భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి

 • 3 సెప్టెంబర్ 2019
అపాచీ హెలికాప్టర్ Image copyright ANI

భారత వాయుసేన అమ్ముల పొదిలో అత్యంత అధునాతన అపాచి హెలికాప్టర్లు వచ్చి చేరాయి.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఎనిమిది అపాచీ హెలికాప్టర్ల దళాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ హెలికాప్టర్ దళాన్ని ప్రారంభించిన వీడియోను భారత వాయుసేన ట్విటర్‌లో విడుదల చేసింది. రష్యా ఎంఐ-35 హెలికాప్టర్ల దళం స్థానంలో అపాచీ-64ఇ హెలికాప్టర్ల దళాన్ని చేరుస్తున్నారు.

అపాచీ ప్రత్యేకతలు ఏమిటి?

 • అపాచీ హెలికాప్టర్ వైమానిక దాడుల్లో బహుళ పాత్ర పోషిస్తుంది.
 • ఈ హెలికాప్టర్ నేల నుంచి గాలిలోకి నిలువుగా గరిష్టంగా నిమిషానికి 2,800 మీటర్ల వేగంతో లేవగలదు.
 • అపాచీ గరిష్టంగా గంటకు 279 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
 • బులెట్లు, బాంబులు, క్షిపణులను ప్రయోగించగలదు.
 • హెలికాప్టర్ కింద ఉన్న రైఫిల్‌లో ఒకసారి 1,200 రౌండ్ల 30ఎంఎం బులెట్లను లోడ్ చేయవచ్చు.
 • శత్రువు భూభాగంలో నిఘా ఆపరేషన్లు కూడా నిర్వహించగలదు.
 • అన్ని రకాల వాతావరణాల్లో, అన్ని రకాల భూభూగాల్లో ప్రయాణించగలదు. దాడులు చేయగలదు.
 • ఒక్కో హెలికాప్టర్‌ను నడపటానికి ఇద్దరు పైలట్లు అవసరం.
 • ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. అందువల్లే దీని వేగం ఎక్కువ.
 • ఈ హెలికాప్టర్‌ది సంక్లిష్టమైన డిజైన్. దీనిని రాడార్ మీద పసిగట్టటం కష్టం.
 • ఇది ఒకసారి గాలిలోకి ఎగిరితే మూడుంపావు గంటల వరకూ ప్రయాణించగలదు.

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఈ అపాచీ హెలికాప్టర్లను తయారు చేస్తోంది.

భారతదేశం 22 అపాచీ ఏహెచ్65ఈ హెలికాప్టర్లు కొనుగోలు కోసం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

మొదటి ఎనిమిది హెలికాప్టర్లు నిర్ణీత గడువులో భారత్‌కు అందాయి.

Image copyright BOEING.COM

2020 సంవత్సరం నాటికి భారత వాయుసేనకు మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లు అందుతాయి.

ఒప్పందం ప్రకారం ఈ హెలికాప్టర్ల సర్వీస్ సేవలను తాము అందిస్తామని కానీ ఉచితంగా కాదని బోయింగ్ పేర్కొంది.

Image copyright ANI

అమెరికా సైన్యం 1984 నుంచి ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. అపాచీ హెలికాప్టర్లను వైమానిక దళంలో చేర్చిన 14వ దేశం ఇండియా.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, ఈజిప్ట్, గ్రీస్, ఇండొనేసియా, ఇజ్రాయెల్, జపాన్, కువైట్, నెదర్లాండ్స్, కతార్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లో 2,200 పైగా అపాచీ హెలికాప్టర్లు వినియోగంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు