విశాఖ ఏజెన్సీ: గుర్రంపై టీచర్ వెళ్తున్న ఊరిలో పాఠశాల నిర్మిస్తామన్న ఐటీడీఏ పీవో - బీబీసీ కథనానికి స్పందన

  • 22 ఆగస్టు 2019
గుర్రంపై టీచర్

విశాఖ జిల్లా జీ.మాడుగుల మండలం గెమ్మలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెంలో ప్రాథమిక పాఠశాలకు భవనం లేకపోయినా ఉపాధ్యాయుడు వెంకటరమణ గుర్రంపై వెళ్లీ పాఠాలు చెబుతున్నారంటూ బీబీసీ న్యూస్ తెలుగు ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.

బీబీసీ తెలుగు ప్రసారం చేసిన కథనానికి పాడేరు ఐటీడీఏ పీవో (ప్రాజెక్టు ఆఫీసర్) బాలజీ స్పందిస్తూ... తక్షణమే ఆ ఊరిలో స్కూలు భవనం నిర్మిస్తామని తెలిపారు.

ఇప్పటికే ఇంజనీర్లను పంపించి అంచనాలు తెప్పించామన్నారు. వర్షం పడుతున్నందున రోడ్డు బాగాలేకపోవడం వల్ల ప్రస్తుతం అక్కడికి ఇసుక వాహనాలు వెళ్లలేవని, సెప్టెంబర్‌ తర్వాత పాఠశాల భవన నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. మంచి కథనాన్ని బీబీసీ అందించిందన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: బీబీసీ కథనానికి స్పందించిన ఐటీడీఏ అధికారి

విద్యార్థుల పట్ల, తన వృత్తిపట్ల ఉపాధ్యాయుడు వెంకటరమణ చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని పీవో బాలాజీ కొనియాడారు. ఆయన ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. గ్రామస్థులు పిల్లల పట్ల అంతగా శ్రద్ధ చూపడం ఆనందించదగ్గ విషయమన్నారు.

అంకిత భావంతో పనిచేసే ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిని అందరికీ పరిచయం చేసిన బీబీసీ తెలుగుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక అసంపూర్ణంగా ఆగిపోయిన పాఠశాల భవనం నిర్మాణం

విశాఖ జిల్లా గెమ్మలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అక్కడికి ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ గుర్రం మీద వెళ్లడం గురించి ఈనెల 17న బీబీసీ తెలుగు ఒక కథనాన్ని ప్రచురించింది.

సుర్లపాలెం, తోకరాయి గ్రామాలకు కలిపి సుర్లపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు భవనం లేదు. గతంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. దాంతో, ఉపాధ్యాయుడు వెంకటరమణ చొరవ తీసుకుని గ్రామస్థులతో మాట్లాడి పెద్ద వరండా ఉన్న ఒక ఇంట్లో స్కూలును నడిపిస్తున్నారు. అందులో 57 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఆ విషయాన్ని కూడా బీబీసీ తన కథనంలో పేర్కొంది.

ఐటీడీఏ అధికారుల స్పందన పట్ల ఉపాధ్యాయుడు వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. "ఈ రోజు స్కూలు భవనం మంజూరు అయ్యిందంటే దానికి కారణం బీబీసీ కథనమే"నని వెంకటరమణ అన్నారు.

పాఠశాల భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చెస్తే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. బీబీసీ కథనాన్ని చూసి స్పందించిన ఐటీడీఏ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భవనం నిర్మాణానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల కాపీ మరో రెండు రోజుల్లో వస్తుందని పీవో బాలాజీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)