ్వస్త్రాలతో దాడి చేస్తుందన్న భయంతో సదరు శత్రుదేశానికి సంబంధించిన అణ్వాయుధాలను సాధ్యమైనంత మేర ధ్వంసం చేయటం లక్ష్యంగా ఒక దేశం తానే ముందుగా అణ్వస్త్రాలతో దాడి చేస్తుంది.

భారతదేశం 1998లో అణ్వస్త్రాలను పరీక్షించి తన అణ్వస్త్ర హోదాను ప్రకటించినపుడు.. ''అణ్వస్త్ర యుద్ధ పోరాటం'' ఆలోచనను తిరస్కరించింది. భారత్ తన అణు శక్తిని ''తిప్పికొట్టటానికి మాత్రమే'' రూపొందిస్తుందని.. అందువల్ల పరిమితమైన అణ్వాయుధాలు మాత్రమే ఉంచుకుంటామని చెప్పింది.

చైనా తరహాలోనే తానూ అణ్వాయుధాలను మొదట ఉపయోగించబోననే విధానాన్ని ప్రతిపాదించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా 1964 - 1966 మధ్య మూడుసార్లు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది

చైనా 1964లో అణ్వస్త్రాలను మొదటిసారి పరీక్షించినపుడు.. తాను ''ఎన్నడూ, ఎప్పుడూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలను మొదటిగా ఉపయోగింబోను'' అని ప్రకటించింది. ఆ విధానానికి చైనా కట్టుబాటును భారతదేశం ఎప్పుడూ పూర్తిగా నమ్మకపోవటం.. 1998లో అణ్వస్త్రాలను బాహాటంగా పరీక్షించాలని నిర్ణయం తీసుకోవటానికి ఒక కారణం.

భారతదేశంతో పాటు చైనా మినహా.. మరే దేశమూ అణ్వస్త్రాలను మొదట ఉపయోగించబోమన్న ప్రకటన చేయలేదు.

ఒక సందర్భంలో ఉత్తర కొరియా కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. కానీ ఎవరూ విశ్వసించలేదు. అణ్వస్త్రాలను తయారు చేయటానికి కారణం.. దక్షిణ కొరియా, అమెరికాల ఉమ్మడి ఆక్రమణను అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించటం ద్వారా ఓడించాలన్న ఉద్దేశమేనని ఉత్తర కొరియా ప్రకటించటం దీనికి కారణం.

ఊహాజనిత సంక్షోభంలో రష్యా, చైనా భయాలను తగ్గించటానికి ఒక మార్గంగా.. అలాగే అణ్వస్త్రాలకు రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించాలన్న సాధారణ నిబద్ధతలో భాగంగా అమెరికా కూడా అప్పుడప్పుడూ అణ్వస్త్రాలను మొదట ఉపయోగించరాదన్న ప్రమాణం చేసే ఆలోచనను పరిశీలించింది కానీ ఇప్పటివరకూ అలా చేయటానికి నిరాకరిస్తూనే ఉంది.

ఇక భారతదేశపు ప్రధాన ప్రత్యర్థిగా భావించే పాకిస్తాన్.. అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించే హక్కు తనకు ఉందని విస్పష్టంగానే ప్రకటించింది.

భారత సైన్యం చేతుల్లో సంప్రదాయ సైనిక పరాజయాన్ని నిరోధించటానికి యుద్ధరంగ అణ్వస్త్రాలను ఉపయోగిస్తామని పాక్ హెచ్చరించింది. పాకిస్తాన్ కారణమని భారత్ ఆరోపిస్తున్న.. దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద హింస పరంపరను తిప్పికొట్టటంలో భారతదేశ సామర్థ్యాన్ని ఇప్పటివరకూ నిలువరిస్తున్న బెదిరింపు ఇది.

Image copyright Getty Images

మొదట ఉపయోగించబోమన్న విధానాన్ని ఇప్పుడు ఎందుకు పునఃపరిశీలిస్తోంది?

రెండు దశాబ్దాల కిందటి ఈ విధానం విజ్ఞత గురించి అంతర్గత చర్చకు సంబంధించి తొలి సంకేతం.. రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ప్రకటన. అయితే.. పదవిలో ఉన్న రక్షణ మంత్రి నుంచి వచ్చిన ఈ ప్రకటనే.. ఈ అంశం మీద ఇప్పటివరకూ అత్యంత పైస్థాయిలో అధికారికంగా వచ్చిన సంకేతం.

1998 మే నెలలో భారతదేశం అణ్వస్త్రాలను పరీక్షించిన కొంత కాలానికే.. భారత ఉన్నతస్థాయి అధికారులు 'మొదట ఉపయోగించం' అనే విధానాన్ని పాటిస్తుందని ప్రకటించారు.

అయితే.. 2003లో ఆ విధానాన్ని కొంత సవరిస్తూ మరో అధికారిక విధానం విడుదల చేసింది. రసాయన లేదా జీవ ఆయుధాల దాడి జరిగితే అణ్వస్త్రాలతో తిప్పికొట్టే అవకాశం తమకు ఉంటుందని విస్పష్టంగా చెప్పింది.

భారతదేశం ''సామూహిక జనహనన ఆయుధాలను తొలుత ఉపయోగించబోం'' అనే విధానానికి మారటం.. తొలుత చేసిన 'అణ్వస్త్రాలను తొలుత ఉపయోగించబోం' అనే విధానం నుంచి పెద్దగా మారినట్లు కాదని చాలా మంది వ్యాఖ్యానించారు.

2016లో నాటి భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. అణ్వస్త్రాలను తొలుత ఉపయోగించబోమని భారత్ స్వయంగా ఎందుకు 'కట్టేసుకోవాలి' అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలేనని ఆయన ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

కానీ.. ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దానికి విరుద్ధంగా అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదు.

ఇదిలావుంటే.. ప్రత్యర్థిని నిరాయుధుణ్ని చేయటానికి ఒక మార్గంగా ఉపయోగించటం కోసం అవసరమైన సాంకేతిక అంశాలను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది.

1998లో భారతదేశం వద్ద కేవలం ఓ పిడికెడు ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉన్నాయి. నిఘా సమాచార సామర్థ్యం పరిమితంగా ఉండేది. లక్ష్యంగా చేసుకున్న చోటుకి వాయు మార్గంలో పేలుడు పదార్థాలను కచ్చితంగా పంపించగల వ్యవస్థ ఒక మాదిరిగా ఉండేది.

ఇప్పుడు భారదేశం దగ్గర మరింత విస్తృతమైన ఖండాంతర, క్రూయిజ్ క్షిపణుల శ్రేణి ఉంది. అంతరిక్ష ఆధారిత ఇమేజరీ శాటిలైట్లు గణనీయంగా ఉన్నాయి. అటువంటి సెన్సర్లు అమర్చిన మానవ సహిత, మానవ రహిత విమానాలు ఉన్నాయి. లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించగల గైడెడ్ బాంబులు ఉన్నాయి. వాటిలో చాలా వాటికి.. కొంత దూరం నుంచి లక్ష్యాల మీదకు ప్రయోగించ గల సామర్థ్యం ఉంది.

అదనంగా.. దేశీయంగా ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయటానికి.. ఖరీదైన రష్యా, ఇజ్రాయెల్ తయారీ క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయటానికి భారత్ పెట్టుబడులు పెట్టింది. ముందస్తు దాడితో ధ్వంసం చేయలేకపోయినపుడు ''మిగిలిపోయిన'' శక్తులను అడ్డుకోవటానికి ఈ వ్యవస్థలను ఉపయోగించుకోవచ్చునన్నది దీని ఆలోచనగా భావించవచ్చు.

ప్రత్యర్థి దేశం దాడి చేయబోతుందని పసిగట్టి దానిని నిరోధించటానికి ముందస్తు దాడి చేయటం ద్వారా.. భారత నగరాలకు జరగగల నష్టాన్ని అర్థవంతంగా పరిమితం చేయవచ్చునని నిర్ధారించటం.. వాస్తవానికి జరగకపోయినా కానీ.. అలా జరగటాన్ని ఊహించటం ఇప్పుడేమాత్రం అసాధ్యం కాదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు ఇటీవల చాలా ఉద్రిక్తంగా మారాయి

ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యం ఎందుకు?

''భారతదేశం ఒక బాధ్యతాయుత అణ్వస్త్ర దేశ హోదాను సంపాదిస్తుండటం జాతి గర్వించదగిన విషయం'' అని రాజ్‌నాథ్‌సింగ్ ఉద్ఘాటించారు.

ఆ గౌరవంలో కొంత భాగం.. భారత్ పాటిస్తున్న సంయమనం గురించి, తను చేపట్టిగలిగిన చర్యలకు అవకాశమున్నా చేపట్టకపోవటం గురించి జాగ్రత్తగా సందేశమిస్తూ నిర్మించినది.

ఇప్పుడు ఈ నైతిక పై స్థాయిని వదులుకోవటం.. ''బాధ్యతాయుతమైన అణ్వస్త్ర శక్తిగా భారత ప్రతిష్టకు మచ్చతెస్తుంది'' అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రకాశ్ మీనన్ వంటి విమర్శకులు వాదిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ కార్యాలయం నుంచి ఒకింత సంయమనం లేని మాటలను వినిపిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. ''ఫాసిస్టు, జాతివిద్వేష, హిందూ ఆధిపత్యవాద (ప్రధానమంత్రి) మోదీ చేతుల్లో భారత అణ్వాయుధాలు ఎంత వరకూ సురక్షితంగా, భద్రంగా ఉంటాయి'' అని ప్రశ్నించింది.

అయితే.. అణ్వస్త్రాలను తాము తొలుత ఉపయోగించబోమన్న హామీని చెరిపివేయటం వల్ల నిజమైన ప్రభావం.. వాక్పటిమ ప్రతీకాత్మకతలో కనిపించదు. పాకిస్తాన్ భౌతిక ప్రతిస్పందనలో ఉంటుంది. అసలు భారతదేశాన్ని తాము ఎన్నడూ విశ్వసించలేదని పాకిస్తాన్ అణ్వస్త్ర పర్యవేక్షకులు గత వారంలో అనధికారికంగా ఉద్ఘాటించారు.

కానీ.. మాటల్లో వచ్చిన మార్పు, దానికి భారత సామర్థ్యాలు పెరగటం తోడై.. పాకిస్తాన్ మరిన్ని అణ్వస్త్రాలను తయారు చేసి, వాటిని యుద్ధ సంక్షోభంలో భారతదేశం తమ భూమి మీదే ధ్వంసం చేయటానికన్నా ముందుగానే ప్రయోగించటం వల్ల ప్రయోజనమనే విషయానికి ప్రాధాన్యం పెరుగుతుంది.

సంక్షోభ సమయంలో అణ్వస్త్రాలను ఉపయోగించే ప్రత్యామ్నాయం ఇంకా చాలా వేగంగా తెరపైకి వస్తుంది. పాకిస్తాన్ శాంతి సమయపు సంసిద్ధతను.. మరింత వేగంగా ఉపయోగించటానికి వీలుగా తయారు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా.. సురక్షిత, భద్రత మీద చూపగల ప్రభావం, ప్రమాదాలు, అపోహలకు అవకాశాల గురించి కొంత కాలం వరకూ స్పష్టంగా అర్థం చేసుకోరు. కానీ.. ప్రచ్ఛన్న యుద్ధ పోటీలో ప్రధాన లక్షణమైన ఖరీదైన, ప్రమాదకరమైన ఆయుధ పోటీని దక్షిణాసియా నివారించలేకపోవచ్చు.

క్రిస్టొఫర్ క్లారీ.. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో యూనివర్సిటీ అట్ అల్బేనీ విభాగంలో రాజకీయ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విపిన్ నారంగ్.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఎంఐటీలోని సెక్యూరిటీ స్టడీస్ ప్రోగ్రామ్ సభ్యుడు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు