జీఎస్టీ దెబ్బకు బిస్కట్ పరిశ్రమ విలవిల... ప్రమాదంలో వేలాది ఉద్యోగాలు

  • అమృత దుర్వె
  • బీబీసీ ప్రతినిధి
బిస్కెట్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

తక్కువ ధర బిస్కెట్లకు గ్రామీణ మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు క్షీణించాయి.

ఆర్థిక మందగమనం కారణంగా దేశంలో పారిశ్రామిక రంగం ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాహన రంగంలో మందగమనం తరువాత, కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. దాంతో, అనేకమంది ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారు.

ఇప్పుడు, వినియోగ వస్తువుల (కన్స్యూమర్ ప్రొడక్ట్స్) రంగంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పించకపోతే, ఈ రంగంలోని సంస్థలు కూడా ఉద్యోగాలకు కోతపెట్టే దిశగా అడుగులు వేసే అవకాశముంది.

ఈ మందగమనం పట్ల దేశంలోని ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే-జి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ సంస్థ 8,000 నుంచి 10,000 మంది కార్మికులను తొలగించే అవకాశం ఉంది.

పార్లే-జి బిస్కెట్ విభాగానికి చెందిన మయాంక్ షా 'ది హిందూ బిజినెస్ లైన్‌'తో మాట్లాడుతూ, "జీఎస్టీ అమలు చేసినప్పటి నుంచి, కిలోకు 100 రూపాయలు.. అంతకంటే తక్కువ ధర గల బిస్కెట్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో ఉంచారు. ఈ తక్కువ ధర బిస్కెట్లను సాధారణంగా అల్పాదాయ ప్రజలు వినియోగిస్తారు. కిలోకు 100 రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం బిస్కెట్ల మాదిరిగానే వీటి మీద పన్ను విధించరాదని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి" అని అన్నారు.

జీఎస్టీ అమలులోకి రాకముందు, కిలోకు రూ.100, అంతకంటే తక్కువ ధర గలిగిన బిస్కెట్ల మీద 12 నుంచి 14 శాతం పన్ను ఉండేది. చౌక ధర బిస్కెట్లను ఎక్సైజ్ సుంకం నుంచి కూడా మినహాయించారు. అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) మాత్రమే ఉండేది.

అయితే, జీఎస్టీ వచ్చాక అన్ని రకాల బిస్కెట్లనూ 18 శాతం పన్ను స్లాబులోకి తెచ్చారు. దాంతో, ఐదు రూపాయల విలువైన బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా 18 శాతం పన్ను పడుతోంది.

పన్ను పెరగడంతో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కొద్దిగా పెంచాయి. ఆ ప్రభావం అమ్మకాలపై పడింది.

జీఎస్టీ పన్ను రేట్లలో మార్పులు చేస్తారన్న ఆశాభావంతో ఏడాదిన్నరగా ధరలను పెంచకుండా వేచిచూశామని మయాంక్ షా చెప్పారు. తప్పని పరిస్థితుల్లో గతేడాది డిసెంబర్‌లో 5 నుంచి 7 శాతం ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు.

"బిస్కెట్ల మార్కెట్ చాలా సున్నితమైనది. ఏ మాత్రం ధరలు పెంచినా అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు, వినియోగదారుల మనోభావాలు బిస్కెట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అయితే, తప్పని పరిస్థితుల్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తోంది. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 నుంచి 10,000 ఉద్యోగాల కోతకు దారితీస్తుంది" అని షా చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడుపోయే చౌక ధర బిస్కెట్ల (కిలో ధర రూ.100 అంతకంటే తక్కువ) అమ్మకాలు గత త్రైమాసికంలో 7-8 శాతం క్షీణించాయి.

1929లో స్థాపించిన పార్లే సంస్థలో లక్ష మంది కార్మికులు ఉన్నారు (ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులు కలిపి). వారంతా దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్లాంట్లు, 125 కాంట్రాక్టు పద్ధతిలో నడిచే తయారీ కేంద్రాలలో పనిచేస్తున్నారు.

బ్రిటానియాదీఅదే పరిస్థితి

మరో ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా కూడా సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ సంస్థ అమ్మకాల వృద్ధిలోనూ తగ్గుదల కనిపించింది.

డీఎన్‌ఏ వార్తా సంస్థతో బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ... "ఈసారి ఆరు శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అది ఆందోళన కలిగించే సంకేతం. ఎందుకంటే, 5 రూపాయల ప్యాకెట్ కొనేందుకు కూడా వినియోగదారుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారంటే, ఆర్థిక వ్యవస్థలో ఏదో తీవ్రమైన సమస్య ఉందని అర్థమవుతోంది" అన్నారు.

గ్రామీణ మార్కెట్‌లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చౌక ఉత్పత్తులు గ్రామీణ మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఆ ఉత్పత్తుల అమ్మకాలు క్షీణిస్తున్నాయి.

"ఏడాది క్రితం గ్రామీణ మార్కెట్, పట్టణ మార్కెట్‌ కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు బలంగా ఉండేది. కానీ, ఇప్పుడు అది కూడా మందగిస్తోంది" అని బెర్రీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

నీల్సన్ నివేదిక

దేశంలో ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో వృద్ధి రేటు అంచనాలను మార్కెట్ పరిశోధన సంస్థ నీల్సన్ తగ్గించింది. ఈ రంగం 11-12 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు ఆ అంచనాను 9-10 శాతానికి తగ్గించింది.

ఎఫ్‌ఎంసీజీ రంగంలో 37 శాతం వృద్ధి గ్రామీణ మార్కెట్ మీదే ఆధారపడి ఉంది. గతంలో పట్టణ మార్కెట్‌తో పోల్చితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి రేటు 3 నుంచి 5 శాతం అధికంగా ఉండేది.

కానీ, ఇప్పుడు గ్రామీణ మార్కెట్ వృద్ధి మందగించింది. ఇప్పుడు గ్రామీణ, పట్టణ మార్కెట్ల వృద్ధి రేటు దాదాపు ఒకే విధంగా ఉంది.

"రెండవ త్రైమాసికంలో అన్ని రకాల ఆహార ఉత్పత్తులూ నిరుత్సాహ పరిచాయి. బిస్కెట్లు, మసాలాలు, వేపుడు పదార్థాలు, సబ్బులు, ప్యాక్ చేసిన టీ లాంటి ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా క్షీణించాయి " అని నీల్సన్ దక్షిణాసియా రిటైల్ గణాంకాల విభాగం హెడ్ సునీల్ ఖియానీ వివరించారు.

ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి రేటు జూలై నుంచి డిసెంబర్ వరకు రెండు త్రైమాసికాలలో 7-8 శాతం నమోదయ్యే అవకాశం ఉందని నీల్సన్ అంచనా వేసింది.

రుతుపవనాలు, ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ నిబంధనలు ఈ రంగాన్ని నిరాశపరిచాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్బీఐ గవర్నర్ చెప్పారు?

2019 జూన్ తర్వాత చోటుచేసుకున్న ఆర్థిక పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందన్న విషయాన్ని సూచిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు.

ఆగస్టు 6న జరిగిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.

దేశ వృద్ధి రేటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను పరిగణనలోకి తీసుకుని, దేశీయ కొనుగోళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రెపో రేటును ఆర్‌బీఐ మూడుసార్లు తగ్గించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశీయ డిమాండ్ కూడా క్షీణించిందని శక్తికాంత్ దాస్ చెప్పారు. "మే నెలలో పరిశ్రమ మందగించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది" అని దాస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రఘురాం రాజన్

రఘురామ్ రాజన్ ఏమన్నారు?

ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి బీబీసీ హార్డ్‌టాక్‌ కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

"ఏం జరగబోతోందన్న విషయం మనకు స్పష్టంగా తెలియదని నేను అనుకోవట్లేదు. ఒక వైపు, పారిశ్రామిక రంగంలో చూస్తే ఉపాధి అవకాశాలకు సంబంధించిన గణాంకాలు బలంగా ఉన్నాయి. వినియోగదారు విశ్వాసం, కొనుగోలు శక్తి కూడా బలంగానే ఉన్నాయి. కాబట్టి, వస్తు వినియోగం ఇప్పటికీ సాధారణంగానే ఉంది. ఈ బ్రెగ్జిట్, అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావంతో మార్కెట్ కొంతమేరకు మందగించింది. ఫలితంగా, ఎవరూ కొత్త పెట్టుబడులు పెట్టడం లేదు" అని రాజన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)