ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపు అద్దె ఒక్క రూపాయే - ప్రెస్ రివ్యూ

  • 25 ఆగస్టు 2019
మద్య పానం Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు సంబంధించి అద్దెకు షాపుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ అధికారులు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చేపట్టారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. అద్దె షాపుల ఎంపికకు అధికారులు ఓపెన్‌ టెండర్లను స్వీకరించగా ఇందుకు తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది.

ముఖ్యంగా ఏలూరు, పెదవేగి మండలాల పరిధిలో ఒకరికొకరు పోటీపడి అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిచ్చేందుకు ఒప్పుకోవటం గమనార్హం.

కేవలం రూ. 1కే షాపును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఏలూరు నగరంలోని 30వ డివిజన్‌లో షాపు, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని మద్యం దుకాణాలను రూ. 1కే ప్రభుత్వానికి అద్దెకు ఇస్తున్నారు.

Image copyright AFP

స్విస్‌ మహిళల ఆయుర్దాయం అత్యధికం

ప్రపంచంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళల ఆయుర్దాయం ఎక్కువని.. అక్కడి మహిళలు సగటున 79.03 సంవత్సరాలు బతుకుతారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారు. మగవాళ్లలో ఎక్కువ కాలం బతికేది సగటున ఆస్ట్రేలియన్లు. అక్కడ వారి ఆయుర్దాయం 74.1 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలో మహిళలు కూడా ఎక్కువ కాలమే బతుకుతారు. అక్కడ వారి సగటు వయస్సు 78.9 ఏళ్లు. ఆస్ట్రేలియాలో కూడా మగవారికన్నా ఆడవారే ఎక్కువకాలం బతుకుతారన్న మాట.

అభివృద్ధి చెందిన 15 దేశాల్లో మహిళలు, పురుషుల సగటు ఆయుర్దాయంపై పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

బ్రిటన్‌లో మహిళల ఆయుర్దాయం సగటున 76.43 ఏళ్లుకాగా, అమెరికాలో 76.08 ఏళ్లు. ఈ విషయంలో ఈ దేశాలు ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో మగవాళ్లు సగటున 72.33 ఏళ్లు, అమెరికాలో 71.57 ఏళ్లు జీవిస్తున్నారని తేలింది.

స్త్రీ, పురుషులు ఎక్కువ కాలం జీవిస్తున్న యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని 15 దేశాల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. నార్వే, జపాన్, స్పెయిన్, డెన్మార్క్, బెల్జియం దేశాల జాబితా కూడా వీటిలో ఉంది. యూరప్‌లో స్వీడన్, స్విడ్జర్లాండ్‌ దేశాల్లో మగవాళ్లు సగటున 74.2, 73.7 ఏళ్లు జీవిస్తున్నారు.

వయసు ఆరేళ్లు.. సంపాదన నెలకు రూ. 20 కోట్లు

‘‘యూట్యూబ్‌లో పాపులర్ అయితే చాలు.. దానికన్నా మించిన సంపాదన వేరొకటి లేదు. అందుకు వయసుతో నిమిత్తం లేదు’’ అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన బోరమ్ అనే ఆరేళ్ల చిన్నారి కూడా అదే పని చేస్తోంది. తన తల్లిదండ్రులతో కలిసి 'బోరమ్ ట్యూబ్ వ్లోగ్', 'బోరమ్ ట్యూబ్ టాయ్ రివ్యూ' అనే రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను నడుపుతోంది.

ఈ రెండు ఛానల్స్‌కు మూడు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దాంతో బోరమ్ నెలకు దాదాపు 2.5 మిలియన్ యూరోలు (రూ. 20 కోట్ల 9 లక్షలు) సంపాదిస్తోంది.

ఈ మధ్యనే 6.4 మిలియన్ యూరోలతో బోరమ్ దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో పెద్ద అపార్ట్‌మెంట్ కొంది.

అచ్చే దిన్‌ వచ్చాక ఆలోచిద్దాం: ట్విటర్‌లో పెళ్లి ప్రపోజల్‌కు ఆప్ యువనేత జవాబు

ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజా ప్రతినిధి రాఘవ్‌ చద్దాకు ఓ యువతి నుంచి ప్రపోజల్‌ వచ్చిందని.. దానికి ఆయన ఇచ్చిన సమాధానం సామాజిక మీడియాలో హాస్యం పండిస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. చార్టర్డ్ అకౌంటెంట్‌ నుంచి రాజకీయనేతగా మారిన రాఘవ్‌కు.. కీర్తి అనే యువతి ట్విటర్‌ వేదికగా పెళ్లి ప్రతిపాదన తెచ్చారు.

'రాఘవ్‌.. నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని ఆమె ట్వీట్‌ చేశారు.

ఇందుకు రాఘవ్‌ స్పందిస్తూ.. 'సారీ కీర్తి. దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాలేదు. కాబట్టి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం సరైనది కాదు. అచ్చే దిన్‌ వచ్చాక మనం పెళ్లి గురించి చర్చించుకుందాం' అని సమాధానమిచ్చారు.

రాఘవ్‌ రిప్లైకు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 'ఆయన సమాధానం హైలైట్‌. హీరోలకంటే ఎక్కువగా ఓ ప్రజాప్రతినిధిపై అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు' అంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)