గోదావరిలో 315 అడుగుల లోతులో బోటు - ప్రెస్‌ రివ్యూ

  • 17 సెప్టెంబర్ 2019
Image copyright Govt of AP

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది.

మరోవైపు, ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలు కూడా ఉండడంతో బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి.

ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు.

మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్‌మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నట్లు కథనంలో చెప్పారు.

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు.

ఇలాంటి పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనని అధికారులు చెప్పారని సాక్షి తెలిపింది.

బోటును గుర్తించేందుకు 'సైడ్‌స్కాన్‌సోనార్‌': నేవీకి చెందిన డీప్‌డైవర్స్‌తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది.

వీరి వద్ద ఉన్న 'సైడ్‌స్కాన్‌సోనార్‌' ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు.

మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్‌ వలలు, లైటింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు కథనంలో చెప్పారు.

Image copyright facebook/Kodela Siva Prasada Rao

ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ప్రాణం పోయింది: కోడెల కుమార్తె

ప్రభుత్వం పెట్టిన వేధింపుల వల్లే తన తండ్రి మరణించాడని కోడెల కుమార్తె చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

నాన్న అంటే తమకు ప్రాణమని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని కోడెల కుమార్తె విజయలక్ష్మి స్పష్టం చేసినట్లు అందులో తెలిపారు.

కొడుకు, కూతురు అంటూ ఆరోపణలు చేసి ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో మాటల్లో చెప్పలేనని అన్నారు.

ప్రభుత్వం పెట్టిన వేధింపుల వల్లే ఆయన ప్రాణం పోయిందని ఆమె అన్నట్లు ఆంధ్రజ్యోతి చెప్పింది.

మీ అందరికీ ఓ దండమని, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండని కోడెల కుమార్తె రోదిస్తూ వేడుకున్నారు.

ఆయన మానసికంగా ఎంత నరకం అనుభవించారో తమకు తెలుసని, ఆయన ఎంత బాధపడ్డారో కూడా తమకు తెలుసునని ఆమె అన్నారు.

కనీసం ఇప్పుడైనా ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండని భోరున రోదిస్తూ కోడెల కుమార్తె విజయలక్ష్మి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పారు.

Image copyright Getty Images

ఎర్ర మంజిల్ కూల్చద్దు-తెలంగాణ హైకోర్టు

అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఈనాడు సహా అన్ని వార్తా పత్రికలు కథనం ప్రచురించాయి.

ఎర్ర మంజిల్ దగ్గర నూతన అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టాలన్న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టినట్లు ఇందులో తెలిపారు.

అక్కడి చరిత్రాత్మక భవనాన్ని కూల్చవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లోని భవనాలు... వారసత్వ కట్టడాల పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది.

వారసత్వ కట్డాల జాబితాలోని పేర్లు తొలగించేటపుడు ప్రభుత్వ నిబంధనలను ఏకపక్షంగా విస్మరించరాదని కోర్టు పేర్కొన్నట్లు కథనం చెప్పింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం 111 పేజీల తీర్పునిచ్చింది.

ప్రభుత్వ విధానాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పరిమితమే. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అనే విషయాన్ని కోర్టు పరిశీలిస్తుందని తెలిపింది. నిబంధనల ప్రకారం జరగలేదంటే అది ఏకపక్షమే అవుతుందన్న న్యాయస్థానం, ఇలాంటి సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చని చెప్పినట్లు కథనంలో వివరించారు.

చట్టసభల సముదాయాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి జితేంద్రబాబు, ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించిన నవాబ్ వారసుడు డాక్టర్ మిర్ అస్గార్ హుస్సేన్, మరొకరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఈనాడు తెలిపింది.

నల్లమల అటవీ ప్రాంతం

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

యురేనియం తవ్వకాలను అనుమతించేది లేదంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, సోమవారం మంత్రి కేటీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం తీర్మానంలో సూచించినట్లు కథనంలో చెప్పారు.

యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చేగాలి, తాగేనీరు కలుషితమై మనిషి జీవితం నరకప్రాయం అవుతుందని తీర్మానంలో వివరించారు.

తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణ అసెంబ్లీ కూడా ప్రజలతో ఏకీభవిస్తోందని తీర్మానం చేసినట్లు కథనం చెప్పింది.

నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)