అరుణ్ జైట్లీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

  • 24 ఆగస్టు 2019
అరుణ్ జైట్లీ Image copyright facebook/Arun Jaitley

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కొద్ది రోజులుగా దిల్లిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం మృతిచెందారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు జైట్లీ భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తామని.. మధ్యాహ్నం నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు.

శ్వాసపరమైన సమస్యలతో ఆగస్ట్ 9న జైట్లీ దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.

గత శనివారం సాయంత్రం ఎయిమ్స్‌కు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్... జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 9న ప్రధాని మోదీ, ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్‌వర్ధన్ కూడా ఎయిమ్స్‌కు వచ్చిన జైట్లీని పరామర్శించారు.

తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని మే నెలలో మోదీకి జైట్లీ ఓ లేఖ రాశారు. గత 18 నెలల నుంచి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా తాను ఎలాంటి పదవులనూ తీసుకోదలచుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన అరుణ్ జైట్లీ బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరు.

Image copyright AIIMS

పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మధ్యాహ్నం 12.07కు మరణించారు. ఈ నెల 9న ఆయన ఎయిమ్స్‌లో చేరారు. సీనియర్ వైద్యులతో కూడిన మల్టీడిసిప్లీనరీ బృందం ఆయనకు చికిత్సనందించింది అని ఎయిమ్స్ మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అరుణ్ జైట్లీ మరణం తీవ్ర విచారం కలిగించిందని, జాతి నిర్మాణానికి ఆయన ఎనలేని సేవలు అందించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

‘‘అద్భుత న్యాయవాదిగా, గొప్ప పార్లమెంటేరియన్‌గా, విశిష్ట మంత్రిగా ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఎంతో కష్టమైన బాధ్యతలనైనా తొణకుండా పూర్తి చేసే సామర్థ్యం ఆయన సొంతం. రాజకీయల్లో, మేధో సమాజంలో ఆయన మరణం తీరని లోటును మిగిల్చింది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఈ బాధను వ్యక్తం చేసేందుకు మాటలు సరిపోవడం లేదు. జైట్లీ అపర మేధావి. పాలనాదక్షుడు, గొప్ప విలువలున్న వ్యక్తి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

విప్లవాత్మకమైన జీఎస్‌టీ విధానంపై రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జైట్లీ రేయింబవళ్లు కృషి చేశారని.. మోదీ, వాజ్‌పేయి హయాంల్లో కీలక శాఖలను సమర్థంగా నిర్వహించారని వెంకయ్యనాయుడు గుర్తుచేసినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

"అరుణ్ జైట్లీ రాజకీయ మేరునగం, విజ్ఞాని, న్యాయ కోవిదుడు. దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన అద్భుత వాక్పటిమ గల నాయకుడు. ఆయన మృతి చాలా బాధాకరం. ఆయన భార్య, కుమారులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నా" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

నా స్నేహితుడు, విలువలతో కూడిన సహవాసి అరుణ్ జైట్లీ మరణం ఎంతగానో బాధించింది. ఆయనో సమర్థుడైన న్యాయవాది, రాజకీయ నాయకుడు అని రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నో పదవుల్లో ఆయన దేశానికి సేవ చేశారని, పార్టీకి, ప్రభుత్వానికి ఆయనో ఓ ఆస్తి వంటివారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అన్నిరకాల అంశాలపై ఆయనకు లోతైన, స్పష్టమైన అవగాహన ఉండేదని, ఆయన విజ్ఞానం, వాక్పటిమ ఆయనకు ఎందరో స్నేహితులను సంపాదించి పెట్టిందని రాజ్‌నాథ్ ట్విటర్లో పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నేతగా జైట్లీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని, బీజేపీకి జైట్లీ మరణం తీరని లోటు అని ఆయనన్నారు.

"అరుణ్ జైట్లీ మరణం ఎంతో దుఃఖాన్ని కలిగించింది. జైట్లీ జీ మరణం వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటును కలిగించింది. కేవలం ఓ సీనియర్ నేతగానే కాదు, ఓ కుటుంబంలో సభ్యుడిగా కూడా ఆయన ఇన్నోళ్లుగా అందించిన మద్దతు, మార్గదర్శనాన్ని నేను కోల్పోతున్నా" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విటర్లో పేర్కొన్నారు.

జైట్లీ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేసింది. జైట్లీ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది.

‘‘నా లాంటి వారెందరికో ఆయన మార్గదర్శి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా, విశాల హృదయమున్న వ్యక్తి. సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండేవారు. తెలివితేటల్లో, చురుకుతనంలో, సూక్ష్మబుద్ధిలో ఆయనకు సాటి లేదు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

‘‘జైట్లీ అకాల మరణం మొత్తం దేశానికి తీరని లోటు. ఆయన న్యాయ కోవిధుడు, తన పాలనా దక్షతకు పేరుపొందిన రాజకీయ అనుభవశాలి’’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య

'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు? మరణ శిక్ష విధించారా...

'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు