కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..

  • 16 సెప్టెంబర్ 2019
కమలీ
చిత్రం శీర్షిక కమలీ

చెన్నై సమీపంలోని మహాబలిపురంకు చెందిన తొమ్మిదేళ్ల స్కేటింగ్ క్రీడాకారిణి, ఆమె తల్లి జీవితం ఆధారంగా తెరకెక్కిన లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) వచ్చే ఏడాది ప్రకటించనున్న ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యింది.

చిన్న వయసులోనే స్కేటింగ్‌లో చక్కని ప్రతిభ కనబరుస్తున్న తొమ్మిదేళ్ల ఈ బాలిక పేరు కమలీ.

కమలీ, ఆమె ఒంటరి తల్లి జీవిత కథల ఆధారంగా 'కమలీ' పేరుతో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ 2020 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది.

"స్కేటింగ్ అంటే నాకు ప్రాణం. సర్ఫింగ్, రన్నింగ్ కూడా ఇష్టం. నేనే సొంతంగా స్కేటింగ్ నేర్చుకున్నాను" అని చెప్పింది కమలీ.

’’నా కోరికల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒంటరి తల్లిగా నా బిడ్డ కలను సాకారం చేసేందుకు ఎంతైనా కష్టపడతాను. నా బిడ్డను గొప్ప విజేతగా చేయడమే నా ఆశయం" అని కమలీ తల్లి సుగంథి అంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఈ బాలిక జీవిత కథతో తీసిన షార్ట్ ఫిల్మ్... ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది

ఆ షార్ట్ ఫిల్మ్‌కు ఇప్పటికే అట్లాంటి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది. ఆ పిల్మ్ ఫెస్టివల్‌లో దానిని ప్రదర్శించారు.

"మా ప్రాంతంలో కొంతమంది అబ్బాయిలు స్కేటింగ్ చేస్తుండటం చూశాను. నాకు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి సొంతంగా నేనే నేర్చుకోవడం ప్రారంభించాను" అని కమలీ చెప్పింది.

ఐదేళ్ల వయసు నుంచే ఈ బాలిక సర్ఫింగ్ కూడా చేస్తోంది.

"మా కుటుంబం నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. స్కేటింగ్ చేసేందుకు మా అమ్మ, అంకుల్ నన్ను బాగా ప్రోత్సహిస్తారు. స్కేటింగ్, సర్ఫింగ్‌లో కొత్త మెలకువలు నేర్చుకోవాలని చెబుతారు. చాలా స్కేటింగ్ పోటీలలో పాల్గొన్నాను. కానీ, ఎన్ని బహుమతులు గెలుచుకున్నానో నాకు తెలియదు" అని ఈ చిన్నారి గుర్తు చేసుకుంది.

"ఇన్నాళ్లూ చాలా కష్టపడ్డాను. కమలి వల్ల నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. గతంలో మీ అమ్మాయిని స్కేటింగ్‌ ఎందుకు ఆడనిస్తున్నావు? అని కొందరు ప్రశ్నిస్తుండేవారు. వాళ్లే ఇప్పుడు తమ పిల్లలకు స్కేటింగ్ నేర్పించమని కమలిని అడుగుతున్నారు. అది నాకెంతో సంతోషాన్నిస్తుంది" అంటూ కమలీ తల్లి సుగంథి చెప్పారు.

"నా దగ్గర స్కేటింగ్ నేర్చుకునేందుకు చాలామంది వస్తుంటారు. మా తమ్ముడికి కూడా నేర్పుతున్నాను. నాకు స్కేటింగ్ అంటే ఇష్టం. ఒలింపిక్స్‌లో పోటీపడాలని నా కొరిక" అంటోంది ఈ అమ్మాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)