కశ్మీర్ పేరుతో పాకిస్తాన్‌లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత: ఫ్యాక్ట్ చెక్

  • 22 ఆగస్టు 2019
పాక్ సోషల్ మీడియా Image copyright EPA

కశ్మీర్ వీడియో అంటూ పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్న ఒక వీడియోను పాకిస్తాన్ కేంద్ర మంత్రి హైదర్ అలీ జైదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జైదీ తన అధికారిక ట్విటర్ హాండిల్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా చూశారు.

Image copyright TWITTER

ఆయన తన పోస్టులో "మోదీ ప్రభుత్వం కశ్మీర్లో ఏం చేస్తోందో ప్రపంచం చూడాలి. ఇంకా ఆలస్యం కాకముందే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్‌పై వాణిజ్య ఆంక్షలు విధించాలి" అని రాశారు.

అలీ హైదర్ జైదీ ట్వీట్ చేసిన వీడియో కశ్మీర్‌ది కాదు, ఇది హరియాణా, పంచకుల నగరంలో జరిగిందని బీబీసీ గుర్తించింది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ వీడియో 2017 ఆగస్టు 25 నాటిదని తెలిసింది.

ఈ వీడియో 'డేరా సచ్చా సౌదా' చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌ను అత్యాచార కేసులో దోషిగా ఖరారు చేసినప్పుడు ఆయన మద్దతుదారులు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలకు దిగినప్పటిది.

పాత కథనాల ప్రకారం ఈ హింసాత్మక ప్రదర్శనల్లో 30 మందికి పైగా చనిపోయారు. రాష్ట్రంలో 2500 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కానీ, రెండేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను జైదీ తప్పుగా చెబుతూ పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియోను పాకిస్తాన్‌లోని చాలా సోషల్ మీడియా గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు.

ఇలాంటి వీడియోలు ఎన్నో..

కశ్మీర్‌లో ప్రస్తుత ఉద్రిక్తతలకు సంబంధించినవిగా చెబుతూ పాకిస్తాన్ కేంద్రమంత్రి అలీ హైదర్ జైదీ పాత వీడియోలను పోస్ట్ చేయడం ఇది మొదటి సారి కాదు.

జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశారు. దానిని ఇప్పటివరకూ దాదాపు రెండు లక్షల మంది చూశారు. దాదాపు నాలుగు వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు.

Image copyright TWITTER

#SaveKashmirFromModi అనే ట్యాగ్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసిన జైదీ "భారత ఆక్రమణలో ఉన్న కశ్మీర్లో లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. మోదీ ప్రభుత్వం 35-ఎను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు" అని రాశారు.

కానీ ఈ వీడియో కూడా మూడేళ్ల క్రితం తీసింది. 'Revoshots' అనే ఒక యూట్యూబర్ 2016 అక్టోబర్ 18న ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

అందులోని వివరాల ప్రకారం ఈ వీడియో హిజ్బుల్ ముజాహిదీన్ స్థానిక కమాండర్ బుర్హాన్ వనీ అంత్యక్రియలకు సంబంధించినది.

24 ఏళ్ల బుర్హాన్ వనీ తన సహచరులతో కలిసి ఆయుధాలు పట్టుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హిజ్బుల్ ముజాహిదీన్ మొదటి కమాండర్.

కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్ వనీ చనిపోయాడు. వానీ మృతిని 2016 జులై 9న ధ్రువీకరించారు.

Image copyright TWITTER

కశ్మీర్‌లో మారణహోమం వాదనలు తప్పు

పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ మాజీ డీజీ హమీద్ గుల్ కొడుకు అబ్దులా గుల్ కూడా ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో గాయపడినవారికి కొంతమంది సాయం చేస్తూ కనిపిస్తారు.

అదే వీడియోతోపాటు "కశ్మీర్‌లో మారణహోమం మొదలైంది. ఈ వీడియోను నాకు ఒక కశ్మీరీ సోదరి పంపించారు. మేం కశ్మీరీలకు రాజకీయ, నైతిక, దౌత్య సాయం అందిస్తున్నాం" అని రాశాడు.

గుల్ పెట్టిన ఆ 25 సెకన్ల వీడియోను 60 వేల సార్లకు పైగా చూశారు. దాదాపు 2 వేల మంది దీనిని షేర్ చేశారు.

కశ్మీర్ న్యూస్ పేరుతో ఒక యూట్యూబర్ 2018 అక్టోబర్ 21న ఈ వీడియోను కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాకు చెందినదిగా చెబుతూ ట్వీట్ చేసినట్టు బీబీసీ తన పరిశోధనలో తేలింది.

ఈ ఘటన గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే, గ్రేటర్ కశ్మీర్ పేరుతో ఒక వెబ్‌సైట్ వార్తా కథనం దొరికింది. దానిని 2018 అక్టోబర్ 22న పోస్ట్ చేశారు

ఈ కథనంలో దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అక్టోబర్ 20-21 మధ్యలో అర్థరాత్రి భద్రతాదళాలు మిలిటెంట్ల మధ్య సుదీర్ఘ ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో ఏడుగురు పౌరులు కూడా మృతిచెందారు అని చెప్పారు.

ఆ వైరల్ వీడియోలో ఆ పౌరుల మృతదేహాలనే గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లడం కనిపిస్తోంది.

కుల్గాంలో జరిగిన ఆ వీడియో ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత పాకిస్తాన్‌లో వైరల్ అవుతోంది. అందరూ దీన్ని కశ్మీరీ లోయలో ప్రస్తుత పరిస్థితి అని చెబుతూ షేర్ చేస్తున్నారు.

Image copyright TWITTER

మానవ కవచంగా చేసుకున్నారనే కథ

పాకిస్తాన్‌లోని పెద్ద ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో కశ్మీర్‌లో జరిగిందని చెబుతూ ఒక వీడియో షేర్ చేస్తున్నారు. దీనిని పాక్ ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకరైన హామిద్ మీర్ కూడా ట్వీట్ చేశారు.

ఆయన తన ట్విటర్‌లో "ఇది జమ్ము-కశ్మీర్ లేటెస్ట్ వీడియో(ఆగస్టు 16ది). శ్రీనగర్‌ దగ్గర భారత సైన్యం రాళ్లు విసురుతున్న ఆపడానికి, నలుగురు కశ్మీరీ యువకులను మానవ కవచంగా ఉయోగించుకుంది" అని రాశారు.

ఆ వీడియోలో సైనికుల మధ్య కూర్చున్న నలుగురు యువకులు కనిపిస్తుంటారు. ఇవతలివైపు నిలబడిన కొందరు "రాళ్లు రువ్వుతున్న వారిని ఆపడానికి భారత భద్రతాదళాలు తమ స్నేహితులు కొందరిని వ్యాన్ ముందు కూర్చోపెట్టుకున్నారని" చెబుతుంటారు.

రివర్స్ సెర్చ్ ద్వారా ఇది కూడా ఏడాది క్రితం వీడియో అని, జమ్ము-కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులకు దీనికి సంబంధం లేదని తెలిసింది.

కశ్మీర్ నుంచి నడిచే కశ్మీర్ వాలా, కశ్మీర్ రీడర్ అనే వెబ్‌సైట్లు కాకుండా న్యూజ్ లాండ్రీ, స్క్రోల్ లాంటి కొన్ని ప్రధాన న్యూస్ వెబ్‌సైట్స్ కూడా ఈ ఘటన గురించి రాశాయి.

ఈ వివరాల ప్రకారం దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉన్న సాంబోరా గ్రామంలో 2019 జూన్ 18న ఈ ఘటన జరిగింది.

దాని గురించి చెప్పిన స్థానికులు సెర్చ్ ఆపరేషన్ సమయంలో భద్రతాదళాలు నలుగురు యువకులను మానవ కవచంగా ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. స్థానిక పోలీసులు మాత్రం ఈ నలుగురు యువకులను అధికారికంగా అరెస్టు చేయలేదని చెప్పారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్-370 తొలగించిన తర్వాత కశ్మీర్‌కు సబంధించిన వదంతులు పాకిస్తాన్‌లోనే కాదు, భారత్‌లో కూడా సర్కులేట్ అయ్యాయి. వాటిపై బీబీసీ ఒక కథనం కూడా ప్రచురించింది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు