రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ

బోనులో ఒకే మహిళ నిలబడింది. కానీ ఆమెలో అప్పటికప్పుడే ఆరుగురు కనిపిస్తున్నారు. వారంతా పాశవిక లైంగిక దాడిపై వాంగ్మూలం ఇస్తున్నారు. సొంత కూతురిపైనే పదేపదే అత్యాచారంచేసిన ఓ తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు. అసలు వీరంతా ఎవరు? ఆమె లోపల ఏం చేస్తున్నారు? కోర్టు ఏం తీర్పు ఇచ్చింది?
ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపీడీ)తో సతమతం అవుతున్న జెనీ హెయిన్స్ కథ.
బాల్యంలో జెనీ పదేపదే అత్యాచారానికి గురైంది. సొంత తండ్రి రిచర్డ్ హెయిన్స్ ఆమెపై అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. చిత్రహింసలూ పెట్టాడు.
ఆస్ట్రేలియాలోని బాలలపై ఇప్పటివరకూ జరిగిన అత్యంత దారుణ అకృత్యాల్లో ఈ కేసు ఒకటని పోలీసులు చెబుతున్నారు.
పైశాచికత్వాన్ని తట్టుకునేందుకు జెనీ ఓ విపరీత వ్యూహానికి అలవాటుపడింది. బాధను భరించేందుకు తనలో కొత్త కొత్త వ్యక్తులను సృష్టించుకోవడం మొదలుపెట్టింది. వేధింపులు చాలా తీవ్రంగా దీర్ఘకాలం కొనసాగాయాని, వాటిని ఎదుర్కొని మనుగడ సాగించేందుకు మొత్తంగా 2500 మంది వ్యక్తుల్ని తనలో తానే సృష్టించుకున్నానని జెనీ వివరించింది.
ఈ కేసు విచారణ మార్చిలో మొదలైంది. తన తండ్రికి ఎలాగైనా శిక్ష పడేలా చూసేందుకు తనలోని 2500 మంది వ్యక్తులతో కలిసి జెనీ పోరాడింది.
మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపీడీ) లేదా డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (డీఐడీ)తో బాధపడుతున్న ఓ వ్యక్తి తనలోని వ్యక్తులతో కలిసి కోర్టులో నిందితుడికి శిక్ష పడేలా చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారిగా భావిస్తున్నారు.
''మేం భయపడలేదు. అసలు ఏం జరిగిందో చెప్పేందుకు చాలా కాలం నిరీక్షించాం. ఇకపై అతడు మా నోరు నొక్కేయలేడు''అని జెనీ వివరించింది.
ఆమె సాక్ష్యం అనంతరం గత శుక్రవారం 74ఏళ్ల రిచర్డ్‌కు సిడ్నీ కోర్టు 45ఏళ్ల జైలు శిక్ష విధించింది.
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- నాగ్‌పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
నా బుర్రలోనే నాకు భద్రత లేదు
1974లో లండన్‌లోని బెక్స్లీహీత్ నుంచి ఆస్ట్రేలియాకు రిచర్డ్ కుటుంబం వలసవెళ్లింది. అప్పటికి జెనీ వయసు నాలుగేళ్లే. అయితే అప్పటికే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. సిడ్నీకి వెళ్లాక ఈ పైశాచికత్వం మరింత కోరలు చాచింది.
''మా నాన్న వేధింపులు పక్కా ప్రణాళిక ప్రకారం ఉండేవి. ప్రతీదీ అతడు కావాలనే చేసేవాడు. అనుక్షణమూ పైశాచిక ఆనందం పొందేవాడు''అని కోర్టులో గత మేలోనే ఆమె వాంగ్మూలమిచ్చింది.
''వద్దు.. వద్దు.. అంటూ చేసే ఆర్తనాదాలను వినేవాడు. నేను అనుభవిస్తున్న బాధ, హింసలను కళ్లారా చూసేవాడు. తన వల్ల శరీరం హూనం అవుతున్నా, రక్తం కారుతున్నా పట్టించుకోనేవాడు కాదు. మళ్లీ మరుసటిరోజు అలానే చేసేవాడు''అని జెనీ తెలిపింది.
తన బుర్రలోని ఆలోచనలు కూడా చదివేయగలనని జెనీని రిచర్డ్ బెరించేవాడు. అఘాయిత్యాల గురించి బయటకు పొక్కితే తన తల్లి, తోబుట్టువులనూ చంపేస్తానని భయపెట్టేవాడు.
''నా వ్యక్తిగత జీవితం మొత్తాన్నీ అతడే ఆక్రమించేశాడు. నా బుర్రలో కూడా నాకు భద్రత లేనట్లు అనిపించేది. అసలు ఏం జరుగుతోందో, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు''అని జెనీ వివరించింది.
తల్లికి కూడా తెలియదు
స్కూల్లో పిల్లలతో ఎక్కువగా మాట్లాడకుండా జెనీపై రిచర్డ్ ఆంక్షలు విధించేవాడు. దీంతో మౌనంగా ఉండేందుకే జెనీ అలవాటు పడిపోయింది.
లైంగిక వేధింపులు, శారీరక హింసతో గాయపడిన జెనీ శరీరానికి వైద్యం కూడా అందేది కాదు. దీంతో ఇవి తీవ్రమైన దీర్ఘకాలిక రుగ్మతలుగా మారిపోయాయి.
ప్రస్తుతం జెనీ వయసు 49ఏళ్లు. ఇప్పటికీ ఆమెపై వేధింపుల జాడలు కనిపిస్తున్నాయి. ఆమె కంటిచూపు, దవడ, కడుపులోని పేగులు, మలమూత్ర విసర్జన నాళాలు, వెన్నెముక చివరిభాగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. వీటికి ఎన్నో శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది.
11ఏళ్ల వయసులో జెనీ మళ్లీ బ్రిటన్‌కు వెళ్లిపోయేవరకూ ఈ వేధింపులు కొనసాగాయి. 1984లో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటివరకూ తనపై జరిగిన ఈ అఘాయిత్యాలు తన తల్లికి కూడా తెలియవని జెనీ వివరించింది.
- బ్రిటన్: స్కూల్ యూనిఫాంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి లైంగిక వేధింపులు
- ఈ డ్రెస్సులే లైంగిక వేధింపులకు కారణమా?
వేధింపులను భరించేది సింఫనీనే
సురక్షిత వాతావరణంలో పెరగాల్సిన పిల్లలకు విపరీతమైన వేధింపులు ఎదురయ్యేటప్పడు ఎంపీడీ, డీఐడీ లాంటి రుగ్మతలు చుట్టుముడతాయని ఆస్ట్రేలియాలోని వైద్య నిపుణులు చెబుతున్నారు.
''తమను తాము కాపాడుకొనేందుకు డీఐడీని బాధితులు వ్యూహంగా భావిస్తుంటారు''అని పిల్లల నిపుణులు పామ్ స్టవ్రాపోలిస్.. బీబీసీతో చెప్పారు.
''వయసు మరీ చిన్నది కావడంతోపాటు వేధింపుల తీవ్రత పెరిగేకొద్దీ.. డీఐడీకి అలవాటు పడటం పెరుగుతుంది. అంటే బాధను తట్టుకొనేందుకు వారు భిన్న వ్యక్తులుగా తమను తాము గుర్తించుకోవడంపై ఆధారపడుతుంటారు. దీని ఫలితమే మల్టిపుల్ పర్సనాలిటీలు''అని పామ్ చెప్పారు.
జెనీ తనలో తాను మొదట సృష్టించుకున్న వ్యక్తి పేరు సింఫనీ. ఆమె వయసు నాలుగేళ్లు. తన సొంత ప్రపంచంలో ఆమె ఎప్పుడూ ఉంటుంది.
''నాన్న వేధింపులకు సింఫనీ ఎంతో బాధపడేది. నిజానికి నేను హింసకు గురయ్యే ప్రతీసారి సంఫనీనే హింసను భరించేది''అని బీబీసీతో జెనీ వివరించింది.
ఏళ్లు గడిచేకొద్దీ.. వేధింపులను తట్టుకొనేందుకు సింఫనీ మరికొంత మందిని సృష్టించింది. అలా తనలోని ఒక్కొక్కరూ వందల వ్యక్తులను సృష్టించారు. వేధింపులను తట్టుకోవడం, పరిస్థితులను గుర్తుంచుకోవడంలో వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కోపాత్ర.
''మా నాన్న వేధింపులను ఎదుర్కొనేందుకు నాలోని వ్యక్తులు అండగా నిలిచారు''అని బీబీసీకి జెనీ తెలిపింది.
- లైంగిక వేధింపులకు గురైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం
- ‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
తనలో ఉన్నట్లుగా జెనీ చెబుతున్నవారిలో కొందరు
- మజిల్స్: గాయకుడు బిలీ ఐడల్లా ఉండే అతడి వయసు 13ఏళ్లు. పొడుగ్గా ఉంటాడు. కండలు కనిపించేలా షర్టులు వేసుకుంటాడు. జెనీకి రక్షణ కల్పించడం అతడి బాధ్యత.
- వాల్కనో: ఇతడు చాలా పొడుగ్గా, దృఢంగా ఉంటాడు. తల నుంచి కాళ్ల వరకూ నల్లని వస్ర్తాలు ధరిస్తాడు. జుట్టు తెల్లగా ఉంటుంది.
- రికీ: ఇతడి వయసు ఎనిమిదేళ్లు. బూడిద రంగు సూట్ వేసుకునే ఇతడి జుట్టు పొట్టిగా, ఎర్రగా ఉంటుంది.
- జుడాస్: ఇతడు ఎప్పుడూ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. పొట్టిగా ఉండే జుడాస్ జుట్టు ఎర్రగా ఉంటుంది.
- లిండా: పొడుగ్గా ఉండే ఈమె 1950ల్లో ఎక్కువగా వేసుకొనే గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తుంది.
- రిక్: తండ్రి రిచర్డ్ వేసుకునే పెద్ద కళ్లద్దాలను రిక్ వేసుకుంటాడు.
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- 'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్'
వైద్యుల పర్యవేక్షణలో
సింఫనీతోపాటు మరో ఐదు పర్సనాలిటీలతో వాంగ్మూలం ఇచ్చేందుకు గత మార్చిలో జెనీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జెనీలోని వీరంతా వేధింపులకు సంబంధించిన భిన్న కోణాలను వివరించారు.
బాధితురాలి వేదన మరింత పెరిగే అవకాశముందని న్యాయమూర్తులు భావించడంతో కేవలం ఒకేఒక న్యాయమూర్తి కేసును విచారించారు.
రిచర్డ్‌పై మొత్తం 367 అభియోగాలు నమోదయ్యాయి. చాలాసార్లు అత్యాచారం, విచక్షణ రహిత లైంగిక దాడి, పదేళ్లకంటే తక్కువ వయసుండే చిన్నారిపై అఘాయిత్యం తదితర ఆరోపణలు వీటిలో ఉన్నాయి. వీటిపై తనలోని భిన్న వ్యక్తులతో కలిసి సాక్ష్యాలు, వాంగ్మూలాలను కోర్టుకు జెనీ సమర్పించింది. ప్రతిచిన్న ఘటననూ జాగ్రత్తగా గుర్తించుకునేందుకు తనలోని మల్టిపుల్ పర్సనాలిటీలు తోడ్పడ్డాయి.
మరోవైపు జెనీ చెబుతున్న అంశాలన్నీ నిజమోకాదో గుర్తించేందుకు, ఆమె పరిస్థితిని గమనించేందుకు డీఐడీ, మానసిక నిపుణుల బృందాలను కోర్టు నియమించింది.
ఈ వేధింపులపై 2009లో జెనీ మొదట ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తయ్యేందుకు పదేళ్లు పట్టింది.
ఈశాన్య ఇంగ్లండ్‌లోని డార్లింగ్టన్లో వేరే నేరం కింద ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రిచర్డ్‌ను 2017లో సిడ్నీకి తీసుకువచ్చారు.
జెనీకి జరిగిన అన్యాయం తెలిసిన వెంటనే న్యాయ పోరాటంలో తల్లి ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే చాలా మంది కౌన్సెలింగ్ ఇచ్చేవారు, వైద్యులు తాను చెప్పేది నమ్మేవారు కాదని, బాధ నుంచి బయట పడేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని జెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- #MeToo: 'నిర్మాతలతో, దర్శకులతో పడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు'
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- చంద్రయాన్-2పై పాకిస్తాన్ అక్కసు.. ‘అభినందన్ ఇడియట్’ అంటూ పాక్ మంత్రి ట్వీట్లు
- ఇస్రో చైర్మన్ శివన్ కన్నీటి పర్యంతం.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని
- చంద్రయాన్-2 సామాన్య ప్రజలకు కూడా ఎందుకంత కీలకం
- ఇరాన్ నౌకను అప్పగిస్తే లక్షలాది డాలర్లు ఇస్తామన్న అమెరికా... ఆఫర్‌ను తిరస్కరించిన భారత కెప్టెన్
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)