కశ్మీర్‌కు అవసరమైతే స్వయంగా నేనే వెళ్తా - భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి

  • 16 సెప్టెంబర్ 2019
రంజన్ గొగోయి Image copyright Getty Images
చిత్రం శీర్షిక రంజన్ గొగోయి

జమ్మూకశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, జమ్మూలకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే, ఆ ప్రాంతాల్లో ఆజాద్ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, బహిరంగ ప్రసంగాలు చేయకూడదని నిర్దేశించింది.

ప్రజలకు ఏ ఇబ్బందులూ లేకుండా స్కూళ్లు, హాస్పిటళ్లు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు చేసింది.

అవసరమైతే స్వయంగా తానే జమ్మూకశ్మీర్‌కు వెళ్తానని భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి అన్నారు.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370కి కేంద్రం చేపట్టిన సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పిటిషన్లపై సెప్టెంబర్ ముగిసేలోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

ఎండీఎంకే నాయకుడు వైగో ఈ పిటిషన్‌ను వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 111వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫరూఖ్ అబ్దుల్లా చెన్నై రావాల్సి ఉందని, ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని ఆయన కోర్టు ముందు పేర్కొన్నారు.

Image copyright Getty Images

జర్నలిస్టు అనురాధా భసీన్ తరఫున ఆమె న్యాయవాది బృందా గ్రోవర్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. కశ్మీర్‌లో ఆంక్షలు మొదలై 43 రోజులు గడిచాయని, ఇంకా తన క్లయింట్‌ను నిర్బంధంలో ఉంచడం చట్టవిరుద్ధమని ఆమె వాదించారు.

ఏ చట్టం కింద ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించిందో తెలుసుకోవాలనుకుంటున్నానని బృందా గ్రోవర్ కోర్టును అభ్యర్థించారు.

మీడియాకు ఏ ఆటంకమూ లేకుండా ల్యాండ్‌లైన్, ఇతర సమాచార ప్రసార సేవలు అందుబాటులోనే ఉన్నాయని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో చాలా దినపత్రికలు, టీవీ ఛానెళ్లు యథావిధిగా నడుస్తున్నాయని ఆయన వివరించారు.

ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో 5.5 లక్షల మంది ఔట్ పేషెంట్ సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని 92% మేర ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలూ లేవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న భారత ప్రభుత్వం సవరించింది. అనంతరం ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. ఫోన్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది.

''ఇప్పుడు 92% ప్రాంతంలో ఆంక్షలేవీ లేవు. ల్యాండ్ లైన్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. అన్ని టెలిఫోన్ ఎక్చేంజీలూ నడుస్తున్నాయి. మొబైల్ కనెక్టివిటీ పరిధిని కూడా విస్తరిస్తున్నాం'' అని రవీశ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కడుపు కాలే రోడ్లపైకి వచ్చాం.. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చి అర్హత లేదని వెనక్కి తీసుకున్నారు.. ఎందుకు

భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

‘‘జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం.. అందరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది’’

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి