వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?

  • 2 సెప్టెంబర్ 2019
వైఎస్ రాజశేఖరరెడ్డి, కూలిన హెలీకాప్టర్ శకలం Image copyright YSR Congress Party/AirForce/BSN Malleswara Rao

2009 సెప్టెంబర్ 2వ తేదీ.. బుధవారం. సాధారణంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో లేరంటే సీ బ్లాకు వద్ద హడావుడి ఉండదు. కానీ, ఆరోజు మాత్రం 11 గంటలకే టెన్షన్ మొదలైంది.

చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. కానీ, చేరుకోలేదు.

హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని, సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ లభించడం లేదని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

మరికొద్దిసేపటికే సాక్షి సహా కొన్ని చానెళ్లలో ముఖ్యమంత్రి క్షేమంగానే ఉన్నారని, రోడ్డు మార్గంలో చిత్తూరు వెళుతున్నారంటూ స్క్రోలింగ్‌లు వచ్చాయి.

అప్పటికే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్య, తదితర సీనియర్ మంత్రులు, చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి సహా ఉన్నతాధికారులు సచివాలయానికి చేరుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈలోపు సెక్రటేరియేట్ వద్ద ఉన్న జర్నలిస్టుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం వద్ద హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి, నల్లమల మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కాబట్టి వారేమైనా పేల్చేశారా? లేక ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశారా? వంటి ఊహాగానాలు వస్తున్నాయి.

మధ్యాహ్నానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. హెలికాప్టర్ మిస్సయ్యిందని, ముఖ్యమంత్రి ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు చేప్టటామని. ఈ హెలికాప్టర్‌లో సీఎం రాజశేఖరరెడ్డితో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ కూడా ఉన్నారు.

అతిపెద్ద గాలింపు ఆపరేషన్

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించటం లేదన్న వార్త జాతీయ స్థాయిలో సంచలనమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలను అప్రమత్తం చేసి, గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

పోలీసు, సీఆర్‌పీఎఫ్, యాంటీ నక్సల్ విభాగాల బలగాలు నల్లమల అడవుల్లోకి వెళ్లాయని, సికింద్రాబాద్, బెంగళూరుల నుంచి ఆర్మీ హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయని, థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న సుఖోయ్ విమానాన్ని కూడా పంపించామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనక్కు వచ్చేశాయి. ఇస్రో సైతం ఉపగ్రహ సాయంతో గాలింపు చర్యల్లో పాల్గొంటోందని ప్రభుత్వం తెలిపింది.

రాత్రి నల్లమలకు పయనం

ఉదయం నుంచి సెక్రటేరియేట్ వద్ద ఉన్న నేను సాయంత్రానికి ఆఫీసు (ఆంధ్రజ్యోతి)కి వెళ్లాను. సీఎం గురించి కానీ, హెలికాప్టర్ గురించి కానీ ఎలాంటి సమాచారం రాకపోవటంతో ఈ సంఘటనను కవర్ చేసేందుకు ఏబీఎన్ చానెల్ నుంచి ఒక బృందాన్ని నల్లమలకు పంపిస్తున్నట్లు రాత్రి 8 గంటల సమయంలో తెలిసింది. ఆ బృందంలో నేనూ ఒకడినయ్యాను.

'నువ్వు ప్రింట్ మీడియా రిపోర్టర్‌గా కాదు.. టీవీ చానెల్ రిపోర్టర్‌గా అక్కడికి వెళుతున్నావు' అని మా బ్యూరో చీఫ్ నాతో చెప్పారు. క్రైమ్ రిపోర్టర్ సత్యనారాయణ, రిపోర్టర్ వంశీ, ఫొటోగ్రాఫర్ నారాయణ, కెమెరామెన్లు అక్కి రాము, శ్రీనివాస్‌ ఈ బృందంలో ఉన్నారు. నల్లమలలో ఒకటి, రెండు రోజులు ఉండాల్సి వస్తే బట్టలు అవసరం కాబట్టి తెచ్చుకోవాలని సత్యనారాయణ నాతో అన్నారు.

తెల్లవారుజామున 3.30 గంటలకు ఆత్మకూరు చేరుకున్నాం. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ భవనం వద్ద డీఎస్ఎన్‌జీ వ్యాన్లతో చాలా మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. స్థానిక రిపోర్టర్‌కు ఫోన్ చేశాం. హైదరాబాద్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కోటాచారి కర్నూలులో స్టాఫ్ రిపోర్టర్‌గా వెళ్లారు. అతనే వచ్చి మమ్మల్ని ఆత్మకూరు పీసీ సెంటర్‌కు తీసుకెళ్లారు.

పరిచయాలు అయ్యాక, హెలికాప్టర్ అదృశ్యంపై చర్చించాం. చివరకు రెండు బృందాలుగా విడిపోయాం. సత్యనారాయణ, నారాయణ, వంశీ, కోటాచారి, స్థానిక విలేకరి, కెమెరామెన్ శ్రీనివాస్‌లు కృష్ణా జలాల్లో ఆయిల్ తెట్ట కనిపించింది అని ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. నేను, కర్నూలు బ్యూరో ఇన్‌ఛార్జి సుబ్బారాయుడు, ఫొటోగ్రాఫర్ ఆంజనేయులు, కెమెరామెన్ రాము టాటా ఇండికాలో నల్లమలకు బయలుదేరాం.

Image copyright BSN Malleswara Rao

ఆత్మకూరు నుంచి నల్లకాలువ వరకూ వెళ్లి అక్కడి నుంచి నల్లమలలోకి ప్రవేశించాం. అప్పటికే స్థానిక, జాతీయ న్యూస్ చానెళ్ల ప్రతినిధులు అక్కడ ఉన్నారు. ఆరు కిలోమీటర్లు లోనికి వెళ్లాక రోడ్డు మార్గం మొత్తం బురదమయం అయ్యింది. కారు ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో కారును అక్కడే వదిలిపెట్టి నడిచివెళ్లాలని నిర్ణయించుకున్నాం. రెండు, మూడు కిలోమీటర్లు నడిచాక కొన్ని జీపులు వస్తున్నాయి. ముందురోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాట ప్రారంభించారు.

రెండు జీపుల్లో గుంటూరు నుంచి కొందరు కార్యకర్తలు నల్లమలకు వచ్చారు. వారి జీపు పక్కన, వెనుక వేలాడుతూ మేం గాలేరు నది (నల్ల కాల్వ) వరకూ వెళ్లాం. అక్కడి నుంచి నల్లమల టైగర్ జోన్ ప్రారంభం అవుతుందని సుబ్బారాయుడు చెప్పారు. అక్కడికి మొత్తం 50 మంది వరకూ మీడియా ప్రతినిధులు, మరో 50 మంది కార్యకర్తలు, గ్రామస్తులు చేరుకున్నారు. పోలీసులు కానీ, హెలికాప్టర్లు కానీ మాకు కనిపించలేదు. దీంతో ముఖ్యమంత్రి జాడ తెలిసే ఉంటుందని, కాబట్టే హడావుడి లేదని మేం అనుకున్నాం. డప్పుల శబ్దం వినిపిస్తుండటంతో వాగు గట్టు నుంచి కొంచెం లోపలికి వెళ్లాం. ఇంతలో ఒక హెలికాప్టర్ కనిపించింది. దీంతో మళ్లీ వాగు వద్దకు వచ్చాం. ఆ హెలికాప్టర్ చాలా కిందికి వచ్చి, ఒక నోటు విసిరి వెళ్లింది. దీన్ని మేం ముందు గమనించలేదు.

ఉదయం 8 గంటల సమయంలో ఎడిటర్ కె. శ్రీనివాస్ గారి నుంచి ఫోన్ వచ్చింది. కర్నూలు జిల్లా వెలుగోడు సమీపంలోని ఒక కొండపై హెలికాప్టర్ ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఇంతలో మాకు కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కాన్వాయ్ కనిపించింది. నేను ఆయనతో మాట్లాడి, బైట్ తీసుకున్నాను. ఆయనా ఇదే విషయం చెప్పారు. వెలుగోడుకు వెళ్తున్నామని ఆయన చెప్పడంతో ఆయనతో పాటు మళ్లీ నల్లమలలోకి బయలుదేరాం. సుబ్బారాయుడు మేయర్ కారులో ఎక్కారు. మేం మా కారులో ఎక్కాం. కారు డ్రైవర్ మాకు టిఫిన్ పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు. వాటిని బ్యాగ్‌లో పెట్టుకున్నాం. వాగు వద్దకు చేరుకునే సరికి మిగతా బృందం నుంచి నేను, రాము విడిపోయాం. వాగును దాటుకుని నల్లమలలోకి నడిచాం. కొద్ది దూరం వెళ్లేప్పటికే చుక్కలు కనిపించాయి. ముందురోజు కూడా సరిగా భోజనం చేయకపోవటంతో నాకు నీరసం ఆవహించింది.

Image copyright DGCA
చిత్రం శీర్షిక వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కూలిపోయిన ప్రాంతం వరకూ ప్రయాణించిన రూట్ మ్యాప్

అవస్థలు పడుతూనే అభయారణ్యంలోకి..

ఇంతలో అనపర్తి ఎమ్మెల్యే (శేషారెడ్డి), రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అడవిలో పరుగులాంటి నడకతో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన కొందరు స్థానికుల్ని అడిగితే కొండ 8 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. కానీ, ఎంత దూరం నడుస్తున్నా కొండ దగ్గర పడటం లేదు. అలా నడుస్తూనే డ్రైవర్ ఇచ్చిన టిఫిన్ కవర్ తెరిచాం. అందులో పూరీలు, ఇడ్లీ పొట్లాలు రెండేసి ఉన్నాయి. నేను ఒక ఇడ్లీ పొట్లం తీసుకున్నాను. రాము కూడా ఒక పొట్లం తీసుకున్నాడు. మాతో పాటే నడుస్తున్న ఇద్దరు మీడియా మిత్రులకు చెరొక పొట్లం ఇచ్చాం. నడుస్తూనే వాటిని తిని, మంచినీళ్లు తాగాను. దీంతో కొంత శక్తి వచ్చినట్లనిపిచ్చింది. అలా నడుస్తూనే అనపర్తి ఎమ్మెల్యే బైట్ తీసుకున్నాం.

కొంత దూరం వెళ్లాక దారి మళ్లాం. అది కొండదారి. అప్పటికే ఒక వాగు, మూడు వంకల్ని దాటాం. నేను లెదర్ షూస్ వేసుకోవడంతో లోపలికి చేరిన నీళ్లు బయటకి పోవట్లేదు. సాక్సుల్లో కూడా నీళ్లు చేరి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగని బూట్లు తీసేసినా నడవలేకపోతున్నాను. ఇలా కొద్దిసేపు షూస్ తీసి, కొద్దిసేపు వేసుకుని నడుస్తున్నాను. కొద్దిదూరం అలా అడవిలో ముందుకు వెళ్లాక కొందరు బైక్‌లపై వచ్చారు. రామును తీసుకెళ్లాలని వాళ్లని కోరాను. కెమెరామెన్ వెళితే విజువల్స్ అయినా లభిస్తాయన్నది నా ఉద్దేశం. కానీ వాళ్లు రామును ఎక్కించుకోలేదు. నిజానికి దారి కూడా ఏమాత్రం బాగోలేదు. బురద, రాళ్లతో ఉంది. శక్తి లేకపోయినా, శరీరం సహకరించకపోయినా నెమ్మదిగా పరుగెత్తుతున్నాను. రాము నా వెనకే ఉండిపోతున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేస్తూ, పరుగెత్తమని కోరుతున్నాను. ఈ క్రమంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టింది నేను తీసుకెళ్లిన బ్యాగ్, వేసుకున్న జీన్స్ ప్యాంట్. నేను వేసుకున్న లెదర్ కోటు కూడా ముందు ఇబ్బందిగా అనిపించింది. అయితే, వర్షం వచ్చినప్పుడు మాత్రం దాన్నే కప్పుకున్నాను. మొత్తానికి ఇలా అవస్థలు పడుతూనే అభయారణ్యంలోకి అడుగుపెట్టాం.

మాకంటే ముందు వెళ్లిన మీడియా ప్రతినిధులు, మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకచోట ఆగిపోయారు. మేం హడావుడిగా వెళ్లి అక్కడ హెలికాప్టర్ ఉందేమోనని వెదికాం. గ్రేహౌండ్స్ దళాలు ఉన్నాయి కానీ, శకలాలు లేవు. అప్పుడు తెలిసింది.. గ్రే హౌండ్స్ బృందం కూడా దారితప్పిందని. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. నిజానికి మేం వాగు నుంచి అడవిలోకి వచ్చేప్పుడు కూడా అప్పుడప్పుడూ వస్తున్న హెలికాప్టర్లు మాకు దిశానిర్దేశం చేస్తున్నట్లు అనిపించింది.

ఇక్కడి నుంచి ముందుకెళితే ఎటు వెళుతున్నామో కూడా తెలియటం లేదు. దీంతో అంతా అక్కడే ఆగిపోయాం. కర్నూలు రేంజ్ డీఐజీ, కొందరు ఎస్సైలు కూడా అక్కడే ఉన్నారు. మరొక బృందంలో ఉన్న కెమెరామెన్ శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. వంశీ కూడా వస్తున్నట్లు అతను చెప్పాడు. దీంతో వారిద్దరినీ మేయర్, కార్యకర్తల్ని ఫాలో అవ్వమని చెప్పి.. నేనూ, రాము అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అదే దారిలో కొంతదూరం ముందుకు వెళ్లాక.. అప్పటి వరకూ ఉత్సాహంగా కదిలిన మిగతా మీడియా మిత్రులు వెనక్కు తగ్గారు. కొద్దిదూరం వెళ్లాక ఈటీవీ కెమెరామెన్, హిందూ ఫొటోగ్రాఫర్‌లు వెనక్కి వచ్చేస్తున్నారు. అయినప్పటికీ మేం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మాకు సూర్య పత్రిక స్థానిక విలేకరి తోడయ్యారు.

అక్కడ ఉన్న బాటలో ముందుకు వెళుతున్నాం. హెలికాప్టర్ మార్గాన్ని కూడా గమనిస్తున్నాం. కొంతదూరం వెళ్లాక బాట రెండుగా చీలింది. దీంతో హెలికాప్టర్ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇంకొంత దూరం వెళ్లాక ఒక కొండ ఉంది. ఇక్కడ కొందరు స్థానికులు కూడా ఉన్నారు. వారితో కలసి నిటారుగా ఉన్న ఆ కొండ ఎక్కాం. అది పావురాల కొండ అని వాళ్లు చెప్పారు. మేం కొండపైకి చేరుకున్నాం. అప్పటి వరకూ మాకు దిశానిర్దేశం చేసిందనుకున్న హెలికాప్టర్ మాయం అయ్యింది. దీంతో నాకు కోపం, చిరాకు, నిస్పృహ, ఆవేదన.. ఇలా అన్ని అనుభూతులూ వచ్చాయి.

Image copyright DGCA
చిత్రం శీర్షిక వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం

‘అడవిలో చిక్కుకున్నాం.. తప్పిపోతున్నాం..’

ఒక పక్కన వెలుగోడు రిజర్వాయర్ కనిపిస్తోంది. మేం ఉన్న ప్రదేశం టైగర్ రిజర్వ్ అని, పులులు సంచరిస్తాయని స్థానికులు చెబుతున్నారు. మరో 15 కిలోమీటర్లు వెళితే శ్రీశైలం హైవే వస్తుందని వారన్నారు. తిరిగి వాగువైపు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు అని చెప్పారు. దీంతో శ్రీశైలం హైవే వైపు వెళ్లాలని నేను అనుకున్నాను. ఇంతలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి.

అప్పుడు నేను చేసిన ఒకే ఒక్క కాల్ హైదరాబాద్ సిటీ బ్యూరో చీఫ్ శశికాంత్‌ గారికి. జర్నలిజం కాలేజీ రోజుల దగ్గర్నుంచి ఆయనతో నాకున్న పరిచయం వల్ల, సిటీబ్యూరోలో పనిచేసిన సాన్నిహిత్యం వల్ల నాకు ఏదైనా జరిగితే ఆయన తక్షణం స్పందిస్తారని నాకు గట్టి నమ్మకం. ఫోన్ చేసి విషయం చెప్పాను.

నల్లమల గర్భంలో చిక్కుకున్నామని, ముఖ్యమంత్రి విషయం పక్కన పెడితే మేమే తప్పిపోతున్నామని చెప్పాను. అడవిలో మా వెదుకులాట, ఇంత దూరం నడిచిన తర్వాత మా పరిస్థితిని వివరించాం. విలేకరులు తప్పిపోయినట్లు మీడియాలో కూడా ప్రచారం జరుగుతోందని ఆయన మాతో అన్నారు. టీవీకి ఫోన్ ఇన్ ఇవ్వమన్నారు.

ఫోన్ ఇన్‌లో క్లుప్తంగా విషయం చెబుతుండగా సిగ్నల్స్ కట్ అయ్యాయి. మళ్లీ కొద్ది సేపటికి సిగ్నల్స్ వస్తే ఫోన్ చేశాను. ఇంతలో ఎదురుగా ఉన్న కొండపైన ఒక హెలికాప్టర్ చక్కర్లు కొడుతోంది. ఇదే విషయం శశికాంత్ గారికి చెబితే, ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్లాలని చెప్పారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండకపోవచ్చు అని నేనన్నాను. అయినాసరే అక్కడికి వెళ్లమని ఆయన స్పష్టం చేశారు. మాతో ఉన్న మిగతా వాళ్లతో మాట్లాడాం. అంతా కలిసి ఆ హెలికాప్టర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

నిట్టనిలువుగా ఉన్న కొండ దిగి లోయలోకి వెళ్లాం. ఆ లోయ నుంచి మళ్లీ నిట్టనిలువుగా ఉన్న మరొక కొండ ఎక్కాం. ఈలోపు మాతో తెచ్చుకున్న ఆహారం, నీళ్లు అన్నీ అయిపోయాయి. మధ్యలో కొన్నిసార్లు వాన నీళ్లతోనే నేను గొంతు, పెదవులు తడుపుకున్నాను. కొంతదూరం వెళ్లాక సాక్షి గుంటూరు విలేకరి కనిపించారు. 'గ్రామస్తులు మనల్ని సరైన దిశలోనే తీసుకెళ్తున్నారా' అని మేమిద్దరం మాట్లాడుకున్నాం. 'ఏదైతే అది అవుతుంది ముందు హెలికాప్టర్ వద్దకు వెళదాం' అని అనుకున్నాం. అయితే, మేం మరికొంత దూరం నడిచాక ఆ హెలికాప్టర్ వెళ్లిపోయింది.

అక్కడే ఉన్న రాళ్లపై కూర్చున్నాం. అప్పటి వరకూ మాతో ఉన్న గ్రామస్తులు వెనక్కు వెళ్లిపోతున్నారు. నాకు మాత్రం కాళ్లు ముందుకుపడటం లేదు. శరీరంలోని ప్రతి అణువు నుంచి శక్తిని పిండేసినట్లుంది నా పరిస్థితి. అప్పటికి బురద పడి, వర్షానికి తడిచి, ఎండకు ఎండిన నా బట్టల్ని చూస్తే నాకే అసహ్యంగా అనిపించాయి.

అప్పటి వరకూ నేను అడవుల్లోకి వెళ్లింది లేదు. కొండల్ని కూడా దూరం నుంచి చూడటమే తప్ప ఎక్కిందీ లేదు. చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం వల్ల 'నదిలో పడ్డా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలను' అన్న నమ్మకం నాకు బాగా ఉండేది. కానీ, అడవిలో తప్పిపోతే పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. ఎటు వెళ్దామన్నా కనీసం 20 నుంచి 30 కిలోమీటర్లు నడవాల్సిందే. పైగా కనీసం రెండుమూడు కొండలు, లోయలు దిగి ఎక్కాలి. దారి కూడా నడిచేందుకు అనుకూలంగా ఉండట్లేదు. బురద బురద. మా దగ్గరేమో ఆహారం, నీళ్లు లేవు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. వీటన్నింటికీ తోడు, 'ఇక్కడ పులులు తిరుగుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి' అని వెళ్తూ వెళ్తూ స్థానిక గ్రామస్తులు చేసిన హెచ్చరికలు కూడా పదేపదే గుర్తొస్తున్నాయి.

ఈ సమయంలో ఒక హెలికాప్టర్ కనిపించింది. అది ఆకాశంలో ఒక్కచోటే ఆగింది. దీంతో, అక్కడికి చేరుకుంటే, ఎలాగొలా మన ఉనికి, పరిస్థితి వారికి తెలియచేసి అందులో వెళ్లిపోవచ్చు అన్న ఆశ కలిగింది. అసలు నడవలేం అని అప్పటి వరకూ అనుకున్న వాళ్లం అంతా పరుగులు పెట్టాం.

Image copyright ABN Andhrajyothy/BSN Malleswara Rao
చిత్రం శీర్షిక వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం

ముక్కలు ముక్కలుగా హెలికాప్టర్, శరీర భాగాలు

శరీరం సహకరించకపోయినా, ఒంట్లో ఏమాత్రం శక్తి లేకపోయినా అలా పరుగులు తీయడం నాకు విచిత్రంగా, డెస్పరేట్గా అనిపించింది.

మరొక చిన్న లోయలోకి దిగి, ఇంకొక కొండ ఎక్కుతున్నాం. అలా కొండ ఎక్కుతుంటే చెట్లలో కలసిపోయిన గ్రేహౌండ్స్ దళాలు నాకు కనిపించాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే కనిపిస్తోంది గ్రేహౌండ్స్ సిబ్బందేనని స్పష్టం చేసుకున్నాను. అప్పుడు తట్టింది.. సీఎం హెలికాప్టర్ ఇక్కడ కూలి ఉండొచ్చని. కొండపైన ఉన్న ఆ ప్రదేశానికి దగ్గరవుతున్న కొద్దీ నన్ను చాలా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.

హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని నేను రెండుసార్లు పరిశీలించాను. అది కొండ శిఖరాగ్రం. హెలికాప్టర్ కొండను ఢీ కొట్టి ముక్కలయ్యింది. తోక భాగం ఒకచోట, రెక్కలు ఒకచోట, ఇంజిన్ మరొకచోట పడ్డాయి. మిగతావన్నీ ముక్కలు చెక్కలయ్యాయి. ఇంజిన్ కాలిపోయింది. ఇంజిన్‌కు సమీపంలోనే సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మృతదేహం పడింది. బట్టతల, పంచె ఆధారంగా ఆయన్ను గుర్తు పట్టినట్లు గ్రేహౌండ్స్ సిబ్బంది చెప్పారు.

తోకభాగం పడ్డచోట ఇద్దరు పైలట్లు, వారికి దూరంగా కుడివైపున భద్రతాధికారి వెస్లీ, వీరందరికీ కిందగా సుబ్రహ్మణ్యం మృతదేహాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒక పైలట్ మృతదేహం సీటుకే ఉందని చెప్పారు. మరొక పైలట్ ముఖం దొరికిందన్నారు. గన్ ఉండటంతో వెస్లీని గుర్తించామన్నారు. వాళ్లు చెబుతున్నదంతా నేను సెల్‌ఫోన్లో కూడా రికార్డు చేశాను. తర్వాత విని రాసుకోవచ్చని.

మృతదేహాలన్నీ చిందరవందరగా పడ్డాయి. శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఇంజిన్ కాలిపోవటంతో తలెత్తిన మంటల వల్ల ఈ శరీరాలు కూడా మండిపోయాయి. అయితే, తర్వాత వర్షం కురవటం వల్లనేమో సగం కాలినట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా వెగటు పుట్టించే కమురువాసన కమ్ముకుని ఉంది. ఈ శరీర భాగాలన్నింటినీ అప్పటికే గ్రేహౌండ్స్ సిబ్బంది పోగు చేసి నల్లటి, పెద్ద క్యారీబ్యాగుల్లోకి వేర్వేరుగా సర్దేశారు. ఆ క్యారీబ్యాగులకు తెల్లటి గుడ్డలు చుట్టి, ఒక్కొక్కటిగా ఆకాశంలో ఆగి ఉన్న హెలికాప్టర్‌లోకి తాడు సహాయంతో పంపిస్తున్నారు. దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో హెలికాప్టర్, శరీర భాగాలు పడ్డాయని నాకు అనిపించింది. ఆ ప్రాంతం అంతా రాళ్లతో నిండిపోయి ఉంది. గ్రేహౌండ్స్ సిబ్బంది కూడా మొత్తం శరీర భాగాలను తీయలేకపోయారు. ఇంకా చాలా మాంసపు ముద్దలు అక్కడే పడి ఉన్నాయి.

Image copyright ABN Andhrajyothy/BSN Malleswara Rao
చిత్రం శీర్షిక శరీర భాగాలను పోగు చేసి కట్టిన మూట

పావురాల గుట్ట కాదు..

విచిత్రంగా ఇక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఫుల్‌గా ఉన్నాయి. దాదాపు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎడిటర్ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ఒకపక్క విపరీతమైన హెలికాప్టర్ శబ్దం. అక్కడ ఉన్న పరిస్థితిని వివరించాను. ఇంతలోనే శశికాంత్ గారు కూడా ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడాక కాలిపోయిన ఇంజిన్ దగ్గరికి వెళ్లి హడావుడిగా పీటూసీ (పీస్ టు కెమెరా) చెప్పాను. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా అదే నా మొదటి పీటూసీ. తోక భాగం పడ్డ కొండ కింది వైపు వెళ్లి మరొక పీటూసీ చెబుతుండగా.. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయమంటూ గ్రేహౌండ్స్ వాళ్లు ఆదేశిస్తున్నారు.

నేను మాట్లాడుతున్న వైపు సీఎం రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్చి, అప్పా డైరెక్టర్ రాజీవ్ త్రివేది వస్తున్నారు. నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌నని, మా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరాను. అదే నా మొదటి ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూ. ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తుండగానే వర్షం మొదలైంది. చివరిప్రశ్నకు ఆయన సమాధానం చెబుతుండగా వర్షం పెరిగింది. దీంతో 'వర్షం వస్తోంది' అంటూ ఆయన పక్కకు వెళ్లిపోయారు.

అందరికంటే మేమే ముందు చేరుకున్నామని మేము అనుకుంటుండగా.. ఇక్కడికి అందరికంటే ముందుగా చేరుకున్న మీడియా ప్రతినిధి హెచ్ఎంటీవీ స్థానిక కెమెరామెన్ అని గ్రేహౌండ్స్ సిబ్బంది మాతో చెప్పారు. మా తర్వాత టీవీ 5 కెమెరామెన్ వచ్చారని వాళ్లే చెప్పారు. వాళ్ల సమాధానం కొంత అసంతృప్తిగా అనిపించినా.. మేం బాగానే కవర్ చేశామని అనుకున్నాం.

Image copyright ABN Andhrajyothy/BSN Malleswara Rao
చిత్రం శీర్షిక కూలిపోయిన హెలికాప్టర్ విమానం ఇంజిన్ వద్ద నుంచి పీటూసీ

అప్పటికి సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. వర్షం పెరుగుతుండటంతో కెమెరాను కాపాడుకోవాలని, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాం. రాజీవ్ త్రివేదీ కూడా వెనుదిరగటంతో ఆయన్ను అనుసరించాం. మేం తిరిగి వెళ్తుండగా కొందరు రిపోర్టర్లు, కెమెరామెన్లు కొండపైకి వెళ్తున్నారు. వర్షం ఎక్కువైంది. కొండదిగి లోయలోనే నడిచాం. పావురాల గుట్ట ఎక్కలేదు. (రాజశేఖరరెడ్డి చనిపోయింది పావురాల గుట్టపై అని బాగా ప్రచారం జరిగింది. కానీ, పావురాల గుట్ట పక్కన ఉన్న మరొక కొండపై ఆయన చనిపోయారు. ఈ కొండపేరు పసురుట్ల కొండ అని స్థానికులు చెప్పారు.)

అలా నడుస్తుండగా ఒక ట్రాక్టర్ వచ్చింది. బయటకు తీసుకెళ్లాలని ఆ డ్రైవర్‌ను గ్రేహౌండ్స్ దళాలు కోరాయి. కానీ, అడవిలోకి మంత్రులు వచ్చి చిక్కుకుపోయారని, వారిని తీసుకెళ్లేందుకే తాను వచ్చానని డ్రైవర్ చెప్పి, వెళ్లిపోయాడు. రాజీవ్ త్రివేదిని, గ్రేహౌండ్స్ దళాలను అనుసరించడానికి.. వాళ్లతో క్షేమంగా చేరుకోవచ్చు, ఒకవేళ మాకేదైనా అయినా వాళ్లు సహాయం చేస్తారు, ఎలాగైనా సరే వాళ్లు ఏదోఒక వాహనం ఏర్పాటు చేస్తారు అని అనిపించడమే కారణాలు.

Image copyright DGCA
చిత్రం శీర్షిక నల్లమలలో కూలిన బెల్ 430 హెలికాప్టర్ శకలాలు

ఇంతకీ హెలికాప్టర్ ఎలా కూలింది?

ముఖ్యమంత్రి సాధారణంగా ప్రయాణించే హెలికాప్టర్ అగస్టా. రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే రోజు ప్రయాణించిన, ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 430. పైగా, ఆరోజు వర్షం పడుతుండగా హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి ఎలా లభించింది? అన్న పలు అంశాలు అనుమానాలకు దారితీశాయి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్రకోణం ఉందంటూ కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆర్ కె త్యాగి నేతృత్వంలో డీజీసీఏ సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన 139 పేజీల నివేదిక ప్రకారం.. గేర్‌బాక్సులో లూబ్రికెంట్ ఆయిల్ సరఫరాలో లోపం తలెత్తిందని, దాన్ని సరిదిద్దే క్రమంలో పైలట్లు చెక్‌లిస్టు కోసం వెతికారని, హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయారని, హెలికాప్టర్ అత్యంత వేగంగా కిందికి పడిపోయిందని పేర్కొన్నారు. అలాగే, హెలికాప్టర్ నిర్వహణలోనూ, ఆరోజు హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించిన ఫ్లైట్ ప్లానింగ్‌లోనూ చాలా లోపాలు ఉన్నాయని తెలిపింది.

ఈ ప్రమాదంలో ఈ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ, హెలికాప్టర్ నడిపిస్తున్న పైలట్ ఎస్ కే భాటియా, కోపైలట్ ఎం సత్యనారాయణ రెడ్డి కూడా మృతి చెందారు.

బుధవారం ఉదయం 9 గంటల 27 నిమిషాల 57 సెకండ్లకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) పనిచేయడం ఆగిపోయిందని డీజీసీఏ నివేదిక పేర్కొంది. తర్వాతి రోజు గురువారం ఉదయం 9.20 గంటలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నల్లమల అడవులపై గాలింపు చర్యలు చేపడుతూ.. కూలిన హెలికాప్టర్‌ను గుర్తించింది.

ముఖ్యమంత్రి ఆచూకీ గల్లంతైన దాదాపు 25 గంటల తర్వాత.. ఆయన చనిపోయారని కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం దిల్లీలో మీడియాకు అధికారికంగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ఏపీలో 162, తెలంగాణలో 229కి చేరిన మొత్తం కేసులు

కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?

రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..

కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?

ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల‌ కార్మికుల వేదన

ఇండియా లాక్‌డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది.. మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు

కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం