మోదీ ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?

  • 28 ఆగస్టు 2019
రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్

ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.76 లక్షల కోట్ల రూపాయల (24.4 బిలియన్ డాలర్లు) డివిడెండు, అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయిస్తామని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది.

రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి ఏటా నిధులు బదలాయిస్తుంది. నోట్ల ముద్రణ, నాణేల తయారీ, పెట్టుబడులపై లాభాలతో రిజర్వు బ్యాంకు వద్ద సాధారణంగా అదనపు నగదు ఉంటుంది. తన అవసరాలు తీరిన తర్వాత, మిగులు నిధులను ఆర్‌బీఐ ప్రభుత్వానికి బదలాయిస్తుంది.

ప్రభుత్వానికి గత ఏడాది ఇచ్చిన నగదుతో పోలిస్తే ఈ ఏడాది పంపుతున్న నగదు రెట్టింపు కన్నా ఎక్కువ.

Image copyright Getty Images

ఆర్‌బీఐకు అంత మిగులు ఎలా వచ్చింది?

ఈసారి తనకు అంత మిగులు ఎలా వచ్చిందో ఆర్‌బీఐ వెల్లడించలేదు.

కొన్నిసార్లు ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్‌బీఐ మార్కెట్లో జోక్యం చేసుకొంటుంది.

ప్రభుత్వ బాండ్లను రిజర్వు బ్యాంకు పెద్దయెత్తున కొనుగోలు చేసింది. అధిక ఆదాయం వీటిపై వడ్డీ రూపంలో వచ్చి ఉండొచ్చు.

Image copyright Getty Images

ఈ బదలాయింపు ప్రాధాన్యం ఏమిటి?

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇచ్చే ఈ నగదు ఉపయోగపడుతుంది.

ఈసారి వృద్ధిరేటు ఐదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది.

వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గిపోయింది. ఆటోమొబైల్, ఇతర పరిశ్రమల్లో లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారనే వార్తలు వస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేలా చేసేందుకు ఆగస్టు 24న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ చర్యలు ప్రకటించారు.

ఈ చర్యలు పెద్దగా ఫలితాలు ఇవ్వవని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆర్‌బీఐ నగదు బదలాయింపు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఆర్‌బీఐ నగదు బదలాయింపు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.

భారతీయ బాండ్లు కూడా మూడు వారాల అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

ప్రభుత్వానికి ఖర్చు చేయడానికి అవసరమైన నిధులు సమకూరాయనే నమ్మకం మార్కెట్లలో ఏర్పడింది.

ఈ నిధులను దేనికి వినియోగిస్తారు?

రిజర్వు బ్యాంకు బదలాయించే నిధులను దేనికి ఉపయోగిస్తామనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు.

ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలను ఆదుకోవడం మొదలుకొని, పన్నుల తగ్గింపు, రుణభారం తగ్గించుకోవడం, గృహనిర్మాణ రంగానికి సంబంధించిన ఆర్థిక సంస్థలకు మరిన్ని నిధులు సమకూర్చడం వరకు అనేక అవసరాలకు ప్రభుత్వం ఈ నిధులను వినియోగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చిత్రం శీర్షిక వివిధ పరిశ్రమల్లో లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారనే వార్తలు వస్తున్నాయి.

"ఎదుగుతున్న ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ రుణభారం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకొనేందుకు ఉపయోగించాలి" అని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్‌ఐపీఎఫ్‌పీ)' ఫెలో రాధికా పాండే చెప్పారు.

2014-25లోగా భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే కీలకమైన మౌలిక సదుపాయాల రంగానికి నిధులు సమకూర్చేందుకు ఈ సొమ్ములో కొంత భాగాన్ని ప్రభుత్వం కేటాయించొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

విమర్శలు ఏమిటి?

ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చర్యను తప్పుబట్టింది.

ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి దేశంలో ఆర్థిక విపత్తును సృష్టించారని, దీనిని ఎలా పరిష్కరించాలో వారికి తెలియడం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రిజర్వు బ్యాంకు సొమ్మును తస్కరిస్తే సమస్య పరిష్కారమైపోదని వ్యాఖ్యానించారు. తూటా తగలడం వల్ల అయిన గాయానికి డిస్పెన్సరీలోకి వెళ్లి బ్యాండ్-ఎయిడ్ దొంగిలించుకొని వచ్చిన విధంగా ఈ చర్య ఉందని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉర్జిత్ పటేల్

రిజర్వు బ్యాంకు అపరిమిత స్థాయిలో నగదును దగ్గర పెట్టుకొంటోందని ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది.

ఎక్కువ మొత్తంలో నిధులు బదలాయించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడివల్లే 2018 డిసెంబరులో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారనే భావన ఉంది.

తాను చెప్పినట్లు చేసేలా రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం ఇప్పుడు సఫలీకృతమైందని కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

భారత ఆర్థిక సమస్యలకు ఇది సమగ్ర పరిష్కారం కాదని నిపుణులు అంగీకరిస్తున్నారు.

ఈ బదలాయింపుతో దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పై పెద్ద ప్రభావమేమీ ఉండదని యెస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ శుభదా రావ్ చెప్పారు. ప్రభుత్వం వ్యయాలను గణనీయంగా తగ్గించుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

నిలిచిపోయిన కొన్ని చెల్లింపులను సత్వరం జరిపేందుకు ప్రభుత్వానికి ఈ నిధులు ఉపయోగపడొచ్చని ఆమె తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం సాఫీగా మారొచ్చని, తద్వారా తక్కువ వ్యయాలతో ఎక్కువ లాభాలు పొందవచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)