కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

  • 17 సెప్టెంబర్ 2019
కశ్మీర్ ఆగ్రా
చిత్రం శీర్షిక రోజుకూలీగా పనిచేసే అబ్దుల్ ఘని తన వారిని కలుసుకునేందుకు కుల్గాం నుంచి దిల్లీకి రైలులో వచ్చి, అక్కడి నుంచి బస్సులో ఆగ్రాకు వచ్చారు. ఆయన కొడుకు, మేనల్లుడు జైలులో ఉన్నారు

ఆ రోజు శుక్రవారం ఉదయం. ఆగ్రాలో ఉన్న వేడి వాతావరణం వల్ల కాస్త ఉక్కపోతగా ఉంది. అయితే, గాలి వీస్తుండటంతో కాస్త ఉపశమనంగా ఉంది.

కశ్మీర్‌లో చల్లటి వాతావరణానికి అలవాటుపడిన పురుషులు, మహిళలు ఇక్కడి వేడి వాతావరణానికి ఇబ్బందిపడుతున్నారు.

ఆగ్రా సెంట్రల్ జైలు గేటు బయట గంభీరమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఒక పెద్ద వెయిటింగ్ హాల్‌లో కూర్చున్న ఆ కశ్మీరీలు జైలు శిక్ష అనుభవిస్తున్న తమ వారిని కలుసుకునేందుకు ఓపికగా ఎదురు చూస్తున్నారు.

భద్రతా దళాలు లోయ నుంచి అనేక వందల మందిని తీసుకొచ్చి ఇక్కడ వివిధ జైళ్లలో పెట్టినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

అయితే, అధికారులు మాత్రం ఈ విషయంపై మాట్లాడటం లేదు.

కశ్మీర్ నుంచి వచ్చిన దాదాపు 80 మందికిపైగా ప్రజలు భారీ భద్రత ఉన్న ఆ ఆగ్రా జైలు బయట వేచిచూస్తున్నారు.

అక్కడున్న వెయిటింగ్ హాల్‌లో దుర్వాసన వస్తోంది. వాతావరణం కూడా వేడిగా ఉంది.

''ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను ఇక్కడే చనిపోతానేమో'' అని చొక్కాతో చెమట తుడుచుకుంటూ చిరునవ్వుతో ఓ కశ్మీరీ చెప్పారు.

''నా పేరు అడగకండి. మేం ఇబ్బందుల్లో పడొచ్చు'' అని అతను మమ్మల్ని కోరారు.

తన సోదరుడిని కలవడానికి ఆయన కశ్మీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా నుంచి ఇక్కడికి వచ్చారు.

''ఆగస్టు 4న రాత్రి భద్రతా దళాలు మా సోదరుడిని అదుపులోకి తీసుకున్నాయి. వారు రెండు,మూడు వాహనాలలో ఇంటికి వచ్చారు. ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు'' అని ఆ కశ్మీరీ తెలిపారు.

''అతన్ని ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు. రాళ్లు రువ్విన ఘటనలతో ఆయనకు సంబంధం లేదు. ఆయనొక డ్రైవర్. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించే ప్రకటన జరిగిన రోజు(ఆగస్టు5) కంటే ముందు రోజు ఆయనను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మా సోదరుడిని తీసుకెళ్లిన మూడో రోజు మేం శ్రీనగర్‌లోని అధికారులను వాకబు చేశాం. చాలా ప్రయత్నాల తరువాత, అతన్ని ఆగ్రా తీసుకువచ్చినట్లు మాకు తెలిసింది'' అని పుల్వామావాసి చెప్పారు.

''నేను ఆగస్టు 28న ఆగ్రాకు వచ్చాను. స్థానిక ఎస్పీ నుంచి 'ధ్రువీకరణ లేఖ' తీసుకురావాలని మాకు చెప్పారు.

లేఖ తీసుకురావడానికి నేను మళ్లీ పుల్వామాకు వెళ్లాను. ఇలా వెళ్లిరావడానికి నాకు వేల రూపాయలు ఖర్చైంది'' అని ఆయన తెలిపారు.

''నా సోదరుడి వయసు 28, ఆయన ఎంఏ, బీఎడ్ చేశారు. ఇప్పుడు జైలు పాలవడంతో ఆయన డిగ్రీలన్నీ పనికిరాకుండా పోయాయి'' అని మాతో చెబుతూ బాధపడ్డారు.

జైలుపాలైన శ్రీనగర్‌ వ్యాపారవేత్తను చూడటానికి ఆయన కుటుంబ సభ్యలు హాల్‌లో వేచిచూస్తున్నారు. ఆయన భార్య ఏడుస్తున్న తన బిడ్డను ఓదార్చుతోంది. టీనేజ్‌లో ఉన్న మరో కొడుకు చుట్టుపక్కల చూస్తున్నాడు.

రోజు కూలీగా పనిచేసే అబ్దుల్ ఘని తన వారిని కలుసుకోడానికి కుల్గాం నుంచి దిల్లీకి రైలులో వచ్చి, అక్కడి నుంచి బస్సులో ఆగ్రాకు వచ్చారు. ఆయన కొడుకు, మేనల్లుడు జైలులో ఉన్నారు.

కశ్మీర్ నుంచి తీసుకురావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఆయన వెంటతెచ్చుకోలేదు. దీంతో ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారు.

ఆగ్రా రావడానికి ఆయనకు ఇప్పటికే రూ. పదివేలు ఖర్చైంది. మళ్లీ వెళ్లిరావాలంటే ఆయనపై చాలా భారం పడుతుంది.

''ఆ పత్రాలను తీసుకరావాలని నాకు తెలియదు. తెల్లవారుజామున రెండు గంటలకు మా వాళ్లను తీసుకెళ్లారు. ఆ సమయంలో వారు నిద్రలో ఉన్నారు'' అని ఆయన చెప్పారు.

''వారిని ఎందుకు తీసుకెళుతున్నారో మాకు చెప్పలేదు. వాళ్లు ఎప్పుడూ రాళ్లు రువ్వలేదు'' అని పేర్కొన్నారు.

కొన్ని గంటల తర్వాత జైలులో ఉన్నవారిని కలుసుకునేందుకు గేటు తెరిచారు. అక్కడికి వచ్చిన కశ్మీరీలందరూ తాజా యాపిల్స్‌ను వెంటతీసుకొచ్చారు.

అబ్దుల్ ఘని తన వారిని కలుసుకోడానికి అధికారులను వేడుకుంటున్నారు. ఆయన ఆధార్ కార్డును పరిశీలించిన అనంతరం అధికారులు ఆయనకు అనుమతిచ్చారు.

''మేం వీలైనన్ని ఎక్కువ అభ్యర్ధనలను అంగీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆధార్ కార్డు చూపితే లోపలి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం'' అని జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఒక గంట దాటిన తర్వాత, తన కుమారుడు, మేనల్లుడిని కలిసిన ఆనందంతో ఘని బయటకు వచ్చారు.

ఆయన మాతో మాట్లాడుతూ ''నా కొడుకు బాధపడుతున్నాడు. ఇంటి దగ్గర అంతా బాగానే ఉందని చెప్పాను. ఇన్నాళ్లు తను ఎక్కడున్నాడోనని బాధపడ్డాను. దేవుడి దయ వల్ల అతడ్ని కలుసుకోగలిగాను'' అని చెప్పారు.

చిత్రం శీర్షిక బారాముల్లాకు చెందిన తారిఖ్ తన సోదరుడిని కలుసుకునేందుకు శ్రీనగర్ నుంచి విమానంలో దిల్లీకి వచ్చి అక్కడి నుంచి అద్దె కారులో ఆగ్రా వచ్చారు

మధ్యాహ్నం 4 గంటల సమయంలో జైలు గేటు వద్ద ఓ మహిళ, మరో వ్యక్తి పచార్లు చేస్తున్నారు. అప్పుడు వెయిటింగ్ హాల్ ఖాళీగా ఉంది.

వాళ్లు బారాముల్లాకు చెందినవారు. శ్రీనగర్ నుంచి విమానంలో దిల్లీకి వచ్చి అక్కడి నుంచి అద్దె కారులో ఆగ్రా వచ్చారు.

అధికారులను అభ్యర్థించడంతో తమవారిని కలుసుకునేందుకు వారికి 20 నిమిషాల సమయం ఇచ్చారు.

''కాస్త ముందుగా వచ్చిఉంటే మా వాళ్లను కలుసుకోడానికి 40 నిమిషాల సమయం ఇచ్చేవారిమని జైలు అధికారులు చెప్పారు'' అని తారిఖ్ అహ్మద్ ధర్ చెప్పారు.

సోదరుడిని కలుసుకోడానికి ఆయన ఇక్కడికి వచ్చారు.

''సందర్శకులకు మంగళ, శుక్రవారాల్లో అనుమతి ఉంది. తారిఖ్ తన వాళ్లను మళ్లీ కలుసుకోవాలంటే ఇంకా నాలుగు రోజులు ఆగ్రాలోనే వేచి ఉండాలి'' అని జైలు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం