ఎన్‌ఆర్‌సీ: ‘‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’’ - అస్సాం పౌరసత్వ జాబితాలో పేరు లేని లక్షలాది మంది ఆవేదన

  • 31 ఆగస్టు 2019
అబ్దుల్ హలీం మజుందార్
చిత్రం శీర్షిక అబ్దుల్ హలీం మజుందార్ కుటుంబు సభ్యుల పేర్లు ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేవు

అబ్దుల్ హలీం మజుందార్ దిగ్భ్రాంతితో స్థాణువులా నిలుచుని ఉన్నాడు. అతడి చేతిలో ఒక కాగితం ముక్క వేలాడుతోంది. అతడి వయసు 45 ఏళ్లు. కుటుంబంలో ఐదుగురు సభ్యులు. వారిలో నలుగురి పేర్లు.. అస్సాంలో తాజాగా ప్రచురించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాలో లేవు.

కామరూప్ జిల్లాలోని టుక్దపాద గ్రామంలో ఎన్‌ఆర్‌సీ కేంద్రం దగ్గర నిలబడిపోయిన అతడి దిగ్భ్రాంతిని, భయాన్ని గమనించిన స్థానికులు కొందరు అతడి చుట్టూ చేరారు.

రాత్రి నుంచీ తనను కుంగదీస్తున్న ఆందోళన గురించి చెప్తున్నపుడు అబ్దుల్ స్వరం గద్గదమవుతోంది.

''2017 డిసెంబర్, 2018 జూలైలో ఎన్‌ఆర్‌సీ ముసాయిదాల్లో.. నా భార్య పేరు మినహా నా కుటుంబ సభ్యులందరి పేర్లూ ఉన్నాయి. ఆమె పేరు మీద కేవలం ఒకే ఒక్క అభ్యంతరం ఉండింది. దీంతో ఆమె కోసం మేం ధృవపత్రాలు సమర్పించాం. ఈ రోజు ఉదయం.. భయాందోళనలతో నిద్రలేచాను. నా భార్య గురించే నా భయమంతా. నా గురించి కానీ, నా పిల్లల గురించి కానీ కాదు. ఇప్పుడు.. మా నలుగురినీ తిరస్కరిస్తూ ఎన్‌ఆర్‌సీ లేఖ నా చేతిలో ఉంది. ఏం చేయాలో నాకు తెలియటం లేదు'' అని వివరించాడు.

ఎట్టకేలకు అస్సాంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌సీని ప్రచురించారు. ఈ పౌరసత్వ జాబితాలో తాము ఉన్నామో లేదో చూసుకోవటానికి దరఖాస్తుదారులు తమ సమీపంలో ఉన్న ఎన్‌ఆర్‌సీ కేంద్రాల దగ్గరకు వచ్చారు.

అటువంటి దరఖాస్తుదారుల్లో మొహమ్మద్ ఖాదిమ్ అలీ వయసు 60 సంవత్సరాలు. అతడు సంతోషంతో వెలిగిపోతున్నాడు. తుది ఎన్‌ఆర్‌సీ జాబితాలో అతడి కుటుంబ సభ్యులు ఆరుగురి పేర్లూ ఉన్నాయి. తన ఎన్‌ఆర్‌సీ ఫలితాల కాపీని నాకు చూపిస్తూ ''ఎట్టకేలకు నేను ఊపిరిపీల్చుకుని ప్రశాంతంగా ఉండగలను'' అని చెప్పాడు.

చిత్రం శీర్షిక ఖాదిమ్ అలీ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయి

కానీ ఖాదిమ్ అలీ లాగా అందరూ అదృష్టవంతులు కాదు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా నుంచి 19 లక్షల మందికి పైగా ప్రజలను మినహాయించారు.

అటువంటి వారిలో 20 ఏళ్ల మొయినుల్ హక్ ఒకరు. తుక్దపాద ఎన్‌ఆర్‌సీ సెంటర్ వెలుపల చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని నిలుచుని ఉన్న అతడిని నేను కలిశాను. ముఖం మీద చెమట, కన్నీళ్లను తుడుచుకుంటూ.. ''నా కుటుంబంలోని ఆరుగురు సభ్యుల పేర్లూ ఈ తుది జాబితాలో లేవు'' అని చెప్పాడు.

విదేశీ ట్రైబ్యునళ్లలో 120 రోజుల్లో దరఖాస్తు చేయటం గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఇతడి వరకూ రాలేదు. ఈ జాబితా నుంచి మినహాయించిన వారికి జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎస్ఎల్ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామన్న న్యాయ సహాయానికి సంబంధించి ఇతడికి ఎటువంటి సమాచారమూ తెలియదు.

మొయినుల్ పక్కన నిల్చున్న అన్సార్ అలీ చాలా కలవరపడుతున్నాడు. అతడి భార్య రబియా ఖాటూన్ పేరు తుది ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేదు. ఈ విషయం గురించి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది అన్సార్‌కి కూడా తెలియదు.

విదేశీ ట్రైబ్యునల్‌కు దరఖాస్తు చేయటం గురించి నేను అతడిని అడిగినపుడు.. వాటి గురించి తాను 'విన్నాన'ని కానీ వాటిని ఎలా సంప్రదించాలో స్పష్టంగా తెలియదని చెప్పాడు.

జాబితా నుంచి తప్పించిన వారి ప్రయోజనార్థం ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఇంకా క్షేత్ర స్థాయికి చేరలేదని.. విదేశీ ట్రైబ్యునళ్లను సంప్రదించే ప్రక్రియకు సంబంధించి ప్రభావితుల్లో అత్యధికులకు అవగాహన లేదని స్పష్టంగా కనిపిస్తోంది.

చిత్రం శీర్షిక మొయినుల్ హక్ వంటి చాలా మందికి న్యాయ సహాయం గురించి ఎటువంటి సమాచారమూ తెలియదు

అస్సాం అంతటా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. బూటకపు వార్తలు, వదంతుల వలలో పడవద్దని ప్రజలకు విస్తారంగా విజ్ఞప్తులు చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక సంఘటన ఏదీ జరిగినట్లు వార్తలు రాలేదు.

సోషల్ మీడియాను పోలీసులు నిశితంగా పరిశీలిస్తుంటారని రాష్ట్ర పోలీస్ అధిపతి డీజీపీ కులధర్ సైకియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ''వదంతులు, విద్వేష ప్రసంగాలు, మతపూరిత వ్యాఖ్యలను విస్తరించటానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునే ప్రయత్నం చేసేవారిని ఉపేక్షించటం'' అని హెచ్చరించారు.

ఈ జాబితాలో పేర్లు లేని వారిని విదేశీయులుగా పరిగణించబోమని.. వారు విదేశీయులని విదేశీ ట్రైబునళ్లు ప్రకటించేవరకూ నిర్బంధించబోమని రాష్ట్ర హోంశాఖ పేర్కొంది. ఈ జాబితాలో పేర్లు లేని వారు తమ పౌరసత్వం కోసం విదేశీ ట్రైబునళ్లకు దరఖాస్తు చేసుకోవటానికి ఇచ్చిన కాల పరిమితిని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు.

ఒకవేళ విదేశీ ట్రైబునల్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే.. దరఖాస్తుదారులు తమ పౌరసత్వం కోసం భారతదేశపు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే వీలు ఉంది. కానీ.. అబ్దుల్ హలీమ్ వంటి వారికి.. ఎన్‌ఆర్‌సీ జాబితా నుంచి తిరస్కరణే.. పౌరసత్వాన్ని ఒక కాగితం ముక్క మీద నిరాకరించటం కన్నా చాలా పెద్ద విషయం.

విచారవదనంతో తనను తాను కూడగట్టుకుని చెప్పాడతడు:

''నేను అస్సాంలో పుట్టాను. నా తండ్రి ఇక్కడ పుట్టాడు. నా పిల్లలూ ఇక్కడే పుట్టారు. మా బతుకులన్నీ ఇక్కడే బతికాం. నేను ఓ బ్యాంకులో పనిచేస్తా. నా పిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు వాళ్లు తమ ఉద్యోగాల గురించి, భవిష్యత్ జీవితాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంది. కానీ.. దానికి బదులుగా ఇప్పుడు సుదీర్ఘ న్యాయ పోరాటం కోసం మేం సిద్ధపడాలి. నేను ఇప్పుడు షాక్‌లో ఉన్నాను. కానీ ఆశలు ఇంకా ఉన్నాయి. మేం విదేశీ ట్రైబ్యునల్‌కు వెళ్తాం. మా పేర్లను ఆమోదిస్తారని నాకు నమ్మకముంది. ఎందుకంటే మేం ఇక్కడి వాళ్లమే. ఇంక ఎక్కడికి పోతాం?''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

టెలికాం రంగంలో ఏం జరుగుతోంది.. మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరముందా

"పాకిస్తాన్‌ వ్యతిరేక ప్రచారానికి దిల్లీ కేంద్రంగా నకిలీ మీడియా సంస్థలు" - ఇది నిజమేనా?

శబరిమలకు 10 మంది విజయవాడ మహిళలు.. వెనక్కి పంపిన పోలీసులు

అతిపెద్ద డంప్ యార్డ్ పాతికేళ్ల ముందే నిండిపోయింది

మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు

గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి

ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు