విరుష్క: అనుష్క శర్మతో హానీమూన్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ బయటపెట్టిన ఆసక్తికర విషయం ఏమిటి?

  • 7 సెప్టెంబర్ 2019
కోహ్లీ, అనుష్క Image copyright ANUSHKASFANCLUB/TWITTER

భారత్‌లో క్రికెట్, సినిమా.. రెండు మతాల్లాంటివని అంటుంటారు. ఈ రెండు రంగాలకున్న పాపులారిటీ అలాంటిది.

అందుకే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిందీ సినీ తార అనుష్కశర్మల ప్రేమాయణం అప్పట్లో జనాలకు చాలా ఆసక్తికర అంశంగా ఉండేది. ఈ జంటను 'విరుష్క' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు.

దాదాపు నాలుగేళ్ల ప్రేమయాణం తర్వాత కోహ్లి, అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తాజాగా 'ఇన్ డెప్త్ విత్ గ్రాహమ్ బెన్సింగర్' అనే అమెరికన్ టీవీ షోకు కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

అనుష్కను తొలిసారి కలిసిన సందర్భంతోపాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అతడు ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నాడు.

Image copyright twitter/imVkohli

ఓ షాంపూ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో అనుష్కను తాను తొలిసారి కలిశానని కోహ్లీ చెప్పాడు.

''ఆ యాడ్ షూటింగ్ మూడు రోజులు జరిగింది. అనుష్కతో కలిసి ఆ యాడ్ చేయాల్సి ఉంటుందని నా మేనేజర్ వచ్చి చెప్పాడు. నాకు టెన్షన్ పట్టుకుంది. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అయిన అనుష్క పక్కన నేనెలా చేయగలుగుతా అని మేనేజర్‌తో అన్నా. ఏం ఫర్వాలేదని, యాడ్ స్క్రిప్ట్ కూడా బాగుందని అతడు చెప్పాడు. అయినా, నాలో టెన్షన్ తగ్గలేదు'' అని అన్నాడు కోహ్లీ.

''అనుష్కను తొలిసారి కలవగానే టెన్షన్‌కు లోనయ్యా. ఆమె హీల్స్ వేసుకుని ఉంది. నా కంటే ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తోంది. నాపై నేనే ఓ చెత్త జోక్ వేసుకున్నా. దీంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నాలో గుబులు మరింత పెరిగింది'' అని వివరించాడు.

తమ ఇద్దరి కెరీర్లు ఒకేసారి మొదలయ్యాయని, ఇద్దరం ఒకే తరహా కుటుంబాల నుంచి వచ్చామని కోహ్లీ చెప్పాడు. తమ పెళ్లి ఏర్పాట్లంతా అనుష్కనే దగ్గరుండి చూసుకుందని, తాను అప్పుడు ఓ క్రికెట్ సిరీస్ మధ్యలో బిజీగా ఉన్నానని వివరించాడు.

Image copyright twitter/imVkohli

ఇటలీలో జరిగిన తమ వివాహ వేడుకకు కేవలం 42 మందిని పిలిచామని.. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం, క్రికెటర్ల కోసం విడివిడిగా విందులు ఏర్పాటు చేశామని కోహ్లీ చెప్పాడు.

తమ హనీమూన్ గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కోహ్లీ ఈ టీవీ షోలో బయటపెట్టాడు.

''మమ్మల్ని గుర్తుపట్టేవారు ఎవరూ ఉండరని ఫిన్లాండ్‌కు వెళ్లాం. అక్కడ ఓ హోటళ్లో కాఫీ తాగుతూ, ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. పక్కనే ఓ టేబుల్‌ వద్ద తలపాగా పెట్టుకున్న వ్యక్తి కనిపించాడు. మేం అతడికి దూరంగా, కొంచెం లోపలకు ఉన్న టేబుల్ వైపు వచ్చి కూర్చున్నాం. కొద్ది సమయం తర్వాత ఆ వ్యక్తి కూడా మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని చూడటం సంతోషం కలిగించిందని, తన ఇంటి పేరు కూడా కోహ్లీనేనని చెప్పాడు. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని చోటుకు ఎప్పటికి వెళ్తామో అని అప్పుడు నాకు అనిపించింది'' అని కోహ్లీ వివరించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)