ఎంఎస్ ధోనీ క్రికెట్‌‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?

  • 12 సెప్టెంబర్ 2019
ఎం ఎస్ ధోనీ Image copyright Getty Images

'ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్‌ అవుతున్నాడు. ఇవాళ సాయంత్రం తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడు' అంటూ అనేక వార్తలు గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కసారిగా 'Dhoni' హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు రావడంతో అభిమానులంతా తమ భావోద్వేగాలను సోషల్ మీడియాలో వివిధ పోస్టుల రూపంలో పంచుకోవడం మొదలుపెట్టారు. ధోనీ క్రికెటింగ్ కెరీర్‌లోని అనేక సంఘటనలను గుర్తుచేసుకుంటూ రకరకాల ట్వీట్లు చేస్తున్నారు.

ఈ ట్రెండ్ అంతా కూడా విరాట్ కోహ్లి చేసిన ఒక పోస్టుతో మొదలైంది. 'నేను ఎప్పటికీ మరచిపోలేని గేమ్ అది. ప్రత్యేకమైన రాత్రి. ఈ మనిషి నన్ను ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరుగెత్తించినట్లు పరుగెత్తించాడు' అంటూ ధోనీతో ఉన్న ఈ ఫొటోను కోహ్లి గురువారం ఉదయం ట్వీట్ చేశాడు.

దాంతో ధోనీ రిటైర్ అయ్యాడని, అందుకే కోహ్లి ఈ పోస్టు చేశాడనే వదంతులు మొదలయ్యాయి. చాలామంది ధోనీకి అభినందనలు, కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు.

ఈ మొత్తం పరిణామాలపైన ధోనీ భార్య సాక్షి ట్విటర్ ద్వారా స్పందించారు. 'ఇవన్నీ వదంతులే' అంటూ ఒక్కమాటలో ఈ పోస్టులన్నింటికీ బదులిచ్చారు.

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పైన ఎలాంటి అప్‌డేట్ లేదని, ఆ వార్తలు అవాస్తవమని భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా పేర్కొన్నారు. దాంతో చాలామంది వీళ్లద్దరి మాటల్ని పోస్ట్ చేస్తూ, ధోనీ రిటైర్మెంట్‌ వార్తలన్నీ వదంతులే అని పోస్టులు పెడుతున్నారు. అలా మొత్తమ్మీద విరాట్ కోహ్లీ చేసిన ఒక్క పోస్టు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ‘ధోనీ’ ట్రెండ్‌కు దారితీసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)