కొల్లేరు: దేశంలో అతి పెద్ద‌ మంచినీటి స‌ర‌స్సుకు వచ్చిన ప్రమాదం ఏమిటి? పరిష్కారం ఎలా?

  • 4 సెప్టెంబర్ 2019
కొల్లేరు సరస్సు, పక్షులు Image copyright BBC/Getty Images

భారతదేశంలో అతిపెద్ద మంచినీటి స‌రస్సుగా పేరున్న కొల్లేరు భ‌విత‌వ్యం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతే ఎలాంటి చిక్కులు వ‌స్తాయ‌న్న‌ది కొల్లేరు చాటుతోంది.

ప్ర‌క్షాళ‌న పేరుతో చేసిన ప్ర‌య‌త్నాలు స‌జావుగా సాగ‌క‌పోతే స‌మ‌స్య‌లు ఎలా తీవ్ర‌మ‌వుతాయ‌న్న‌ది తెలియ‌జేస్తోంది.

కొల్లేరు స్వ‌రూపం ఇదే

ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల ప‌రిధిలో కొల్లేరు స‌ర‌స్సు ఉంది. కేజీ(కృషా,గోదావరి) బేసిన్ ప‌రిధిలోని చిత్త‌డి నేల‌ల్లో సుమారుగా 1.20 ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది.

అరుదైన జాతుల‌ ప‌క్షులు, ప‌లు ర‌కాల చేప‌ల‌కు కొల్లేరు ప్రసిద్ధి. ఎన్నో అరుదైన విదేశీ ప‌క్షుల‌కు కొల్లేరు ఆవాసంగా ఉంటోంది. దీని ప‌రిధిలో 122 లంక గ్రామాల్లో మూడు ల‌క్ష‌ల మంది నివిస్తున్నారు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆకివీడు, నిడ‌మ‌ర్రు, భీమ‌డోలు, ఉంగ‌టూరు, పెద‌పాడు, ఏలూరు, దెందులూరు మండ‌లాల‌ ప‌రిధిలో 20 బెడ్ గ్రామాలు (స‌ర‌స్సు లోప‌ల‌), 63 బెల్ట్ గ్రామాలు (స‌ర‌స్సు ఆనుకుని) ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కైక‌లూరు, మండ‌విల్లి మండ‌లాల ప‌రిధిలోని 26 బెడ్, 13 బెల్ట్ గ్రామాలు కొల్లేరు పరిధిలో విస్త‌రించి ఉన్నాయి.

బుడ‌మేరు, త‌మ్మిలేరు, రామిలేరు, గుండేరు లాంటి చిన్నా, పెద్దా ఏరుల నుంచి కొల్లేరుకు నీరు వ‌చ్చి చేరుతుంది. ఏలూరు, కైక‌లూరుకు చెందిన మురుగు నీరు కూడా కొల్లేరులోకి వస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ప్రమాదంలో కొల్లేరు సరస్సు

పూడిక‌తో నిండుతున్న కొల్లేరు

కొన్నాళ్లుగా కొల్లేరు పూడిక‌తో నిండిపోతోంది. ముఖ్యంగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వ‌చ్చే ఒండ్రు మ‌ట్టి, గుర్ర‌పు డెక్క, కిక్కిస వంటి కార‌ణంగా కొల్లేరు పూడిక‌మ‌యం అవుతోంది. ఫ‌లితంగా 1900 నాటికి స‌ముద్ర మ‌ట్టం కంటే దిగువ‌న ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువ‌కు వ‌చ్చింద‌ని అధికారిక నివేదిక‌లు తెలుపుతున్నాయి.

ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే స‌ర‌స్సు పూడిక‌మ‌యం అయిపోయే ప్ర‌మాదం ఉంద‌ని గ‌తంలో ఇంపీరియ‌ల్ గెజిట్‌లో కూడా పేర్కొన్నారు. ప్ర‌ధానంగా పారిశ్రామిక వ్య‌ర్థాలు, ర‌సాయ‌నాలు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు చేరిక‌తో ఇది మ‌రింత వేగ‌వంతం అవుతోంది.

వ్య‌వ‌సాయం నుంచి ఆక్వా వైపు

కొల్లేరు ప్రాంతమంతా ఒక‌ప్పుడు వ్యవసాయంతో సందడిగా ఉండేది. 1969లో వ‌చ్చిన తుపాన్ త‌ర్వాత ప‌రిస్థితి మారింది.

ముంపు, కాలుష్యం పెర‌గ‌డంతో వ్య‌వ‌సాయం ముందుకు సాగ‌లేదు. ఆ స‌మ‌యంలో ప‌లువురు కొల్లేరు వాసులు వ‌ల‌స‌లు పోవాల్సి వ‌చ్చింది. అప్ప‌టి ప్ర‌భుత్వం స్పందించి కొల్లేరులో వ్య‌వ‌సాయం వీలుకాద‌ని నిర్ధరించింది. 1976లో జ‌ల‌గం వెంక‌ట్రావు ప్ర‌భుత్వం జీవో నెం.118 ద్వారా చేప‌ల చెరువుల త‌వ్వ‌కాల‌కు దిగింది.

రెండు జిల్లాల్లో క‌లిపి 136 సొసైటీలు ఏర్పాటు చేసి చేప‌ల చెరువుల‌కు శ్రీకారం చుట్టారు. డీఫారం, జిరాయితీ భూముల్లో కూడా చెరువుల త‌వ్వ‌కం జరిగింది.

1990 త‌ర్వాత చేప‌లు, రొయ్య‌ల సాగు జోరందుకుంది. పెద్ద స్థాయిలో ఆక్వా సాగు జ‌ర‌గ‌డంతో అన్ స‌ర్వేడు భూముల్లో కూడా చెరువుల తవ్వ‌కాలు పెరిగాయి. ఆ స‌మ‌యంలోనే భారీగా కొల్లేరు ఆక్ర‌మ‌ణ‌లు పెరిగిన‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది.

ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన చేప‌లు, రొయ్య‌ల వ్యాపారులు రంగ ప్ర‌వేశం చేశారు. సొసైటీల‌కు ఆదాయం పెర‌గ‌డంతో కొల్లేరు లంక వాసుల జీవ‌నానికి ఢోకా లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

రొయ్య‌ల సాగుతోనే ఛిన్నాభిన్నం ..

కొల్లేరులో స‌హ‌జ సిద్ధంగా సాగిన చేప‌ల పెంప‌కం, ఆక్వా క‌ల్చ‌ర్ అంటూ వ‌చ్చిన రొయ్య‌ల సాగు మూలంగా అనేక స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టింద‌ని గుడివాక‌లంకకు చెందిన జ‌య‌మంగ‌ళం సున్నిబాబు బీబీసీకి తెలిపారు.

''మా త‌ల్లిదండ్రులు చేప‌లు పెంచేవారు. వాటిని అమ్ముకుని జీవ‌నం సాగించేవారు. కానీ, ఆక్వా సాగు వ‌చ్చిన త‌ర్వాత చెరువుల‌న్నీ లీజుల‌కు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఇప్పుడు ఎక‌రానికి రూ. 1.50 ల‌క్ష‌లు ఇస్తున్నారు. ఆ చెరువుల్లో మా వాళ్లు కూలీల‌య్యారు. సొసైటీల‌కు వ‌స్తున్న ఆదాయం ఊర్లో కుటుంబాలంద‌రికీ పంచుతున్నారు. మా బ‌తుకులు బాగుప‌డ్డాయి. కానీ, కొల్లేరు స్వ‌రూపం మారిపోయింది. ఇప్పుడంతా కాలుష్య‌మే అన్న‌ట్టుగా ఉంది. ఒక‌ప్పుడు కొల్లేరు నీరు తాగి బ‌తికిన మాకు ఇప్పుడు మంచినీటికి దిక్కులేదు. తాగునీరు కావాలంటే 18 కిలో మీట‌ర్ల నుంచి వేసిన పైప్ లైన్ నుంచి రావాల్సిందే'' అని తెలిపారు.

ఆప‌రేష‌న్ కొల్లేరుతో అక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 1999లో జీవో నంబర్ 120 విడుద‌ల చేసి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. 2006లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం ఆ జీవో అమ‌లు చేసింది.

వేల ఎక‌రాల్లో చెరువుల ధ్వంసం చేశారు. కొల్లేరు ప్ర‌క్షాళ‌న కోస‌మంటూ సాగించిన ఆపరేష‌న్ కొల్లేరులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు కాకుండా, సామాన్యుల భూములు స్వాధీనం చేసుకున్నార‌ని అప్ప‌ట్లో స్థానిక రైతులు ఆరోపించారు. అయినా ప్ర‌భుత్వం ముంపు, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మంటూ ఆప‌రేష‌న్ సాగించింది.

ఆ త‌ర్వాత చెరువులు కోల్పోయిన వారికి ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అది స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేద‌ని కొల్లేరు వాసులు చెబుతున్నారు.

కాంటూరు కుదింపు కుదిరేనా?

కొల్లేరులో 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి కుదించాల‌ని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు. గ‌తంలో భీమ‌వ‌రం బ‌హిరంగ‌స‌భ‌లో 2014 ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర మోదీ కూడా దీనిపై హామీ ఇచ్చారు.

ఆ త‌ర్వాత 2015లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అసెంబ్లీలో కాంటూరు కుదింపు కోసం తీర్మానం కూడా చేసింది. కానీ, అది కేంద్రం ప‌రిధిలో ఉన్న అంశం కావడంతో వారికి నివేదిస్తున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

స‌ముద్ర‌మ‌ట్టానికి ఎగువ‌, దిగువ‌న ఎంత మేరుకు ఉన్న‌ది అన్న‌ది లెక్క‌గ‌ట్టి కాంటూరు లెక్కిస్తారు. ప్ర‌స్తుతం కాంటూరు 5గా ఉన్న కొల్లేరు ప‌రిధిని కాంటూరు 3కు కుదిస్తే సుమారుగా 40 వేల ఎక‌రాల భూమి సాగులోకి వ‌స్తుంది. త‌ద్వారా స్థానికులంద‌రికీ ఉపాధి ల‌భిస్తుంద‌ని రైతులు చెబుతున్నారు.

ఏపీ రైతుసంఘం నాయ‌కుడు కె. శ్రీనివాస్ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ ''కాంటూరు కుదింపు ఈ ప్రాంత వాసులు సుదీర్ఘ‌కాల డిమాండ్. పలుమార్లు ప్ర‌భుత్వానికి చెప్పిన త‌ర్వాత కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల పెద్ద‌లు కూడా హామీలు ఇచ్చారు. అయినా అమ‌లుకి నోచుకోవ‌డం లేదు. కాంటూరు కుదించిన త‌ర్వాత దాదాపు 70 వేల ఎక‌రాల వ‌ర‌కూ కొల్లేరు కింద సాగు భూమి మిగులుతుంది. దానిని ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా స‌క్ర‌మంగా అభివృద్ధి చేస్తే అంద‌రికీ మేలు జ‌రుగుతుంది. కానీ, ప‌ర్యావ‌ర‌ణం పేరు చెప్పి ప్ర‌జ‌ల ఉపాధిని కొల్ల‌గొట్ట‌డం త‌గ‌దు'' అని అన్నారు.

త‌గ్గిపోతున్న విదేశీ పక్షులు

కేంద్రప్రభుత్వం 2009లో చిత్త‌డి నేల‌ల ప‌రిధిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. 2012లో కొల్లేరును ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్ర‌క‌టించింది.

అయినప్పటికీ, కొల్లేరులో ప‌ర్యావ‌ర‌ణం పరిరక్షణ ప‌ట్ల నిర్ల‌క్ష్యం పెరుగుతోంద‌ని ఏలూరుకి చెందిన సామాజిక‌వేత్త కేబీ రావు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ, కొల్లేరు కీల‌క‌మైన ప‌ర్యావ‌ర‌ణ కేంద్రమని, దాని ప‌ట్ల ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోగా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయని ఆరోపించారు. దీని వల్లే విదేశీ వ‌ల‌స ప‌క్షులు కూడా త‌గ్గిపోతున్నాయని చెప్పారు.

''గ‌తంతో పోలిస్తే అరుదైన జాతి ప‌క్షులు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఆక్ర‌మ‌ణ‌లు, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. కొల్లేరుని కాపాడుకోవ‌డానికి త‌గిన రీతిలో చ‌ర్య‌లు చేప‌ట్టాలి'' అని ఆయన కోరారు.

రెండు నెల‌ల్లో కార్యాచ‌ర‌ణ చేప‌డ‌తాం

కాంటూరు కుదింపు ప‌ట్ల ప‌లు అభ్యంత‌రాలు ఉన్నాయి. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లూ ఉన్నాయి. వాట‌న్నంటినీ ప‌రిశీలించాల్సి ఉంద‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు.

ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ బీబీసీతో మాట్లాడుతూ ''కొల్లేరు ప్రాంత స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేస్తున్నాం. కొల్లేరు ప‌రిర‌క్ష‌ణ మా బాధ్య‌త‌. ప్ర‌జ‌ల‌కు, ప‌ర్యావ‌ర‌ణానికి ఎటువంటి స‌మ‌స్య రాకుండా చూస్తున్నాం. కొల్లేరు రూపురేఖ‌లు మారిపోవ‌డం బాధాక‌రం. స‌ర‌స్సుని కాపాడుకునేందుకు ఏం చేయాల‌న్న దానిపై ఇరిగేష‌న్, ఫారెస్ట్ అధికారులు క‌లిసి ఓ నివేదిక త‌యారు చేయాల‌ని ఆదేశించాం.

‘‘కొల్లేరు ప్ర‌క్షాళ‌న‌కు అవ‌స‌ర‌మైన రెగ్యులేట‌రీ చానెళ్లు స‌హా అన్ని వివ‌రాల‌తో నివేదిక 2 నెల‌ల్లో సిద్ధం అవుతుంది. కొల్లేరు ప్రాంత వాసుల మంచినీటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు చెరువులు తవ్వ‌కాల‌కు అనుమ‌తులు తీసుకొస్తాం. కాంటూరు స‌మ‌స్య‌పై అంద‌రితో చ‌ర్చిస్తాం'' అని తెలిపారు.

‘వ‌న్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు '

కొల్లేరు ప‌రిధిలో వ‌న్య‌ప్రాణుల‌కు ఎటువంటి స‌మ‌స్యలు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అట‌వీశాఖాధికారి అనంత శంక‌ర్ తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ ''రెండేళ్ల కిందట కొల్లేరులో నీటి స‌మ‌స్య వ‌చ్చింది. త‌గిన స్థాయిలో స‌ర‌స్సులో నీటి ల‌భ్య‌త లేక‌పోవ‌డంతో విదేశీ ప‌క్షుల రాక త‌గ్గింది. సైబీరియా, ర‌ష్యా, చైనా స‌హా ప‌లు దేశాల ప‌క్షి జాతులు వ‌స్తుంటాయి. కానీ, గ‌త ఏడాది కొల్లేరులో త‌గినంత నీరు అందుబాటులో ఉండ‌డంతో ప‌క్షులు వ‌చ్చాయి. ఈసారి కూడా వ‌ర్షాలు బాగా కురిసినందున ప‌క్షులు ఎక్కువ సంఖ్య‌లో వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాం. అరుదైన ప‌క్షుల‌ను చూసేందుకు ప‌ర్యాట‌కుల సంఖ్య కూడా పెరుగుతోంది. త‌గిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం'' అని తెలిపారు.

కొల్లేరు స‌మ‌స్య‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు ప‌లు క‌మిటీల‌ను నియ‌మించాయి. శ్రీరామ‌కృష్ణ‌య్య క‌మిటీ నివేదిక ప్ర‌కారం కొల్లేరు చానెళ్ల రెగ్యులేష‌న్ మీద దృష్టి సారించాల్సి ఉంది.

మిత్రా క‌మిటీ కూడా ప‌లు సిఫార్సులు చేసిన‌ప్ప‌టికీ అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌స్తుతం కొల్లేరు రానురాను కుచించుకుపోతోంద‌ని స్థానికులు చెబుతున్నారు.

కాంటూరు రీ స‌ర్వే చేసి, పారిశ్రామిక‌, ఇతర వ్య‌ర్థాలు అరిక‌ట్టి, అటు ప‌ర్యావ‌ర‌ణం, ఇటు స్థానిక ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు రాకుండా చూడాల‌ని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు