అరుణ్ జైట్లీ: వాజ్‌పేయి తర్వాత బీజేపీలో ఉదారవాద నాయకుడు
- శేఖర్ అయ్యర్
- బీబీసీ కోసం
ఫొటో సోర్స్, Getty Images
భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత ఆ స్థాయిలో ఉదారవాదిగా పరిగణించేది అరుణ్ జైట్లీనే. తన విధానాలు, భావజాలం ఆధారంగా బీజేపీ సంప్రదాయవాద పార్టీగా కనిపిస్తుంది.
అరుణ్ జైట్లీకి పార్టీ భావజాలంపై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ ఆయన సంస్కరణవాదిగా ఉన్నారు. దీని వల్ల పార్టీ కూడా లాభపడింది.
పార్టీ విస్తరణలో..
బీజేపీ తన భావజాలాన్ని విస్తరింపజేయడంలో అరుణ్ జైట్లీది చాలా కీలక పాత్ర. ఒక మేధావిగా ప్రభుత్వ విధానాలను రూపొందించడంతో పాటు పార్టీ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు.
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీకి సంబంధించిన వ్యవహారాలపై పార్టీకి, మీడియాకు మధ్య వారధిగా పనిచేశారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోలేనివారికి, పార్టీని వ్యతిరేకించేవారికి తమ విధానాలను ఆయన తెలియజెప్పేందుకు ప్రయత్నించేవారు.
అయితే, జైట్లీ ప్రజాకర్షణ ఉన్న నేత కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన ఓటమికి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ వ్యూహకర్త
తానొక మాస్ లీడర్ కాదని జైట్లీ నమ్మేవారు. అటల్, సుష్మా స్వరాజ్ లాగా మంచి వక్తను కూడా కాదని ఆయనకు తెలుసు. కానీ, ఆయనొక గొప్ప వ్యూహకర్త.
1998 తర్వాత అనేక ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
చట్టం, రాజ్యాంగంపై చక్కటి అవగాహన
మంచైనా, చెడైనా.. జైట్లీ బహిరంగంగానే మాట్లాడేవారు. ఆయనకు చట్టం, రాజ్యాంగం గురించి బాగా అవగాహన ఉంది. తన విధానాలను రాజకీయంగా ఎలా ప్రవేశపెట్టాలో ఆయనకు బాగా తెలుసు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అణు ఒప్పందాన్ని ఆమోదింపజేయడంలో కాంగ్రెస్‌కు ఎంతో సహాయం చేశారు. ఆ బిల్లులో జైట్లీ చెప్పిన అనేక సూచనలు పొందుపరిచారు.
లోక్‌పాల్ విషయంలోనూ ఆయన సూచనలు బిల్లులో చేర్చారు.
ఫొటో సోర్స్, Rstv
ఆర్థిక మంత్రిగా...
ఆర్థిక మంత్రిగా ఆయన అనేక ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు. అవినీతిపై తన హయాంలో కఠిన చర్యలు తీసుకున్నారు. బ్యాంకుల పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, ఆయనకు ఈ విషయంలో అనుకున్నంత గుర్తింపు లభించలేదు. కొన్నిసార్లు విమర్శలకూ గురయ్యారు.
2014 నుంచి 2019 మధ్య ఆర్థికమంత్రిత్వ శాఖతో పాటు కొన్నిసార్లు రక్షణ శాఖ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు.
ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎప్పటికీ గుర్తించుకోదగినవి.
ఫొటో సోర్స్, EPA
ఒకే దేశం, ఒకే పన్ను - జీఎస్టీ
ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో వచ్చిన జీఎస్టీ బిల్లు ఆమోదంలోనూ ఆర్థికమంత్రి జైట్లీ కీలకపాత్ర పోషించారు. దేశంలో అతిపెద్ద సంస్కరణల్లో ఇదొకటి.
ఈ బిల్లు అమలుకు అన్ని రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. దీనికోసం ఒక నేషనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వారంతా వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందినవారు కూడా ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు. వారందరితో చర్చించేందుకు జైట్లీ సిద్ధమయ్యారు.
2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీనికి ముందు జరిగిన సమావేశంలో జైట్లీ పాత్ర చాలా ముఖ్యమైనది.
జీఎస్టీ అమలుపై చాలా రాష్ట్రాలు మొదట విముఖత చూపాయి. అనేక రకాల పన్నులు తొలగించడం వల్ల తమ రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని భావించాయి. అయితే, జైట్లీ అన్ని రాష్ట్రాల ప్రతినిధులను ఒప్పించారు.
జీఎస్టీ అమలు తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ కొత్త పన్నుల వ్యవస్థ గురించి వ్యాపారుల లాబీని ఒప్పించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలను కొనసాగించారు. చాలాసార్లు పన్ను రేట్లలో మార్పులు చేశారు. జీఎస్టీని బాగా అమలు చేసినందుకు జైట్లీని అందరూ గుర్తుంచుకుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్
ఒకే ర్యాంకు ఉన్న సైనికులకు ఒకే తరహా పెన్షన్ అమలు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా వస్తోంది. ఆర్థికంగా భారం కావడంతో ప్రభుత్వాలు దీన్ని అమలు చేసేందుకు వెనకడుగు వేస్తూ వచ్చాయి.
అయితే, మోదీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా, మనోహర్ పరికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సైనికుల డిమాండ్‌కు అంగీకారం తెలిపారు.
ఫొటో సోర్స్, Reuters
కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం
రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడం చాలా పెద్ద ప్రక్రియ. దీన్ని ఆర్థిక రంగంలో పెనుమార్పుగా చెప్పవచ్చు. రైల్వేను ఎప్పుడూ ఆదాయాన్ని తెచ్చే మంత్రిత్వ శాఖగా పరిగణించలేదు. కానీ, రైల్వే అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. రైల్వేలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికి, ఆదాయం కోసం ఈ సంస్కరణలు అవసరం.
ఇప్పటికీ రైల్వే ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ట్రాక్‌లను మార్చడం, కొత్త కోచ్‌లు, భద్రత అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి. రైల్వేల ఆధునికీకరణ కూడా ముఖ్యం. ఇవన్నీ చేయడానికి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో అనుసంధానించడం చాలా ముఖ్యమైన పని. దీన్ని జైట్లీ విజయవంతంగా పూర్తి చేశారు.
ఫొటో సోర్స్, AFP
పెద్ద నోట్ల రద్దు
నోట్లరద్దు నిర్ణయంతో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ పార్టీలు, వ్యాపార సంస్థలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమయంలోనే కేంద్రం సుమారు మూడు లక్షల షెల్ కంపెనీలపై చర్యలు తీసుకుంది.
నోట్ల రద్దు సమయంలో మొత్తం ప్రక్రియను జైట్లీనే పర్యవేక్షించారు. ఈ సమయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే దీని తరువాత కూడా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించింది.
(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం. బీబీసీ ప్రతినిధి వాత్సల్యతో సంభాషణ ఆధారంగా ఈ వ్యాసం ప్రచురితమైంది.)
ఇవి కూడా చదవండి:
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
- విజయనగర సామ్రాజ్యం శిథిలమైనా... డిజిటల్‌గా సజీవం
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
అరుణ్ జైట్లీ (1952 - 2019): విద్యార్థి నాయకుడు, న్యాయవాది నుంచి రాజకీయ సమున్నత శిఖరాలకు...
విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగిన అరుణ్ జైట్లీ సమర్థుడైన న్యాయవాదిగా రాణించారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి వాజ్‌పేయి, నరేంద్ర మోదీ క్యాబినెట్లలో కీలక మంత్రి పదవులు చేపట్టారు.