అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు? : అభిప్రాయం

  • 26 ఆగస్టు 2019
పెళ్లి, బాల్య వివాహం Image copyright AFP

భారత్‌లో వివాహం చేసుకోవాలంటే చట్టప్రకారం అమ్మాయికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి. ఎందుకు ఈ అంతరం?

ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కనీస వివాహ వయసులు స్త్రీ, పురుషులకు భిన్నంగా ఉన్నాయి. కనీస వయసు అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా ఉండాలన్న దేశాలైతే దాదాపు లేనే లేవు.

భారత్‌లో స్త్రీ, పురుషులుకు మేజర్ అయ్యే వయసు ఒక్కటే అయినప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం తేడా ఉండటం గమనార్హం.

దిల్లీ హైకోర్టులో ఇటీవల అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఓ పిటిషన్ వేశారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు కనీస వివాహ వయసును సమానంగా నిర్ణయించాలని అందులో ఆయన అభ్యర్థించారు. వయసు అంతరం ఉండాలనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలూ లేవని, పితృస్వామిక ఆలోచనల ప్రతిఫలంగానే ఆ తేడా వచ్చిందని అన్నారు. దీంతో, ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది.

పెళ్లి వయసు గురించి భారత్‌లో చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. వివాహ కనీస వయసు నిబంధనల వెనుక బాల్య వివాహాలను నిరోధించాలన్న ఉద్దేశం ఉంది. అయితే, అమ్మాయి జీవితంలో సమస్యలు రాకూడదన్న అంశాన్నే పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Image copyright AFP

వలసపాలన కాలంలో 1884లో డాక్టర్ రుఖ్మాబాయి కేసు, 1889లో ఫుల్మోనీ దాసీ మరణం అంశాలతో కనీస వివాహ వయసు విషయంపై చర్చ మొదలైంది. తనకు జరిగిన బాల్యవివాహాన్ని రుఖ్మాబాయి నిరాకరించారు. 11 ఏళ్లున్న పుల్మోని 35 ఏళ్ల వ్యక్తితో జరిగింది. భర్త బలవంతంగా లైంగిక దాడి చేయడంతో ఆమె చనిపోయింది.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం 1894లో మైసూర్ రాష్ట్రం ఓ చట్టాన్ని రూపొందించి ఎనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికల వివాహాలపై నిషేధం విధించింది.

ఇండోర్ సామ్రాజ్యంలో 1918లో అమ్మాయిలకు 12 ఏళ్లు, అబ్బాయిలకు 14 ఏళ్లను కనీస వివాహ వయసుగా నిర్ణయించారు. కానీ, ఒక సమగ్ర చట్టం కోసం పోరాటం జరుగుతూనే ఉంది.

1927లో రాయ్ సాహెబ్ హర్బిలాస్ సారదా బాల్య వివాహాలను నిరోధించాలన్న అభ్యర్థనను చేశారు. కనీస వివాహ వయసు అమ్మాయిలకు 14 ఏళ్లు, అబ్బాయిలకు 18 ఏళ్లుగా ఉండాలని అందులో ప్రతిపాదించారు. 1929లో ఇది చట్టంగా మారింది.

1978లో దీనికి సవరణ చేసి, కనీస వివాహ వయసును అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. కానీ, బాల్య వివాహాలు ఆగలేదు. దీంతో 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని కొత్తగా తెచ్చారు. ఇందులో బాల్య వివాహాన్ని నేరంగా ప్రకటించారు.

యునెస్కో లెక్కల ప్రకారం బాల్య వివాహ బాధిత మహిళల్లో మూడింట ఒకవంతు మంది భారత్‌లోనే ఉంటున్నారు.

Image copyright EPA

2015-16లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం అప్పుడు దేశంలో 20-24 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 26.8 శాతం మందికి 18 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది. 25-29 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఇది 20.4 శాతం మందికి 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నప్పుడు వివాహమైంది.

ఆయా రాష్ట్రాల్లోని మహిళల జనాభాను చూస్తే, పశ్చిమ బెంగాల్‌లో 40.7 శాతం, బిహార్‌లో 39.1 శాతం, ఝార్ఖండ్‌లో 38 శాతం, రాజస్తాన్‌లో 35.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 30 శాతం, మహారాష్ట్రలో 25.1 శాతం మంది 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నప్పుడు పెళ్లైనవారు ఉన్నారు.

బాల్య వివాహాన్ని యునైటెడ్ పాపులేషన్ ఫండ్ సంస్థ మానవహక్కుల ఉల్లంఘన అనే చెబుతోంది.

అమ్మాయిల వివాహ వయసును శారీరకంగా వారిలో వచ్చే మార్పులతోనే ముడిపెట్టి చాలా మతాలు చూస్తున్నాయి. రజస్వల అయిన వెంటనే అమ్మాయి పెళ్లి గురించి చాలా కుటుంబాల్లో ధ్యాస మొదలవుతుంది.

బాలికలను 'భారం'గా భావించడం, వాళ్ల భద్రత గురించిన భయాలు, 'తప్పుదోవ' పడతారన్న అనుమానం, కట్నం, పేదరికం, బాలికల చదువులేమి ఇవన్నీ అమ్మాయిలకు బాల్యంలోనే పెళ్లిల్లు జరగుతుండటం వెనుకున్న కారణాలు.

అందుకే, చాలా మల్లగుల్లాల తర్వాత చట్టంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు కనీస వివాహ వయసులో అంతరం పెట్టారు. ఈ తేడా వల్ల బాల్యంలోనే అమ్మాయిల వివాహాలు జరిగే అవకాశాలు తగ్గిపోయే ఆస్కారముంది.

Image copyright AFP

బిహార్‌లోని ఓ గ్రామానికి వెళ్లినప్పుడు ఈ విషయం గురించి నేను కొంతమందితో మాట్లాడా.

''అమ్మాయి వయసులో పెద్దదైతే అబ్బాయి పెత్తనం నడవదు. ఒక వేళ పెళ్లి చేయడం ఆలస్యం చేస్తే అమ్మాయిలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదని తల్లిదండ్రులను ఇరుగుపొరుగువారు, చుట్టాలు అడుగుతుంటారు'' అని అక్కడివాళ్లు నాతో అన్నారు.

వయసులో సమానంగా అంటే అన్ని విషయాల్లోనూ మహిళ సమానత్వం కోరుకుంటుంది. అదే తమకన్నా తక్కువ వయసున్న భార్య అయితే, చెప్పిన మాట వింటుంది. భయం, భక్తి చూపుతుంది.

అందుకే మగవాళ్లు తమకన్నా తక్కువ వయసున్నవారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు.

భారత లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతిపై ఇచ్చిన ఓ నివేదికలో వివాహ వయసు గురించి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

మేజర్ అయ్యే వయసు బాలబాలికలకు ఒకటే అయినప్పుడు, వివాహ వయసు కూడా ఒకే విధంగా ఉండాలని అభిప్రాయపడింది.

Image copyright Getty Images

ఓటు వేసి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం పౌరులకు 18 ఏళ్లకే వస్తున్నప్పుడు, తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం ఎందుకు ఉండకూడదు. పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకునే హక్కు యువతీ యువకులు సమాన వయసులో ఎందుకు రాకూడదు.

చట్ట ప్రకారం వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రతి విషయంలో సమానమే. కానీ, వయసు అంతరం ఇందులో అసమానతను సృష్టించడమే. కనీసం చట్టపరంగానైనా దీన్ని తొలగించాలి.

18 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా, అది త్వరగా వివాహం చేసుకోవడమే అవుతుంది. త్వరగా పెళ్లి చేసుకుంటే, త్వరగా పిల్లలు పుడతారు. అమ్మాయిలపై కొత్త బాధ్యతలు వస్తాయి. జీవితంలో ఎదిగే అవకాశాలు తగ్గుతాయి.

అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో కోర్టు లా కమిషన్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు