గోదావరి బోటు ప్రమాదం: 33కి చేరిన మృతులు.. మరో 14 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

  • 18 సెప్టెంబర్ 2019
నదిలో దొరికిన మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, సిబ్బంది
చిత్రం శీర్షిక నదిలో దొరికిన మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది.

బుధవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 33 మృతదేహాలు లభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

ఈ బోటు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణీకులు, బోటు సిబ్బందితో కలిపి మొత్తం 73 మంది ఉన్నారని రంపచోడవరం ఆర్డీఓ మీడియాకు తెలిపారు.

మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.

దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు.

గాలింపు చర్యల వివరాలు...

గల్లంతయిన వారి కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్, 6 అగ్నిమాపక, 2 నేవీ గజఈతగాళ్ళ బృందాలు, రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ హెలికాపర్‌తో గాలిస్తున్నామని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. సైడ్ స్కాన్ సోనార్, ఇతర ఆధునాతన పరికరాలతో గాలింపు చర్యల్లో పాల్గొంటోంది.

Image copyright Govt of AP

జగన్ ఏరియల్ సర్వే.. సమీక్ష

ఏరియల్ సర్వే ద్వారా బోటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధితుల బంధువులను, క్షతగాత్రులను పరామర్శించారు.

ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష జరిపారు. అనుమతుల్లేని బోట్లను నడుపుతుండటం, అధికారులు తనిఖీలు చేయకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘బోటు ప్రమాదానికి గురైనప్పుడు దాదాపు 70 మంది అందులో ప్రయాణిస్తుండవచ్చు. అందులో 12 మంది మృతి చెందారు. వారిలో 8 మంది మృతదేహాలను బయలకు తెచ్చారు. మరో నాలుగు మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నారు’’ అని చెప్పారు.

ప్రమాదానికి గురైన బోటులో దాదాపు 70 మంది ఉండొచ్చునని మంత్రి చెప్పగా.. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రమాదం జరిగిన బోటులో 60 మంది ప్రయాణిస్తున్నారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అయితే, ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 61 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అందులో 50 మంది పర్యటకులు కాగా 11 మంది బోటు సిబ్బంది అని వారు తెలిపారు. మంటూరుకు చెందిన కొందరు గిరిజనులు చేపలు వేటాడేందుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు గుర్తించి కొందరిని రక్షించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తున్నారు.

విశాఖవాసులు 13 మంది

విశాఖపట్నం నుంచి పాపికొండలు వెళ్లినవారి జాబితాను విశాఖ అధికారులు తయారు చేస్తున్నారు. విశాఖ కలెక్టరేట్‌లో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి మొత్తం 13 మంది ప్రమాదం జరిగిన బోట్‌లో ప్రయాణించినట్లు గుర్తించారు.

విశాఖ నగరంలోని మహారాణీ పేట నుంచి నలుగురు, ఆరిలోవ నుంచి ముగ్గురు, వేపగుంటకు నుంచి ఇద్దరు, అనకాపల్లి నియోజకవర్గానికి చెందినవారు నలుగురు ఉన్నట్లు డీఆర్వో శ్రీదేవీ తెలిపారు.

వారిలో 12 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మాట్లాడి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

వీరంతా సురక్షితం

పేరు ఊరు
బోసాల లక్ష్మి(45) అనకాపల్లి మండలం గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా
దరసనాల సురేశ్(29) కడిపికొండ, ఖాజీపేట్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
బసికె దశరథం(52) కడిపికొండ, ఖాజీపేట్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
బసికె వెంకట స్వామి(60) కడిపికొండ, ఖాజీపేట్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
గొర్రె ప్రభాకర్(47) కడిపికొండ, ఖాజీపేట్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
ఆరెపల్లి యాదగిరి(42) కడిపికొండ, ఖాజీపేట్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
దుర్గం మధులత(35) తిరుపతి
సీహెచ్ జానకిరామారావు(65) ఉప్పల్, హైదరాబాద్
కె.గాంధీ(29) గొల్లపూడి, విజయవాడ
గల్లా శివకుమార్(25) కోదాడ, సూర్యాపేట
సోతాటి రాజేష్(24) సనత్‌నగర్, హైదరాబాద్
నార్లపురం సురేశ్(31) జగద్గిరిగుట్ట, హైదరాబాద్
మజీరుద్దీన్(28) హైదరాబాద్
కిరణ్ కుమార్(29) హైదరాబాద్
పాడి జననీ కుమార్(21) హైదరాబాద్
కోదాడ అర్జున్(23) హైదరాబాద్
మండల గంగాధర్ కుమార్ నరసాపురం
గొర్రిపర్తి సుబ్రహ్మణ్యం(25) హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా
ఉంగరాల శ్రీను హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా
మద్దిల జోజిబాబు హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా
కంచెర జగన్నాథరెడ్డి కడప

కంట్రోల్ రూమ్‌ల వివరాలు

లాంచీ ప్రమాద బాధితుల కుటుంబాలు సమాచారం తెలుసుకునేందుకు గాను ఏపీ ప్రభుత్వం ఏడు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది.

కంట్రోల్ రూం ఫోన్ నంబర్
తూర్పుగోదావరి కలెక్టర్ కార్యాలయం, కాకినాడ 18004253077
సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమండ్రి 08832442344
సబ్ కలెక్టర్ కార్యాలయం, యాటపాక 08748285279
ఐటీడీఏ పీఓ కార్యాలయం, రంపచోడవరం 18004252123
అమలాపురం ఆర్డీవో కార్యాలయం 08856233100
కాకినాడ ఆర్టీవో ఆఫీస్ 08832368100
రంపచోడవరం ఆర్డీవో ఆఫీస్ 08857245166
చిత్రం శీర్షిక లాంచీలో ప్రయాణించిన వరంగల్‌వాసులు.. వీరిలో అయిదుగురు సురక్షితంగా బయటపడగా, 9 మంది గల్లంతయ్యారు

‘మాతో వచ్చిన మరో 9 మంది కనిపించడం లేదు’

వరంగల్ నుంచి తాము 14 మంది వచ్చామని.. బోటు పక్కకు ఒరిగి మునిగిపోయిందని.. చేతికి దొరికిన లైఫ్ జాకెట్లతో బయటపడ్డామని.. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో లాంచీ తమను కాపాడిందని వరంగల్‌కు చెందిన పర్యటకుడు ప్రభాకర్ చెప్పారు.

తాము మొత్తం 14 మంది రాగా అయిదుగురు ప్రాణాలతో బయటపడ్డామని.. ఇంకా తమ బృందంలోని 9 మంది కనిపించడం లేదని చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం

బోటు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

ప్రమాద నేపథ్యంలో అధికారులతో ఆయన మరోసారి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న మంత్రులు సహాయచర్యలు పర్యవేక్షించాలని సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల చొప్పునచొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

సహాయక చర్యల్లో పాల్గొనాలసిందిగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదేశించారు

మారుమూల ప్రాంతం కావడంతో సహాయచర్యలు ఆలస్యంగా ప్రారంభం

ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని గుర్తించినా అది మారుమూల అట‌వీ ప్రాంతం కావ‌డంతో, క‌మ్యూనికేష‌న్ స‌దుపాయం సరిగా లేక‌పోవ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌లకు స‌మస్య‌గా మారింద‌ని అధికార యంత్రాంగం చెబుతోంది.

దేవీప‌ట్నం మండ‌ల కేంద్రానికి సుమారుగా 20 కిలోమీట‌ర్ల దూరంలో క‌చ్చులూరు ఉంటుంది.

గల్లంతైనవారిలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతీయులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కుటుంబసభ్యులు కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కి వివరాలు తెలపాలని కలెక్టర్ వినయ్ చంద్ కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077.

చిత్రం శీర్షిక ప్రమాద స్థలంలో ఏపీ మంత్రులు

సహాయ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. ఘటనాస్థలానికి ఏపీ ఉప ముఖ్యమంత్రులు ఆళ్లనాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్‌, వ్యవసాయ మంత్రి కన్నబాబు తదితరులు వెళ్లారు.

ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెంటనే అధికారులతో మాట్లాడారు సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్లను సహాయక చర్యలకు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

సహాయ చర్యల వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. తక్షణమే బోటు సర్వీసులన్నీ నిలిపివేయాలని ఆదేశించారు.

ప్రమాదానికి గురైన లాంచీకి పర్యాటక శాఖ అనుమతులు లేవని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు.

చిత్రం శీర్షిక సహాయ చర్యలకు వెళ్తున్న బృందాలు

సహాయచర్యల కోసం 60 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించినట్లు విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు.

గోదావరిలో పడవ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వెంటనే సహాయచర్యలు చేపట్టాలని, గాలింపు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలోని జనసైనికులు వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు.

గోదావరి లాంచీ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. పర్యటకుల్లో చాలా మంది తెలంగాణవాసులు ఉండడంతో సత్వరమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

"ఇలా జరగడం చాల దురదృష్టకరం, ఇప్పటివరకూ ఆచూకీ తెలియకుండా పోయిన వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారని ఆశిస్తున్నా" అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)