ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు? - సోషల్

  • 31 ఆగస్టు 2019
ప్రభాస్ పవన్ కల్యాణ్, లార్గో వించ్ Image copyright Saaho/Agnyaathavaasi/LargoWinch

బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినీ స్టార్ ప్రభాస్.. సాహో చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ సహా నాలుగు భాషల్లో విడుదలైంది.

రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించామని చెబుతూ, 'ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్'గా ఈ సినిమా గురించి మేకర్స్ ప్రచారం నిర్వహించారు.

దీనికి తోడు బాహుబాలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరిచారు. చిత్ర బృందం కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించింది.

దీనికి తగ్గట్లే చాలా చోట్ల సినీ ప్రేక్షకుల హంగామా నడుమ సాహో థియేటర్లలోకి వచ్చింది.

అయితే, శుక్రవారం ప్రదర్శనలు మొదలయ్యాక సినిమా చూసినవారి నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

కొందరేమో సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడితే, ఇంకొందరు అస్సలు బాగోలేదని వ్యాఖ్యలు చేశారు.

చిన్న వయసులోనే సుజీత్ డైరెక్షన్ అదరగొట్టాడని కొందరంటే, అనుభవలేమి ఫలితం స్పష్టంగా కనిపించిందని ఇంకొందరు పోస్ట్‌లు పెట్టారు. సినిమాకు ప్రభాస్ ప్లస్ అని కొందరు, సినిమాలో అతడిని సరిగ్గా వాడుకోలేదని మరికొందరు.. ఇలా రకరకాల కామెంట్లు కనిపించాయి.

అయితే.. ప్రభాస్, సుజీత్ కాకుండా ఈ సినిమాతో సంబంధం లేని ఓ వ్యక్తి కూడా సోషల్ మీడియాలో చర్చలకు కేంద్రమయ్యాడు.

అతడే జెరోమ్ సాలే. అతడెవరో పరిచయం లేదా? 'లార్గో వించ్'.. ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా?

Image copyright twitter/haarikahassine

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2018లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

పవన్ సినీ కెరీర్‌లో ప్రస్తుతానికి ఆఖరి చిత్రమైన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఫ్లాప్‌ అయ్యింది.

అయితే, తన సినిమానే కాపీ కొట్టి అజ్ఞాతవాసి తీశారంటూ అప్పుడు ఓ ఫ్రెంచ్ డైరెక్టర్ ట్విటర్‌లో ఆవేదన వెళ్లగక్కాడు. అతడే జెరోమ్ సాలే. అతడు తీసిన సినిమానే 'లార్గో వించ్'.

రెండు సినిమాలూ చూసినవారిలో చాలా మంది కూడా ఆ సినిమాకు, ఈ సినిమాకు పోలికలు ఉన్నాయనే అన్నారు.

అజ్ఞాతవాసి నిర్మాతలపై తాను న్యాయపోరాటం చేస్తానని కూడా జెరోమ్ అన్నాడు.

అయితే, అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత అతడి స్పందన పెద్దగా కనిపించలేదు.

Image copyright pan-europeenne.com

మళ్లీ సాహోతో..

ఇప్పుడు సాహోతో మరోసారి జెరోమ్ సలే తెరపైకి వచ్చాడు.

సాహో సినిమా కూడా అజ్ఞాతవాసిలాగే ఉందంటూ కొందరు ట్విటర్లో పోస్ట్‌లు పెట్టారు.

ఇంకొందరు లార్గో వించ్‌ను, జెరోమ్ సాలేను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో ట్విటర్‌లో #LargoWinch హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది.

దీని గురించి ఓ వెబ్‌సైట్ రాసిన కథనాన్ని జెరోమ్ సాలే ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

'భారత్‌లో నాకు మంచి కెరీర్ ఉంటుందేమో' అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి తెలుగు సినీ ప్రేక్షకులు స్పందించడం మొదలుపెట్టారు. కొందరు మీమ్స్‌తో తమ రియాక్షన్ చెబుతూ నవ్వులు పూయించారు.

లార్గో వించ్ కాపీలని చెబుతున్న రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయని, భారత్‌కు వచ్చే ధైర్యం ఇప్పుడప్పుడే చేయొద్దని జెరోమ్ సాలేకు ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు' సినిమాలోని 'పూల కుండీని ఎందుకు తన్నావురా' డైలాగ్‌ను గుర్తు చేస్తూ మరొకాయన 'నవ్వు అసలు లార్గో వించ్‌ ఎందుకు తీశావురా' అంటూ నిలదీశాడు.

లార్గో వించ్ సినిమానే ఫ్లాప్ అని.. అజ్ఞాతవాసి, సాహోలకు జెరోమ్ శని తగిలినట్లుందని ఇంకో వ్యక్తి కాస్త పరుషంగానే కామెంట్ చేశాడు.

''అసలు ఏం సినిమా తీశావురా. ఇన్ని రకాలుగా తీస్తున్నారు. ఒకడోమో కామెడీగా తీస్తే, ఇంకొకడు యాక్షన్ సినిమాగా తీశాడు. రేపు ఇంకొకడు రెండు కలిపి తీస్తాడు చూస్కో' అని సుధీర్ అనే ఆయన ట్వీట్ పెట్టాడు.

''అస్సలు ఆ కళాఖండం నవ్వు తీయడమేంది.. మా వాళ్లకి నచ్చడమేంది మా కర్మ కాకపోతేను'' అని ఇంకో తెలుగు సినీ అభిమాని నిట్టూర్చాడు.

జెరోమ్ సాలే నానాయాగీ చేస్తున్నాడని, లార్గో వించ్ రాకముందు కూడా అలాంటి కథతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయని మరో వ్యక్తి విమర్శించాడు.

ఆల్వేస్ లక్ష్మణ్ అనే పేరున్న ట్విటర్ యూజర్ ‘వీడురా డైరెక్టర్ అంటే.. అసలు జెలసీ లేదు’ అంటూ ఒక తెలుగు మూవీ డైలాగ్‌ను ఉటంకిస్తూ జెరోమ్ సాలే ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

Image copyright twitter/UV_Creations

'దుష్ప్రచారాన్ని నమ్మొద్దు'

సాహో చిత్రం బాగా లేదని కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని కొందరు ట్వీట్లు చేశారు.

సినిమా అద్భుతంగా ఉందని, దుష్ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని సూరజ్ పాటిల్ అనే వ్యక్తి ట్వీట్ పెట్టాడు.

''ప్రభాస్ వన్ మ్యాన్ షో. జీబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేశ్, శ్రద్ధా కపూర్ బాగా నటించారు. సుజీత్ విజన్‌కి హ్యాట్సాఫ్'' అంటూ వ్యాఖ్యానించాడు.

విడుదలైన తొలి రోజు సాహో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)