తెలంగాణలో రైతులకు యూరియా కొరత ఎందుకొచ్చింది? ప్రత్యామ్నాయాలు ఏమిటి?

  • 18 సెప్టెంబర్ 2019
యూరియా కొరత తెలంగాణ రైతులు వ్యవసాయం Image copyright Getty Images

యూరియా కొరతతో తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలలో యూరియా కొరత ఉంది.

అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు?

దీనిపై బీబీసీ న్యూస్ తెలుగు కామారెడ్డి జిల్లాకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడింది.

చెప్పులు, రాళ్లతో క్యూలైన్

కామారెడ్డిలోని మాచారెడ్డి రైతు సంఘం సొసైటీ దగ్గర ఎరువులు పంపిణీ చేస్తున్నారు. దాదాపు 22 గ్రామాలకు ఇది కేంద్రం. ఇక్కడ వరసగా పేర్చి ఉన్న చెప్పులు, రాళ్లు యూరియా సమస్య తీవ్రతను తెలియచేస్తున్నాయి.

స్టాక్ కోసం రోజుల తరబడి ఎదురు చూడలేక, ఇలా ఆనవాళ్లు పెట్టుకుని రైతులు వెళ్లిపోయారు.

ఇక్కడికి వచ్చిన రైతులు లోడ్ ఎప్పుడు వస్తుందని అధికారులను అడుగుతుంటే, వారు మాత్రం తమకూ సమాచారం లేదని చెబుతున్నారు.

మాచారెడ్డి సొసైటీ ఆఫీస్‌లోని అధికారి బీబీసీతో మాట్లాడుతూ, ''మేము ఏం చేయగలం? లోడ్ వస్తే రైతులకు పంపిణీ చేస్తాం. మాకే సమాచారం లేకపోతే రైతులకు ఏం చెప్పాలి. మొన్న లోడ్ వచ్చింది. వచ్చిన గంటలోపు అయిపొయింది. లైన్‌లో ఇంకా చాలా మంది రైతులున్నారు. వారు కోపంతో మమల్ని గదిలో వేసి తాళం పెట్టారు. వారి ఆగ్రహం మాకు అర్థం అవుతూనే ఉంది'' అని వాపోయారు.

'యూరియా పొలానికి తల్లి పాలవంటది'

మాచారెడ్డికి 8 కిలోమీటర్ల దూరంలో ఇసాయిపేట గ్రామం ఉంది. ఇక్కడ ఎక్కువగా వరి, మక్క (మొక్కజొన్న), కొంత వరకు చెరకు, కూరగాయలు పండిస్తున్నారు. వెయ్యి ఎకరాల వరకు సాగు జరుగుతోంది.

బండారు నాంపెల్లి అనే రైతు తన మూడు ఎకరాల భూమిలో వరి వేశారు. ఆయన యూరియా కొరతపై బీబీసీతో మాట్లాడుతూ, ''వారం రోజులగా రోజూ వెళ్లి వస్తున్నాం. రాళ్లు పెట్టి లైన్లు కట్టి ఉంటున్నారు. పోలీసులు కూడా ఉన్నారు. గొడవ అవట్లేదు కానీ తీసుకున్న వాళ్ళే మళ్లీ మళ్లీ లైన్లో జొరపడి సంచులు తీసుకొని పోతున్నారు. మాకు మసాలా (యూరియాను కొన్ని ప్రాంతాల్లో మసాలా అంటారు) దొరకట్లేదు. బాగా ఇబ్బందిగా ఉంది. నాకు మూడు సంచులు కావాలి. ఒక్క సంచికూడా దొరకలేదు. వెళ్లిరావడానికి ఆటో ఖర్చులు అవుతున్నాయని కానీ యూరియా మాత్రం దొరకడం లేదు'' అని చెప్పారు.

''చంటి పిల్లకు తల్లి పాలెంతో పొలానికి యూరియా అంతే'' అని అక్కడే ఉన్న మరో రైతు చెప్పారు. రైతులకు అత్యంత అవసరమైన యూరియా కొరత రావటంతో వేసిన పంటకి దిగుబడి రాదని ఆందోళన చెందుతున్నారు.

ఎం. రమేశ్ అనే రైతు తన రెండు ఎకరాల భూమిలో మక్క (మొక్కజొన్న) వేశారు. యూరియా దొరకక పంట నాశనం అవుతుందని పిలకగా ఉండగానే రాలిపోయిన ఒక కంకి తీసి మాకు చూపించారు.

''ప్రతి సీజన్‌లో యూరియా మూడు సార్లు అవసరం ఉంటుంది. నాట్లు వేశాక ఒక సారి, నాట్లు పిలకలు వచ్చాక ఒక సారి, కాయ వచ్చే ముందు మరోసారి యూరియా, 20-20, పొటాష్ ఇలా వేస్తూ ఉండాలి.

వరి పంటకి ఎకరానికి దాదాపుగా మూడు బస్తాల యూరియా ఈ సమయంలో తప్పనిసరిగా వేస్తాం. మక్కకి రెండు బస్తాలు అవసరం. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే ఎంత దిగుబడి వస్తాదో చెప్పలేం" అని 50 ఏళ్లగా వ్యవసాయం చేస్తున్న పోచారం చెప్పారు.

'ఆధార్ లింక్ వల్లే క్యూ పెరిగింది.. ఇప్పుడు కొరత లేదు'

రాష్ట్రమంతా ఒకేసారి వర్షాలు కురవడంతో ఒక్కసారిగా రైతులకు యూరియా అవసరం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''గత నాలుగు ఖరీఫ్ సీజన్లలో సుమారు 6 లక్షల టన్నుల యూరియా అవసరం పడగా, ఈసారి ఆగస్టు నాటికే 6 లక్షల టన్నులు అవసరం పడింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఒకేసారి యూరియా అవసరం పడింది. ఈసారి కొత్తగా యూరియా సబ్సిడీ కోసం ఆధార్ లింక్ తప్పనిసరి చేశారు. వేలిముద్రల అప్‌లోడ్‌కు సమయం పట్టడంతో క్యూలు పెరిగాయి. దాన్ని ఎరువుల కొరతగా ప్రచారం చేయడంతో ముందు జాగ్రత్తగా అవసరానికి మించి రైతులు ఎరువులు కొనేశారు'' అని మంత్రి తెలిపారు.

యూరియా కొరత నేపథ్యంలో తమ ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వేతో మాట్లాడి 13 రోజుల్లో 15 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు తెప్పించిందని ఆయన చెప్పారు.

Image copyright NIRAJANREDDY
చిత్రం శీర్షిక యూరియాను పరిశీలిస్తున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

''ఇప్పుడు అసలు ఎరువుల కొరతే లేదు. వచ్చే పంటకు కూడా నిల్వ చేస్తున్నాం. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్‌కు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 7.30 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం. ఇందులో సెప్టెంబరు 1 నుంచి ఇప్పటి వరకు 1.25 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. ఇంకా 75 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. సెప్టెంబరులో కేంద్రం నుంచి లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉండగా, రెండు లక్షల టన్నులు అడిగాం. కేంద్రం అంగీకరించింది'' అని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించేలా రైతులను ప్రోత్సహిస్తోంది.

2017 నవంబర్ 26 నాటి 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "యూరియా వంటి రసాయనాలతో భూమికి నష్టం జరుగుతుంది. రైతులు 2022 నాటికి యూరియా వాడకం సగానికి తగ్గిస్తాం అని సంకల్పం తీసుకోవాలి. దానివల్ల భూమికి మేలు జరుగుతుంది'' అని పిలుపు ఇచ్చారు.

ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో కూడా రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని ప్రధాని కోరారు.

'సేంద్రియ సాగుకు ప్రోత్సహకాలు ఇవ్వాలి'

అయితే, యూరియాకు ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

''యూరియా వాడకం తగ్గించాలని ప్రభుత్వం అంటుంది. కానీ, యూరియాకి ప్రత్యామ్నాయం మాత్రం ప్రభుత్వం చూపలేకపోయింది. సేంద్రియ ఎరువులు వాడి పండిస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి'' అని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డా.జి.వి. రామాంజనేయులు అన్నారు.

యూరియా ఉత్పత్తి తగ్గడం వల్లే ప్రభుత్వం రైతులకు సకాలంలో సరఫరా చేయలేకపోతోందని ఆయన చెప్పారు.

యూరియా ఉత్పత్తి తగ్గిందా?

కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ లోక్ సభ లో ఇచ్చిన వివిధ సమాధానాలు ప్రకారం, 2015-16లో దేశంలో యూరియా ఉత్పత్తి 24.48 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంటే, 2017-18 లో ఉత్పత్తి 24.02 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది. దిగుమతి చేసుకున్న యూరియా కూడా క్రమేణా తగ్గింది. 2015-16లో 5.48 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి చేసుకుంటే, 2017-18 లో 4.56 మిలియన్ మెట్రిక్ టన్నులు యూరియాను భారత్ దిగుమతి చేసుకుంది.

ప్రపంచంలో చైనా తరవాత యూరియా ఎక్కువగా వాడేది భారతదేశమే. ప్రపంచ దేశాలన్నీ యూరియా వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాయి. గాలి, నీటిలో యూరియా ద్వారా వచ్చే నైట్రేట్ కాలుష్యాన్ని అపటమే దీని వెనుక ఉదేశ్యం. ఈ దిశగా యూరోపియాన్ యూనియన్ కూడా ఆంక్షలు విధించి, 2020 తరువాత యూరియా అమ్మకాలలో మార్పులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది.

భారత్ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంది. 2015-16 నుంచి వేపనూనె పూసిన యూరియా మాత్రమే వాడాలని ఆంక్షలు విధించింది.

చిత్రం శీర్షిక యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు

'యూరియాపై సబ్సిడీలు తగ్గించాలి'

యూరియా, మిగతా రసాయన ఎరువుల వాడకం తగ్గించటం అంతా సులువైన పనికాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కేంద్రం కూడా కారణమని అంటున్నారు.

ఎరువులపై సబ్సిడీలకు కేంద్రం బడ్జెట్లో ఏటా రూ. 65,000 నుంచి రూ. 70, 000 కోట్లు కేటాయింపులు చేస్తూ వచ్చింది. కానీ, సేంద్రీయ వ్యవసాయం, భూసార పరిరక్షణకు రూ. 1,000 నుంచి రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది.

''ప్రధాని కోరినట్లు యూరియా వాడకం తగ్గించాలంటే పటిష్ఠమైన వ్యూహం రూపొందించాలి. యూరియా ఉత్పత్తి తగ్గిందనే విషయం రైతులకు తెలియచేసి బడ్జెట్‌లో రసాయన ఎరువుల సబ్సిడీల మొత్తం తగ్గించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేకుంటే, యూరియా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు, ప్రభుత్వాలు బాగానే ఉంటాయి. కానీ, మధ్యలో ఎక్కువ దిగ్గుబడి ఆశతో యూరియాకి అలవాటు పడ్డ రైతులు మోసపోతారు'' అని డా. జి.వి. రామాంజనేయులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)