పది కోట్ల మందికి అన్నం పెట్టే పరిశ్రమ.. పడి లేవలేకపోతోంది

బనారస్ చీరలకు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఆ చీరలను నేసే కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?
"రెండు చీరలు నేస్తే రోజుకు రూ .150 వస్తాయి. కొన్ని నెలలుగా చీరల ఆర్డర్లు తగ్గిపోయాయి. మాకు పని తగ్గింది. ఇప్పుడు చీరలు నేస్తే మాకు పూటగడవటం లేదు. అందుకే చీరలు నేయడంతో పాటు, బయట కూలీ పనులకు కూడా వెళ్లక తప్పట్లేదు."
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావు జిల్లా కాసింపూర్ నేత కార్మికుల టౌన్షిప్ వాసి నౌషాద్ చెప్పిన మాటలివి.
ఆయన ఇంట్లోనే రెండు మరమగ్గాలను నడుపుతున్నారు. ఆయన, ఆయన తల్లి, భార్య, ఇద్దరు చెల్లెళ్లు అందరూ చీరలే నేస్తారు.
రెండు పవర్‌లూమ్‌ల మీద అందరూ కష్టపడితే, రోజులో రెండు మూడు చీరలు పూర్తవుతాయి. అందరికీ కలిపి రోజుకు ఓ రూ.300 వస్తాయి. కానీ, ఆర్డర్లు లేక కొన్ని రోజులుగా ఒక పవర్లూమ్ మూతపడింది.
కాసింపూర్‌లో చాలామంది తమ ఇళ్లలో పవర్‌లూమ్‌లను నడుపుతున్నారు. చీరలు నేయడమే వారికి జీవనోపాధి. ఆర్డర్ల మీద చీరలు నేస్తారు. ఒక్కో చీరకు రూ.100 వస్తాయి.
ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులే నూలు, నైలాన్ లాంటి ముడి సరులను సరఫరా చేస్తారు.
దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావం చేనేత పరిశ్రమ, దానిపై ఆధారపడి బతుకుతున్న కార్మికులపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక్కడ పనులు లేక ఇప్పటికే వందల మంది ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లారని స్థానికులు చెప్పారు.
'గతిలేక ఈ పనిచేస్తున్నాం'
"12-14 గంటలు కష్టపడినా మా కడుపు నిండటం కష్టమైపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ పరిశ్రమలోనే ఉండాలని ఎవరు కోరుకుంటారు? మరోచోటుకు వెళ్లలేక, గతిలేక మేము ఇక్కడే పనిచేయాల్సి వస్తోంది" అని కాసింపూర్ వాసి రెహమాన్ అన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావు జిల్లా చేనేత పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా బనారస్ చీరలు నేస్తారు. మావుతో పాటు, అజాంగఢ్, వారణాసి , ముబారక్పూర్లోనూ బనారస్ చీరల తయారీ, అమ్మకాలు జరుగుతాయి.
యూపీలోని గోరఖ్‌పూర్, తాండా, మీరట్ లాంటి నగరాల్లోనూ చేనేత పరిశ్రమ ఉంది. అంతటా పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది.
ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాదు, దేశమంతా పరిస్థితి ఇలాగే ఉంది.
దేశవ్యాప్తంగా మగ్గాల సంఖ్య, కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. డిమాండ్‌ను పెంచి ఈ పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించినా, పరిస్థితి క్షీణిస్తూనే ఉంది.
దేశంలో వస్త్ర పరిశ్రమ సుమారు పది కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఉపాధి కల్పన విషయంలో, ఈ రంగం వ్యవసాయం తరువాత రెండవ స్థానంలో ఉంది.
బాధలు వివరిస్తూ పత్రికల్లో ప్రకటన
వస్త్ర పరిశ్రమ ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందో వివరిస్తూ గత నెల ఆగస్టు 20న, ఉత్తరభారత స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ (నిట్మా) వార్తా పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది.
'దేశంలో స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. దాంతో అనేకమంది ఉపాధి కోల్పోయి, నిరుద్యోగులుగా మారుతున్నారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
"స్పిన్నింగ్ మిల్లుల్లో దాదాపు మూడోవంతు మూతపడే స్థితిలో ఉన్నాయి. రూ.80,000 కోట్ల విలువైన పత్తిని కొనేవారు లేరు. ప్రభుత్వం ముడి పదార్థాల ధరను తగ్గించి, ఎగుమతులపై పన్ను తగ్గించాలన్నది మా డిమాండ్. ,ప్రభుత్వం రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు అందేలా చూడాలి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా నుంచి ముడి పదార్థాల దిగుమతిని నిషేధించాలి" అని నిట్మా వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ త్యాగి అన్నారు.
తాము ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని, అందుకే పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని త్యాగి చెప్పారు.
సూరత్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వస్త్ర పరిశ్రమలో స్తబ్దత, ఉద్యోగాల కోత పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.
అయినా, ఈ సమస్యనను ప్రభుత్వం ధృవీకరించడంలేదు. ఎందుకంటే, ఈ రంగంలో ఎక్కువ భాగం అసంఘటిత రంగం కిందకు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వానికి అందడటంలేదు. మీరు కేంద్ర టెక్స్ట్ టైల్ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో దొరికే డేటాను పరిశీలిస్తే, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో నిరుద్యోగం, స్తబ్దత లాంటి విషయాల్లో పెద్దగా మార్పు లేదని అర్థమవుతోంది.
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?

ఉపాధి కల్పించే విషయంలో, వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమ దేశంలో రెండవ అతిపెద్ద రంగం. అయితే, రోజులు గడిచేకొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 1995లో 65 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారు. 2010లో ఆ సంఖ్య 43 లక్షలకు పడిపోయింది. అప్పటి నుంచి ఈ సంఖ్య నిరంతరం తగ్గుతూ వస్తోంది.
గత మూడేళ్ల నుంచి ఈ రంగం తిరోగమనం దిశగా వెళ్తోందని ఉత్తర్‌ప్రదేశ్ నేత కార్మికుల ఫోరం చైర్మన్ అర్షద్ జమాల్ అన్నారు.
"ఈ పరిశ్రమలో మాంద్యం నోట్ల రద్దుతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక కోలేకోలేదు. నోట్ల రద్దు చేనేత పరిశ్రమ నడ్డి విరిచింది. ఆ దెబ్బ నుంచి వస్త్ర పరిశ్రమ ఇప్పటికీ కోలుకోవడంలేదు. దానికి తోడు జీఎస్టీ మరింత నష్టం కలిగించింది" అర్షద్ జమాల్ చెప్పారు.
ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ వీరేంద్ర భట్ అన్నారు. "ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో 21 స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి. అవి అక్కడి నేత కార్మికులకు నూలును సరఫరా చేస్తుండేవి. ఇవాళ మిల్లులన్నీ మూతపడ్డాయి. ఫలితంగా నేత కార్మికులు నూలు, నైలాన్‌ను అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. ఏడాది క్రితం, అలహాబాద్‌లో ఒక స్పిన్నింగ్ మిల్లును మళ్లీ ప్రారంభించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది విఫలమైంది. ఈ రంగంలో, ప్రభుత్వ విధానాలు నేత కార్మికుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నాయి" అని ఆయన అన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆరోగ్య బీమా పథకం, పవర్లూమ్ సబ్సిడీ పథకం, ప్రధాన్ మంత్రి ముద్ర యోజన, హాత్కర్ఘా సంవర్ధన్ సహాయత యోజన పథకం లాంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ, నేత కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో వస్త్ర పరిశ్రమను కరెంటు కోతలు కూడా తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయని కార్మికులు అంటున్నారు.
ఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవం మరోలా ఉంది.
ఎందుకంటే, గత కొన్నేళ్లుగా ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.710 కోట్లు కేటాయించారు. 2017-18లో రూ.604 కోట్లకు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 386 కోట్లకు తగ్గించారు. 2019-20 బడ్జెట్లో రూ.456 కోట్లు కేటాయించారు.
కార్మికులకు నేరుగా ప్రయోజనం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వస్త్ర పరిశ్రమ నిపుణులు అంటున్నారు. సాంకేతికత పరంగానూ మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్షద్ జమాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
- కృత్రిమ కాళ్లతో నడిచే చిన్నారి మోడల్.. "ఈ పాపను చూస్తే జాలిపడరు, అద్భుతం అంటారు"
- తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)