చిదంబరం అరెస్టుకు సీబీఐ తొందరపడిందా... ఈ కేసులో అయిదు కీలక ప్రశ్నలు, వాటి సమాధానాలు
- వినీత్ ఖరే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, PRESS TRUST OF INDIA
బుధవారం మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకునే ముందు, దిల్లీ హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన ప్రత్యేక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించాల్సి ఉంది.
కానీ, సుప్రీంకోర్టు దీన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. బుధవారం సాయంత్రం చిదంబరంను కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను అయిదు రోజుల పోలీస్ రిమాండుకు పంపించింది.
ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన దిల్లీ హైకోర్టు తన ఆదేశాలలో "ఇప్పటి ఈ కేసులో పైపైన కనిపిస్తున్న వాస్తవాలు పిటిషనే కింగ్ పిన్... అంటే కేసులో ప్రధాన కుట్రదారు అని వెల్లడి చేస్తున్నాయి. చట్టాన్ని అమలు చేసే సంస్థలను చట్టపపరమైన అడ్డంకులు కల్పించి నిర్వీర్యం చేయలేం..." అని వ్యాఖ్యానించింది.
దిల్లీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌పై వెంటనే విచారణ జరగకపోవడం, నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకోవడం లాంటి మొత్తం ఘటనలపై న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, facebook/rebecca mammen john
సీనియర్ వకీల్ రెబెకా జాన్ తన ఫేస్బుక్ పోస్ట్ హైకోర్టులో ఆ రోజు బెయిల్ పిటిషన్‌ను ఆలస్యంగా తిరస్కరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఆమె తన పోస్టులో "చిదంబరం కేసులో మంచిచెడులు నాకు తెలియవు. కానీ, ఓ న్యాయమూర్తి ముందస్తు బెయిల్ దరఖాస్తును నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి, తాను రిటైర్ కావడానికి రెండు రోజుల ముందు దీనిపై నిర్ణయం ఎలా వెలువరిస్తారు? తుది ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా ఒకవేళ నేరం తీవ్రమైనదైతే విచారణ పూర్తయిన వెంటనే తీర్పును ఎందుకు ఇవ్వలేదు?" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
అరెస్టు ప్రమాదాన్ని చూస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను 'తక్షణ జాబితా'లో చేర్చని విషయంలో సుప్రీంకోర్టు పాత్ర ఏంటి?
దీనిపై రెబెకా జాన్ "అన్ని కేసుల నుంచి ఉపశమనం లభించాలని నేను చెప్పడం లేదు. కానీ, వారి గొంతు వినిపించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్నిసార్లు అది అత్యవసరంగా జరగాల్సి రావచ్చు, కొన్నిసార్లు వెంటనే చేయాల్సి రావచ్చు. బెయిల్ తిరస్కరణకు గురైనవారు ఏళ్లతరబడి కస్టడీలోనే ఉండిపోతున్నారనే వాస్తవం కోర్టులకు తెలియదా?" అన్నారు.
దీనికి సంబంధించి వస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికి బీబీసీ సీనియర్ లాయర్లు సూరత్ సింగ్, కుమార్ మిహిర్‌తో మాట్లాడింది.
ఫొటో సోర్స్, Getty Images
1. కఠినమైన భాషతో 24 పేజీలు ఆదేశాలను ఎలా అర్థం చేసుకోవాలి?
సూరత్ సింగ్: హైకోర్టు తన భాష పట్ల గౌరవంగా ఉండాలి. ప్రాథమిక సాక్ష్యాలను బట్టి ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కోర్టు చెప్పింది. అయితే తీర్పుు మాత్రం సుదీర్ఘంగా ఉండకూడదు, తగినట్లుగా ఉండాలి.
కుమార్ మిహిర్: ముందస్తు బెయిలుపై విచారణ చేస్తున్న కోర్టు, కేసులోని యోగ్యతల గురించి పట్టించుకోకూడదు. కానీ చిదంబరం వైపు నుంచి వినిపించిన వాదన ఏంటంటే.. ఆయన పేరు అసలు ఎఫ్ఐఆర్లో లేనప్పుడు, ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చుండాలి. అందుకే కోర్టు ఆయన పాత్ర (ఆరోపించిన) గురించి చెప్పాల్సి వచ్చింది. లేదంటే ఆయనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించే వారు కాదు. బహుశా మంచి పదాలు ఉపయోగించాల్సింది. కానీ ఆ ఆదేశాలు రాయడం అనేది జడ్జి విశిష్టాధికారం.
బెయిల్ దశలో కోర్టు ఏది చెప్పినా, అది ప్రాథమిక అవగాహన మేరకే. అది ట్రయల్ కోర్టుపై ఆధారపడి ఉండదు. చిదంబరంపై మొత్తం దర్యాప్తు జరగాలి. ఎలాంటి ఆధారాలు గుర్తించలేకపోయామని, ఏ కేసులూ పెట్టలేకపోయామని సీబీఐ చెప్పొచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
2. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి చిదంబరానికి తగిన సమయం లభించిందా?
సూరత్ సింగ్: దిల్లీ హైకోర్టు చిదంబరం బెయిల్ తిరస్కరించినపుడు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోడానికి ఆయనకు తగినంత సమయం ఇచ్చుండాల్సింది. ఆయన్ను కొంత కాలం అరెస్టు చేయకుండా ఉండాలని కోర్టు చెప్పుండాలి. అపీల్ చేసే టైమే ఇవ్వలేదంటే, అది న్యాయం కాదు. మన వ్యవస్థలో ఒక వ్యక్తిని నిందితుడుగా చెబితే, కోర్టులో అది నిరూపితమైనా, కాకపోయినా వారిని దోషిగా చూస్తారు. మీడియా కూడా ఆ వ్యక్తిని దోషిగా చూపిస్తుంది. హైకోర్టుదే తప్పని నిరూపితమైతే, వ్యక్తి పరువు పోతుంది. వారు తమ స్వేచ్ఛను కోల్పోతారు. హైకోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులను సుప్రీం కోర్టులో కొట్టివేశారు.
కుమార్ మిహిర్: ముందస్తు బెయిల్ కోసం కోర్టు మూడు నాలుగు విషయాలను చూస్తుంది. ఆ కేసులో వ్యక్తి పాత్ర, అతడు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందా, అతడిని కస్టడీలో విచారించడం ఎంత అవసరం, సాక్షులను, ఆధారాలను అతడు ప్రభావితం చేయగలడా అనేది పరిశీలిస్తుంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఎఫ్ఐఆర్లో చిదంబరం పేరును ప్రస్తావించలేదు. అందుకే కోర్టు ఆయనను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందా అనే అంశాలను చూసుండాలి. కార్తీపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, లంచం తీసుకోడానికి తన తండ్రి పలుకుబడిని వాడుకున్నాడని, అందుకే మనం హైకోర్టు ఆదేశాల్లో తప్పు వెతకలేం.
ఫొటో సోర్స్, PTI
3. చిదంబరాన్ని అరెస్టు చేయాలని దర్యాప్తు సంస్థలు తొందరపడ్డాయా?
సూరత్ సింగ్:నేను అమెరికాలో చదివాను. అక్కడ ఒక వ్యక్తి నిందితుడైతే, పోలీసులు ఆధారాలు సేకరించడానికి సమయం తీసుకుంటారు. నిందితుడికి తగినంత సమయం ఇస్తారు. తర్వాతే చర్యలు తీసుకుంటారు.
భారత్‌లో ఒక వ్యక్తిని నిందితుడుగా చెబితే, కరడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నట్టే పోలీసులు అతడిపై విరుచుకుపడతారు. ఈ విషయం మే నెల నుంచీ కొనసాగుతోంది. వాళ్లు ఒకరోజు ముందు వరకూ ఒక్కపని కూడా చేయలేదు. తర్వాత నిందితుడిని రెండు గంటల్లో ఈడీ ముందు ప్రవేశపెట్టాలనుకున్నారు. ఎందుకంత తొందర?
ఒక మంచి ప్రజాస్వామ్యంలో ప్రజా భద్రత, నిందితుల హక్కుల మధ్య ఒక సమతౌల్యం ఉండాలి. అవి తగిన పరిమితులకు లోబడి ఉండాలి.
ఈ రెండు గంటల గడువు అనేది, తగిన పరిమితులు అనే నిర్వచనంలోకి రాదు. ప్రణయ్ రాయ్ (ఎన్డీటీవీ)ని విమానాశ్రయంలో ఆపినట్లు, వాళ్లు ఆయనకు రెండు రోజులు టైం ఇచ్చుండాలి.
చిదంబరం భారత ఆర్థిక, హోం మంత్రిగా ఉన్నారు. ఒక మాజీ మంత్రి దర్యాప్తు సంస్థల నుంచి పారిపోతున్నాడనేది మన వ్యవస్థలో బలహీనతకు అద్దంపడుతుంది.
కుమార్ మిహిర్: సమస్య ఏమిటంటే, మీరు చిదంబరాన్ని రాజకీయ నాయకుడు అనే కోణంలో చూస్తున్నారు, సామాన్యుడిగా చూడట్లేదు. ఈ కేసులో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని మరచిపోండి. ఇలాంటి కేసుల్లో త్వరగా చర్యలు తీసుకోకపోతే అనేక పరిణామాలు జరగవచ్చు. సాక్షులను నిందితులు ప్రభావితం చేయొచ్చు, పత్రాలు తారుమారు చేయొచ్చు. అయితే, ఆయన సీనియర్ సిటిజన్ అయినందున సీబీఐ మితిమీరి వ్యవహరించినట్లు అనిపించొచ్చు. కోర్టుకు వెళ్లేందుకు ఆయన సమయం ఇచ్చి ఉండాల్సింది.
ఫొటో సోర్స్, Getty Images
4. చిదంబరం పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది?
సూరత్ సింగ్: సుప్రీంకోర్టులో ఎవరైనా సరే ఒక నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి. సుప్రీంకోర్టు చేసింది చట్టబద్ధమే. కానీ, మరొక చట్టపరమైన మార్గం ద్వారా పిటిషనర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించాల్సి ఉండేది. చట్టంలో ఒకే ప్రశ్నకు అనేక రకాల సరైన సమాధానాలు ఉంటాయి. నిందితుడికి సాంకేతికంగా న్యాయం చేస్తున్నాం, కానీ అతనికి సరైన న్యాయం అందించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని చిదంబరం కేసు నొక్కి చెబుతుంది.
కుమార్ మిహిర్: మనం కోర్టులో పిటిషన్ వేసినప్పుడు, అన్ని పత్రాలూ సరైన పద్ధతిలో ఉండాలి. అప్పుడే రిజిస్ట్రార్ దానిని కోర్టుకు సమర్పిస్తారు. అది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఎవరూ ఏమీ అనలేరు.
ఫొటో సోర్స్, Getty Images
5. చిదంబరం ముందున్న మార్గాలేంటి?
సూరత్ సింగ్: సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో, ఆయన సాధారణ బెయిల్ కోసం వెళ్లాల్సి ఉంటుంది.
ఆయన దిగువ కోర్టుకు వెళ్లి, సాధారణ బెయిల్ కోరవచ్చు. ఆయన అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరిస్తే, హైకోర్టుకు, ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.
కుమార్ మిహిర్: సుప్రీంకోర్టులో ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా ట్రయల్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. ఆయన ఎంపీ అయినందున, ఎంపీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు ఆయనను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు చాలా తక్కువ. దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలనుకుంటాయి.
ఇవి కూడా చదవండి:
- చిదంబరంపై వచ్చిన ఆరోపణలేంటి.. ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్తి కథేమిటి
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- గుర్రంపై ఉపాధ్యాయుడు వెళ్తున్న ఊరిలో పాఠశాల భవనం నిర్మిస్తామన్న ఐటీడీఏ పీవో
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: నాటి బ్రిటిష్ ఇండియాలో సంచలనం రేపిన చరిత్ర
- సర్కారు బడుల్లో 'స్మార్ట్' క్లాస్ రూంలు... ఈ-మెయిల్లో హోంవర్క్, ఆన్లైన్లో ఎగ్జామ్స్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)