''రాజధానిగా అమరావతి ఉండదు.. 4 రాజధానులు వస్తాయి'' - టీజీ వెంకటేశ్ : ప్రెస్‌ రివ్యూ

  • 26 ఆగస్టు 2019
అమరావతి Image copyright ccdmc.co.in

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తొలగించే అంశంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్టానంతో చర్చించారని బీజేపీ రాస్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ వెల్లడించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం ఆదివారం కర్నూలులో 'ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి'తో ప్రత్యేకంగా మాట్లాడిన టీజీ.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి దిల్లీ వెళ్లినపుడే బీజేపీ పెద్దలతో దీనిపై మాట్లాడారని.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు తనకు చెప్పారని తెలిపారు. అయితే ఆ నాయకుడి పేరును బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదన్నారు.

రాష్ట్రాన్ని నాలుగు ప్రణాళికాబోర్డులుగా విభజించి, నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని.. అందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురు డిప్యూటీ సీఎంలను జగన్‌ నియమించుకున్నారని తెలిపారు.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు విజయనగరం బోర్డులో, ఉభయగోదావరి-కృష్ణా జిల్లాలు (ఇప్పుడున్న అమరావతి సహా) కాకినాడ బోర్డులో, గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాలు గుంటూరు బోర్డులో, రాయలసీమ 4 జిల్లాలు కడప బోర్డులో ఉంటాయని టీజీ చెప్పారు.

ఈ నాలుగు చోట్ల అసెంబ్లీ భవనాలు కట్టవచ్చని, సీఎం జగన్‌ ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని అన్నారు. అసెంబ్లీ అంటే కన్వెన్షన్‌ హాలులా కట్టవచ్చని.. అది రూ. 20 కోట్లతో కావచ్చు.. రూ. 2,000 కోట్లతో కావచ్చు.. అని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో మట్టి అంటించుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్నారు.

''బీజేపీతో విషయాలు చెప్పినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కాదు. అంతా కేంద్రం చెప్పినట్లే చేస్తున్నామనడం కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ మాట్లాడినట్లుగా ఉంది'' అని ఎద్దేవా చేశారు.

రాజధాని మార్పు ప్రకటనతో ఆ ప్రాంత రైతులంతా బీజేపీ నేతలను సంప్రదిస్తున్నారని.. దీనిపై కేంద్రం ఇప్పుడే స్పందించదని చెప్పారు. రాజధానిని మార్చాలని భావించినప్పుడు జగన్‌ ప్రజలతో ముందుగా చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చేది కేంద్రమేనని.. అందుకే అందుకే రీ టెండర్లపై కచ్చితంగా దానిని సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిరంతరం అధికారంలో కొనసాగాలని ఆలోచిస్తారని, ఆ ఎజెండాలో ఎవరు బలైనా లెక్కచేయరని టీజీ అన్నారు. చంద్రబాబు, వైఎస్‌, సోనియాగాంధీ.. ఇలా చాలా మంది నేతలు ఆయన్ను నమ్మి చేతులు కాల్చుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను జగన్‌ ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మితే మంచిది. లేనిపక్షంలో కరెంటు దీపం ఆకర్షణకు లోనైన పురుగులా మాడిపోవలసిందే అని వ్యాఖ్యానించారు.

ఇక 9వ తరగతి నుంచి 'కృత్రిమ మేధ' బోధన

మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) 'కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)’ను ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. యోగా, శిశు విద్య అనే వాటిని కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో 'కృత్రిమ మేథ'ను తీసుకుంటే పదో తరగతిలో కూడా దాన్నే ఎంచుకోవాలి. తప్పనిసరి సబ్జెక్టులు అయిదు ఉంటాయి. ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు.

అలాగే.. గణితం అంటే భయపడేవారికి ఊరటనిస్తూ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో రెండు రకాల గణితం ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. గణితం అంటే ఆసక్తి లేనివారు, పదో తరగతి తర్వాత గణితం సబ్జెక్టు లేని విద్యను చదువుకోవాలనుకున్న వారు సులభంగా ఉండే (బేసిక్‌ లెవెల్‌) ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. మిగిలిన వారు ప్రామాణిక ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు.

వార్షిక పరీక్షలో బేసిక్‌ స్థాయి పరీక్ష రాసి.. మళ్లీ ప్రామాణిక స్థాయి రాయాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చు. ఒకవేళ ప్రామాణిక స్థాయి పరీక్షలో తప్పిన వారు.. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రాథమిక స్థాయి పరీక్ష రాసి ఇంటర్‌ విద్యలోకి ప్రవేశించవచ్చు. అయితే వారు గణితం సబ్జెక్టు ఉన్న గ్రూపులో చేరటం కుదరదు.

పదో తరగతి గణితం సిలబస్‌ అందరికీ ఒకటే.. తరగతి గదిలో ఒకేలా బోధిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న దాన్ని బట్టి ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.

Image copyright Thinkstock

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న టీబీ.. టీనేజీ యువతపై పంజా..

తెలంగాణ రాష్ట్రంలో ట్యూబరిక్లోసిస్‌ (టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోందని.. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ బాధితులు, చిన్నారుల్లోనే కాదు, టీనేజీ అమ్మాయిల్లోనూ ఇది వెలుగుచూస్తోందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. జనసమూహం ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, పోటీ పరీక్షల పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి తోడు అవసరమైన స్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో రోగ నిరోధకశక్తి తగ్గుతోంది.

మరి కొంతమంది ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో కాలేజీకి బయలుదేరి, మధ్యాహ్నం క్యాంటీన్లో రెడీమేడ్‌ ఫుడ్‌తో కడుపు నింపుకోవడం వల్ల పౌష్టికాహారలోపం ఏర్పడుతోంది. దీంతో చాలామంది టీబీ బారిన పడుతున్నారు.

బంధువర్గాల్లో తెలిస్తే వివాహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి, గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నారు. రోగుల వివరాల నమోదుకు ప్రైవేటు ఆసుపత్రులు సహకరించడంలేదు.

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2015లో ఆస్పత్రికి చికిత్స కోసం 80 వేలమంది రాగా.. 2018లో 1.72 లక్షల మందికి పెరిగింది. వీరిలో 20 శాతానికి మించి టీనేజీ యువత ఉన్నారు.

దేశంలో ఏటా మూడు లక్షల మంది ప్రజలు టీబీతో చనిపోతున్నారు. ప్రతిరోగి చనిపోవటానికి ముందు ఆ వ్యక్తి నుంచి మరో 15 మందికి వ్యాపిస్తోంది. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

టీబీ లక్షణాల్లో.. సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం ఉంటాయి. ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతీలో నొప్పి ఉంటుంది.

తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆరు నుంచి తొమ్మిది మాసాలపాటు మందులు వాడాలి. బలవర్థకమైన ప్రొటీన్లతో కూడిన గుడ్లు, పప్పు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి.

బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి.

Image copyright Reuters

శంషాబాద్ ఎయిర్‌పోర్టు బాత్‌రూంలో రూ. 1.11 కోట్ల బంగారం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం భారీగా బంగారం పట్టుకున్నారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు.. షార్జా నుంచి 6ఈ1406 విమానంలో హైదరాబాద్ వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగా రం తరలిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు.

విషయం తెలిసిన సాజిద్ బంగారాన్ని విమానాశ్రయంలోని బాత్‌రూంలో పడేశాడు. అనంతరం తనిఖీలో అతని వద్ద బంగారం లభించకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో బాత్‌రూంలో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. రూ.1,11,60,160 విలువచేసే 2,992 గ్రాముల బరువున్న 26 బంగారం బిస్కెట్ల ప్యాకెట్‌ను బాత్‌రూం నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ సాజిద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?