అసోం చిన్నారులకు ఎన్ఆర్‌సీ కష్టాలు.. పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న పసివాళ్లు

  • 10 సెప్టెంబర్ 2019
అసోం ఎన్ఆర్సీ Image copyright DEBALIN ROY/BBC
చిత్రం శీర్షిక షాహీనా

అసోంలోని ధుభ్రీ జిల్లాలో ఉంటున్న షాహిదా బీబీ తన ఒక్క గది ఇంట్లో కొడుకు ఫొటో వెతుకుతున్నారు. చాలాసేపు వెతికినా అది దొరక్కపోవడంతో అలిసిపోయి కూచున్నారు.

ఆమె జీవితంలో 45 రోజులే ఉన్న కొడుకు నజ్రుల్ ఇస్లాం ఫొటో ఇప్పుడు ఇంట్లో ఒక్కటి కూడా లేదు.

జులై చివర్లో అసెంబ్లీలో ఒక జాబితా జారీ చేసిన అసోం ప్రభుత్వం రాష్ట్రంలోని డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్న 25 మంది చనిపోయారని రికార్డుల్లో చెప్పింది.

మృతుల్లో అందరికంటే చిన్నవాడు నజ్రుల్ పేరు జాబితా చివర్లో ఉంది.

దీనిపై అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేసిన రాష్ట్ర మంత్రి చంద్ర మోహన్ పట్వారీ ఈ 25 మంది మృతికి వ్యాధులే కారణం అన్నారు.

కానీ షాహిదా మాత్రం డిటెన్షన్ క్యాంప్‌లోని కఠిన పరిస్థితులను తన బిడ్డ తట్టుకోలేకపోయాడని చెబుతోంది.

Image copyright DEBALIN ROY/BBC

డిటెన్షన్ క్యాంప్‌లో గడిపిన చిన్నారి

ధుభ్రీ జిల్లాలోని రేవా గ్రామంలో ఉన్న షాహిదా ఇంటి ముందు బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంటుంది. ఆ ఇంటి వాకిట్లో బట్టలు ఆరేసే తాడుకు ఎండుతున్న చేపల వాసన అక్కడంతా వస్తోంది.

అక్కడే కూచున్న షాహిదా తను డిటెన్షన్ సెంటర్లో ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు.

"2011 మేలో నన్ను డీ-ఓటర్ కేసులో కోక్రాఝార్ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పుడు నా కవల పిల్లలు నజ్రుల్, నోబిజూర్‌ల వయసు 14 రోజులు. ఆ రోజు అక్కడికి వెళ్లే దారిలో నజ్రుల్ ఆరోగ్యం పాడైంది. జైల్లో వైద్యం చేసే సౌకర్యాలు కూడా లేవు. దాంతో నజ్రుల్ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దాంతో జైలు అధికారులు ఒకసారి బాబును డాక్టరుకు చూపించమని నన్ను గువాహాటీ పంపించారు" అన్నారు..

"డాక్టర్ బాబును ఆస్పత్రిలో అడ్మిట్ చేయమన్నారు. కానీ నేను అక్కడ ఉండలేక, తిరిగి రావాల్సొచ్చింది. నజ్రుల్ దగ్గు తగ్గలేదు. ఆరోగ్యం కూడా పాడవుతూ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకే తను మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. అప్పుడు నేను మూడు రోజులు స్పృహలో లేను" అని షాహిదా చెప్పారు..

నజ్రుల్ చనిపోయిన ఏడు నెలలకు 2012 మార్చిలో గువాహాటీ హైకోర్టు డీ-ఓటర్ పౌరసత్వం కేసులో షాహిదాను భారత పౌరురాలని ప్రకటించి, విడుదల చేసింది. కానీ ఇటీవల ఆగస్టు 31న ప్రచురించిన ఎన్ఆర్సీ ఫైనల్ లిస్టులో మాత్రం ఆమె పేరు లేదు.

నజ్రుల్ మృతదేహాన్ని షాహిదా సోదరుడికి అప్పగించారు. నజ్రుల్ కవల సోదరుడు నోబిజూర్ మొదటి ఏడాది తల్లితో కలిసి జైల్లోనే గడిపాడు.

Image copyright DEBALIN ROY/BBC

భర్త కూడా దూరమయ్యాడు

రెండేళ్ల క్రితం చనిపోయిన తన భర్తను గుర్తు చేసుకున్న షాహిదా కళ్లు చెమర్చాయి.

ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ "నా పౌరసత్వం కేసు కోసం నా భర్త మా మొత్తం భూమి అమ్మేశాడు. తన గురించి, పిల్లల కోసం దాన్ని ఉంచాలని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నన్ను కేసు నుంచి ఎలాగైనా బయట పడేయాలని అనుకున్నాడు. నాకు జైలు తిండి పడేది కాదు. దాంతో 42 వారాలు ఆయన నాకోసం వంట సరుకులు తెచ్చిచ్చేవారు. ధుభ్రీ నుంచి కోక్రాఝార్ వచ్చేవారు. అప్పుడు మాకు చాలా డబ్బు ఖర్చైంది. ఆ అప్పుల నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నాం" అన్నారు.

తర్వాత పౌరసత్వం కోసం ట్రైబ్యునల్‌కు దరఖాస్తు చేయడం గురించి మాట్లాడిన షాహిదా "నా భర్త డబ్బు ఆందోళనతోనే చనిపోయారు. ఒక బిడ్డ కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఇంత జరిగినా ఆ పౌరసత్వం వల్ల ఏం ఒరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు" అన్నారు.

Image copyright DEBALIN ROY/BBC
చిత్రం శీర్షిక నజ్రుల్ కవల సోదరుడు నోబిజూర్ ఇస్లాం

నాన్న ఎప్పుడు వస్తాడు

బక్సా జిల్లాలో గోవర్ధనా గ్రామంలో ఉంటున్న అనారా ఖాతూన్ ఆరేళ్ల కూతురు షాహీనా తన కాళ్లపై నిలబడలేకపోతోంది. మూడేళ్ల నుంచీ అసోంలోని గ్వాల్పారా డిటెన్షన్ సెంటర్‌లో బంధీగా ఉన్న భర్త అలీ కేసులో పోరాడుతున్న అనారా.. కూతురు చికిత్స కోసం పది వేల రూపాయలు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.

షాహినాను తన వీల్‌చెయిర్లో కూచోబెడుతూ "నా భర్త డీ-ఓటర్ కేసులో డిటెన్షన్ సెంటర్ వెళ్లి మూడేళ్లైంది. అప్పటి నుంచి ఈ ఇల్లు, ఆయన పౌరసత్వం కేసు, ముసలివాళ్లైన అత్తమామలు, పాప బాధ్యత అన్నీ నేనే చూసుకుంటున్నా. నేను కూలి చేసి వీళ్ల కడుపు నింపాలా, వకీలుకు డబ్బు కట్టాలా, లేక పాపకు ఆపరేషన్ చేయించాలా? ఒక్కదాన్ని, ఏం చేయగలను" అన్నారు అనారా.

Image copyright DEBALIN ROY/BBC
చిత్రం శీర్షిక కూతురు షాహీనాతో అనారా ఖాతూన్

కూతురి అనారోగ్యం గురించి చెబుతూ ఆమె "డాక్టర్ రెండున్నరేళ్ల క్రితమే పాపకు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ తర్వాత పాప నడుస్తుందనే అనుకుంటున్నాం. కానీ దానికి పది వేలు కావాలి. అంత డబ్బు సర్దడం ఇప్పటికీ కుదర్లేదు. వాళ్ల నాన్నను కలవడానికి జైలుకెళ్తే, అక్కడ ఆయన పరిస్థితిని చూళ్లేను. తనకు కూడా తినడానికి మార్కెట్ నుంచి ఏవైనా సరుకులు తీసుకెళ్లి ఇస్తాను. ఇక డబ్బులేం మిగులుతాయి" అన్నారు.

ఆగస్టు 31న ప్రచురించిన ఎన్ఆర్సీ జాబితాలో అనారా కుటుంబంలో ఎవరి పేరూ లేదు. ట్రైబ్యునల్లో పౌరసత్వం కేసు గురించి అడిగితే ఆమె "నా కూతురు నాన్న ఎక్కడ అని నన్ను అడిగితే, నాకు ఏడుపొస్తుంది. ఇక నా వల్ల కాదు. నాకు ఇంకా పోరాడే ధైర్యం లేదు. ప్రభుత్వం వచ్చి రేపు నా మొత్తం కుటుంబాన్ని డిటెన్షన్‌ సెంటర్లో మూసేసినా, మేం నోరు మెదపం. మనిషి మళ్లీ మళ్లీ చావడు, ఒకేసారి చస్తాడు" అన్నారు.

Image copyright DEBALIN ROY/BBC

టాప్ విద్యార్థి కూలీ అయ్యాడు

దరాంగ్ జిల్లాలోని టేక్రాబారీ గ్రామంలో ఉంటున్న 17 ఏళ్ల మొహమ్మద్ అస్మత్‌ది చదువుకుంటూ, స్నేహితులతో సంతోషంగా గడపాల్సిన వయసు. కానీ చదువులో చురుకైన వాడు అయినప్పటికీ, అస్మత్ ఇప్పుడు స్కూల్ విడిచిపెట్టి రోజూ కూలికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

రెండేళ్ల క్రితం అస్మత్ తండ్రి మునాఫ్ అలీని పౌరసత్వానికి సంబంధించిన డీ-ఓటర్ కేసులో తేజ్‌పూర్ డిటెన్షన్ సెంటర్‌కు పంపించారు. అస్మత్ జీవితం అప్పటి నుంచి శాశ్వతంగా మారిపోయింది.

తన పరిస్థితి గురించి వివరించిన అస్మత్ "రెండేళ్ల ముందు డీ-ఓటర్ కేసులో పోలీసులు మా నాన్న మునాఫ్ అలీని తీసుకెళ్లారు. ఆయన్ను తేజ్‌పూర్‌లోని డిటెన్షన్ క్యాంపులో బంధించారు. ఇంటి బాధ్యతలన్నీ నాపై పడ్డాయి. మా దగ్గర కేసు వాదించడానికి, నాన్నను కలవడానికి కూడా డబ్బుల్లేవు. రోజూ కూలికి వెళ్లి చాలా కష్టపడి ఇంట్లో వాళ్ల కడుపు నింపగలుగుతున్నా" అన్నాడు.

స్కూల్ వదిలిన తర్వాత ఒకరోజు క్లాస్ టీచర్ తన గురించి తెలుసుకోడానికి ఇంటికి వచ్చారని అస్మత్ చెప్పాడు. ఆమెకు తను ఇక స్కూలుకు రాలేననని చెప్పినట్లు తెలిపాడు.

పారతో తవ్వుతున్న అస్మత్ ఆరోజు గురించి చెబుతూ "మా టీచర్‌తో, నేను ఒక్క రోజు పనిచేయకపోయినా, మా అమ్మ ఆకలితో ఉండాలి. అందుకే చదువు వదిలేశాను అని చెప్పా. స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాడ్ని అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. చదువు పూర్తయ్యుంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని కుటుంబాన్ని బాగా చూసుకునేవాడ్ని. కానీ నాన్న డిటెన్షన్ క్యాంప్ వెళ్లాక అంతా తలకిందులైంది. ఇప్పుడు నా రాత ఇంతేలే అని సరిపెట్టుకున్నా" అని చెప్పాడు.

Image copyright DEBALIN ROY/BBC

అసోం ప్రజల పౌరసత్వం నిర్ధరించే ఈ కఠిన ప్రక్రియకు బలైపోయిన ఈ పిల్లల భవిష్యత్తు గురించి చట్టంలో ఇప్పటివరకూ ఎలాంటి నిబంధనలు లేవు.

గువాహాటీలో సీనియర్ వకీల్ ముస్తఫా అలీ దాని గురించి వివరించారు.

"డిటెన్షన్ సెంటర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి జైలు మాన్యువల్ లేదు. జైల్లోనే విడిగా డిటెన్షన్ క్యాంపులు క్రియేట్ చేశారు. జైల్ మాన్యువల్‌లో పెరోల్ లాంటి సదుపాయాలు ఉంటాయి. కానీ, అవి డిటెన్షన్ క్యాంపులకు అమలు కావు, దానిపై క్లారిటీ కూడా లేదు. డిటెన్షన్ సెంటర్‌కు వెళ్లే వారి పిల్లల బాగోగులు చూసుకోవడంపై చట్టంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు" అన్నారు.

పౌరసత్వం నిర్ధరించే ఈ కఠిన చట్ట ప్రక్రియలో చిక్కుకున్న ఈ పిల్లల భవిష్యత్తు ప్రస్తుతం అంధకారంలో ఉంది. ఒక్కోసారి డిటెన్షన్ సెంటర్లో బంధీలుగా ఉన్న తల్లిదండ్రులతో కఠిన జైలు వాతావరణంలో, ఇంకోసారి వారు లేని కఠిన ప్రపంచంలో ఒంటరిగా జీవించే ఈ పిల్లలను ఆదుకునేవారు ప్రస్తుతం ఎవరూ కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు