గుజరాత్ 2002 అల్లర్ల ముఖచిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా? వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?

  • 17 సెప్టెంబర్ 2019
ఆశోక్ మోచీ, కుతుబుద్దీన్ Image copyright Getty Images/BBC
చిత్రం శీర్షిక ఆశోక్ మోచీ, కుతుబుద్దీన్ అన్సారీ

2002లో గుజరాత్ లో జరిగిన మతతత్వ అల్లర్లకు వీరిద్దరూ ముఖచిత్రాలుగా మారారు. ఆశోక్ మోచీ ఫొటో అల్లరిమూకల విధ్వంసకాండకు ప్రతీకగా మారగా, కుతుబుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి చిత్రం ఆ అల్లర్లలో నష్టపోయిన బాధితులకు ప్రతీకగా నిలిచింది. అయితే వీరిద్దరూ, ఇటీవల కేరళలో ఒక రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో ఒకే వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత నుంచి తమ మధ్య శత్రుత్వాన్ని మరచిపోయి మిత్రులుగా మారారు. అంతేకాదు, దళితుడైన అశోక్ మోచీ ఒక చెప్పుల దుకాణం తెరవగా, దానికి కుతుబుద్దీన్ రిబ్బన్ కత్తిరించారు.

‘‘మీడియాలో తన ఫొటో కనిపించే సమయానికే ఆశోక్ పశ్చాత్తాపంలో పడ్డారు. ఎందుకంటే ఆయన నివసించేది ముస్లింలు ఎక్కువగా ఉండే బస్తీలోనే’’ అని కుతుబుద్దీన్ బీబీసీతో చెప్పారు.

‘‘కుతుబుద్దీన్ మంచి వ్యక్తి. నిజమైన ముస్లిం. అల్లర్లలో ఆయన ఎంత నష్టపోయినా సరే, హిందూ మతానికి వ్యతిరేకంగా చిన్న మాట కూడా మాట్లాడలేదు’’ అని ఆశోక్ మోచీ అన్నారు.

చిత్రం శీర్షిక అశోక్ మోచీ

2002లో గుజరాత్ లో జరిగిన దారుణ మతతత్వ ఘర్షణలకు అశోక్ మోచీ, కుతుబుద్దీన్ ఇద్దరూ రెండు పరస్పర వ్యతిరేక ముఖచిత్రాలుగా నిలిచారు.

ఈ అల్లర్లు జరిగిన 17 ఏళ్ల తర్వాత, అశోక్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా వారిద్దరూ తిరిగి కలుసుకున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వీళ్లిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

‘‘నా దగ్గర సరిపడా డబ్బున్నపుడు, సొంతంగా ఒక చెప్పుల షాపు తెరవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. నా షాపుని కుతుబుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించాలని ఆయనను ఆహ్వానించాను’’ అని ఆశోక్ మోచీ గుర్తు చేసుకున్నారు.

‘‘మా ఇద్దరి మధ్య స్నేహమే ఉండేది. జరిగిన ఘటనల పట్ల తను మొదటి నుంచీ పశ్చాత్తాపపడుతూనే ఉన్నాడు. గుజరాత్‌లో మరొకసారి అలాంటి దారుణ ఘటనలు జరగకూడదని తను కోరుకుంటున్నాడు’’ అని అశోక్ గురించి కుతుబుద్దీన్ చెప్పారు.

చిత్రం శీర్షిక అశోక్ మోచీ చెప్పుల షాపును ప్రారంభిస్తున్న కుతుబుద్దీన్ (ఫైల్ ఫొటో)

‘‘మీడియాలో నా ఫోటోను వాడిన తీరు నాకు నచ్చలేదు. నన్ను అల్లర్లకు పాల్పడ్డ వ్యక్తిగా చూపించారు. ఇప్పుడు హిందువులు గానీ, ముస్లింలు గానీ ఎవ్వరూ అల్లర్లను కోరుకోవడం లేదు. అందుకే నా షాపుకి ‘ఏకతా చప్పల్ ఘర్’ అనే పేరు పెట్టాను. దాన్ని కుతుబుద్దీన్‌తో ప్రారంభింపజేయడం ద్వారా, ఒకప్పుడు మత ఘర్షణలతో అప్రతిష్టపాలైన అహ్మదాబాద్ నగరం ఇప్పుడు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్న విషయాన్ని ప్రపంచానికి చాటాలని ఆశించాను’’ అని తన షాపు గురించి, దానిని కుతుబుద్దీన్ చేత ప్రారంభింపచేయడం గురించి ఆశోక్ మోచీ వివరించారు.

2002లో గుజరాత్ అల్లర్లలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. మృతుల్లో అత్యధికులు ముస్లింలే.

నాటి అల్లర్లతో హిందూ, ముస్లిం ప్రజల మధ్య దూరం మరింత పెరిగింది.

చిత్రం శీర్షిక కుతుబుద్దీన్ అన్సారీ

‘‘మేం కూడా భారత పౌరులమే. తప్పును మేమెప్పుడూ సమర్థించం. మాక్కూడా ఇక్కడ అన్ని హక్కులూ ఉన్నాయి. ఇక్కడ బతికే హక్కు మాకుంది. మా వాదనేంటో వినిపించేందుకు మాకు అవకాశం ఇవ్వండి’’ అని కుతుబుద్దీన్ అంటున్నారు.

‘‘2002 అల్లర్ల నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, రాజకీయ పార్టీల మాటలతో లేదా నాయకులు చెప్పే మాటలతో కొట్టుకుపోవద్దు. హిందువులు, ముస్లింలు ఒకరినొకరు చంపుకోవద్దు’’ అని ఆశోక్ మోచీ హితవు పలికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)