బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం

  • 2 సెప్టెంబర్ 2019
నిర్మలా సీతారామన్ Image copyright Getty Images/Andhra Bank

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన తాజా ప్రకటనపై చాలా చర్చ జరుగుతోంది.

దేశంలోని ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల విలీనం అవసరం, దాని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై వాదోపవాదాలు నడుస్తున్నాయి.

భారత్‌లో బ్యాంకుల విలీనం ఇది కొత్తేమీ కాదు. అయితే, ముందెప్పుడూ ఇంత భారీ స్థాయిలో, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లకు మాత్రమే పరిమితమై విలీన ప్రక్రియ చేపట్టలేదు.

1969 జులై 20న 14 అతిపెద్ద వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది.

వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు, బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకు ఆ చర్య తీసుకుంది.

ఆ తర్వాత 1980లో ఆంధ్రాబ్యాంకు సహా మరో 13 బ్యాంకులను కూడా జాతీయం చేశారు.

భారత ఆర్థిక చరిత్రలో అతిప్రధానమైన విధానపరమైన నిర్ణయం ఇదేనని విశ్లేషకులు తరచూ చెబుతుంటారు.

బ్యాంకుల జాతీయం కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థను భారీ కార్పొరేట్ సంస్థలే నియంత్రించేవి. డిపాజిటర్లకు ఎలాంటి రక్షణా ఉండేది కాదు.

బ్యాంకుల జాతీయీకరణ, 1991లో చేపట్టిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది.

వినియోగదారులు, పెట్టుబడిదారుల్లో గొప్ప విశ్వసనీయతను సంపాదించుకుంది.

యాంకర్ బ్యాంక్ విలీనం కానున్న బ్యాంకులు వ్యాపార విలువ(రూ. లక్షల కోట్లలో) పీఎస్‌బీ ర్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17.94 2(రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది)
కెనరాబ్యాంక్ సిండికేట్ బ్యాంకు 15.2 4
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు 14.59 5
ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంకు 8.08 7

బ్యాంకుల విలీనం ఫలితం ఎలా ఉండబోతుంది?

పీఎస్‌బీల సంఖ్య తగ్గిపోవడం వల్ల మానవవనరులు, ఉద్యోగకల్పన, ఆర్థికవృద్ధి వంటి వాటికి కొన్ని స్వల్పకాలిక, మరికొన్ని దీర్ఘకాలిక ప్రతికూలతలు ఎదురవ్వొచ్చు.

పీఎస్‌బీల విలీనం ఉద్దేశం ఏంటన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. బ్యాంకులను లాభాల్లోకి తేవడం కోసమో లేక పెట్టబడుల అవసరాలు తీర్చేందుకో ఈ నిర్ణయం తీసుకోలేదు.

స్వల్పకాలికంగా ఎదురయ్యే ప్రతికూలతల్లో ప్రధానమైనది మానవవనరులపై పడే ప్రభావమే. సంస్కృతి పరంగా, కార్యకలాపాలపరంగా ఆయా బ్యాంకుల మధ్య ఉండే తేడాలకు తగ్గట్లు సర్దుకుపోవడంలో ఉద్యోగుల వైఖరి ఎలా ఉంటుందన్నదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విలీన నిర్ణయం తీసుకున్నారు.

ఎస్‌బీఐ, దాని అనుబంధ ప్రాంతీయ బ్యాంకుల విలీనంతో పోలిస్తే ఇప్పుడు జరగబోయే విలీనం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణం ఒకేలా ఉండేవి. కానీ, ఇప్పుడు పీఎస్‌బీల విషయంలో అలా కాదు.

నాయకత్వ అభివృద్ధిపరంగానూ కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు.

నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల సమస్యలను నియంత్రించేందుకు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచేందుకు విలీనం ఉపయోగపడుతుందా? అనేది మరో పెద్ద ప్రశ్న.

Image copyright Getty Images

భారత ఆర్థికవ్యవస్థ దృష్టసారించాల్సిన ప్రధాన సమస్యలు మూడు ఉన్నాయి.

  1. 5 లేదా అంతకన్నా తక్కువ శాతం జీడీపీ వృద్ధి రేటు, డిమాండ్‌ లేమితో దేశం ఆర్థికమాంద్యం వైపు నడుస్తోంది.
  2. నిరర్థక ఆస్తులు, రుణాల రికవరీ రేటు తక్కువగా ఉండటంతో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
  3. జనాభాలో అధిక శాతం యువత ఉండటం దేశ ఆర్థిక పురోగతికి ఎంతో ప్రయోజనకరమని రాజకీయంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రయోజనాన్ని దేశం ఒడిసిపట్టుకోలేకపోతోందని పెరుగుతున్న నిరుద్యోగిత సూచిస్తోంది.

పీఎస్‌బీల విలీనం వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలదా అనే విషయంపై స్పష్టత లేదు.

ప్రభుత్వ, ప్రవేటు రంగాల బ్యాంకులకు కాలక్రమంలో నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి.

పీఎస్‌బీలతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకుల రికవరీ రేటు మెరుగ్గా ఉంది. ఎందుకంటే, రుణాల రికవరీ ప్రక్రియల విషయంలో ప్రైవేటు రంగ బ్యాంకులు కింది స్థాయి వరకూ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తాయి.

పీఎస్‌బీలు మాత్రం ఇలాంటి ప్రక్రియలను అనుసరించవు. నిర్వహణపరంగా ఉన్న అమసర్థతను ఈ విషయం తేటతెల్లం చేస్తుంది. దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ భారీ బ్యాంకుల విలీనం కారణంగా కార్యకలాపాల నిర్వహణను ఏమైనా మెరుగ్గా చేయొచ్చా అన్నది చూడాలి. పెట్టుబడులు, రుణాలకు సంబంధించి బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యత పెరగడం వల్ల కార్యకలాపాల స్థాయి కూడా పెరుగుతుంది. విలీనం వల్ల కలిగే తొలి ప్రయోజనం ఇదే.

అయితే, అవసరమైన కొత్త నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా ఈ కార్యకలాపాల నిర్వహణలో సమర్థత రాదు.

Image copyright PTI

బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతమున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది.

  1. రుణాలు ఎగ్గొట్టినవారి విషయంలో పూచీగా పెట్టిన ఆస్తులను త్వరగా నగదుగా మార్చుకోగలగాలి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారి విషయంలో ఇలాంటి సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా భారీ మొత్తాల్లో అప్పులు తీసుకున్నవారి విషయంలో బ్యాంకులు కఠినమైన ప్రక్రియలను అనుసరించాలి. అలాంటివారు అప్పులు ఎగ్గొడితే మొత్తంగా బ్యాంకుకే ముప్పు రావొచ్చు. దాని ఫలితం ఆర్థిక వ్యవస్థ మీదా పడుతుంది.
  2. వినియోగదారుల గురించి బ్యాంకులు అవగాహన పెంచుకోవాలి. వాళ్లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలి.
  3. లాభాలు పెంచేందుకు, రిస్క్‌ను తగ్గించుకునేందుకు మరిన్ని నైపుణ్యాలు, సామర్థ్యాలు సమకూర్చుకోవాలి.
  4. వేగంగా మారుతున్న సాంకేతికతను, అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం ధోరణులను పునికిపుచ్చుకోవాలి.

మొత్తంగా బ్యాంకింగ్ ధోరణులు ఒకేలా మారేందుకు విలీనం ప్రక్రియ తోడ్పడొచ్చు. కానీ, సంస్థాగత నిర్మాణం అభివృద్ధి విషయంలో బ్యాంకులు కృషి చేయాలి.

స్వల్పకాలికంగా కొత్త ఉద్యోగాలు అవసరం తగ్గడం, ఉన్న వనరులు ఏకీకృతమవ్వడం వల్ల నిరుద్యోగిత పెరగొచ్చు.

అయితే, ఉద్యోగాల విషయంలో ఎలాంటి కోతా ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కొంత సమయం తర్వాత అన్ని విభాగాల్లో సిబ్బంది అవసరానికి మించి సిబ్బంది ఉన్న భావన కలగొచ్చు.

బ్రాంచ్‌ల సంఖ్య, లావాదేవీల సంఖ్య తగ్గడం వల్ల నిర్వహణపరమైన వ్యయం తగ్గి బ్యాంకులకు ఆర్థిక ప్రయోజనం కలగొచ్చు.

ఉద్యోగావకాశాలు తగ్గిపోతే దీర్ఘకాలంలో ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉత్పాదక ఉద్యోగ అవకాశాల సృష్టి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. అప్పుడే జనాభాలో ఎక్కువ శాతం యువత ఉన్నందుకు ప్రతిఫలాన్ని దేశం పొందగలుగుతుంది. లేకపోతే, జీడీపీ వృద్ధి రేటును ఎనిమిది శాతాన్ని దాటించడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగానే మారుతుంది.

ప్రస్తుత ఆర్థిక సమస్యలను, బ్యాంకింగ్ రంగంలోని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పీఎస్‌బీల విలీనం ఒక్కటే సరిపోకపోవచ్చు.

(గార్గి సన్నాటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐబీఎం)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ వ్యాసంలోని విషయాలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, బీబీసీవి కావు)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం