అరుణ్ జైట్లీకి వచ్చిన సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ ఎలా వేధిస్తుంది?

  • 24 ఆగస్టు 2019
జైట్లీ Image copyright Getty Images

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన మూత్రపిండాల వ్యాధితో పాటు అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో కొద్దికాలంగా బాధపడుతున్నారు. ఆ రకం క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో 'సాఫ్ట్ టిష్యూ సర్కోమా' అంటారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం, అలసిపోతుండడంతో ఆగస్టు 9న దిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన్ను చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు.

మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన జైట్లీని సాఫ్ట్ టిష్యూ సర్కోమా వ్యాధి తీవ్రంగా పీడించింది.

ఈ రకం క్యాన్సర్ చాలా నెమ్మదిగా కణజాలం, కండరాలు, స్నాయువులు(కండరాలను, ఎముకలను కలిపిఉంచే భాగం), కీళ్లకు వ్యాపిస్తుంది.

దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా వస్తుందని, ఎక్కువగా చేతులు, కాళ్ల కండరాలలో మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు.

కండరాల వాపు, ఎముకల్లో నొప్పి, శరీరంలో చిన్నచిన్న తిత్తులు వంటివి ఏర్పడడం దీనికి సూచన.

వైద్య నివేదికలప్రకారం అరుణ్ జైట్లీ ఎడమ కాలికి సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ వచ్చింది. దానికి శస్త్ర చికిత్స కోసమే ఆయన ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్ళారు.

Image copyright Getty Images

మూత్రపిండాలు, గుండె సమస్యలూ ఉన్నాయి

కేవలం సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్‌తోనే కాకుండా జైట్లీ మూత్రపిండాల వ్యాధి, హృద్రోగాలతోనూ బాధపడ్డారు.

గత ఏడాది ఆయనకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పటికి ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు.

మూత్రపిండాల మార్పిడి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను పీయుష్ గోయల్‌కు అప్పగించారు. కోలుకున్నాక మళ్లీ జైట్లీ 2018 ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నారు.

మూత్రపిండాల సమస్యలతో పాటు పలు ఇతర సమస్యలనూ ఆయన ఎదుర్కొన్నారు.

2014 సెప్టెంబరులో ఆయనకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. 2005లో ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు.

2019లో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆయన అనారోగ్య కారణాలతో తాను మంత్రి పదవి చేపట్టలేనంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

అనంతరం ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)