అమరావతి... ఇక నామ్‌కే వాస్తే! - ప్రెస్‌రివ్యూ

  • 23 ఆగస్టు 2019
Image copyright @PrajaRajadhani

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న నూతన రాజధాని అమరావతి ఇకపై 'నామ్‌కే వాస్తే'గా మాత్రమే ఉంటుందని.. భారీ అంతస్తుల సచివాలయ టవర్లు, బౌద్ధ స్తూపం ఆకారంలో హైకోర్టు భవనం, తిరగేసిన లిల్లీ పువ్వు శిఖరంతో సచివాలయం - ఇలాంటివేవీ ఉండవని విశ్వసనీయ సమాచారం అంటూ 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ''అమరావతి ముంపు ప్రాంతంలో ఉంది. వర్షం వస్తే మునిగిపోతుంది. కొండవీటి వాగు నుంచి ముంపు ముప్పు ఉంది. అమరావతిపై ఒక విధాన నిర్ణయం తీసుకుంటాం...'' అంటూ ప్రభుత్వంలోని పెద్దలు చేసిన ప్రకటనలతో అమరావతి భవిష్యత్తుపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.

అయితే, అమరావతి విషయంలో ఏం చేయాలనేదానిపై ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక కీలక అధికారి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పుడు 'మధ్యంతర' ప్రాతిపదికన నిర్మించిన సచివాలయం, అసెంబ్లీతోపాటు హైకోర్టు భవనాలు మాత్రం అలాగే ఉంటాయి. అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడమనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఎంతమాత్రం ఉండదు. మరీ తప్పనిసరైన, పనులు చివరి దశల్లో ఉన్న వాటిని మాత్రమే పూర్తి చేసే అవకాశముందని తెలిసింది.

హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చిన శాఖాధిపతుల కార్యాలయాలు (హెచ్‌వోడీ) కొన్ని విజయవాడలో, ఇంకొన్ని గుంటూరులో, మరికొన్ని విజయవాడ-గుంటూరు మధ్య నడుస్తున్నాయి. ఇవన్నీ రాజధానిలో ఉండేలా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో 5 భారీ టవర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. వీటి పనులు కూడా మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జీఏడీ టవర్ల నిర్మాణం కూడా ఆగిపోయినట్లే.

అయితే, పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్‌వోడీలు ఒకేచోట ఉండేలా ఒక భవన సముదాయాన్ని కొత్తగా నిర్మించే అవకాశముంది. సుమారు 250 ఎకరాల్లో, తక్కువ అంతస్తులతో వీటిని కట్టాలనుకుంటున్నారు. అదికూడా.. ఇప్పుడున్న అమరావతిలో కాకుండా, దానికి వెలుపల అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం!

అలాగే.. లింగాయపాలెం - నీరుకొండల మధ్య సుమారు 7 కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటర్‌ వెడల్పుతో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నది చంద్రబాబు సర్కారు ప్రణాళిక. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌- హెచ్‌వోడీ టవర్లు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భారీ టవర్లు ఇందులోనే ఉన్నాయి. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది.

మొత్తం 61 హౌసింగ్‌ టవర్లలో ఇప్పటి వరకూ 53 టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. 20 టవర్ల పనులు దాదాపు పూర్తికాగా.. మరొక 15 ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తంమీద చూస్తే ఈ హౌసింగ్‌ టవర్ల పనుల్లో ఇప్పటికి సుమారు 70 శాతం పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టవర్ల పనుల్లో వేగం మందగించడంతో ఇది సాధ్యం కాలేదు. ఈ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని నిర్మాణాల్లో కొన్నింటిని మాత్రమే పూర్తిచేసే అవకాశముందని కొందరు అధికారులు చెబుతున్నారు.

Image copyright Laknavaram lake/Facebook

మళ్లీ పూటకూళ్ల ఇళ్లు !

హోటళ్లు వచ్చిన తర్వాత కనుమరుగైపోయిన పూటకూళ్ల ఇళ్లను పునరుద్ధరించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర పర్యటక శాఖ సూచిస్తోందని.. తెలంగాణలో కూడా అలనాటి పూటకూళ్ల ఇళ్ల తరహా వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యటక శాఖ కసరత్తు మొదలుపెట్టబోతోందని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. మన తాతల కాలంలో ప్రతి ఊళ్లో పూటకూళ్ల ఇళ్లు ఉండేవని పెద్దలు చెబుతుంటే విన్నాం. చందమామ కథల్లో చదివాం కూడా. బాటసారులకు భోజనం, విశ్రాంతి తీసుకునేందుకు కల్పించే బసను పూటకూళ్ల ఇళ్లుగా వ్యవహరించేవారు.

జలపాతాలు, పురాతన కట్టడాలు, వందల ఏళ్లనాటి దేవాలయాలు, హాయి గొలిపే అడవి అందాలు.. ఇలాంటి చూడదగ్గ ప్రాంతాలు తెలంగాణలో ఎన్నో. అయితే.. కనీస వసతులు లేకపోవటంతో ఈ ప్రాంతాలకు వచ్చే పర్యటకుల సంఖ్య తక్కువే. దీనికి పరిష్కారంగా పూటకూళ్ల ఇళ్ల తరహా ఏర్పాటు ఉండాలనేది కేంద్ర పర్యటక శాఖ అభిప్రాయం. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా అలాంటి 'ఇంటి ఆతిథ్యం' అవసరమని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం గతంలో 'హోమ్‌ స్టే' పథకాన్ని రూపొందించింది. దీనికి 'బెడ్, బ్రేక్‌ఫాస్ట్‌' పథకంగా నామకరణం చేసింది. దీన్ని రాజస్తాన్, తమిళనాడులాంటి రాష్ట్రాలు బాగా అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో అది మొదలే కాలేదు.

హోమ్ స్టే పథకం కింద.. పర్యటక ప్రాంతాల్లో ఉండేవారు తమ ఇళ్లలోని కొంత భాగాన్ని ఇలా పర్యటకులు తాత్కాలికంగా ఉండేలా తీర్చిదిద్ది ఆదాయం పొందుతున్నారు. కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తే ఎంతటి మారుమూల ప్రాంతానికైనా విదేశీ, స్వదేశీ పర్యటకులు వస్తారని తేలింది.

తమిళనాడు, రాజస్తాన్‌ల్లో దాదాపు అన్ని పర్యటక ప్రాంతాలకు విదేశీ పర్యటకులు వచ్చేందుకు ఇదే కారణమవుతోంది. గ్రామాల్లో స్థానికులు తమ ఇంటిలోని కొంత భాగాన్ని పర్యటకులు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వారికి తమ ఇంటి భోజనాన్నే వడ్డిస్తున్నారు. అది సురక్షిత ప్రాంతమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వాటి వివరాలు పర్యటక శాఖ వెబ్‌సైట్‌లలో పొందుపరచడంతో పర్యటకులు ఎలాంటి జంకు లేకుండా అక్కడే రాత్రి బసచేసి సమీపంలోని ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా విధానం తెలంగాణలో కూడా ఏర్పాటయ్యేలా ప్రయత్నం చేస్తామని పర్యటక శాఖ అధికారులు చెబుతున్నారు.

Image copyright Getty Images

నల్లమలలో.. క్వార్ట్జ్‌ తవ్వకాలు!

నల్లమల అడవుల్లో ఓవైపు యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ, తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతుండగానే.. మరోవైపు క్వార్ట్జ్‌ ఖనిజాన్ని వెలికి తీసేందుకూ రంగం సిద్ధమవుతోందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) అటవీశాఖతో కలిసి ఇటీవల సర్వే చేసి.. భారీస్థాయిలో క్వార్ట్జ్‌తో పాటు ఫెల్డ్‌స్పార్‌ ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించినట్లు సమాచారం. మార్కెట్లో వాటికి మంచి గిరాకీ ఉంది. దీంతో వీటి తవ్వకాలపై దృష్టిపెట్టిన టీఎస్‌ఎండీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. తవ్వకాల కోసం నల్లమలలో తీసుకునే అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించాలని కోరింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గుండ్య, ఇబ్రహీంబాద్‌, రామనూతల్‌, చెరుకూరు, పాదకల్‌, సంతెపూర్‌, ముదివేను అటవీప్రాంతాల్లో దాదాపు 2,500 ఎకరాల్లో క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ ఖనిజాలు ఉన్నట్లు టీఎస్‌ఎండీసీ గుర్తించింది. తవ్వకాలకు 14 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసినప్పటికీ ముందుకు వెళ్లలేదు.

తాజాగా ఆ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. అటవీశాఖతో కలిసి జూన్‌, జులై నెలల్లో నల్లమల అడవుల్లో డీజీపీఎస్‌ సర్వే చేసింది. ఏడు ప్రాంతాల్లో 195 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఖనిజాలు పెద్దమొత్తంలో ఉన్నాయని.. ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది.

భూమి ఉపరితలంపైనే కాకుండా లోపల పెద్దమొత్తంలో క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ ఖనిజాలు ఉంటాయి. కోడిగుడ్డులో తెల్లసొన, పచ్చసొన మాదిరి క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ కలిసి ఉంటాయి. గాజు, సిరామిక్‌ పరిశ్రమల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.

Image copyright facebook

తెలంగాణలో విద్యావలంటీర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవు

రెవెన్యూ వసూళ్లలో దేశంలోనే నెంబర్‌ వన్‌ తెలంగాణ. ఐటీ సేవల ఎగుమతుల్లో అగ్రస్థానం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లకు మాత్రం ఫిబ్రవరి నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని నవ తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. విద్యావలంటీర్లకు నెలకు రూ. 12 వేల చొప్పున వేతనం చెల్లించలేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. రాష్ట్రంలో 15 వేల మంది విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.18 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, జూన్‌, జులై ఐదు నెలలకు కలిపి రూ.90 కోట్లు చెల్లించాలి. జీతాల చెల్లింపులకూ నిధుల్లేవని అధికారులు చెప్తుండటంతో విద్యావలంటీర్లు ఆందోళన చెందుతున్నారు.

గతంలో రెండు నెలలకోసారి జీతాలు చెల్లించేది. ఇప్పుడు మాత్రం ఐదు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదు.

జీతాలు రాక విద్యావలంటీర్లు అప్పులపాలవుతున్నారు. కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రూ. 3 నుంచి రూ. 10 వరకు వడ్డీకి అప్పు తెచ్చి కుటుంబాలను పోషిస్తున్నారు. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇక వారి కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్యమైతే అగమ్యగోచరమే. అన్ని ఇబ్బందుల మధ్య విద్యావలంటీర్లు జీతాలు సకాలంలో రాకపోయినా పనిచేస్తున్నారు.

మరోవైపు.. కనీస వేతనాలకూ విద్యావలంటీర్లు నోచుకోవడంలేదు. కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

సుభాష్ బోస్

నేతాజీ మరణ రహస్యాన్ని ఛేదించండి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని బోస్ కుమార్తె అనితా బోస్ కోరినట్లు 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. జపాన్‌లోని రింకోజీ ఆలయంలో నేతాజీకి చెందినవిగా చెబుతున్న చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష జరిగేలా సహకరించాలని గురువారం ఆమె విజ్ఞప్తి చేశారు. దీని కోసం ప్రధాని మోదీతోపాటు జపాన్ అధికారులను కలుస్తానని తెలిపారు.

బ్రిటిషర్లపై పోరాటానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసిన బోస్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని కొందరు.. ప్రమాదం నుంచి బయటపడి గుమ్‌నామీ బాబాగా యూపీలోని ఫైజాబాద్‌లో అజ్ఞాత జీవితం గడిపారని మరి కొందరు భావిస్తున్నారు.

ఆగస్టు 18న బోస్ వర్ధంతి అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్‌పై విమర్శలు రావడంతో వెంటనే దానిని తొలగించింది.

జర్మనీలో ఉంటున్న అనితా బోస్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 1945 ఆగస్టు 18న తన తండ్రి మరణించారని భావిస్తున్నానని అనితా బోస్ అన్నారు. అయితే తన తండ్రి మరణంపై నెలకొన్న మిస్టరీ విడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)