ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొన్ని నెలల క్రితమే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు మరో 10 బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆ పది బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పునాదులు వేసుకుని, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలు ఉన్న ఆంధ్రా బ్యాంకు కూడా ఉంది. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
అంటే, ఈ విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగు కానుంది.
రూ.లక్షతో ప్రారంభమై ఆంధ్రాబ్యాంకు
తెలుగు నేలపై పురుడుపోసుకున్న ఏకైక జాతీయ బ్యాంకు ఆంధ్రాబ్యాంకు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) ప్రధాన కేంద్రంగా స్థాపించారు.
1923 నవంబర్ 20న ఈ బ్యాంకు పేరు రిజిస్టర్ అయింది. లక్ష రూపాయల మూలధనం, రూ. 10 లక్షల అధీకృత మూలధనం (ఆథరైజ్డ్ క్యాపిటల్)తో 1923 నవంబర్ 28న కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయ చేసినప్పుడు ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్యాంచ్‌లు, 76 ఎక్స్టెన్షన్ కౌంటర్లు ఉండేవి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉన్నాయి. 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు (30.09.2018 నాటికి). హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- నిర్మలాసీతారామన్: ఆంధ్రాబ్యాంక్ ఇక కనుమరుగు.. అయిదేళ్ల కనిష్ఠానికి జీడీపీ
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
లోగో ప్రత్యేకతలు:
ఆంధ్రాబ్యాంకు లోగోలో పెద్ద ఇన్ఫినిటీ ( అనంతం ) చిహ్నం ఉంటుంది. అది వినియోగదారుల కోసం ఏ పని చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం అనే అనే సందేశాన్ని సూచిస్తుంది.
గొలుసు మాదిరిగా కనిపించే తమ లోగో ఐక్యతను సూచిస్తుందని, ఎరుపు, నీలం రంగులు చైతన్యాన్ని, దృఢత్వాన్ని సూచిస్తాయని ఆంధ్రాబ్యాంకు తన వెబ్సైట్లో పేర్కొంది.
వ్యవస్థాపకుడు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో (అప్పట్లో కృష్ణా జిల్లాలో ఉండేది) 1880 నవంబర్ 24న అతి సామాన్య కుటుంబంలో డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు.
ఉపకార వేతనాలతోనే ఆయన ఉన్నత చదువులు అభ్యసించారు. 1901లో మద్రాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం (బందరు)లో వైద్యుడిగా ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు.
అలా... లక్ష రూపాయలు పోగుచేసి 1923 నవంబర్ 20న ఆయన ఆంధ్రాబ్యాంకును స్థాపించారు.
ఆంధ్రాబ్యాంకుతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు.
మహాత్మా గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీతో కలిసి అనేక కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషించారు. గాంధీ చేపట్టిన సత్యాగ్రహం ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
పట్టాభి సీతారామయ్య స్వయంగా రచయిత. 'జన్మభూమి' అనే పత్రికను ఆయన నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను ప్రామాణికంగా అక్షరబద్ధం చేసిన తొలివ్యక్తి కూడా ఆయనే.
1928లో ఏర్పాటు చేసిన భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సంఘానికి ఆయన అధ్యక్షులుగా పనిచేశారు.
స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. 1948లో జరిగిన సదస్సులో పట్టాభిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
1952 నుంచి 1957 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. 79 ఏళ్ల వయసులో 1959 డిసెంబర్ 17న కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి:
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- 41 లక్షల మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్ఆర్సీ ఏంటి?
- కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ
- మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- డెబిట్ కార్డులు, ఏటీఎంలు త్వరలో కనిపించకుండా పోతాయా...
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- భారతదేశ ఉత్పత్తులు బహిష్కరించాలంటూ పాక్ సోషల్ మీడియా ప్రచారం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)