అమరావతిపై నిపుణుల కమిటీ.. రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై సమీక్ష చేయాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

  • 13 సెప్టెంబర్ 2019
వైఎస్ జగన్, అమరావతిలో బుద్ధుడి విగ్రహం

అమరావతి నగర నిర్మాణంపై త్వరితగతిన సమీక్ష జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.

ఇప్పటి వరకు రచించిన.. అమరావతి నగరాభివృద్ధి ప్రణాళికలు, రాజధాని నగరంతో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి వ్యూహాలపై ఈ సమీక్ష జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం విడుదల చేసిన జీఓ 585లో పేర్కొంది.

ఈ కమిటీలో సభ్యులు..

  • ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్, డీన్ (అకడమిక్), స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూదిల్లీ
  • డాక్టర్ అంజలీ మోహన్, అర్బన్ అండ్ రీజినల్ ప్లానర్
  • ప్రొఫెసర్ శివానంద స్వామి, సీఈపీటీ, అహ్మదాబాద్
  • ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, ఎస్‌పీఏ (రిటైర్డ్), దిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దిల్లీ
  • డాక్టర్ కేవీ అరుణాచలం, రిటైర్డ్ ఛీఫ్ అర్బన్ ప్లానర్, చెన్నై

అయితే, ఈ కమిటీ పర్యావరణ సమస్యలు, ముంపు నిర్వహణకు సంబంధించిన నిపుణుడు ఒకరిని సభ్యుడిగా ఎంచుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఈ నిపుణుల కమిటీకి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది.

కమిటీ ఆరు వారాల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది.

నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు

నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు ఏపీ దేవాదాయ సంస్థల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల నిబంధనలను సవరించారు.ఈమేరకు దేవాదాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ 50 శాతం రిజర్వ్డ్ పదవుల్లో కూడా సగం వంతు మహిళలు ఉండాలని, మిగిలిన 50 శాతం రిజర్వు కాని పదవుల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం