చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..

  • 13 సెప్టెంబర్ 2019
కన్నవారితో అవినాష్ Image copyright MOHANAVADIVELAN
చిత్రం శీర్షిక కన్న తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శివగామిలను అవినాష్ 20 ఏళ్ల తర్వాత కలిశాడు

''మా ఇంటి దగ్గరున్న ప్రభుత్వ కుళాయి నుంచి నీళ్లు తీసుకురావటానికి నా భార్య వెళ్లింది. మా అబ్బాయి అక్కడ ఆడుకుంటున్నాడు. ఒక్క నిమిషంలోనే కిడ్నాపర్ మా పిల్లాడ్ని ఎత్తుకుపోయాడు'' - ఏడాదిన్నర వయసున్న తన కొడుకు అవినాష్‌ని 1999లో కిడ్నాప్ చేసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు ఆ బాలుడి కన్నతండ్రి నాగేశ్వరరావు.

''మా ప్రాంతంలో ఉన్నవాళ్లందరూ వెదికారు. కానీ మా అబ్బాయి కనిపించలేదు'' అని తెలిపాడు.

నాగేశ్వరరావు, శివగామి దంపతులు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని పులియాన్తోప్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారి పిల్లల్లో ఆకరివాడు సుభాష్. 1999 ఫిబ్రవరి 18వ తేదీన అతడిని ఓ కిడ్నాపర్ అపహరించాడు.

గాలింపు

''మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా కొడుకును వెదకటం కోసం చేయగలిగినదంతా చేశాం. న్యాయ మార్గాలన్నిటినీ పరిశీలించాం. మా పిల్లాడ్ని వెనక్కు రప్పించాలంటూ ఎన్నో దేవాలయాల్లో పూజలు చేశాం'' అని చెప్పాడు నాగేశ్వరరావు.

పోలీసుల దర్యాప్తు కొంత నెమ్మదిగా సాగుతుండటంతో నాగేశ్వరరావు తన న్యాయవాది ద్వారా 2006లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. అపహరణకు గురైన కొందరు పిల్లలను ఆ తర్వాత మలేసియన్ సోషల్ సర్వీస్ అనే సంస్థ దత్తత ఇచ్చిన ఉదంతాల వివరాలను వెలికితీసింది. సీబీఐ 2009లో సుభాష్ కేసు మీద కూడా దర్యాప్తు ప్రారంభించింది.

Image copyright MOHANAVADIVELAN

గుర్తింపు

''మేం సుభాష్ గురించి వెదుకుతున్నపుడు.. అమెరికాలో ఉన్న అవినాష్ అనే పిల్లవాడి గురించి మాకు తెలిసింది. స్కాట్ కార్నే అనే జర్నలిస్టు ద్వారా అమెరికా మీడియాలో ఒక వార్తా కథనం ప్రచురించటానికి మేం ప్రయత్నించాం. ఆ తర్వాత అవినాష్ తల్లిదండ్రులతో మాట్లాడాలని కూడా ఆ జర్నలిస్టును కోరాం'' అని తెలిపారు నాగేశ్వరరావు తరఫు న్యాయవాది మోహనవడివేలన్.

చెన్నైలో కిడ్నాప్ చేసిన సుభాష్‌ను మలేసియన్ సోషల్ సర్వీస్ అనే సంస్థకు ఇచ్చారు. ఆ తర్వాత అమెరికాలో నివసించే ఒక జంట ఆ బాలుడిని దత్తత తీసుకుని అతడికి అవినాష్ అని పేరు పెట్టింది.

''డీఎన్‌ఏ పరీక్ష గురించి మేం సదరు అమెరికా తల్లిదండ్రులను సంప్రదించినపుడు వాళ్లు చెప్పిన సమాధానాల్లో పొంతన లేదు'' అని మోహనవడివేలన్ తెలిపారు.

ఇంటర్‌పోల్ సాయంతో ఆ బాలుడి రక్తాన్ని సేకరించి, చెన్నైలో దాన్ని పరీక్షించారు. ఆ బాలుడికి నాగేశ్వరరావు కుటుంబంతో రక్తసంబంధం ఉందని ఫలితాల్లో వెల్లడైంది.

''ఆ బాలుడు మా అబ్బాయే అని పరీక్ష నిరూపించినప్పటికీ అతడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో పోరాడి పిల్లాడిని తెచ్చుకునేందుకు మాకు మనస్కరించలేదు. వాళ్లు కూడా పిల్లాడిని చాలా ప్రేమగా పెంచారు. వాళ్లే తనతో చెప్తారని, మమ్మల్ని కలవడం గురించి తనే నిర్ణయం తీసుకుంటాడని మేం ఎదురుచూశాం'' అని నాగేశ్వరరావు చెప్పారు.

జీవితం

అవినాష్ అమెరికాలో తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీసోదరులతో కలిసి నివసిస్తున్నాడు. ఇండియాలోని తన కన్నతల్లిదండ్రుల గురించి అతడికి పదమూడేళ్ల వయసులో తెలిసింది. ''అటువంటి వివరాలు తెలుసుకోవటానికి ఆ వయసు చాలా చిన్నది. నేను పెద్దగా కలవలేదు. నాకు తెలుస్తున్న సమాచారాన్ని గమనిస్తూ ఉన్నాను.. అంతే'' అంటాడు అవినాష్.

భారతదేశంలోని తన కన్నతల్లిదండ్రులను కలవాలని సుమారు నాలుగైదేళ్ల కిందట అవినాష్ నిర్ణయించుకున్నాడు. ''అమెరికాలోని నా దత్త తల్లిదండ్రులకు నేను ఈ మాట చెప్పినపుడు నా తల్లిదండ్రులు, సోదరీసోదరులు చాలా అండగా నిలిచారు'' అని వివరించాడు.

Image copyright MOHANAVADIVELAN
చిత్రం శీర్షిక నాగేశ్వరరావు కుటుంబ న్యాయవాది అనువాదకుడిగా కూడా వ్యవహరించారు

భావోద్వేగం

2019 సెప్టెంబర్ ఎనిమిదో తేదీ.. నాగేశ్వరరావు కుటుంబం మరచిపోలేని రోజు. వాళ్లు ఇరవై ఏళ్ల తర్వాత తమ కొడుకుని చెన్నైలో మళ్లీ కలిశారు.

''అతడు చెన్నైలో చూడాలనుకున్న అన్ని ప్రాంతాలకూ తీసుకెళుతున్నాం. మాకోసం మేమేమీ ఆలోచించలేదు. అతడు కోరిన ఆహారమంతా కొనిపించటం, అతడు కోరుకున్న ప్రాంతాలన్నీ చూపించటానికే మేం ప్రయత్నిస్తున్నాం'' అని చెప్పారు నాగేశ్వరరావు.

కన్నవారిని కలవటం తనకు ఒక రకమైన మనశ్శాంతిని ఇచ్చిందని అవినాష్ చెప్తున్నాడు. ''నా కన్న తల్లిదండ్రులను కలవటం, వారి నగరం గురించి వాళ్లు ఎలా పెరిగారో, నా సంస్కృతి ఏమిటో తెలుసుకోవటం చాలా అద్భుతమైన అనుభవం. నేను ఎక్కడి నుంచి వచ్చాననేది తెలుసుకోవటం ద్వారా నాకు ఓ విధమైన మనశ్శాంతి లభించింది'' అని వివరించాడు.

కుటుంబంతో కలిసి కొన్ని రోజులు గడిపిన తర్వాత అవినాష్ మళ్లీ అమెరికా తిరిగి వెళుతున్నాడు.

''పోయిన తన కొడుకుని మళ్లీ కళ్లచూసిన నా భార్య చాలా సంతోషంగా ఉంది. అతడు తిరిగి అమెరికా వెళ్లిపోతుండటం ఆమెకు బాధగా ఉన్నా.. అక్కడ కూడా అతడికి ఒక కుటుంబం ఉంది కదా అని తనను తాను సముదాయించుకుంటోంది'' అని నాగేశ్వరరావు పేర్కొన్నాడు.

భాష

చెన్నైలో తన కన్నవారిని కలవటానికి ముందు నుంచే తన కుటుంబ న్యాయవాది మోహనవడవేలన్‌తో అవినాష్ సంప్రదిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబానికి ఎదురైన పెద్ద సమస్యల్లో భాష ఒకటి. అవినాష్‌కు తమిళం తెలియదు. అతడి కన్నవారైన నాగేశ్వరరావు కుటుంబంలో ఎవరికీ ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాబట్టి వీరి మధ్య అనువాదం చేసే పనిని వీరి న్యాయవాదే తీసుకున్నారు.

''ఇరు పక్షాలూ కలిసినపుడు.. ఒకరినొకరు పలకరించుకోవటం, భావోద్వేగాలు తెలియజెప్పటం ఎలాగో వీరికి తెలియలేదు. అతడి కన్నతల్లి అతడిని కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. తన బాధను, ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో ఆమెకు తెలియలేదు. వారి తరఫున నేను తర్జుమా చేసి చెప్తున్నప్పటికీ.. భావోద్వేగాలను పూర్తిగా అనువదించి చెప్పలేం'' అని మోహనవడివేలన్ వివరించారు.

అయితే.. తమిళం అభ్యసించాలని అవినాష్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. తన కుటుంబంతో సంభాషించటంలో సమస్య గురించి మేం అతడిని అడిగినపుడు.. ''నేను అమెరికా తిరిగి వెళ్లాక తమిళం నేర్చుకోవటం ప్రారంభించాలి. నేను బాగా మాట్లాడలేకపోయినా.. మా మధ్య అనువాదకుడి అవసరం లేకుండా ఉండేలా ప్రాధమిక అంశాలైనా నేర్చుకుంటాను'' అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?