సెప్టెంబర్ 17: విలీనమా... విమోచనా? 1948 నాటి సైనిక చర్యను ఎలా చూడాలి - అభిప్రాయం

  • 17 సెప్టెంబర్ 2019
పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ విలీనం Image copyright FACEBOOK
చిత్రం శీర్షిక పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

"చరిత్ర అంటే స్వేచ్ఛా స్ఫూర్తి చైతన్యపూరితంగా స్వీయ- పరిపూర్ణతకి చేరుకునే ప్రక్రియ" అని హెగెల్ అభిప్రాయం. చైతన్యపూరితమైన ప్రయత్నంగా నిర్వచించబడిన రాజకీయాల ద్వారా ఒక దేశంలోని విబేధాలు, చీలికలు సంవాదం ద్వారా ఏకత్వం, సామరస్యం అనబడే అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. గతం, భవిష్యత్తు మధ్య సంవాదం ఈ అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి తప్పనిసరి. దీనర్థం చరిత్ర పరిణామమంతా యోగ్యంగానూ, సంతృప్తికరంగానూ ఉంటుందని కాదు. చరిత్ర ఆవిష్కరింపబడే కొద్దీ ఆ చరిత్రే గతితార్కిక పద్ధతిలో ఆ చారిత్రక పరిణామ అభావాలని, వ్యతిరేకార్ధాలని సృష్టిస్తుంది.

నేడు తెలంగాణా విషయంలోనూ ఆ హెగెలియన్ సూత్రాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. పక్షపాత, వ్యతిరేకార్ధ రాజకీయ అవసరాల కోసం చరిత్రని నేడు తెలంగాణలో వాడుకుంటున్న తీరు ఒక 'డెజా వూ' అనుభూతిని కలిగిస్తున్నది.

బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన ఏడాదిన్నర తరువాత నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని (తెలంగాణా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో భాగం) భారత సమాఖ్యలో విలీనం చేశారు.

1947 ఆగస్టు 15కి ముందు రెండు భారత దేశాలు ఉండేవి: ఒకటి బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వలస పాలకుల పాలనలో ఉన్న భారతదేశం కాగా, రెండవది స్థానిక పాలకుల రాజ్య పాలనలో ఉన్న భారతదేశం. నాటి భారతదేశంలో 552 రాజ్యాలు ఉండేవి. వాటిల్లోని పెద్ద రాజ్యాలలో హైదరాబాద్ ఒకటి.

1948లో భారతదేశంలో విలీనం అయ్యేనాటికి హైదరాబాద్ రాష్ట్రం రెండు శతాబ్దాల పాటు ఆసఫ్ జాహీల పాలనలో ఉంది. అందులో మూడు భాషా ప్రయుక్త ప్రాంతాలు ఉన్నాయి: తెలుగు భాష మాట్లాడే వారు అధికంగా ఉన్న తెలంగాణాలోని ఎనిమిది జిల్లాలు, మరాఠా భాష మాట్లాడేవారు అధికంగా ఉన్న ఐదు జిల్లాలు, కన్నడ భాష మాట్లాడేవారు అధికంగా ఉన్న మూడు జిల్లాలు.

84 శాతంగా ఉన్న హిందువులు అధిక సంఖ్యాక మతస్థులు కాగా, ముస్లింలు 11 శాతంగా ఉన్నారు. మిగతావారు జైన, సిక్కు ఇతర అల్పసంఖ్యాక మతాలకి చెందిన వారు. ఆ విధంగా సామాజిక పరంగా, భాషా పరంగా, సంస్కృతి పరంగా సమ్మిళిత జీవనానికి హైదరాబాద్ రాష్ట్రం ఒక విశిష్టమైన ఉదాహరణ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’- నిజాం

బ్రిటిష్ ఇండియాలో లాగా కాకుండా స్థానిక రాజ్యాలలో ప్రజాస్వామిక రాజకీయాలు ఆచరించడానికి ఉండిన అవకాశాలు బహు తక్కువ. హైదరాబాద్ రాష్ట్రం దీనికేమీ మినహాయింపు కాదు. నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్‌లో ప్రజలకు ఉండిన పౌర, ప్రజస్వామ్య హక్కులు చాలా పరిమితమైనవి. ఇక రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థలు, పౌర సమాజం గురించి చెప్పుకోవడం కూడా అనవసరం.

నిజాం పాలన నిరంకుశ పాలనే, కానీ నిజాం రాజ్యం ఒక మత రాజ్యం అనో, మతాధారిత రాజ్యం అనో చెప్పటం అబద్దం అవుతుంది; అల్పసంఖ్యాక వర్గాల భాష అయిన ఉర్దూని అధికారిక భాషగా ప్రజల నెత్తిన రుద్దటం, పరిపాలనలో, న్యాయవ్యవస్థలో ఇస్లామిక్ సూత్రాలను పాటించడం కానీ హైదరాబాద్ రాష్ట్రాన్ని మతాధారిత రాజ్యం చెయ్యదు.

హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య హక్కులని నిరాకరించడం అధిక సంఖ్యాక వర్గాల భాష, సంస్కృతి ఆధారంగా సాంస్కృతిక ఉద్యమాలు పురుడుపోసుకోవడానికి కారణం అయ్యింది.

20వ శతాబ్దం ఆరంభంలో ఈ అధిక సంఖ్యాక వర్గాలకు ఆర్య సమాజ్ ముఖ్య ప్రతినిధి అయ్యింది. రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు తమ అభిప్రాయలు తెలపేందుకు సాంస్కృతిక రూపాలే ముఖ్య చోదకం అయ్యాయి.

తమది రాజకీయేతర సంస్థ అని చెప్పుకుంటూ ఈ సాంస్కృతిక ఉద్యమానికి ఆర్య సమాజ్ ముఖ్య వాహనం అయ్యింది. తరువాతి కాలంలో కాంగ్రెస్, వామపక్ష, సామ్యవాద రాజకీయాలలో ఉద్దండులైన వారందరూ ఆర్య సమాజ్ రాజకీయాల నుంచే తమ జీవితం ప్రారంభించారు. అయితే, వారు ఆర్య సమాజ్ రాజకీయాలు తమ మీద వేసిన తొలి ప్రభావాన్ని అధిగమించి ముందుకు వెళ్ళారు అనేది వేరే విషయం.

Image copyright Getty Images

హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ సంవాదం రెండు ముఖ్య విషయాల చుట్టూ తిరిగేది. మొదటిది, 'బాధ్యతాయుతమైన' ప్రభుత్వం ఉండాలి, ప్రజల పౌర, రాజకీయ హక్కులని విస్తరించాలి అని. రెండవది, పెత్తందారి అనుకూల రాజ్య విధానం, అలాగే నిజాం ప్రభుత్వం సామాజిక పునాది. కాంగ్రెస్ పార్టీ మొదటి విషయం మీద దృష్టి కేంద్రీకరించగా, వామపక్షవాదులు, సామ్యవాదులు రెండవ దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు.

పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడనిదే ప్రజాస్వామిక సంస్కరణలకు అర్థం లేదు అనేది వారికి తెలిసిన విషయం. పెత్తందారి వ్యతిరేక ప్రజా బాహుళ్య సమీకరణ విస్తరిస్తున్న కొద్దీ నిజాం వ్యతిరేక పోరాట రూపంలోనూ, సారంలోనూ గాఢతను సంతరించుకుంది.

పెత్తందారి వ్యతిరేక, నైజాం వ్యతిరేక పోరాటాల కలయిక హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా బాహుళ్య వ్యక్తీకరణకు చిహ్నంగా నిలిచింది. అంతే కాక, ఇది బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ పోరాటాలతో పోల్చుకుంటే గుణాత్మకంగా విభిన్నమైనది. బ్రిటిష్ ఇండియాలో బాహాటంగా జరుగుతున్న ఈ రాజకీయ పోరాటాలలో సామజిక ప్రగాఢత బహు తక్కువ.

నైజాం ప్రభుత్వ పాలన, ఆ పాలనకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా బాహుళ్య పోరాటాల నేపథ్యంలో 1948లో చోటుచేసుకున్న హైదరాబాద్ విలీనం గురించి నేడు నడుస్తున్న చర్చని అంచనా వెయ్యాలి. ఇక్కడ ముఖ్య ప్రశ్న- నాడు జరిగింది విలీనమా? విమోచనా?

రాజకీయ సంవాదంలో మనం రోజువారీగా ఉపయోగించే పదజాలం చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆ పదజాలం ప్రజల ఆలోచనని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రజల అభిప్రాయాలను తమ తమ రాజకీయ, ఎన్నికల లాభం కోసం తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

విమర్శనాత్మక తార్కికతకు, ఆలోచనలకు సంరక్షకులుగా ఉండే అకాడమియా, మీడియా ఉపయోగంలో ఉన్న పదాల అర్థం, వాడకాల నిర్దిష్టత, ఆ వాడకం సంభావ్య దురుపయోగం, అలాగే దాని వల్ల చరిత్ర మీద, భవిష్యత్తు మీద ఉండగలిగే ప్రభావం గురించి మదింపు చేయాల్సిన అవసరం ఉంది.

ఇంకొక మాటలో చెప్పాలంటే, హేగేలియన్ సూత్రం ప్రకారం నిర్మాణాత్మకమైన వైఖరిని పెంపొందించే, విస్తరించే స్వేచ్ఛకి ప్రతికూలాత్మకమైన వైఖరిని పెంపొందించే చరిత్ర చెత్తబుట్టకి చెందవలసిన కశ్మలానికి మధ్య తేడా గమనించగలగడం ఇక్కడ కీలకాంశం.

Image copyright Getty Images

'విమోచన' అనే పదం వినడానికి నిర్మాణాత్మకమైన పదంగానే అనిపించినా హైదరాబాద్ నేపథ్యంలో దానికంటూ ఒక ప్రతికూలమైన భావననే అంటగట్టారు. 1948లో జరిగింది నైజాం పాలన నుంచి విమోచన అని చెప్పేవారు హైదరాబాద్ రాజ్యంలోని మిగతా విషయాలను విస్మరించి కేవలం హైదరాబాద్ పాలకుడి మతాన్నే ఉద్ఘాటిస్తున్నారు. ఈ అభిప్రాయం ప్రకారం నైజాం పాలన కేవలం అధిక సంఖ్యాక హిందువులను ముస్లింలు అణిచివేసిన పాలన. కాబట్టి 1948లో ముస్లిం పాలన నుంచి హిందువులు విమోచన పొందారు.

అయితే, హైదరాబాద్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా వాస్తవం మరింత సంక్లిష్టమైనది అని, పైన పేర్కొన్న అభిప్రాయానికి భిన్నమైనదని తెలుస్తుంది.

పాలకుడు ముస్లిమే అయినా అతనికి లభించిన మద్దతు అంతా హిందూ సంస్థానాధీశులు, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, దేశాయ్‌ల నుంచే. ఎందుకంటే నైజాం రాజ్యంలో 60% శాతం భూ భాగం ఖల్సా వ్యవస్థ కింద ఉండేది. కేవలం 30 శాతం భూభాగం మాత్రమే ముస్లిం జాగీర్దార్‌ల నియంత్రణలో ఉండేది. ఈ సంస్థానాధీశులు కేవలం భూ ఆదాయానికి మాత్రమే బాధ్యులు కాదు. గణనీయమైన స్థాయిలో న్యాయాధికారాలు, చట్ట సంబంధమైన అధికారాలు కలిగి ఉండేవారు.

హైదరాబాద్ రాష్ట్రంలో వృత్తిపరమైన వర్గాలలో హిందువులు గణనీయమైన సంఖ్యలో ఉండేవారు- ఉదాహరణకు విధానాల మీద, వాటి అమలు మీద కాయస్థ కులస్థులకి గణనీయమైన స్థాయిలో నియంత్రణ ఉండింది. చాలా కాలం పాటు పరిపాలన వ్యవస్థ అత్యున్నత స్థాయిలో నైజాం రాజు కింద హిందూ దివాన్ (ముఖ్యమంత్రి) లే ఉండేవారు. నైజాం రాజ్యం దైహికంగా, వ్యవస్థాగతంగా, ఇంకా చెప్పుకోవాలంటే అధికారం, పలుకుబడి అంశాలలోనూ నిరంకుశమైన రాజ్యమని, వారసత్వ రాజ్యమని ఈ వాస్తవాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే, అది మతాధారిత రాజ్యం కానే కాదు అనే విషయం కూడా ఈ వాస్తవాలు మనకు తెలియచేస్తున్నాయి. హిందూ పెత్తందారులు కేవలం ఈ రాజ్యం మద్దతుదారులు మాత్రమే కాదు, ఈ రాజ్యంలో అంతర్భాగం వారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

చరిత్రలో నిగూఢంగా ఉండే సంక్లిష్టతలను తొలగించి ప్రజా బాహుళ్య లోక జ్ఞానం కోసం చరిత్రను తమకు అనుకూలంగా మార్చి, అందించే ధోరణి సాధారణంగా కనిపిస్తుంటుంది. దీనికి సైద్ధాంతిక అడ్డంకులు లేవు- వామపక్ష వాదులు, మితవాదులు ఇద్దరూ దీనికి పాల్పడుతుంటారు. కానీ, చరిత్ర అంటే సంక్లిష్టమైనది, వివిధాంశాల అల్లికగా ఉండేది.

సమాజంలో చలామణీలో ఉన్న పాక్షిక, పక్షపాత అభిప్రాయానికి భిన్నంగా నైజాం పాలనకు సంబంధించి మంచి విషయాలు ఉన్నాయి.

వలస పాలన నేపధ్యంలో ఒక ఆధునిక విశ్వవిద్యాలయాన్ని (అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం) ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్థానిక పాలకుడు నైజాం రాజు. ఇది ఉర్దూ మాధ్యమ విశ్వవిద్యాలయం. ఇందుకు గానూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసలు కూడా పొందాడు నైజాం రాజు. కరవు తాండవించే తెలంగాణలో నీటిపారుదుల వ్యవస్థ మీద దృష్టి కేంద్రీకరించడం ఆయన ముందుచూపుకు ఒక తార్కాణం. దాని ఫలితమే చెరువులని, కుంటలని నిర్వహించడం, నిజాం సాగర్ లాంటి జలాశయాలను నిర్మించడం.

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఈ చెరువుల నిర్వహణకు కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు, చివరి నైజాం రాజు ఆధునిక పారిశ్రామికరణ మీద దృష్టి కేంద్రీకరించాడు. అందులో భాగమే నిజాం చక్కెర పరిశ్రమ, ఆజం జాహీ బట్టల మిల్లు, సిర్పూర్ కాగితపు మిల్లు, ఆల్విన్ లోహ పరిశ్రమ, ప్రాగా టూల్స్‌ల ఏర్పాటు.

ప్రజారోగ్యం మరొక ముఖ్యమైన ప్రాధాన్యతాంశం. పైన పేర్కొన్న వాస్తవాలను గ్రహించి వామపక్ష శిబిరంలోనూ, మతవాద మితవాద శిబిరంలోనూ నైజాం పాలనని తీవ్రమైన పెత్తందారి అణిచివేత పాలనగా, తీవ్రమైన ముస్లిం మతాధారిత పాలనగా దుష్ట పాలనగా చూపించే ధోరణి పట్ల జాగురుకతగా ఉండాలి.

బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని, పెత్తందారి పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ నుంచి, వామపక్షవాదుల నుంచి తన పాలన చివరి రోజులలో ప్రతిఘటన వచ్చిన నేపథ్యంలో చివరి నైజాం రాజు తన పాలనలో మతతత్వాన్ని జోడించాడు అనేది వాస్తవం.

Image copyright facebook

'అమల్ మాలిక్' (అంటే ప్రతి ముస్లిము పాలకుడే అని అర్థం) అనే ఒక ఆలోచన ద్వారా హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా చూపించే ప్రయత్నం జరిగింది. రజాకార్ల రాకతో ఈ మతతత్వం ఒక నిర్ణయాత్మకమైన దశకు చేరుకుంది. అయితే, ముస్లిం మతతత్వ సైనికులకు గ్రామీణ తెలంగాణలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్న నేపథ్యంలో ఆ తిరుగుబాటుని అణచివెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న హిందూ పెత్తందారీల మద్దతు లభించింది అన్న వాస్తవాన్ని మరిస్తే చరిత్రని అపహాస్యం చెయ్యడమే అవుతుంది.

అదే విధంగా నైజాం వ్యతిరేక పోరాటంలో ప్రస్ఫుటంగా కనిపించే ముస్లిం మేధావుల, మధ్య తరగతి వర్గాల, కార్మికుల, రైతుల భాగస్వామ్యాన్ని తక్కువ చేసి చూపడం కూడా అంతే తప్పిదం అవుతుంది.

ఎన్నికల లాభాల కోసం ఇటువంటి సంక్లిష్టమైన చరిత్రను నీరుగార్చే ప్రయత్నాల పట్ల జాగురుకతగా ఉండాలి. ఏ సమాజం చరిత్రలోనైనా సరే ఆహ్లాదకరమైన విషయాలు, అసహ్యకరమైన విషయాలు, వాంఛనీయమైన వాస్తవాలు, అవాంఛనీయమైన వాస్తవాలు ప్రజల సామూహిక సుప్త చేతనలో నిక్ష్లిప్తమై ఉంటాయి.

జ్ఞాపకాలు అనేవి స్వేచ్ఛా స్పూర్తిని విస్తరించేవిగా ఉండాలా లేక అంతర్వాహినిలో నిక్ష్లిప్తమై ఉన్న విభేదాలను మరింత తీవ్రతరం చేసేవిగా ఉండాలా అనే ప్రశ్న వెయ్యటం ఆలోచనాపరుల బాధ్యత.

హైదరాబాద్‌లో, తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో హింసాత్మకమైన, దీర్ఘకాలపు మతతత్వ గొడవలు జరిగిన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఇటువంటి సంభావనీయత గురించి ఆలోచించడం అవాస్తవం కాదు.

తెలుగు దేశం, తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా మతతత్వ ఘర్షణలు తగ్గుముఖ్యం పట్టాయి. ఈ వాస్తవానంతర కాలంలో అటువంటి బాధాకరమైన జ్ఞాపకాలనే రాజేయ్యటం వల్లన ఘర్షణలు కొత్తగా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్నికలలో మతతత్వ కార్డుని వాడుకునే రాజకీయ శక్తులకు ఈ గొడవలు ఉపయోగపడతాయి అనేది తెలిసిన విషయమే.

ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ఎత్తి చూపుతూ, బాధాకరమైన జ్ఞాపకాలను పాతిపెట్టవలసిన బాధ్యత నేడు లౌకిక, పౌర, సామాజిక శక్తులపై ఉన్నది.

'గంగా జమునా సంస్కృతి'కి ఒకప్పుడు పేరుగాంచిన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింతగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేడు ఆ విలువ మాత్రమే సామాజిక సామరస్యాన్ని నిలబెట్టి, ఈ రాష్ట్ర శాంతియుత అభివృద్దికి దోహదం చెయ్యగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు