అరుణ్ జైట్లీ: నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు, మోదీ ఎందుకు రాలేకపోయారంటే...

  • 25 ఆగస్టు 2019
మోదీ జైట్లీ Image copyright Getty Images

బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అంతిమ సంస్కార కార్యక్రమాలు పూర్తయ్యాయి.

దిల్లిలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన పార్థివదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. జైట్లీ కుమారుడు రోహన్ ఆయన చితికి నిప్పంటించారు.

Image copyright BJP4INDIA/twitter

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు విపక్షాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు నిగమ్ బోధ్ ఘాట్‌కు వచ్చి, జైట్లీకి అంతిమ వీడ్కోలు పలికారు.

శ్వాసపరమైన సమస్యలతో ఆగస్ట్ 9న ఆయన ఎయిమ్స్‌లో చేరిన జైట్లీ.. శనివారం మధ్యాహ్నం మృతిచెందిన సంగతి తెలిసిందే.

న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన జైట్లీ బీజేపీ అగ్ర నేతల్లో ఒకరిగా ఎదిగారు.

తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని మే నెలలో మోదీకి జైట్లీ ఓ లేఖ రాశారు. గత 18 నెలల నుంచి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా తాను ఎలాంటి పదవులనూ తీసుకోదలచుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

Image copyright AMITSHAH/twitter

అరుణ్ జైట్లీ మరణం తీవ్ర విచారం కలిగించిందని, జాతి నిర్మాణానికి ఆయన ఎనలేని సేవలు అందించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

''ఈ బాధను వ్యక్తం చేసేందుకు మాటలు సరిపోవడం లేదు. జైట్లీ అపర మేధావి. పాలనాదక్షుడు, గొప్ప విలువలున్న వ్యక్తి'' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

"అరుణ్ జైట్లీ రాజకీయ మేరునగం, విజ్ఞాని, న్యాయ కోవిదుడు. దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన అద్భుత వాక్పటిమ గల నాయకుడు. ఆయన మృతి చాలా బాధాకరం. ఆయన భార్య, కుమారులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నా" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Image copyright Getty Images

బాధ్యతల సంకెళ్లలో బందీనైపోయా: మోదీ

జైట్లీ అంత్యక్రియలకు మోదీ హాజరుకాలేకపోయారు. ముందుగానే ఖరారైన విదేశీ పర్యటనలు, ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొనాల్సి ఉండటంతో ఆయన దిల్లీకి రాలేకపోయారు. ఇవి కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శనివారం అత్యున్నత పౌర పురస్కారం కూడా మోదీకి ప్రదానం చేసింది.

జైట్లీ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ.. జైట్లీ భార్య సంగీతా జైట్లీకి ఫోన్ చేసి పరామర్శించారు.

శనివారం రాత్రి బహ్రెయిన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘బహ్రెయిన్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంది. భారత్‌లో కృష్ణాష్టమి సంబరాలు జరుగుతున్నాయి ఇదే సమయంలో నా మనసు నిండా భరించలేనంత శోకం నిండిపోయింది. బాధను దిగమింగుకొని మీ ముందు నిల్చున్నా. విద్యార్థి దశ నుంచి రాజకీయాల దాకా నాతో కలిసి నడిచిన జైట్లీ కన్నుమూశారు.. ఆయన, నేను కలిసి ఎన్నో స్వప్నాలు కన్నాం. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేశాం’’ అని మోదీ అన్నారు.

‘‘బాధ్యతల సంకెళ్లలో బంధీనైపోయా. నా మిత్రుడు ప్రపంచాన్ని వదిలిన ఈ సమయంలో నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రోజు బహ్రెయిన్ గడ్డపై నుంచే నా మిత్రుడు అరుణ్ జైట్లీకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

బహ్రెయిన్‌లో కార్యక్రమాలు పూర్తైన తర్వాత మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లారు. ఆదివారం, సోమవారం ఆయన అక్కడ జీ-7 సదస్సులో పాల్గొంటారు. సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు.

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ తాజా విదేశీ పర్యటనలు భారత్‌కు చాలా కీలకమైనవి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)