దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?

  • 1 సెప్టెంబర్ 2019
దళితులు Image copyright Getty Images

అది మే నెల. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దొరాజీ ప్రాంతం. ఒక సామూహిక పెళ్లి వేడుక ఊరేగింపు జరుగుతోంది. అందులో పదకొండు మంది పెళ్లికొడుకులు ఉన్నారు. మేళతాళాల మధ్య గుర్రాల మీద ఊరేగుతున్నారు. అందరూ దళితులే. చిరకాలంగా సాగుతున్న సంప్రదాయాన్ని వీరు ధిక్కరించారు.

అగ్ర కులాలకు చెందిన పెళ్లికొడుకులు మాత్రమే గుర్రం మీద ఊరేగటం ఆ సంప్రదాయం. దానిని దళితులు ధిక్కరించారు. దీంతో ఈ ప్రాంతంలో కుల ఉద్రిక్తత తలెత్తింది. దళితులు తమ ఊరేగింపు కోసం పోలీసు రక్షణ కోరారు.

యోగేష్ బాషా.. ఈ సామూహిక వివాహ నిర్వాహకుల్లో ఒకరు. వివక్షను ఇక ఏమాత్రం సహించబోమని దళితులు స్పష్టమైన సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన బీబీసీతో చెప్పారు. దోరాజీలో కనీసం 80 శాతం మంది నాణ్యమైన విద్య అందుకున్నారని ఆయన పేర్కొన్నారు.

''విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్, వైద్యం, న్యాయ రంగాలను ఎంచుకున్నారు. కాబట్టి వాళ్లు తమ దైనందిన జీవితాల్లో వివక్షను సహించగలరా? ఈ వివక్షను ముగించాలనే సందేశం ఇవ్వటానికి మేం ఈ సామూహిక పెళ్లి ఊరేగింపు చేపట్టాం'' అని వివరించారు.

Image copyright MANUBHAI PARMAR

ఇలాంటి సంఘటన ఇది ఒక్కటే కాదు. భారతదేశమంతటా దళిత సమాజాలు తమ సామాజిక సాధికారత కోసం సాధ్యమైన అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూ ప్రకటిస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇవి గుర్రం మీద స్వారీ చేయటం లేదంటే మీసాలు పెంచుకోవటం వంటి అతి చిన్న అంశాలుగా కూడా కనిపించవచ్చు.

దళితుల ఆకాంక్షలు పెరుగుతుండటంతో.. దళితులు - దళితేతరుల మధ్య సంఘర్షణ కూడా పెరుగుతుండటం కనిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సవాళ్లు విసురుతున్న వారిలో చాలా మంది విద్యావంతులు.. వారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచనలతో ప్రభావితమైనవారు. గౌరవప్రదమైన జీవితం కోసం 'చదువు, సమీకరించు, పోరాడు' అనే ఆయన సందేశంతో ప్రభావితమైనవారు.

దళితుల నుంచి పుట్టుకొస్తున్న ఈ ప్రతిఘటన.. అణగారిన వర్గాల వారి నుంచి సవాళ్లకు ఆరంభమని అంటారు దళిత హక్కుల కార్యకర్త, రచయిత మార్టిన్ మాక్వాన్.

''ఇటువంటి సంఘటనలు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే.. విద్యావంతులైన దళితులు తమ జీవనాధారం కోసం ఇప్పుడిక గ్రామాలు, పట్టణాల్లో ధనవంతుల మీద ఆధారపడే పరిస్థితి లేదు. పట్టణ ప్రాంతాల్లోని లేబర్ మార్కెట్ మీద వారు ఆధారపడి ఉన్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఉదాహరణకు.. గత నెలలో లోహర్ గ్రామానికి చెందిన మేహుల్ పార్మార్ తన పెళ్లి ఊరేగింపు సందర్భంగా గుర్రం మీద స్వారీ చేయటం ద్వారా తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని బద్దలుకొట్టటానికి ప్రయత్నించాడు. మేహుల్ ఆ గ్రామంలో నివసిస్తున్నాడు. కానీ అతడు పనిచేసేది సమీపంలోని అహ్మదాబాద్ నగరంలో.

అతడు బీబీసీ గుజరాతీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ''మేం సంపాదించుకుంటున్నాం. మా పెళ్లి ఊరేగింపులో గర్రాన్ని పెట్టుకోగల స్తోమత మాకు ఉంది. అలాంటపుడు మేం గుర్రం మీద ఎందుకు స్వారీ చేయకూడదు?'' అని ప్రశ్నించాడు. ఈ గ్రామంలో పెళ్లిలో గుర్రం మీద స్వారీ చేసిన తొలి దళిత వరుడు మేహుల్.

ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ జిల్లాకు చెందిన జితేంద్ర దాస్ (23) గత మే నెలలో.. అగ్రకులాల వారితో కలిసి ఒకే పంక్తిలో భోజనం చేయకూడదన్న కట్టుబాటును తెంచే ప్రయత్నం చేశాడు. అతడిని కొట్టి చంపారు.

అతడి మరణం తర్వాత.. అతడి మీద ఆధారపడి ఉన్న తల్లికి, చెల్లికి మిగిలిన ఆస్తి.. అతడి మోటార్‌సైకిల్, అతడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఒకటి.

ఇటువంటి ఘర్షణల వెనుక గల రెండు ప్రధాన కారణాలు.. విద్య, పట్టణ ప్రాంత పరిచయం.

మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. 2014-15 విద్యా సంవత్సరంలో దళితులు 1 నుంచి 12 తరగతుల వరకూ స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో - జీఈఆర్).. జాతీయ నిష్పత్తి కన్నా అధికంగా ఉంది. అయితే.. ఉన్నత విద్యలో మాత్రం జాతీయ సగటు (24.3) కన్నా దళితుల సగటు (19.1) తక్కువగా ఉంది.

చిత్రం శీర్షిక దేశంలో దళితుల సరికొత్త నాయకుడిగా ఎదిగిన చంద్రశేఖర్ ఆజాద్

జాతీయ నమూనా సంస్థ కార్యాలయం 2014లో ప్రచురించిన 71వ అధ్యయనం ప్రకారం.. ఏడేళ్లు అంతకుమించిన వయసున్న వారిలో అక్షరాస్యత రేటు దేశవ్యాప్తంగా 75.8 శాతం ఉంటే.. దళితుల్లో 68.8 శాతంగా ఉంది.

ఈ అధ్యయాన్ని ఉటంకిస్తూ.. ''ఇతర వెనుకబడిన వర్గాల వారితో పోల్చినపుడు దళితుల అక్షరాస్యతలో దూరం వేగంగా తగ్గిపోతోంది. సంప్రదాయాలు, కట్టుబాట్లను సవాల్ చేయటానికి ఇది ఒక ప్రధాన కారణం'' అని మాక్వాన్ చెప్పారు.

ఈ గణాంకాలు, నిపుణులు చెప్తున్నదాని ప్రకారం.. దళితుల విద్యలో ఈ పెరుగుదల వీరిలో ఆశలు ఆకాంక్షలను పెంచింది. వివక్షకు గురవటం తమ 'తలరాత' అని వీరు ఇక ఏమాత్రం విశ్వసించటం లేదు.

దళితుల ఆసక్తి కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద మాత్రమే కేంద్రీకృతం కాలేదు. స్టార్టప్‌లు, చిన్న వ్యాపార రంగాలలోకి కూడా వీరు ప్రవేశిస్తున్నారు.

వాణిజ్య మెళకువల్లో చాలా మంది దళిత యువతకు దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డీఐసీసీఐ) శిక్షణనిచ్చింది. కొత్త వ్యాపారాలను ఎంచుకునేలా వారిని ప్రోత్సహించింది.

డీఐసీసీఐ అధ్యక్షుడు మిలింద్ కాంబ్లే బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ.. దళితులు తమ హక్కులు పొందటం కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ సంకెళ్లను తెంచటంలో ఈ సంఘర్షణలు తుది ఘట్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Image copyright BHARGAV PARIKH
చిత్రం శీర్షిక గుర్రంపై కూర్చున్న పెళ్లికొడుకు ప్రశాంత్ సోలంకీ

''అగ్రకులస్తులు ఇటువంటి ఘటనలను ఇక ఎంతో కాలం తిప్పికొట్టలేకపోవచ్చునని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆకాంక్షలతో నిండిన దళితులు ఈ పనులు ఇంకా ఎక్కువగా చేస్తుంటారు. రాబోయే రోజుల్లో గుర్రాల మీద స్వారీ చేసే యువత.. అగ్రకులాల వారి ముందు భోజనాలు చేసే యువత.. మరింత ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే దళితుల్లో చాలా మంది విద్యావంతులవుతున్నారు'' అని ఆయన చెప్పారు.

అయితే.. రాజకీయ విశ్లేషకుడు బద్రీనారాయణ్ భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. ''ఇటువంటి సంఘటనలు సామూహిక ఉద్యమాలుగా మారనిదే.. ఈ అంశాల మీద దృష్టి కేంద్రీకరించటానికి రాజకీయ పార్టీలకు ఆసక్తి ఉండదు. రాజకీయ పార్టీలు ఈ అంశాలను చేపట్టనిదే.. క్షేత్రస్థాయిలో దళితుల జీవితాల్లో మార్పు కనిపించటం కష్టం'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ సంఘటనలు దళిత సమాజాలలో పెరుగుతున్న ఆకాంక్షలు, వారి హక్కుల పట్ల పెరుగుతున్న అవగాహనల ఫలితమని నిపుణులు నమ్ముతున్నారు. ఆర్థికాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలకు దూరంగా మెట్రో నగరాలతో పరిచయం, విద్య.. అన్నీ దళితులను అణచివేత గతం నుంచి బయటపడటానికి ప్రోత్సహించాయి.

అయితే.. దీనర్థం దళితుల మీద అకృత్యాలు ముగిసినట్లు కాదని నిపుణులు అంటున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి అత్యాచారాల కేసులు మరింత ఎక్కువగా నమోదవుతాయని అభిప్రాయపడుతున్నారు.

''విద్యకు దూరంగా ఉన్న దళితులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు'' అంటారు మాక్వాన్.

ఇటువంటి సంఘటనలను రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్నారని.. అవన్నీ ప్రజా ఉద్యమాలుగా మారనిదే దళిత సమాజానికి ఉపయోగం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.

ఇటువంటి సంఘటనలు సమాజంపై కొంత ప్రభావం చూపినప్పటికీ.. అవి రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపబోవని బద్రీనారాయణ్ బీబీసీతో పేర్కొన్నారు.

''ఇటువంటి సంఘటనలను రాజకీయ పార్టీలు చాలా వేగంగా మరచిపోతాయి'' అని వ్యాఖ్యానించారు. సామాజిక నిచ్చెన వ్యవస్థను ఈ సంఘటనలు సవాల్ చేస్తాయి. కానీ సామాజికంగా ఎటువంటి భారీ మార్పును తేవటం కోసమైనా రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలను నిర్మించలేవు.

''దళితులపై అకృత్యాల మీద ఎటువంటి ప్రజా ఉద్యమాలనూ సృష్టించనిదే సామాజిక సంస్కరణ కష్టం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ.. విద్యావంతులైన దళితులు చేసే ఈ చిన్న చిన్న దళిత ప్రతిఘటనా ఉద్యమాలు, చిన్నపాటి వ్యక్తిగత తిరుగుబాట్లు కూడా పెద్ద ఉద్యమాల లాగే ప్రాముఖ్యత గలవని కొందరు భావిస్తున్నారు.

Image copyright Getty Images

బిహార్ వంటి రాష్ట్రాలు సుదీర్ఘ కాలంగా దళితులపై అత్యాచారాల మీద పోరాడుతున్నాయని.. కానీ అవి బయటకు రాలేదని దళిత ఉద్యమకారుడు పాల్ దివాకర్ పేర్కొన్నారు.

''ఈ రోజుల్లో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలకు మీడియా బృందాల్లో కూడా స్థానం లభిస్తోంది. కాబట్టి అటువంటి సంఘటనలు వార్తల్లోకి వస్తున్నాయి. ఇది దళితుల్లో విద్య పెరగిన ఫలితం'' అని చెప్పారు.

దళితుల్లో అత్యధికులు.. తమ దుస్థితికి కారణం తమ తలరాత కాదని నమ్మటం మొదలైందని.. కాబట్టి ప్రతిచోటా సనాతన కట్టుబాట్లు, సంప్రదాయాలను తిరస్కరిస్తున్న సంఘటనలు మరింత ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయని దివాకర్ విశ్లేషించారు.

దళితులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నిరంతరం వలస పోతుండటం కూడా దీనికి కారణం. ''వాళ్లు తిరిగి తమ గ్రామాలకు వచ్చినపుడు.. కొత్త ఆలోచనలతో వస్తారు. ఇది వారు వివక్షాపూరిత సంప్రదాయాలను ధిక్కరించటానికి స్ఫూర్తినిస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ఆర్థిక కార్యకలాపాల విస్ఫోటనం వెనుకడిన వర్గాల వారితో సహా దేశలో చాలా మందికి లబ్ధి చేకూర్చిందని డీఐసీసీఐ అధ్యక్షుడు మిలింద్ కాంబ్లే చెప్పారు.

Image copyright D. RAMAKRISHNA
చిత్రం శీర్షిక పోలీస్ స్టేషన్ ఎదుట ఉ.సా. ఆధ్వర్యంలో ధర్నా

''యువ దళితుల ఆకాంక్షలు పెరిగాయి. వారు గౌరవ ప్రదమైన జీవితం కోరుకుంటున్నారు. ప్రజల ఆర్థికాభివృద్ధి ఫలాల్లో తమకు సమాన వాటా కోరుకుంటున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

దళితుల విజయం కొందరు అగ్రకుల వారిలో అభద్రతాభావాన్ని సృష్టించిందని.. దాని ఫలితమే ఈ అత్యాచార సంఘటనలని మిలింద్ భావిస్తున్నారు.

అయితే.. వాణిజ్య ప్రపంచంలో తామూ ఉన్నామనే ముద్ర వేయగల దళితుల శాతం చాలా తక్కువని కూడా ఆయన విశ్వాసం.

భారతీయ మీడియాలో ప్రచురితమైన దళితులు, గిరిజనుల మీద అత్యాచార సంఘటనల గురించి ఇటీవల ముద్రించిన ఒక పుస్తకానికి మార్టిన్ మాక్వాన్ సంపాదకుడిగా ఉన్నారు.

అటువంటి చాలా సంఘటనల్లో.. రాజస్థాన్‌లో బాబూరాం చౌహాన్ (36) అనే దళిత సమాచార హక్కు ఉద్యమకారిపై దాడి ఘటనను మాక్వాన్ ఉటంకించారు.

ఆక్రమణకు గురయ్యాయనే ఆరూపణలున్న దళితుల భూములను తిరిగి పొందటం కోసం సమాచార హక్కు దరఖాస్తు సమర్పించిన అతడు.. అగ్రకులాల నుంచి క్రోథం చవిచూశాడు. ''దళితుల్లో అవగాహన అగ్రకులాల వారికి ఆగ్రహం తెప్పించింది. బాబూరాం మీద దాడిచేశారు'' అని మాక్వాన్ చెప్పారు.

Image copyright BHARGAV PARIKH

విద్యావంతులైన తర్వాత కూడా తీవ్ర అణచివేతకు గురైన పాత తరం వారిలాగా కాకుండా.. కొత్త తరం మరింతగా గళమెత్తటంతో పాటు.. తమ హక్కుల గురించి మరింత అవగాహన గల వారని.. అంబేడ్కర్ సామ్యవాద ఆలోచనను విశ్వసిస్తోందని పేర్కొన్నారు.

''సామ్యవాదం, సమానత్వం గురించి అంబేడ్కర్ ఆలోచన చాలా మంది దళిత యువత జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది'' అన్నారు.

అక్షరాస్యత రేటుపై 2014లో ప్రచురించిన ఎన్ఎస్ఎస్ఓ అధ్యయన గణాంకాలను ఆయన ఉటంకిస్తూ.. దళితులపై అత్యాచారాలు అధికంగా ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దళితుల్లో అక్షరాస్యత రేటు కూడా అధికంగా ఉందని ఆయన చెప్పారు.

''విద్య ఎంత ఎక్కువగా ఉంటే.. వివక్షాపూరిత కట్టుబాట్లను పాటించటానికి వ్యతిరేకత అంత ఎక్కువగా ఉంటుంది.. దానిపై ప్రతీకారాలూ అంతే ఎక్కువగా ఉంటాయి'' అని మాక్వాన్ పేర్కొన్నారు.

సామాజిక నిరంకుశత్వంతో పోలిస్తే రాజకీయ నిరంకుశత్వం అల్పమైనదని.. సమాజాన్ని ధిక్కరించే సంస్కర్త.. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కన్నా ధైర్యశాలి అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చెప్పినట్లుగా.. చిన్నవిగా కనిపిస్తున్న ఈ ధిక్కారాలు మున్ముందు రాబోయే భారీ మార్పుకు ప్రతిబింబాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు