బుమ్రా: అమ్మ ఆంక్షలే యార్కర్లు వేయడంలో తొలి పాఠాలు నేర్పాయి

  • 3 సెప్టెంబర్ 2019
బుమ్రా Image copyright facebook/JaspritJBumrah

ఏ విధంగా చూసుకున్నా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడున్న అగ్రశ్రేణి బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ముందువరుసలో ఉంటాడు. యార్కర్, బౌన్సర్, ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్.. ఇలా ఈ భారత ఫాస్ట్ బౌలర్ అమ్ములపొదిలో లేని అస్త్రమంటూ లేదు.

కింగ్స్‌టన్ టెస్ట్‌తో ఈ విషయాన్ని అతడు మరో సారి రుజువు చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు తన కెరీర్‌లోనే తొలి హ్యాట్రిక్‌ తీశాడు.

దీంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే భారత్ కట్టడి చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడి 257 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

దీనికి ముందు తొలి టెస్టులోనూ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడొగట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతడు ఇచ్చుకున్న పరుగులు కేవలం ఏడే.

ఈ రెండు మ్యాచ్‌ల్లో విండీస్ బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా ముచ్చెమటలు పట్టించాడు.

బుమ్రాను భారత బౌలింగ్ దళ నాయకుడిగా విశ్లేషకులు చూస్తున్నారు. అనుభవజ్ఞుడైన బౌలర్ ఇషాంత్ శర్మ కూడా బుమ్రా ఇచ్చిన సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయని వెల్లడించాడు.

బుమ్రా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. తన బలహీనతలు కూడా అతడికి బాగా తెలుసు. అతివిశ్వాసానికి పోడు. నేర్చుకోవాలన్న తపన ఎక్కువ.

టెస్టులకు, వన్డేలకు, టీ20లకు అతడి దగ్గర విడివిడిగా వ్యూహాలు సిద్ధంగా ఉంటాయి.

తాను వేసే బంతులపై బుమ్రా అద్భుతమైన నియంత్రణ ప్రదర్శిస్తుంటాడు. చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆంక్షలే ఈ విషయంలో అతడికి తొలి పాఠాలు నేర్పించాయి.

Image copyright AFP/GETTYIMAGES

అమ్మ చెప్పింది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1993 డిసెంబర్ 6న ఓ వ్యాపార కుటుంబంలో బుమ్రా పుట్టాడు.

ఏడేళ్ల వయసులోనే అతడి తండ్రి చనిపోయాడు. ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న తల్లి దల్జీత్ అన్నీ తానై బుమ్రాను పెంచారు.

చిన్నప్పుడు టీవీలో ఫాస్ట్ బౌలింగ్ చూస్తూ బుమ్రా అనుకరిస్తుండేవాడు. ఇంట్లో గోడకు బాల్ వేస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.

బంతి ఊరికే గోడకు తగలడంతో వచ్చే శబ్దానికి బుమ్రా తల్లికి విసుగొచ్చేది. దాంతో శబ్దం తక్కువ వచ్చేలా ఆడుకోవాలని, లేదంటే ఇంట్లోనే ఆడొద్దని అతడికి ఆమె గట్టిగా చెప్పారు.

దీంతో బుమ్రాకు ఒక ఐడియా వచ్చింది. బౌలింగ్ చేసేటప్పుడు బంతిని గోడ దిగువ అంచులో వేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తే, బంతి ఫ్లోరింగ్, గోడ కలిసే చోట తగిలి శబ్దం తక్కువగా వస్తుంది.

ఇలా బుమ్రా బంతి నియంత్రణలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు.

Image copyright Getty Images

చిన్నతనం నుంచీ ఫాస్ట్ బౌలింగ్ అనుకరించిన బుమ్రాకు ఓ ప్రత్యేక బౌలింగ్ యాక్షన్ ఏర్పడింది. ఆ బౌలింగ్ యాక్షన్ చూసి బ్యాట్స్‌మెన్ గందరగోళంలో పడేవారు.

స్కూల్ క్రికెట్ నుంచే ఒక గుర్తింపు రావడంతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ బుమ్రాను ఎంపిక చేసింది.

తర్వాత అతడు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు సెలక్ట్ అయ్యాడు. తర్వాత చూస్తూ చూస్తూనే గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మొదటి మ్యాచ్‌లోనే సౌరాష్ట్ర అండర్-19 బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా చుక్కలు చూపించాడు.

దాంతో గుజరాత్ రంజీ కోచ్ హితేష్ మజుందార్, టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

2013లో జరిగిన ఆ టోర్నీలో బుమ్రా అద్భుతంగా రాణించాడు. గుజరాత్ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మూడు వికెట్లు తీశాడు.

అదే టోర్నీ అతడి కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఆ టోర్నీని వీక్షించేందుకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు కోచ్‌ జాన్‌ రైట్ వచ్చారు. ఆయన్ను బుమ్రా బౌలింగ్ బాగా ఆకట్టుకుంది.

దీంతో బుమ్రాకు ముంబై ఇండియన్స్‌ కాంట్రాక్ట్ దక్కింది. సచిన్ తెందుల్కర్, లసిత్ మలింగ లాంటి స్టార్ ఆటగాళ్లతో కలసి డ్రెసింగ్ రూం పంచుకునే అవకాశం వచ్చింది.

Image copyright TWITTER/ JASPRIT BUMRAH

స్టార్స్ సహచర్యంతో..

స్టార్ ఆటగాళ్ల సహచర్యం బుమ్రాను మరింత మెరుగ్గా తయారుచేసింది.

ఐపీఎల్‌లో తన మొట్టమొదటి మ్యాచ్‌లొ అతడు రాయల్ ఛాలెంజర్స్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో బుమ్రా వేసిన మొదటి మూడు బంతులను కోహ్లీ వరుసగా బౌండరీలుగా మలిచాడు.

దీంతో కుంగిపోయిన బుమ్రాలో సచిన్ తెందుల్కర్ స్ఫూర్తి నింపాడు. "ఒక మంచి బంతితో మనం మ్యాచ్‌ను మార్చేయొచ్చు. దిగులు పడకు" అని అతడికి సలహా ఇచ్చాడు.

చివరికి అదే జరిగింది. బుమ్రా అదే ఓవర్లో విరాట్ కోహ్లీని ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.

కానీ, ఆ తర్వాత బుమ్రా హఠాత్తుగా ఫాం కోల్పోయాడు. ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టాయి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది.

Image copyright Getty Images

లసిత్ మలింగతో కలిసి ఆడడం బుమ్రాకు లాభించింది. అతడి నుంచి స్లో బాల్స్ వేయడంలో నైపుణ్యాలను బుమ్రా నేర్చుకున్నాడు. స్లో బాల్స్ బుమ్రా ప్రమాదకరమైన ఆయుధాల్లో ఒకటిగా మారాయి.

బుమ్రాకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన అంశం మాత్రం అతడి బౌలింగ్ యాక్షనే. దాన్ని చదవడం బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు.

"చిన్నతనం నుంచి నేను చాలా మంది బౌలర్లను చూసి నేర్చుకున్నా. కానీ ఈ యాక్షన్ ఎలా డెవలప్ అయ్యిందో నాకు తెలీదు.అయితే, ఏ కోచ్ కూడా దాన్ని మార్చుకోమని చెప్పలేదు. ఫిట్‌గా ఉండాలని మాత్రం సూచించారు. ఎందుకంటే శరీరం బరువెక్కితే నా స్పీడ్ తగ్గుతుందని వారికి అనిపించింది" అని బుమ్రా తన బౌలింగ్ యాక్షన్ గురించి ఒక సందర్భంలో వివరించాడు.

అన్నీ కలిసి రావడంతో 2016 జనవరిలో టీ-20ల్లో, వన్డేల్లో భారత జట్టుకు ఆడే అవకాశం బుమ్రాకు వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.

చూస్తుండగానే భారత బౌలింగ్ దళం నాయకుడిగా ఎదిగాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే? ఆ సముద్రంలో ఉష్ణోగ్రతలు మారితే ఏమవుతుంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితులను చంపేస్తే ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

హైదరాబాద్ అత్యాచారం, ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"