కోడెల శివప్రసాద్ 'ఆత్మహత్య'.. ప్రభుత్వ వేధింపులే కారణమన్న చంద్రబాబు

  • 16 సెప్టెంబర్ 2019
కోడెల శివప్రసాద రావు Image copyright facebook/Palanatipuli.DrKodelaSivaprasadaro

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు (72) మరణించారు.

ఆయన సమీప బంధువులు చెబుతున్న కథనం ప్రకారం.. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంట్లో వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దీంతో ఆయన్ను హుటాహుటిన స్థానిక బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

గత కొద్దికాలంగా ఆయన చాలా అసంతృప్తితోను, ఆవేదనతోను ఉంటున్నారని, 20 రోజుల కిందట కూడా ఒకసారి నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగేశారని, అప్పుడు వైద్యులు ఆయన్ను కాపాడారని సన్నిహితులు తెలిపారు.

‘‘ఉరి వేసుకుని ఆయన చనిపోయారు.. దీన్నిబట్టే ప్రభుత్వ వేధింపులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బసవతారకం ఆస్పత్రిని స్థాపించింది ఆయనే. ఫౌండర్, ఛైర్మన్‌గా పదేళ్లు పనిచేశారు. చివరకు ఇదే ఆస్పత్రిలో చనిపోయారు’’ అని ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో అన్నారు.

'పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుంది'

కోడెలది ఆత్మహత్య అని ఇప్పుడే నిర్ధారించలేమని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

''ఆయన ఉరివేసుకొని చనిపోడాని ప్రయత్నిస్తే ఆస్పత్రికి తీసుకొచ్చామని కోడెల కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కోడెలది ఆత్మహత్య అని ఇప్పుడే చెప్పలేం. ఉస్మానియా మార్చురీలో శవపరీక్ష చేస్తారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే ఏ విషయం అనేది తెలుస్తుంది. ఇప్పటికే సీఆర్పీ 174 కింద కేసు నమోదు చేశాం'' అని వెల్లడించారు.

పల్నాడులో అప్రమత్తమైన పోలీసులు

కోడెల శివప్రసాద్ మృతి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షాపుల్ని మూసివేస్తున్నారు.

'ప్రభుత్వ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారు'

వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, '' కోడెల పులిలా బతికారు. భయమన్నది ఎరగని వ్యక్తి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనను హింసిచడం మొదలుపెట్టింది. ఎన్నో కేసులు పెట్టింది. అవమానించింది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆయన చొరవ చూపారు. ఇప్పుడు అదే ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. కోటప్పకొండను ఆయన గొప్పగా అభివృద్ధి చేశారు. పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న ఆయన అవమానాలను మాత్రం తట్టుకోలేకపోయారు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి.. వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ సంతాపం

కోడెల శివప్రసాద్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కోడెల శివ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు.

కోడెల శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Image copyright facebook/KODELA
చిత్రం శీర్షిక సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడుతో కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు (ఫైల్ ఫొటో)

కోడెల మరణం విషాదకరం: పవన్ కల్యాణ్

శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవులను అలంకరించారని, రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక ఆయన తుది శ్వాస విడవటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

‘‘తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. ఈ ఆపత్కాల సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.

‘రాజకీయ కోణంలో చూడొద్దు’

కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతీ అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం దురదృష్టకరమని,వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని అన్నారు. సీనియర్ నేత చనిపోయాడనే భాద లేకుండా టీడీపీ నాయకులు తమ పార్టీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. పోస్టుమార్టం తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

Image copyright UGC
చిత్రం శీర్షిక కంచేటి సాయి ఫిర్యాదు లేఖ

కొడుకు వేధింపులే కారణమని కోడెల బంధువు ఫిర్యాదు

కోడెల మరణానికి కారణం ఆయన కుమారుడు శివరామేనని కోడెల బావగా చెబుతున్న కంచేటి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొడుకు ఆస్తి కోసం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు కోడెల తనకు ఫోన్ చేసి బాధపడ్డాడని, తాను వెళ్లి కలిసినప్పుడు కూడా చాలా ఆవేదన చెందాడు కంచేటి సాయి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయమై కంచేటి సాయితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

అయితే, దీనిపై క్రోసూరు ఎస్సై జనార్దన్ బీబీసీతో మాట్లాడుతూ, కోడెల మృతిపై కంచేటి సాయి ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేయలేదని తెలిపారు.

కేసు విచారణ తెలంగాణలో జరుగుతున్న నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు మృతిపై వచ్చిన ఫిర్యాదుని ఆ రాష్ట్ర పోలీసులకు పంపిస్తామని సత్తెనపల్లి డిఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుడికి కూడా అదే సూచన చేశామన్నారు. విచారణ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో ఇక్కడ కేసు నమోదు సాధ్యం కాదని తెలిపామన్నారు

కోడెల కుమారుడిపై వచ్చిన ఆరోపణలను టీడీపీ ఖండించింది. కోడెల కుమారుడు శివరామ్ విదేశాల్లో ఉన్నారని, తండ్రి మరణ వార్త విన్నవెంటనే ఆయన స్వదేశానికి పయనమయ్యారని తెలిపింది.

Image copyright Basavatarakam cancer institue/fb
చిత్రం శీర్షిక బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు, దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, బీజేపీ నేత విద్యాసాగార్ రావుతో కోడెల శివప్రసాద్. (ఫైల్ ఫొటో)

కోడెల ప్రస్థానం

కోడెల శివప్రసాదరావు 1947 మే 2వ తేదీన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో జన్మించారు.

నరసరావుపేట, విజయవాడ, గుంటూరుల్లో చదివారు. ఎంబీబీఎస్, ఎంఎస్ చేసిన కోడెల నరసరావుపేటలో డాక్టర్‌గా వృత్తిజీవితం ప్రారంభించి, పేరు తెచ్చుకున్నారు.

1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999, 2014 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

1987వ సంవత్సరంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు.

1995, 1999 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆరోగ్యం, నీటిపారుదల, పంచాయితీరాజ్, పౌర సరఫరాలు వంటి పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.

2014లో ఏర్పడ్డ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

#100Women: మహిళలు చదువుకుంటే ప్రపంచానికే మేలు - అరణ్య జోహర్

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియాలోని వార్తాపత్రికలు మొదటి పేజీలను పూర్తిగా నలుపు రంగుతో నింపేశాయెందుకు?