పొంగుతున్న వాగులు.. కూలిన కల్వర్టులు... ఇబ్బందుల్లో విశాఖ ఏజెన్సీ ప్రజలు

  • 11 సెప్టెంబర్ 2019
విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు

విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ఏజెన్సీలోని వాగులు, గెడ్డలు (చిన్నపాటి ప్రవాహాలను స్థానికంగా ఇలా పిలుస్తారు) పొంగి పొర్లుతున్నాయి. గెడ్డలను దాటడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హుకుంపేట మండలం మత్స్యపురానికి చెందిన రాణి జ్వరంతో బాధపడుతున్న తన 11 నెలల బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గెడ్డ పొంగటంతో మత్స్యపురం పెద్ద గరువు మధ్య కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో తల్లి సహాయంతో అతికష్టం మీద ఆమె గెడ్డను దాటి ఆసుపత్రికి వెళ్లారు.

''గెడ్డ కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పాపకు జ్వరం. ఆసుపత్రికి తీసుకొని వెళ్దామనుకుంటే నిన్న గెడ్డ పొంగటంతో కుదరలేదు. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ప్రవాహానికి మా పొలం కొట్టుకుపోయింది'' అని రాణి తెలిపారు.

ఇదే గ్రామానికి చెందిన శివ తండ్రి జబ్బుపడటంతో ఆయనను డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

''కల్వర్టు కూలడంతో మా 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్యం బాగా లేదు. కుర్రాళ్లం కాబట్టి ఆయనను డోలీలో తీసుకెళ్లాం. మిగతా వారి పరిస్థితి ఏంటి?'' అని ఆయన ప్రశ్నించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పొంగుతున్న వాగులు... ఇబ్బందుల్లో విశాఖ ఏజెన్సీ ప్రజలు

రాకపోకలకు గెడ్డలే కీలకం

విశాఖ ఏజెన్సీలో కొండలపై పడే వర్షం గెడ్డల ద్వారానే పారుతుంది. గెడ్డల ద్వారానే ఇక్కడ వ్యవసాయ పనులు సాగుతాయి. కొద్దికాలంగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఏజెన్సీలో భారీ వర్షం పడిన పెదబయలు, పాడేరు, హుకుంపేట తదితర మండలాల్లో బీబీసీ పర్యటించింది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఈనెల 7, 8 తేదీల్లో సగటున 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహించడంతో అనేక చోట్ల చిన్నపాటి బ్రిడ్జ్‌లు, కల్వర్టులు, రోడ్లు వరద తాకిడికి కొట్టుకు పోయాయి.

దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు బయట ప్రపంచంతో సంబంధాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గిరిజనులు తమ నిత్యావసరాలను సంతల నుంచి తీసుకు రావాలన్నా.. అమ్మాలన్నా కల్వర్టులు దాటాల్సిందే. హుకుంపేట మండలం పెద్దగరువు కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో బొర్రిగరువు, సాలపు గొంది, చీడిపుట్టు, తడిగిరి, బరంగి బంద, ఎగమూలపాడు, దిగమూలపాడు, దురిపాడు, లోపాలం తదితర 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వర్టులు కూలిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బొర్రిగరువుకు చెందిన పడాల్ దొర తన అన్న కొడుక్కి ఒంట్లో బాగోకపోవడంతో డోలీలో కట్టుకొని గెడ్డ దాటించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''మా అన్న కొడుక్కి రాత్రి నుంచి తీవ్రంగా జ్వరం ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గెడ్డ దాటాం. బ్రిడ్జి కూలడంతో అంబులెన్స్ ఇక్కడికి రావడం లేదు'' అని చెప్పారు.

పెద్ద గరువు కల్వర్టుల మీద 25 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. పాడేరు, హుకుంపేట మండలాలే కాదు.. చింతపల్లి, పెదబయలు, అరకు మండలాల్లో కూడా పలు ప్రాంతాల్లో గెడ్డలు పొంగుతున్నాయి. జీ మాడుగుల మండలం మద్దిగరువు దగ్గర ఉన్న కల్వర్టు కూడా కొట్టుకుపోయింది. దీంతో 28 గ్రామాలకు దారి లేకుండా పోయింది.

'పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాం'

భారీ వర్షాలు తగ్గకపోవడం వల్ల ప్రస్తుతానికి తాత్కాలిక పునరుద్దరణ పనులు చేపడతున్నట్లు పాడేరు డివిజనల్ ఇంజనీర్ హరి తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''48 గంటలలోగా పునరుద్దరణ పనులు పూర్తవుతాయి. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నాం. వర్షాకాలం ముగిసిన తరువాత శాశ్వత చర్యలు చేపడతాం'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు