ఎన్‌ఆర్‌సీ జాబితా: ‘భారతీయులు కాదని తేల్చిన’ ఆ 19 లక్షల మంది భవిష్యత్తేమిటి? బంగ్లాదేశ్‌కు పంపిస్తారా

  • 31 ఆగస్టు 2019
‘మా పూర్వీకులు ఈ భూమ్మీదే పుట్టారు. మేం నిజమైన భారత ప్రజలం’ అంటున్నారు గువాహటి సమీపంలోని గోవల్పర జిల్లా ఖుటమరి గ్రామానికి చెందిన 55 ఏళ్ల సాహెబ్ అలీ (ఆగస్టు 29వ తేదీన తీసిన చిత్రం) Image copyright BIJU BORO/AFP/Getty Images
చిత్రం శీర్షిక 'మా పూర్వీకులు ఈ భూమ్మీదే పుట్టారు. మేం నిజమైన భారత ప్రజలం' అంటున్నారు గువాహటి సమీపంలోని గోవల్పర జిల్లా ఖుటమరి గ్రామానికి చెందిన 55 ఏళ్ల సాహెబ్ అలీ

అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాను శనివారం భారత్ విడుదల చేసింది. తమను భారత్ పౌరులుగా గుర్తిస్తారా? లేదా? అని ఆందోళనగా ఎదురుచూస్తున్న 41 లక్షల మంది అస్సాంవాసుల భవితవ్యం దీనిలో ఉంది. వీరిలో దాదాపు 19 లక్షల మంది భారతీయులు కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చి అస్సాంలో స్థిపరడిన వారిని గుర్తించేందుకే ఎన్ఆర్‌సీని సిద్ధం చేసినట్లు భారత్ చెబుతోంది.

అక్రమంగా వలస వచ్చినట్లు అనుమానిస్తున్న వేల మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిని అస్సాంలోని జైళ్లలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాల్లో ఉంచారు.

అసోంలోనే ఎందుకు?

భిన్న తెగలు నివసిస్తున్న ప్రధాన రాష్ట్రాల్లో అస్సాం కూడా ఒకటి. పౌరసత్వం, వ్యక్తిగత ధ్రువీకరణ లాంటి ప్రశ్నలు మొదట్నుంచీ ఇక్కడ వివాదాస్పద మైనవే.

ఇక్కడ బెంగాలీ, అస్సామీ మాట్లాడే హిందువులతోపాటు పెద్ద సంఖ్యలో గిరిజనులుంటారు.

మరోవైపు 3.2 కోట్ల మంది రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా మూడో వంతు వరకూ ఉంటుంది. భారత్ పాలిత కశ్మీర్ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉండేది ఇక్కడే.

ఇక్కడ నివసిస్తున్న ముస్లింలలో చాలా మంది పూర్వీకులు బ్రిటిష్ పాలన కాలంలో వలస వచ్చారు.

కానీ.. ఇప్పటికీ పొరుగునున్న బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసల సమస్య అస్సాంను వెంటాడుతోంది. దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు తమ దేశంలో నివసిస్తున్నట్లు 2016లో భారత్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4000 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది.

ఈ 19 లక్షల మంది భవిష్యత్తు ఏంటి?

ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విదేశీ ట్రిబ్యునల్స్‌తోపాటు సుప్రీం, హైకోర్టులలో వీరు అప్పీలు చేసుకోవచ్చు. దీనికి 120 రోజుల గడువు ఉంటుంది.

అయితే, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న కేసులతో సతమతం అవుతున్న కోర్టులపై సుదీర్ఘ కాలం కొనసాగే ఈ అప్పీల్స్‌తో మరింత భారం పడనుంది.

మరోవైపు కోర్టు కేసులకు సరిపడా నిధులు పోగేసుకునేందుకు పేద ప్రజలు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఒకవేళ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు ఓడిపోతే.. వెంటనే సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు.

ఇదివరకు ఇలా విదేశీ ట్రిబ్యునల్స్‌లో కేసులు ఓడిపోయిన దాదాపు వెయ్యిందిని జైళ్లలోని ఆరు శిబిరాలకు తరలించారు.

అదుపులోకి తీసుకునేవారిని ఉంచేందుకు ప్రత్యేకంగా నిర్బంధ కేంద్రాన్నీ మోదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిలో 3000 మందిని ఉంచొచ్చు.

'జాబితాలో పేర్లులేని వారు తమ భవిష్యత్తు ఏంటోనని ఆందోళన పడుతున్నారు. విదేశీ ట్రిబ్యునల్స్‌కు అంత మంచి పేరు లేదు. వీటి ద్వారా విచారణ ఎదుర్కొనేందుకు చాలా మంది భయపడుతున్నారు'అని అస్సాం: ద అకార్డ్, ద డిస్కార్డ్ పుస్తక రచయిత సంగీత బోరా వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఈ కోర్టులు ఎందుకు వివాదాస్పదమయ్యాయి?

ఈ ప్రత్యేక కోర్టులను 1964లో తొలిసారిగా ఏర్పాటుచేశారు. ఇప్పటివరకూ లక్ష మందిని ఇవి విదేశీయులుగా ప్రకటించాయి. అనుమానిత ఓటర్లు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించేవారిని విదేశీయులుగా గుర్తించడమే వీటి కర్తవ్యం.

అసోంలో ఇలాంటి కోర్టులు దాదాపు 200 ఉన్నాయి. 2014లో భారత్‌లో జాతీయవాద భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వీటిలో చాలావాటిని ఏర్పాటుచేశారు.

అక్టోబరునాటికి ఈ కోర్టుల (విదేశీ ట్రిబ్యునళ్ల) సంఖ్య వెయ్యికి పెరిగే అవకాశముంది.

అయితే, ఈ కోర్టులు నిష్పక్షపాతంతో వ్యవహరిస్తాయని ఆరోపణలున్నాయి. వీటి విధుల్లోనూ పారదర్శకత కొరవడినట్లు చెబుతుంటారు.

ఈ కోర్టుల్లో తాను విదేశీయుణ్ని కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అనుమానిత వ్యక్తిపైనే ఉంటుంది. మరోవైపు చాలా కుటుంబాలు రికార్డులను సరిగా భద్రపరచుకోలేక పోవడం, నిరక్షరాస్యత వల్ల ధ్రువపత్రాలు సమర్పించలేకపోతున్నాయి.

పేర్లలో తప్పులు, వయసులో భేదాలు, అధికారులతో పత్రాల ధ్రువీకరణలో ఇబ్బందులు తదితర కారణాలతో చాలా మందిని విదేశీయులుగా కోర్టులు గుర్తించారు. వీటి పనితీరులో నాణ్యత కొరవడిందని, చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

అక్రమంగా నివాసముంటున్న ముస్లిం వలసదారులను తిప్పి పంపుతామని ఇదివరకు రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం తెలిపింది.

అయితే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొనేందుకు బంగ్లాదేశ్ అంగీకరించకపోవచ్చు.

ప్రస్తుతం జాబితాలో చోటు దక్కనివారికి ప్రభుత్వ పథకాల వర్తింపు, ఆస్తి హక్కులు లాంటివి ఉంటాయా? లేదా అనే విషయంపై స్పష్టతలేదు.

అయితే, శిబిరాల నుంచి విడుదలయిన తర్వాత కొన్ని పరిమిత హక్కులతో పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశముంది. ఓటు హక్కు మాత్రం ఇవ్వకపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు