డెబిట్ కార్డులు తగ్గిపోతున్నాయ్.. కారణం తెలుసా

  • 29 ఆగస్టు 2019
Image copyright Getty Images

డెబిట్ కార్డులు కనుమరుగు కానున్నాయా? ముందుముందు వాటి అవసరమే ఉండదా? కార్డుల అవసరమే లేనట్లుగా బ్యాంకులు నగదు లావాదేవీల తీరును సమూలంగా మార్చేయబోతున్నాయా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఎస్బీఐ డెబిట్ కార్డులు అవసరం లేకుండా బ్యాంక్ డిజిటల్ పేమెంట్ యాప్‌తోనే అన్ని రకాల ట్రాంజాక్షన్లు పూర్తయ్యేలా చూస్తామని ఆయన అన్నారు.

ప్రధానంగా ఎస్బీఐ తన యోనో యాప్ ద్వారా, యోనో క్యాష్ పాయింట్ల ద్వారా డెబిట్ కార్డుల అవసరం లేకుండా చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలో 68,000 యోనో క్యాష్ పాయింట్లున్నాయి.

వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల యోనో క్యాష్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నది ఎస్బీఐ లక్ష్యం. ఈ క్యాష్ పాయింట్లలో డెబిట్ కార్డు అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు, పేమెంట్లు కూడా జరపొచ్చు. ఇలాంటి క్యాష్ పాయింట్లు విరివిగా ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల్లేకుండా చేస్తామంటున్నారు ఎస్బీఐ చైర్మన్.

నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సైతం రెండేళ్ల కిందటే ఈ మాట చెప్పారు. డెబిట్, క్రెడిట్ కార్డులు... ఏటీఎంలు నాలుగైదేళ్లలో కనుమరుగవుతాయని ఆయన పలుమార్లు చెప్పారు. భవిష్యత్‌లో ఆర్థిక లావాదేవీలకు ప్రజలు మొబైల్ ఫోన్లే వాడుతారని చెబుతూవస్తున్నారాయన.

Image copyright Getty Images

ఇప్పటికే తగ్గిన డెబిట్ కార్డులు, వినియోగం

గత పది నెలలుగా దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

2019 జూన్ నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 83,68,92,047 డెబిట్ కార్డులు ఉండగా.. ఈ కార్డులు వినియోగించి ఏటీఎంల్లో 78,78,84,063... పీవోఎస్‌ల్లో 40,73,76,249 లావాదేవీలు జరిగాయి. డెబిట్ కార్డులతో ఏటీఎంలలో రూ.2,83,403 కోట్లు.. పీఓఎస్‌ల ద్వారా రూ. 57,042 కోట్ల మొత్తంలో లావాదేవీలు జరిగాయి.

అత్యధికంగా 2018 అక్టోబరులో దేశంలో 99,71,05,700 డెబిట్ కార్డులు ఉండేవి. దీంతో డెబిట్ కార్డుల సంఖ్య 100 కోట్లు దాటుతుందని అంచనా వేసినా ఆ తరువాత నెల నుంచి క్రమంగా తగ్గనారంభించాయి.

ఆ ఏడాది నవంబరులో 99,25,63,471కి.. డిసెంబరులో 958150285కి తగ్గిపోయాయి.

2019లో తగ్గుదల ఇలా
నెల దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య
జనవరి 93,12,61,931
*ఫిబ్రవరి 94,45,45,934
మార్చి 92,46,30,309
ఏప్రిల్ 88,47,75,739
మే 82,49,33,507
జూన్ 83,68,92,047

అక్టోబరు 2018 నుంచి జూన్ 2019 మధ్య 16 లక్షల డెబిట్ కార్డులు తగ్గాయి.

గత దశాబ్ద కాలంలో
సంవత్సరం(ఏప్రిల్‌లో గణాంకాలు) దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య
2011 23,02,56,833
2012 45,26,14,082
2013 47,34,18,167
*2014 39,96,52,017
2015 56,47,07,913
2016 67,11,87,187
2017 78,07,95,417
2018 90,63,56,781

జన్‌ధన్ ఖాతాలతో..

నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక 2014 ఆగస్టు 28న 'ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన'(పీఎంజేడీవై) ప్రారంభించారు.

దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకంలో అన్ని బ్యాంకులను భాగస్వాములను చేస్తూ జన్‌ధన్ ఖాతాలు ప్రారంభింపజేశారు.

ఈ పథకంలో ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు డెబిట్ కార్డులు జారీ చేశాయి.

Image copyright Getty Images

నోట్ల రద్దుతో..

ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత నగదు లభ్యత తగ్గిపోయింది. దాంతో నగదు రహిత లావాదేవీల అవసరం అందరికీ ఏర్పడింది.

అది కూడా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ పేమెంట్లతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని, అవసరాన్నీ పెంచింది.

అప్పటి నుంచి దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య, వినియోగం మరింతగా పెరిగింది.

2018 అక్టోబరు నాటికి దేశంలో ఏకంగా 99,71,05,700 డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఇదే అత్యధికం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డెబిట్, క్రెడిట్ కార్డులు

ఎందుకు తగ్గుతున్నాయి

అనంతర కాలంలో బ్యాంకులు పాత కార్డుల స్థానంలో 'సెక్యూరిటీ చిప్' ఉన్న కొత్త కార్డులు తీసుకోవాలని కోరడం.. వాటిని చాలామంది తీసుకోకపోవడం.. వ్యాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ పెరగడంతో డెబిట్ కార్డు అవసరం చాలామందికి తగ్గడంతో కొత్తగా కార్డులు తీసుకోవడం తగ్గింది. అది డెబిట్ కార్డుల సంఖ్యలో తగ్గుదలకు కారణమైంది.

Image copyright Getty Images

ఇతర దేశాల్లో ఎలా ఉంది(2017 గణాంకాల ప్రకారం )

భారత్‌లో 2017 చివరి నాటికి 84 కోట్ల డెబిట్ కార్డులు, 3.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆ ఏడాది దేశంలో తలసరి కార్డుల(డెబిట్+క్రెడిట్) సంఖ్య 0.7గా నమోదైంది. సగటున 18.3 నగదు రహిత లావాదేవీలు నమోదయ్యాయి.

దేశం తలసరి కార్డులు(డెబిట్+క్రెడిట్) తలసరి సగటు నగదు రహిత లావాదేవీల సంఖ్య
దక్షిణకొరియా 5.1 499.9
చైనా 4.9 96.3
అమెరికా 4.2 473.4
జపాన్ 3.5 -
కెనడా 2.9 366.7
ఆస్ట్రేలియా 2.8 497.2
బ్రిటన్ 2.5 410.9
భారత్ 0.7 18.3

నగదు రహితం ఇంకెంత దూరం..

నగదు రహిత లావాదేవీలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా ఇంకా నగదు ఆధారిత లావాదేవీలదే సింహభాగంగా ఉంది.

వరల్డ్ పేమెంట్స్ రిపోర్ట్-2018 ప్రకారం 2012-16 మధ్య ప్రపంచంలో నగదు రహిత లావాదేవీల సంచిత వార్షిక వృద్ధిరేటు(సీఏజీఆర్) 9.8 శాతంగా ఉంది.

భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2010-11లో దేశంలో సగటు తలసరి డిజిటల్ పేమెంట్ల విలువ సుమారు రూ.100 ఉండగా 2014-15 నాటికి అది రూ.450కి చేరింది. 2018-19 నాటికి అది రూ.2,100కి చేరింది.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ చౌకగా, మరింతగా అందుబాటులోకి రావడం.. తలసరి ఆదాయం, విద్యాస్థాయి, ప్రైవేటు రంగంలోకి నిధులు పెరగడం.. ద్రవ్యోల్బణం తగ్గడం వంటివన్నీ డిజిటల్ పేమెంట్లు క్రమంగా వృద్ధి చెందడానికి కారణమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 2019 ఆగస్టు బులెటిన్‌లో సూత్రీకరించింది.

Image copyright Getty Images

అయితే, సమీప భవిష్యత్తులో డెబిట్ కార్డులు పూర్తిగా కనుమరుగై మొత్తం ఆన్‌లైన్ లావాదేవీలే సాధ్యం కావడం కష్టమేనని బ్యాంకింగ్ రంగానికి చెందినవారు, సాంకేతికరంగానికి చెందినవారు అభిప్రాయపడుతున్నారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు, డిజిటల్ లిటరసీపరంగా మనకంటే ముందున్న దేశాల్లో కూడా కార్డుల వినియోగం పూర్తిగా తగ్గిపోలేదని.. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రజల్లో డిజిటల్ లిటరసీ ఇంకా తక్కువగానే ఉన్నందున పూర్తిగా 100 శాతం డిజిటల్ పేమెంట్లు అయిదేళ్లలో సాధ్యం కాదని కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు జ్ఞానతేజ నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ప్రస్తుత ఆర్థిక సాంకేతికలకు అలవాటుపడుతున్నారని.. ఇలాంటి సమయంలో మళ్లీ వారు కొత్తగా వచ్చే మార్పులకు అలవాటుపడాల్సి రావడం కొంత ఇబ్బందికరమేనని ‘బీబీసీ’తో ఆయన అన్నారు.

''భారత్‌లో నగదు, బ్యాంకు కార్డుల వినియోగం ఇంకా విరివిగానే ఉందని.. వీటితో పోల్చితే డిజిటల్ పేమెంట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా పనిచేసే జి.రమణ 'బీబీసీ'తో అన్నారు.

''బ్యాంకు ఇలాంటి లక్ష్యం ఏర్పరుచుకున్నప్పుడు దాన్ని సాధించేందుకు ఉద్యోగులుగా తాము 100 శాతం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లున్నా ముందుకు సాగుతాం'' అన్నారాయన.

(ఆధారం: బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై విచారణ కమిషన్: నిందితులు పిస్టల్ లాక్కొని దాడికి దిగినా పోలీసులు గాయపడలేదా: సీజేఐ ప్రశ్న

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత