మేధాపాట్కర్: క్షీణించిన ఆరోగ్యం.. నర్మదా డ్యాం నిరాశ్రయుల కోసం కొనసాగుతున్న నిరాహార దీక్ష

  • 1 సెప్టెంబర్ 2019
మేధాపాట్కర్
చిత్రం శీర్షిక మేధాపాట్కర్

నర్మదా డ్యాం నిర్మాణంతో నిరాశ్రయులైన వారి హక్కుల కోసం ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారంతో ఆమె నిరశన ఎనిమిదో రోజుకు చేరుకుంది.

నర్మదా నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 32,000 మంది హక్కుల కోసం నర్మదా చునౌతీ ఆందోళన్ పేరుతో ఆమె దీక్ష చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బడ్వానీ జిల్లాలోని ఛోటాబడా గ్రామంలో జరుగుతున్న ఈ నిరసనల్లో ఆమెతోపాటు వందల సంఖ్యలో ఆమె మద్దతుదారులూ పాలుపంచుకుంటున్నారు.

నిరసన జరుగుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే జిల్లా ఉన్నత అధికారులు సందర్శించారు. దీక్షను విరమించాలని మేధాపాట్కర్‌ను కోరారు. అయితే తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ శాంతించేదిలేదని ఆమె స్పష్టంచేశారు.

సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణంతో నిరాశ్రయులైన వారి హక్కుల కోసం నర్మదా బచావో ఆందోళన్ పేరుతో గత 34 ఏళ్లుగా మేధాపాట్కర్ పోరాడుతున్నారు. మొదట్నుంచీ డ్యాం నిర్మాణాన్ని ఆమె వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందుకే చాలా మంది ఆమెను అభివృద్ధికి అవరోధంగా చెబుతుంటారు.

చిత్రం శీర్షిక మధ్యప్రదేశ్‌లోని నిసార్‌పూర్ గ్రామంలోకి వచ్చిన నీరు

'34ఏళ్ల నిరసనల తర్వాత కూడా ఇక్కడి గ్రామస్థులు చనిపోతున్నారు. డ్యాంలో నీటి మట్టం పెరగడం వల్ల ఊళ్లకు ఊళ్లే నీటిలో మునిగిపోతున్నాయి'అని బీబీసీతో మేధాపాట్కర్ అన్నారు.

'నీటి మట్టం పెరగడంతో చాలా గ్రామాలు దీవుల్లా మారిపోతున్నాయి. నిరాశ్రయులైనవారికి సరైన పరిహారం అందేవరకూ మా దీక్ష కొనసాగుతుంది'అని స్పష్టంచేశారు.

నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తున్నప్పటికీ.. ఇది సుప్రీం కోర్టు సూచించిన విధంగాలేదని మేధాపాట్కర్ చెబుతున్నారు.

ప్రస్తుతం నిరాహార దీక్షలో ఆమెతోపాటు మరో పదిమంది ఉన్నారు. 'నర్మదా మా జీవనాధారం. దీన్ని మేం మృత్యుపాశంగా మారనివ్వం'అని వారు అంటున్నారు.

32 వేల మంది నిరాశ్రయులు

సర్దార్ సరోవర్ డ్యాం వల్ల 32,000 మంది నిరాశ్రయులయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వీరికి పునరావాసం కల్పించాలని మేధాపాట్కర్ డిమాండ్ చేస్తున్నారు.

శివరాజ్‌సింగ్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొన్ని జల సంరక్షణ పథకాలపైనా విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు నర్మదా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్‌సీఏ) మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణలను గుజరాత్‌లోని భాజపా ప్రభుత్వం ఖండించింది. తాము ఎన్‌సీఏ ఆదేశాలకు అనుగుణంగానే నీటి స్థాయిలను పెంచుతున్నామని, ఎన్‌సీఏ తమకు కేటాయించిన పరిమాణంలోనే నీటిని తీసుకుంటున్నామని నొక్కిచెప్పింది.

డ్యాం గేట్లను మూసివేసేందుకు ఎన్‌సీఏ.. గుజరాత్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. వర్షాకాలంలో గేట్లు మూసివేయడంతో డ్యాంలో నీటి స్థాయిలు రికార్డు స్థాయికి పెరిగాయి. దీంతో చాలావరకు ఆయకట్టు ప్రాంతం నీటిలో మునిగిపోయింది.

రాష్ట్రాల మధ్య నీటి పంపిణీతోపాటు జల విద్యుత్ ఉత్పత్తిపైనా 1979లో ఎన్‌సీఏ తీర్పునిచ్చింది. దీన్ని 2024 సమీక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)