ఐఫోన్11: భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల ఆధిపత్యం సాధ్యమేనా

  • 13 సెప్టెంబర్ 2019
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ Image copyright APple

యాపిల్ ఐఫోన్ 11 పేరుతో కొత్తగా కొన్ని మోడళ్ల ఫోన్లను ఆవిష్కరించింది. అంతకుముందు మోడళ్ల ఐఫోన్ల కంటే ఎక్కువ సంఖ్యలో కెమేరాలు, అధిక బ్యాటరీ సామర్థ్యం వీటి ప్రత్యేకం. కానీ, ఈ ప్రత్యేకతలు ప్రపంచంలోని వర్ధమాన మార్కెట్లలో ఒకటైన భారత విపణిలో ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగపడతాయా అన్నదే ప్రశ్న.

భారతదేశంలో రూ.40 వేలు అంతకంటే ఎక్కువ విలువ చేసే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో చాలాకాలంగా శాంసంగ్ సంస్థ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. కానీ, ఈ ఏడాది తొలిసారి శాంసంగ్‌ను దాటి యాపిల్ ముందుకెళ్లింది.

2019 రెండో త్రైమాసికంలో భారతీయ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ 41.2 శాతం విక్రయాలు సాగించిందని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ సంస్థ నివేదిక వెల్లడించింది.

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అదృష్టాలు మారిపోతుంటాయని టెక్నాలజీ జర్నలిస్ట్ మాలా భార్గవ 'బీబీసీ'తో అన్నారు. ఈ మార్కెట్లో ఎంతో ఆధిపత్యం చలాయించిన సంస్థలు కూడా ఆ తరువాత మూలకు చేరిన ఉదంతాలున్నాయన్నారు.

యాపిల్ కొత్త ఫోన్లు ఐఫోన్11, ఐఫోన్ 11ప్రో,11 ప్రో మ్యాక్స్‌లు సెప్టెంబరు 27 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి మార్కెట్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఐఫోన్ 11ను యాపిల్ తీసుకొచ్చిందని మాలా భార్గవ 'బీబీసీ'తో అన్నారు.

Image copyright APple

ఐఫోన్ 11‌ లాంచింగ్‌కు ముందు కొద్దినెలల కిందట యాపిల్ తన ఇతర మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర రూ.73,900 నుంచి 53,900కి తగ్గించింది. ఇంత భారీగా తగ్గించడమనేది మార్కెట్‌లో విక్రయాలు పెంచుకొనే లక్ష్యంతో వెళ్తున్నారనడానికి సూచనగా చెబుతున్నారు.

''భారతీయ వినియోగదారులు డిస్కౌంట్లు, ఆఫర్లపై ఆసక్తి చూపుతారు'' అని భార్గవ అన్నారు. ''ఐఫోన్‌పై ఆసక్తి ఉన్నవాళ్లంతా ఇప్పుడు ధరలు దిగిరాగానే అటువైపు చూస్తున్నారు'' అన్నారామె. భారత మార్కెట్లో దూసుకెళ్లడానికి ఇది కూడా కారణమైందని ఆమె అన్నారు.

ఐఫోన్ 11 ప్రారంభ మోడల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌కు తదుపరి రూపంగా చెప్పాలని భార్గవ అన్నారు. దీని ధర రూ.64,900 నుంచి మొదలవుతోంది. ఇది ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర కంటే పెద్ద ఎక్కువేమీ కాదు.

''ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర తగ్గడం భారత మార్కెట్లో దాని అమ్మకాలు పెరిగేలా చేసింది. అలాగే, ఇప్పుడు ఐఫోన్ 11 ప్రారంభ ధర సుమారు అంతేస్థాయిలో ఉండడంతో అమ్మకాలకు అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయ''న్నారామె.

ఇక ఐఫోన్ 11 ప్రో ధర రూ.99,990 నుంచి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ రూ.1,09,990 నుంచి మొదలవుతోంది. వీటి ధరలు సగటు ప్రీమియం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేవన్నారామె.

''వీటి ధరలు ఎక్కువగా ఉండడం కూడా కొంతవరకు ఆ సంస్థకు లాభిస్తుందని.. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఆసక్తి ఉన్నవారు ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 8 వంటి ఇతర మోడళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంద''ని భార్గవ అభిప్రాయపడ్డారు.

Image copyright APple

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం వృద్ధి కనిపిస్తోందని.. ఈ నేపథ్యంలో యాపిల్ ఇప్పుడు మిగతా చోట్ల కోల్పోతున్నది ఇక్కడ రాబట్టుకోవాలని భావిస్తోందని భార్గవ అన్నారు.

2019 ద్వితీయ త్రైమాసికంలో భారత్‌లో 3.69 కోట్ల స్మార్ట్ ఫోన్లు షిప్పింగ్ చేశారు. ఇది అంతకుముందు ఏడాది అదే కాలంతో పోల్చితే 9.9 శాతం ఎక్కువ.

ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8 శాతం పతనమైంది. ఒక్క యాపిల్ షిప్‌మెంట్లే 20 శాతం తగ్గిపోయాయి.

భారత్‌లో ఇంకా చాలామంది బడ్జెట్ ఫోన్లే వాడుతున్నారని.. అలాంటి వారంతా ఇప్పుడిప్పుడే ప్రీమియం ఫోన్లపై దృష్టి పెడుతున్నారని.. యాపిల్ వారిని లక్ష్యం చేసుకుంటోందని భార్గవ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)